wadapalli
-
సుబ్బారావు గ్రేట్.. నారింజ రసం సూపర్
నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది తొక్క తీసి తినగా అబ్బబ్బ పులుపు తిననే తినను తీసి నేలకొట్ట తీయని నారింజ తింటే హాయ్ హాయ్.. చిన్నప్పుడు చదువుకున్న పాట ఇది. నారింజ పేరు చెబితేనే కళ్లు మూసుకుంటాయి. అటువంటి నారింజ రసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతుంటారు ఇక్కడ. తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం దాటి, ఆత్రేయపురం వెళ్లే దారిలో లొల్ల లాకులకు ముందుగా, రోడ్డు పక్కన పచ్చని చెట్ల కింద చిన్న బండి కనిపిస్తుంది. అక్కడకు రాగానే వారి వారి వాహనాలను పక్కన పెట్టి, జుత్తుగ సుబ్బారావు తాత ఇచ్చే నారింజ రసం సేవించి, సేద తీరుతుంటారు. సుబ్బారావు వయస్సు 83 సంవత్సరాలు. ‘శ్రేష్ఠమైన వడ్లమూడి నారింజ పండ్లు తెప్పించి, రసం తీసి ఇస్తాను. వడ్లమూడిలో దొరక్కపోతే, రాజమండ్రి, నిడదవోలు ప్రాంతాల నుంచి నారింజకాయలు తీసుకువస్తాయి’ అంటారు ఈ తాత. ఆశ్చర్యమేమిటంటే, నారింజ కాయలు కొనడానికి తాత ఎక్కడకూ వెళ్లరు, అక్కడి నుంచి కాయలు రాగానే, ఇక్కడ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు. ‘అంతా నమ్మకం మీదే నడిచిపోతోంది వ్యాపారం’ అంటారు ఈ తాత. ఒక్కో మనిషికి మూడు కాయల రసం పిండుతారు. కాయలు బాగా తగ్గినప్పుడు రెండు కాయలు పిండుతారు. ఒక్కో కాయ పది రూపాయలకు కొంటారు. కాని గ్లాసు రసం 20 రూపాయలకే అమ్ముతారు. ఎవరైనా వచ్చి ‘ధర పెంచవా తాతయ్యా’ అని అడిగితే, ‘నాకు ఆదాయానికి లోటు లేదు. నేను కూర్చుని తిన్నా నాకు సాగుతుంది. కాని ఏదో ఒక పనిచేయనిదే నాకు తోచదు. ఇది అలవాటైన పని. ఓపిక ఉన్నన్ని రోజులు చేస్తాను’ అంటూ ఎంతో సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. వ్యాపార రహస్యం.. నారింజ రసంలో నాలుగు రకాల వస్తువులు కలుపుతారు. ‘లక్ష రూపాయలిచ్చినా ఆ రహస్యం మాత్రం చెప్పను’ అంటారు సుబ్బారావు తాత. మొట్టమొదట్లో ఈ వ్యాపారం ర్యాలి గ్రామంలోని జగన్మోహిని ఆలయం దగ్గర ప్రారంభించారు. అక్కడ ఈ బండి పాతిక సంవత్సరాలు నడిచింది. ఆ తరవాత ఇప్పుడున్న ప్రదేశానికి మార్చానని చెబుతారు సుబ్బారావు తాత. ఆ తల్లి చలవ.. సుబ్బారావు తాత తన చిన్నతనంలో ఒకరి ఇంట్లో చాలా కాలం పనిచేశారు. అందుకుగాను వారు సుబ్బారావు తాతకు ఆరు కుంచాల పొలం రాసి ఇచ్చారట. సుబ్బారావు తాతకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారిది ఉమ్మడి కుటుంబం. ‘వంటంతా ఒక కుండలోనే జరుగుతుంది’ అంటూ సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. ‘ఇంటి దగ్గర కూర్చుంటే ఏం వస్తుంది. ఓపిక ఉంది, కష్టపడతాను. ఎక్కడెక్కడ నుంచో మీరంతా రసం తాగటానికి వస్తుంటారు. నేను తయారుచేసిన నారింజ రసం అమెరికా కూడా వెళ్లింది. నాకు అంతకుమించిన సంతోషం లేదు’ అంటారు ఈ తాత. ఆరు నెలలు నారింజలే.. ఆరు నెలల పాటు కేవలం నారింజ రసం అమ్ముతారు. మిగిలిన ఆరు నెలలు రకరకాల రసాలు అమ్ముతారు. సొంతంగా లిమ్కా రుచిని కూడా తయారుచేస్తారు. మొత్తం 20 రకాల జ్యూస్‌లు తయారుచేస్తారు సుబ్బా రావు తాత. అన్నీ 20 రూపాయలకే అందిస్తున్నారు. వచ్చిన ప్రతివారినీ ‘రండి బాబూ! రా తమ్ముడూ! రా మనవడా!’ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. పది పైసలతో మొదలు.. 50 సంవత్సరాల క్రితం 10 పైసలతో ప్రారంభమైన నారింజ రసం ఇప్పుడు 20 రూపాయలకు చేరింది. ‘ఈ పాకం, ఈ ఫార్ములా ఎవ్వరికీ తెలియదు. ఈ రుచికి అలవాటు పడిన వాళ్లు మళ్లీ మళ్లీ అక్కడకు వచ్చి, ఆగి తాగి వెళ్తారు. ‘సుబ్బారావు గ్రేట్’ అంటారు అక్కడ రసం తాగినవారు. మంచి నీడనిచ్చే చెట్టు కింద నీడలో చల్లగా సేద తీరుతారు. ‘బండి చిన్నదే కానీ రుచి మాత్రం పెద్దది’ అంటారు ఆ రసం రుచి చూసినవారంతా. ఆ రసాన్ని మిషన్ మీద కాకుండా చేత్తో తీసే మిషన్‌తోనే తీస్తారు. ఉప్పు, కారం, ప్రత్యేకమైన మసాలా వేసి, కొద్దిగా ఐస్ జత చేసి జ్యూస్ ఇస్తూ, సుబ్బారావు తాత అందరి కడుపులను చల్లబరుస్తున్నారు. -
