ఏడోరోజు కొనసాగిన పుష్కరాలు
ఏడోరోజు కొనసాగిన పుష్కరాలు
Published Fri, Aug 19 2016 12:16 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కృష్ణా పుష్కరాల ఏడోరోజు జిల్లాలో 3.5లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గురువారం రాఖీ పర్వదినం కావడం.. ఇంకా పుష్కరాలకు నాలుగురోజులే మిగిలి ఉన్నా ఆశించిన మేర భక్తులు రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 ఘాట్లలో కొన్ని ఘాట్లు వెలవెలబోతున్నా నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లిల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ శివాలయం, ఆంజనేయస్వామి ఘాట్‌లు కలిపి గురువారం లక్ష మందికి పైగా స్నానాలు చేసినట్టు అంచనా. వాడపల్లిలో 80వేల మంది, మట్టపల్లిలో 40వేల మంది వరకు స్నానాలు చేశారు. కనగల్ మండలం దర్వేశిపురం ఘాట్‌కు 30వేల మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా. దర్వేశిపురం ఘాట్‌కు రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు, అధికారుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. అయితే, మట్టపల్లిలో ఏడో రోజు భక్తుల సంఖ్య తగ్గింది. నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్‌లో కూడా భక్తులు తగ్గగా, చందంపేట మండలం కాచరాజుపల్లి ఘాట్‌కు మాత్రం 10వేల మందికి పైగా భక్తులు వచ్చారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఇలా...
హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని ఘాట్లలో భక్తుల సంఖ్య కొంత మేర తగ్గింది. పుష్కర స్నానం కోసం ఈనెల 20వ తేదీన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మట్టపల్లికి రానుండటంతో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి మట్టపల్లికి వచ్చి ప్రహ్లాద ఘాట్‌లో ఏర్పాట్లు పరిశీలించారు. పర్యటన ప్రశాంతంగా సాగేందుకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం స్థానికంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికుల కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మేళ్లచెరువు మండలంలోని పుష్కర ఘాట్లను ఎస్పీ పరిశీలించారు. మట్టపల్లి ప్రహ్లాదఘాట్‌లో ఇంటలిజెన్స్ డిఐజీ శివశంకర్‌రెడ్డి పుష్కర స్నానం ఆచరించి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
దామరచర్ల మండలంలో ఇలా...
దామరచర్ల మండలంలోని ఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం తెల్లవారు జామున భక్తులు తక్కువగా వచ్చినా రాఖీ పౌర్ణమి కావడం వల్ల తొమ్మిది గంటల తర్వాత భక్తుల తాకిడి పెరిగింది. శివాలయం ఘాట్‌తో పాటు అడవిదేవులపల్లి, అయ్యప్పఘాట్‌లకు భక్తులు భారీగా వచ్చారు. అడవిదేవులపల్లి పుష్కరఘాట్‌లో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబసభ్యులతో కలిసి స్నానాలు చేశారు. వాడపల్లిలోని శివాలయం వద్ద వీఐపీ ఘాట్‌లో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం కుటుంబ సభ్యులతో కలిసి పిండప్రదానం చేసి పుణ్యస్నానాలు చేశారు. అదే విధంగా ముదిమాణిక్యం పుష్కరఘాట్‌లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఇర్కిగూడెం ఘాట్‌లో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, వాడపల్లిలో ఏజేసీ వెంకట్రావ్, స్థానిక ఎమ్మెల్యే బాస్కర్‌రావు సతీమణితో పాటు ఆయన బంధువులు స్నానాలు చేశారు.
Advertisement
Advertisement