orange fruits
-
ఖాళీ కడుపుతో నారింజ తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బొంగురుపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. అయితే చలికాలంలో రోజూ పండ్లు తింటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదీ పుల్లటి నారింజ పండు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. అదెలాగో చూద్దామా.. అసలే చలికాలం కదా... నారింజ తింటే జలుబు వస్తుందనే భయంతో ఎక్కువ మంది తినడం లేదు. అయితే చలికాలంలో నారింజ పండ్లు తినడం చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. జలుబు–దగ్గు మొదలైన వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులలో కఫం ఉంటే నారింజ మీకు ఔషధం.శీతాకాలంలో నారింజ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శరీరం లోపల నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ రెండు నారింజలను తింటే, మీ రోజువారీ మోతాదుకు తగ్గ విటమిన్ సి లభిస్తుంది. ఫలితంగా శరీరం లోపల బలం పెరుగుతుంది. ఇది కాకుండా, నారింజలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ శరీరంలో మంట లేదా ఇన్ఫెక్షన్ వంటి వాటికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. నారింజ పండ్లను తినడం వల్ల ముఖం, ముఖంపై ఉండే మొటిమలు మాయమవుతాయి. ఇది శరీరాన్ని ఎక్కువసేపు తేమగా ఉంచుతుంది. ముఖంపై పగుళ్లు, పొడిబారడం వంటి సమస్యలను ఇది సరిచేస్తుంది. నారింజ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఇది మీ శరీరంలో ఎసిడిటీకి దారితీస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మధ్యాహ్నం పూట ఈ పండును తినడం మంచిది. అయితే మంచిది కదా అని రోజుకు రెండు పండ్ల కంటే ఎక్కువ తినకూడదు. అలా తినడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. -
ఇప్పుడు ఆపిల్, ఆరెంజ్‌ల వంతు!
దేశంలో అకస్మాత్తుగా గోధుమల ధరలకు రెక్కలు వచ్చాయ్. వెంటనే రంగంలోకి ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటం, హీట్ వేవ్ కారణంగా గోధుమల దిగుబడి తగ్గిపోయిందంటూ వివరణ ఇచ్చింది. ఎగుమతులపై ఆంక్షలు విధించింది. కానీ గోధుమల ధరలైతే పెద్దగా తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు గోధుమల తరహాలోనే హీట్‌వేవ్ ప్రభావానికి మరో పంటలు లోనయ్యాయి. హీట్‌వేవ్ కారణంగా మహారాష్ట్రలో కమల పండ్లు (ఆరెంజ్), హిమాచల్ ప్రదేశ్‌లో ఆపిల్ పంటల దిగుబడి తగ్గిపోయిందనే వార్తలు వస్తున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం గతేడాది దిగుబడితో పోల్చితే హిమాచల్ ఆపిల్ దిగుబడి 25 శాతం, మహారాష్ట్రలోని విదర్భ ఏరియాలో ఎక్కువగా పండే ఆరెంజ్ దిగుబడి 25 నుంచి 30 శాతం వరకు పడిపోయినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఆరెంజ్, యాపిల్ పండ్లకు సీజన్‌తో సంబంధం లేకుండా డిమాండ్ ఉంటుంది. అందరి ఇళ్లలో సాధారణంగా లభించే ఫలాల జాబితాలో ఇవి రెండు ఉంటాయి. దాదాపు నాలుగో వంతు వరకు దిగుబడి తగ్గిపోయిన దరిమిలా ఈ రెండు ఫలాల ధరలకు కూడా పెరగవచ్చంటూ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలకు ఆర్బీఐ ఉపక్రమించినా.. మరో రూపంలో కొత్త సమస్య వచ్చి పడుతూనే ఉన్నాయి. ధరల పెరుగుదులకు దోహదం చేస్తున్నాయి. చదవండి: బిల్‌గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా? -
Bad Breath: నోటి దుర్వాసనా.. భోజనం చివర్లో పెరుగన్నం తింటే!