ఏడోరోజు కొనసాగిన పుష్కరాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కృష్ణా పుష్కరాల ఏడోరోజు జిల్లాలో 3.5లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గురువారం రాఖీ పర్వదినం కావడం.. ఇంకా పుష్కరాలకు నాలుగురోజులే మిగిలి ఉన్నా ఆశించిన మేర భక్తులు రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 ఘాట్లలో కొన్ని ఘాట్లు వెలవెలబోతున్నా నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లిల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ శివాలయం, ఆంజనేయస్వామి ఘాట్లు కలిపి గురువారం లక్ష మందికి పైగా స్నానాలు చేసినట్టు అంచనా. వాడపల్లిలో 80వేల మంది, మట్టపల్లిలో 40వేల మంది వరకు స్నానాలు చేశారు. కనగల్ మండలం దర్వేశిపురం ఘాట్‌కు 30వేల మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా. దర్వేశిపురం ఘాట్‌కు రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు, అధికారుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. అయితే, మట్టపల్లిలో ఏడో రోజు భక్తుల సంఖ్య తగ్గింది. నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్‌లో కూడా భక్తులు తగ్గగా, చందంపేట మండలం కాచరాజుపల్లి ఘాట్‌కు మాత్రం 10వేల మందికి పైగా భక్తులు వచ్చారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇలా... హుజూర్నగర్ నియోజకవర్గంలోని అన్ని ఘాట్లలో భక్తుల సంఖ్య కొంత మేర తగ్గింది. పుష్కర స్నానం కోసం ఈనెల 20వ తేదీన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మట్టపల్లికి రానుండటంతో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి మట్టపల్లికి వచ్చి ప్రహ్లాద ఘాట్‌లో ఏర్పాట్లు పరిశీలించారు. పర్యటన ప్రశాంతంగా సాగేందుకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం స్థానికంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికుల కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మేళ్లచెరువు మండలంలోని పుష్కర ఘాట్లను ఎస్పీ పరిశీలించారు. మట్టపల్లి ప్రహ్లాదఘాట్లో ఇంటలిజెన్స్ డిఐజీ శివశంకర్‌రెడ్డి పుష్కర స్నానం ఆచరించి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దామరచర్ల మండలంలో ఇలా... దామరచర్ల మండలంలోని ఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం తెల్లవారు జామున భక్తులు తక్కువగా వచ్చినా రాఖీ పౌర్ణమి కావడం వల్ల తొమ్మిది గంటల తర్వాత భక్తుల తాకిడి పెరిగింది. శివాలయం ఘాట్‌తో పాటు అడవిదేవులపల్లి, అయ్యప్పఘాట్లకు భక్తులు భారీగా వచ్చారు. అడవిదేవులపల్లి పుష్కరఘాట్‌లో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబసభ్యులతో కలిసి స్నానాలు చేశారు. వాడపల్లిలోని శివాలయం వద్ద వీఐపీ ఘాట్‌లో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం కుటుంబ సభ్యులతో కలిసి పిండప్రదానం చేసి పుణ్యస్నానాలు చేశారు. అదే విధంగా ముదిమాణిక్యం పుష్కరఘాట్‌లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఇర్కిగూడెం ఘాట్‌లో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, వాడపల్లిలో ఏజేసీ వెంకట్రావ్, స్థానిక ఎమ్మెల్యే బాస్కర్‌రావు సతీమణితో పాటు ఆయన బంధువులు స్నానాలు చేశారు. -
పుష్కర పనుల నాణ్యత ప్రశ్నార్థకం
వాడపల్లి(దామరచర్ల) : ప్రభుత్వం పుష్కర పనులను ఆర్నెళ్ల క్రితం ప్రారంభిస్తే నాణ్యతగా పనులు జరిగేవని సీపీం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వాడపల్లి పాతపోలీస్ స్టేషన్ ఘాట్, పాత సిమెంట్ఘాట్, శివాలయం ఘాట్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పుష్కరాలు దగ్గర పడుతుండడంతో హడావుడిగా పనులు చేయడం వలన నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వాడపల్లిలో ఉన్న చారిత్రక కట్టడాల భద్రతపై చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పుడు రంగులు, టైల్స్ వేస్తే పుష్కరాలు అయిపోయేంత వరకైనా ఉంటాయా అనేది అధికారులే చెప్పాలన్నారు. ఆయన వెంట డివిజన్ కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ యాదవ్, పాపానాయక్, దయానంద్,వినోద తదితరులు పాల్గొన్నారు.