Top 7 Remedies For Bad Breath: నేటి తరుణంలో నోటి దుర్వాసన సమస్య చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నది. కొందరికి ఏం తిన్నా తినకపోయినా నోటి దుర్వాసన వస్తుంటుంది. అయితే అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమి ఉన్నప్పటికీ నోటి దుర్వాసనను పోగొట్టుకోవడం సులభమే. అదెలాగంటే... భోజనం చేశాక ఈ కింది పదార్థాలు తీసుకుంటే సరి! దాంతో నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు. నోటి దుర్వాసన నివారణకు సులువైన చిట్కాలు 1. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో కచ్చితంగా పెరుగన్నంతో తినడం అలవాటు చేసుకుంటే నోట్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. ఫలితంగా నోరు దుర్వాసన రాదు. 2. భోజనం చేశాక 30 నిమిషాల తరువాత గ్రీన్ టీ తాగండి. ఇందులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. 3. ఆహారంలో క్యాప్సికమ్, బ్రొకోలిలను భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. 4. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను తింటుంటే నోటి దుర్వాసన రాదు. దంత సమస్యలు కూడా పోతాయి. చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి. 5. భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. 6. భోజనం చేసిన తరువాత టీస్పూన్ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి, నోరు ఫ్రెష్ అవుతుంది. 7. భోజనం చేశాక ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమిలేయాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. చదవండి👉🏾Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే! -
ఇంట్లోనే ఇలా జ్యూస్ చేసుకోండి.. దీని ధర రూ.8,909!
కాస్త శక్తి రావాలన్నా, దాహం తీరాలన్నా.. ఏమాత్రం ఆరోగ్యం బాగోకున్నా.. ముందుగా గుర్తుకొచ్చేవి కమలా, బత్తాయి పళ్ల జ్యూసులే. ఆరోగ్యంపై పలు జాగ్రత్తలు పెరుగుతున్న ఈ తరుణంలో.. కూల్‌డ్రింక్స్ కంటే ఇలాంటి జ్యూసులకే ప్రాధాన్యం పెరిగింది. అయితే ఇంట్లో చిన్న హ్యాండ్ జ్యూసర్‌తో వీటి రసం తీసుకోవడం శ్రమతో కూడిన పని అయిపోతుంది. దాంతో జ్యూస్ కార్నర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి సమస్యకు చెక్ పెడుతుంది ఈ డివైజ్. దీనిలో కమలా, బత్తాయి, దబ్బపళ్ల వంటి వాటిని.. అడ్డంగా కట్ చేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ స్ట్రెంత్ మోటరైజ్డ్ ప్రెస్ టెక్నాలజీ కలిగిన ఈ జ్యూసర్.. చేతికి శ్రమ లేకుండా సాఫ్ట్ గ్రిప్, నాన్–స్లిప్ హ్యాండిల్ కలిగి ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ డివైజ్‌లో సుదీర్ఘ మన్నిక కలిగిన 2 ఫిల్టర్స్ ఉంటాయి. డివైజ్‌కి సంబంధించిని జ్యూస్ ట్యాప్ దగ్గర లాక్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తేనే పైన ఉన్న ట్రాన్స్పరెంట్ పాత్రలో నిండిన జ్యూస్ కింద ఉండే గ్లాసులోకి వచ్చి చేరుతుంది. ధర : 118 డాలర్లు (రూ.8,909) చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే -
ఆ సమయంలో బత్తాయి, కమలా బదులు అరటి, బొప్పాయి తింటే...
ఏం తింటున్నాం? దేహానికి అవసరమైన ఆహారాన్ని తింటున్నామా? జంక్‌తో పొట్ట నింపేస్తున్నామా? అనే జాగ్రత్తల వరకు చైతన్యవంతంగానే ఉంటున్నాం. కానీ మనం తిన్న ఆహారాన్ని మన దేహం సక్రమంగా గ్రహిస్తోందా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతోంది. మాల్న్యూట్రిషన్ ఎంత ప్రమాదమో మాల్ అబ్జార్షన్ కూడా అంతే ప్రమాదకరం. మాల్ అబ్జార్షన్ అంటే అపశోషణం. తేలిక పదాల్లో చెప్పాలంటే జీర్ణాశయంలోకి చేరిన ఆహారం అక్కడ సరిగ్గా పచనం కావడం, చిన్నపేగుల్లోకి చేరిన తర్వాత ఆహారంలోని శక్తిని పేగులు పీల్చుకోవడం అనే క్రియలు సక్రమంగా జరగకపోవడం. ఆహారంలోని పోషకాలు దేహానికి అందకుండా వ్యర్థాలతోపాటు విసర్జితం కావడం అన్నమాట. సామాన్య భాషలో తిన్నది ఒంటికి పట్టకపోవడం అంటుంటాం. తినడమే కాదు, తిన్నది ఒంట పట్టిందా లేదా అనేది కూడా ముఖ్యమే. ఈ సమస్య చిన్నదిగానే అనిపించవచ్చు, కానీ తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అనేక అనుబంధ ఆరోగ్యసమస్యలకు కారణమవుతుంది. మొదటగా విరేచనాల రూపంలో బయటపడుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంగా కొనసాగుతున్నా, తరచుగా ఎదురవుతూ ఉన్నా... దేహం శక్తిహీనం అవుతూ బరువు తగ్గడం మొదలవుతుంది. మాల్ అబ్జార్షన్కు దారి తీసే ప్రత్యక్ష కారణం జీర్ణ ప్రక్రియలో ఎదురయ్యే అంతరాయాలు. అయితే ఇందులో జీర్ణరసాల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, పైత్యరసం ఉత్పత్తి తగ్గిపోవడం, ఆమ్లాల ఉత్పత్తి మితిమీరడం, చిన్న పేగుల్లో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందడం వంటి కారణాలు పరోక్షంగా ఉంటాయి. అన్నీ కలిపి తింటే ఇంతే... ఒక్కో ఆహారాన్ని జీర్ణం చేయడానికి దేహం ఒక్కో రకమైన జీర్ణరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏకకాలంలో పరస్పరం పొంతన లేని జీర్ణరసాల అవసరం ఏర్పడినప్పుడు జీర్ణవ్యవస్థ కొంత అయోమయానికి, సంక్లిష్టతకు లోనవుతుంది. అలాంటప్పుడు కూడా ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా ఇబ్బంది ఎదురవుతుంది. ఇది ప్రధానంగా డిన్నర్లలో భోజనం చేసినప్పుడు వస్తుంటుంది. రకరకాల పదార్థాలతో జీర్ణాశయాన్ని నింపేయడం వల్ల ఏ రకమైన జీర్ణరసం ఉత్పత్తి ఎంత మోతాదులో జరగాలో అనే అయోమయం ఏర్పడుతుంది. కొందరిలో అప్పటికే జీర్ణరసాల ఉత్పత్తి లోపించి ఉండడం వంటి కారణాలతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మరుసటి రోజు విరేచనాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. అలాగే బయట ఆహారం, పరిశుభ్రత లోపించిన ప్రదేశాల్లో వండిన ఆహారం తినాల్సి రావడం వల్ల కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. డయేరియా అనేది నెలలో ఒకటి లేదా రెండు సార్లు అయితే ప్రమాదకరం కాదు. కానీ ఇలా తరచూ జరుగుతుంటే దేహంలో ఇతర అవయవాల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. డయేరియా వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ కోలుకునే వరకు మసాసాలు, పాలు మానేసి మజ్జిగ, పెరుగు తీసుకోవాలి. వంటి పుల్లటి పండ్లకు బదులు అర బత్తాయి, కమలాటి, బొప్పాయి వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. -
టన్ను బత్తాయి ధర ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో డిమాండ్ పెరగడంతో బత్తాయికి రికార్డు స్థాయిలో ధర లభించింది. హోల్‌సేల్ మార్కెట్లో టన్ను బత్తాయి ధర రూ.లక్ష పలుకుతోంది. సామాన్యులు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే కిలో బత్తాయి రూ.100 కు విక్రయిస్తున్నారు. ఈ ధర గతంలో ఎప్పుడూ లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విటమిన్–సి పుష్కలంగా ఉండడంతో డాక్టర్లు కోవిడ్ పేషెంట్లను బత్తాయి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది బత్తాయి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కొత్తపేట్‌లో శుక్రవారం గతంలో ఎన్నడూలేని విధంగా టన్ను లక్ష రూపాయలు పలికింది. మరోవైపు రోజు మార్కెట్‌కు 800 టన్నుల బత్తాయి దిగుబడి రావాలి. కానీ గత నెల నుంచి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక కూడా ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కేవలం 300 టన్నుల బత్తాయి మాత్రమే మార్కెట్‌కు దిగుమతి అవుతోందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. కరోనా కాలంలో కొత్తపేట పండ్ల మార్కెట్ నుంచి బత్తాయి ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధర టన్ను బత్తాయి ధర రూ.లక్ష పలకడం కొత్తపేట మార్కెట్ చరిత్రలోనే రికార్డు. కోవిడ్ నేపథ్యంలో బత్తాయి వినియోగం దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి మార్కెట్ నుంచే ఎగుమతులు అవుతాయి. ఈ ఏడాది బత్తాయి పూత సమయంలో వర్షాలతో పూత రాలి దిగుబడి తగ్గింది. దీంతో కూడా డిమాండ్‌కు మేర సరుకు లేక ధర పెరిగింది. – సయ్యద్ అఫ్సర్, హోల్‌సేల్ వ్యాపారి, కొత్తపేట చదవండి: అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి? -
అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్-సీ అధికంగా ఉండే పండ్ల వినియోగానికి డిమాండ్ పెరగడంతో బత్తాయి పండ్లకు గిరాకీ పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా విస్తృతి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపారులు ఇక్కడికే వచ్చి రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లకు బత్తాయి రాక తగ్గింది. ఒక్క కొత్తపేట పండ్ల మార్కెట్‌కే కనీసంగా రోజుకు 300 టన్నుల మేర బత్తాయి సరఫరా తగ్గింది. దీంతో రాష్ట్ర మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధర అమాంతం పెరుగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో రూ.20 నుంచి రూ.30 పలకగా, ఇప్పుడది ఏకంగా రూ.70కి చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పొరుగు నుంచి ఎగబడ్డ వ్యాపారులు రాష్ట్రంలో రోజుకు ఐదు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదవుతుండగా, ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాన్యులు సైతం ప్రతిరోజూ 500 మిల్లీగ్రామ్ల విటమిన్–సీ పండ్లను రోజువారీ ఆహారంగా తీసుకోవాలని, దీనిద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉండే బత్తాయి వైపు సామాన్యులు ఎగబడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బత్తాయికి డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు నేరుగా రైతుల పంటల వద్దకే వెళ్లి కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారులే కోతలు చేసి, ప్యాకేజింగ్, రవాణా, లోడింగ్ ఇలా అన్నీ సొంత ఖర్చులతో కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు వీరికి అమ్ముకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎక్కువగా ఢిల్లీ, హరియాణా, కోల్‌కతాతోపాటు రాజస్తాన్ నుంచి వ్యాపారులు టన్నుకు రూ.35 వేల నుంచి 40 వేలకు కొనుగోలు చేస్తున్నారు. బయటి రాష్ట్రాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుండటంతో హైదరాబాద్ మార్కెట్‌కు బత్తాయి రాక తగ్గిపోయింది. ముఖ్యంగా కొత్తపేట పండ్ల మార్కెట్‌కు దీని సరఫరా తగ్గింది. ప్రతి ఏటా కొత్తపేట మార్కెట్‌కు రోజుకు 500–600 టన్నుల మేర బత్తాయి రాగా, ఈ ఏడాది కేవలం 100–125 టన్నులు మాత్రమే వస్తోంది. ఇది మార్కెట్ అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. వచ్చిన కొద్దిపాటి బత్తాయిని వ్యాపారులు హోల్‌సేల్‌లో టన్నుకు రూ.40 వేల నుంచి 50వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో రూ.40–50 వరకు ఉంది. ఇది గత ఏడాది ధరలతో పోలిస్తే రూ.20 అధికం. ఇదే బత్తాయిని బహిరంగ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.70 వరకు కొనుగోలుదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. నిమ్మ, కివీ సైతం... ఇక సీ-విటమిన్ అధికంగా ఉండే నిమ్మకాయలకు చెప్పలేనంత డిమాండ్ ఉంది. గతంలో బహిరంగ మార్కెట్లలో రూ.10కి 3 నిమ్మకాయలు విక్రయించగా, ప్రస్తుతం ఒక్క నిమ్మకాయే అమ్ముతున్నారు. సీ-విటమిన్‌కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కివీ పండ్ల ధరలు సైతం అమాంతం పెరిగాయి. గత ఏడాది 24 పండ్లు ఉండే ఒక్క బాక్స్ ధర రూ.వెయ్యి పలుకగా, ప్రస్తుతం రూ.3 వేలకు చేరింది. రోజుకు కొత్తపేట మార్కెట్‌కు వెయ్యి బాక్స్‌ల వరకు రాగా, ఇప్పుడది 500 నుంచి 600 బాక్స్‌లకు తగ్గింది. దీంతో అటు పండ్ల లభ్యత లేక.. ఇటు అధిక ధరలకు పండ్లు కొనలేక వినియోగదారులు సతమతమవుతున్నారు. చదవండి: కరోనా ఎంతున్నా ఎన్నికలు జరుపుతాం చదవండి: ఉత్సవంతో వచ్చిన కరోనా.. అటవీ గ్రామాల్లో కల్లోలం -
సుబ్బారావు గ్రేట్.. నారింజ రసం సూపర్
నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది తొక్క తీసి తినగా అబ్బబ్బ పులుపు తిననే తినను తీసి నేలకొట్ట తీయని నారింజ తింటే హాయ్ హాయ్.. చిన్నప్పుడు చదువుకున్న పాట ఇది. నారింజ పేరు చెబితేనే కళ్లు మూసుకుంటాయి. అటువంటి నారింజ రసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతుంటారు ఇక్కడ. తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం దాటి, ఆత్రేయపురం వెళ్లే దారిలో లొల్ల లాకులకు ముందుగా, రోడ్డు పక్కన పచ్చని చెట్ల కింద చిన్న బండి కనిపిస్తుంది. అక్కడకు రాగానే వారి వారి వాహనాలను పక్కన పెట్టి, జుత్తుగ సుబ్బారావు తాత ఇచ్చే నారింజ రసం సేవించి, సేద తీరుతుంటారు. సుబ్బారావు వయస్సు 83 సంవత్సరాలు. ‘శ్రేష్ఠమైన వడ్లమూడి నారింజ పండ్లు తెప్పించి, రసం తీసి ఇస్తాను. వడ్లమూడిలో దొరక్కపోతే, రాజమండ్రి, నిడదవోలు ప్రాంతాల నుంచి నారింజకాయలు తీసుకువస్తాయి’ అంటారు ఈ తాత. ఆశ్చర్యమేమిటంటే, నారింజ కాయలు కొనడానికి తాత ఎక్కడకూ వెళ్లరు, అక్కడి నుంచి కాయలు రాగానే, ఇక్కడ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు. ‘అంతా నమ్మకం మీదే నడిచిపోతోంది వ్యాపారం’ అంటారు ఈ తాత. ఒక్కో మనిషికి మూడు కాయల రసం పిండుతారు. కాయలు బాగా తగ్గినప్పుడు రెండు కాయలు పిండుతారు. ఒక్కో కాయ పది రూపాయలకు కొంటారు. కాని గ్లాసు రసం 20 రూపాయలకే అమ్ముతారు. ఎవరైనా వచ్చి ‘ధర పెంచవా తాతయ్యా’ అని అడిగితే, ‘నాకు ఆదాయానికి లోటు లేదు. నేను కూర్చుని తిన్నా నాకు సాగుతుంది. కాని ఏదో ఒక పనిచేయనిదే నాకు తోచదు. ఇది అలవాటైన పని. ఓపిక ఉన్నన్ని రోజులు చేస్తాను’ అంటూ ఎంతో సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. వ్యాపార రహస్యం.. నారింజ రసంలో నాలుగు రకాల వస్తువులు కలుపుతారు. ‘లక్ష రూపాయలిచ్చినా ఆ రహస్యం మాత్రం చెప్పను’ అంటారు సుబ్బారావు తాత. మొట్టమొదట్లో ఈ వ్యాపారం ర్యాలి గ్రామంలోని జగన్మోహిని ఆలయం దగ్గర ప్రారంభించారు. అక్కడ ఈ బండి పాతిక సంవత్సరాలు నడిచింది. ఆ తరవాత ఇప్పుడున్న ప్రదేశానికి మార్చానని చెబుతారు సుబ్బారావు తాత. ఆ తల్లి చలవ.. సుబ్బారావు తాత తన చిన్నతనంలో ఒకరి ఇంట్లో చాలా కాలం పనిచేశారు. అందుకుగాను వారు సుబ్బారావు తాతకు ఆరు కుంచాల పొలం రాసి ఇచ్చారట. సుబ్బారావు తాతకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారిది ఉమ్మడి కుటుంబం. ‘వంటంతా ఒక కుండలోనే జరుగుతుంది’ అంటూ సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. ‘ఇంటి దగ్గర కూర్చుంటే ఏం వస్తుంది. ఓపిక ఉంది, కష్టపడతాను. ఎక్కడెక్కడ నుంచో మీరంతా రసం తాగటానికి వస్తుంటారు. నేను తయారుచేసిన నారింజ రసం అమెరికా కూడా వెళ్లింది. నాకు అంతకుమించిన సంతోషం లేదు’ అంటారు ఈ తాత. ఆరు నెలలు నారింజలే.. ఆరు నెలల పాటు కేవలం నారింజ రసం అమ్ముతారు. మిగిలిన ఆరు నెలలు రకరకాల రసాలు అమ్ముతారు. సొంతంగా లిమ్కా రుచిని కూడా తయారుచేస్తారు. మొత్తం 20 రకాల జ్యూస్‌లు తయారుచేస్తారు సుబ్బా రావు తాత. అన్నీ 20 రూపాయలకే అందిస్తున్నారు. వచ్చిన ప్రతివారినీ ‘రండి బాబూ! రా తమ్ముడూ! రా మనవడా!’ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. పది పైసలతో మొదలు.. 50 సంవత్సరాల క్రితం 10 పైసలతో ప్రారంభమైన నారింజ రసం ఇప్పుడు 20 రూపాయలకు చేరింది. ‘ఈ పాకం, ఈ ఫార్ములా ఎవ్వరికీ తెలియదు. ఈ రుచికి అలవాటు పడిన వాళ్లు మళ్లీ మళ్లీ అక్కడకు వచ్చి, ఆగి తాగి వెళ్తారు. ‘సుబ్బారావు గ్రేట్’ అంటారు అక్కడ రసం తాగినవారు. మంచి నీడనిచ్చే చెట్టు కింద నీడలో చల్లగా సేద తీరుతారు. ‘బండి చిన్నదే కానీ రుచి మాత్రం పెద్దది’ అంటారు ఆ రసం రుచి చూసినవారంతా. ఆ రసాన్ని మిషన్ మీద కాకుండా చేత్తో తీసే మిషన్‌తోనే తీస్తారు. ఉప్పు, కారం, ప్రత్యేకమైన మసాలా వేసి, కొద్దిగా ఐస్ జత చేసి జ్యూస్ ఇస్తూ, సుబ్బారావు తాత అందరి కడుపులను చల్లబరుస్తున్నారు. -
బత్తాయి ధరకు భరోసా.. రైతుకు ధిలాసా
సాక్షి, అమరావతి: ఆంధ్ర బత్తాయి.. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో యమ గిరాకీ. మార్కెట్‌కు వస్తోందంటే చాలు ఎగరేసుకుపోతారు. గతేడాది రికార్డు స్థాయిలో దిగుబడులు రాగా, మార్కెట్‌కు వచ్చే సమయంలో కరోనా దెబ్బతీయడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు చేయడంతో బత్తాయి రైతు గట్టెక్కగలిగాడు. ప్రస్తుతం మార్కెట్లో మంచి రేటు పలుకుతుండడంతో ఈసారి లాభాలను ఆర్జించే అవకాశాలు కన్పిస్తున్నాయి. బత్తాయి సాగులోనే కాదు.. దిగుబడిలో కూడా మన రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉంది. రాష్ట్రంలో అనంతపురం, విజయనగరం, వైఎస్సార్, ప్రకాశం, తూర్పు గోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా సాగవుతోంది. మొత్తం విస్తీర్ణంలో సగానికి పైగా రాయలసీమ జిల్లాల్లోనే ఉంది. రాష్ట్రంలో సాతుగుడి, చీని రకాల బత్తాయి పండుతోంది. సాధారణంగా ఏడాదికి మూడు పంటల వరకు తీస్తారు. కానీ ఏప్రిల్‌లో వచ్చే పంటకే మంచి డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలొస్తాయి.అందుకే రైతులు ఎక్కువగా ఆ పంటపైనే ఆశలు పెట్టుకుంటారు. మనరాష్ట్రంలో సాగయ్యే బత్తాయిలో సగానికిపైగా ఢిల్లీ అజాద్‌పూర్ మార్కెట్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. మిగిలిన సగంలో మూడొంతులకుపైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు వెళుతుంది. కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే లోకల్ మార్కెట్‌కు పోతుంది. మన బత్తాయి టన్ను రూ.లక్ష పలికిన సందర్భాలున్నాయి. 2018–19లో 88,029 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవగా 21.9 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2019–20లో సాగువిస్తీర్ణం 1,10,970 హెక్టార్లకు చేరగా దిగుబడి రికార్డు స్థాయిలో 26.63 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. నిరుడు ప్రభుత్వ జోక్యంతో గట్టెక్కారు.. 2019–20లో దిగుబడి ఎక్కువగా ఉన్నా.. పంట మార్కెట్‌కు వచ్చే సమయం (ఏప్రిల్)లో కరోనా దెబ్బతీసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే.. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లను ప్రకటించింది. ఆ జాబితాలో రాష్ట్రంలో ఎక్కువగా సాగయ్యే బత్తాయి కూడా ఉండడం రైతుకు మేలు చేసింది. గతేడాది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెటింగ్‌శాఖ ద్వారా బత్తాయిని టన్ను రూ.10 వేల చొప్పున 4,109 మెట్రిక్ టన్నుల బత్తాయిని కొనుగోలు చేసింది. రూ.5 సబ్సిడీ భరించి రైతుబజార్లు, స్వయం సహాయక సంఘాల ద్వారా విక్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలవల్ల లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత బత్తాయికి మంచి రేటొచ్చింది. టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముకుని రైతులు గట్టెక్కారు. ఈ ఏడాది మార్కెట్లో మంచి రేటు ప్రస్తుతం 95,982 హెక్టార్లలో బత్తాయి సాగులో ఉంది. హెక్టారుకు 24 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్లో టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉంది. పూర్తిస్థాయిలో పంట మార్కెట్‌కు వచ్చే సమయానికి రూ.60 వేలకు పైగా పలికే అవకాశాలుండడంతో మంచి లాభాలొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మదర్ డెయిరీ తమ ఖాతాదారులకు పంపిణీ చేసేందుకు రాయలసీమ జిల్లాల నుంచి రోజుకు ఒక లోడు బత్తాయిని కొనుగోలు చేస్తోంది. మొత్తం బత్తాయి కొనుగోలు చేస్తామంటూ ఆ సంస్థ ఇప్పటికే అధికారులతో చర్చలు జరుపుతోంది. మరోపక్క ఢిల్లీ అజాద్‌పూర్ మార్కెట్ నుంచి ఆర్డర్లు కూడా మొదలయ్యాయని రైతులు చెబుతున్నారు. దిగుబడులు బాగున్నాయి ఈసారి పంట బాగుంది. దిగుబడులు కూడా రికార్డు స్థాయిలోనే వచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో టన్ను రూ.40 వేలకుపైగా పలుకుతుండగా, ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సంవత్సరం రైతుకు మంచి లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, జేడీ, హార్టికల్చర్ (ఫ్రూట్స్ విభాగం) -
బత్తాయి..చవకోయి..!
ఒంగోలు టూటౌన్: కరోనా నివారణ నేపథ్యంలో లాక్‌డౌక్‌లో ఉన్న పొదుపు మహిళలకు మంచి ఆరోగ్యకరమైన ఫలాలను తక్కువ ధరకు అందించే కార్యక్రమం సర్కార్ చేపట్టింది. కోవిడ్–19 ఎదుర్కొనేందుకు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు వెలుగు ద్వారా అరటి అమ్మకాలు చేపట్టి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. అన్ని జిల్లాల్లో కంటే ప్రకాశం జిల్లాలో 940 మెట్రిక్ టన్నుల అరటి అమ్మకాలు చేసి డీఆర్డీఏ–వెలుగు అధికారులు ప్రభుత్వ ప్రశంసలు పొందారు. లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో మళ్లీ ఇప్పటి నుంచి బత్తాయి అమ్మకాలను పొదుపు సంఘాల ద్వారా సర్కార్ చేపట్టింది. అనంతపురం, కడప జిల్లాల్లోని రైతుల వద్ద బత్తాయిలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ప్రతి పొదుపు సభ్యురాలి కుటుంబానికి అతి తక్కువ ధరకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండు వేల టన్నుల బత్తాయిలు అమ్మాలని డీఆర్డీఏ–వెలుగు అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే తొలివిడతగా జిల్లాకు 70 టన్నుల బత్తాయిలుదిగుమతి అయ్యాయి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, వెలుగు శాఖల సమన్వయంతో జిల్లాకు చేరిన బత్తాయిలను ఆయా మండలాల్లోని వీవోఏలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం తొలివిడతలో వేటపాలెం, పర్చూరు, కారంచేడు, చినగంజాం, మార్టూరు, యద్దనపూడి, ఇంకొల్లు, కొత్తపట్నం మండలాలకు చెందిన వీవోఏలకు బత్తాయి దిగుమతి చేశారు. ప్రభుత్వం బత్తాయిలను కిలో పది రూపాయలకు కొనుగోలు చేసి సబ్సిడీపై ఇస్తోంది. బయట మార్కెట్లో మూడు కిలోల బత్తాయి రూ.100 అమ్ముతుండగా ప్రభుత్వం మాత్రం రూ.100 లకి పది కిలోల బత్తాయి అందిస్తోంది. అంటే బయట మార్కెట్లో కంటే మూడు రెట్లు తక్కువ ధరకు నాణ్యమైన బత్తాయిని పేదలకు ఇస్తోంది. అయితే బత్తాయి తోటలు ఉన్న పశ్చిమ ప్రాంతంలోని కొన్ని మండలాల్లో ఆయా మండలాల ఏపీఎంలు వాటి అమ్మకాలకు అనుమతులు తీసుకోలేదు. మిగిలిన మండలాల్లో పొదుపు సంఘాల ద్వారా అమ్ముతున్నారు. బత్తాయి అమ్మకాల్లో కూడా ముందుంటాం ఇప్పటి వరకు అరటి అమ్మకాల్లో అన్ని జిల్లాల కంటే అత్యధికంగా అమ్మి జిల్లాకు ప్రథమ స్థానం తీసుకొచ్చాం. బత్తాయి పండ్లను చాలా తక్కువ ధరకు ప్రభుత్వం పేదలకు అందించేందుకు శ్రీకారం చుట్టింది. అటు రైతులకు ఇటు పేదలకు ఎంతో మేలు చేసే కార్యక్రమాలను సర్కార్ చేపట్టింది. – జె. ఎలీషా, డీర్‌డీఏ పీడీ -
తొక్కే కదా అని తీసిపారేయకండి...
అన్ని పండ్ల తొక్కల్లో విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందుకని వాటిని ఆహారంగా తీసుకోలేం కదా. అయితే తొక్కే కదా అని తీసిపారేయకండి. వాటిని మరోలా ఉపయోగించుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలు అందానికి బాగా ఉపయోగపడతాయని ఇంతకు ముందు చాలా సార్లు తెలుసుకున్నాం. బకెట్ నీళ్ళలో కొన్ని నిమ్మ తొక్కలు వేసి మరిగించి, ఆ నీళ్లతో స్నానం చేయాలి. నిమ్మతొక్కల్లోని సిట్రిక్ యాసిడ్ వల్ల చర్మం మృదువుగా అవుతుంది. బయట ఎక్కువగా తీరుతున్న వారికి చర్మంపై దుమ్ముచేరి, కమిలిపోతుంది. అలసటకు కూడా గురవుతారు. అలాంటప్పుడు అరటిపండు తొక్కతో ముఖమంతా మర్దనా చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. బొప్పాయి గుజ్జుతో ఫేసియల్ చేయడం అందరికీ తెలుసు. వీటి తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి దీన్ని కూడా ప్యాక్ గా వేసుకుని పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. యాపిల్ తొక్కను కూడా మిక్సీ చేసి ముఖానికి పట్టించాలి.నెమ్మదిగా మర్దన చేస్తే, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది. నారింజ తొక్కలు కూడా సున్నిపిండిలో వేసి మర పట్టిస్తే చర్మం మృదువుగా అవుతుంది. దీన్ని కూడా నీళ్ళలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. అలాగే తొక్కల గుజ్జుతో ప్యాక్ చేసుకుంటే నల్లని మచ్చలు, కంటికింద వలయాలు తగ్గుతాయి. నిద్రనుంచి లేచినప్పుడు కొందరి ముఖం ఉబ్బి పోతుంది. ఇది తగ్గాలంటే బంగాళా దుంప తొక్కలు ఉడికించిన నీటితో ముఖం కడుక్కుంటే ఉబ్బిన చర్మం మామూలుగా అయిపోతుంది. అలాగే ఉడికిన తొక్కల్ని ప్యాక్ గా చేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది. -
ఆశావహ సేద్యం!
రసాయనిక వ్యవసాయానికి పెట్టింది పేరైన హర్యానా రాష్ట్రంలో ఆశా వంటి ప్రకృతి వ్యవసాయదారులు అరుదుగా కనిపిస్తారు. ఆశ తన కుటుంబ సభ్యులు, కూలీల సహకారంతో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండ్ల తోటలు, పంటలు సాగు చేస్తానంటే వాళ్ల ఇంట్లో వాళ్లే ఎగతాళి చేశారు. అయినా, ఆశా వెనకంజ వెయ్యలేదు. జిల్లా కేంద్రం చర్కి–దద్రి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో పిచొంప కలన్ గ్రామం ఆమెది. 3,200 గడప ఉంటుంది. ఆశా, ఆమె కోడలు జ్యోతితోపాటు ఆ ఊళ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా కొద్దిమంది మాత్రమే. వాళ్లకు మూడెకరాల భూమి ఉంది. అందులో నారింజ, నిమ్మ, బత్తాయి చెట్లతో కూడిన పండ్ల తోటను సాగు చేస్తున్నారు. పరస్పరం పోటీ పడని సీజనల్ పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ప్రకృతి వ్యవసాయంలో ఓ ముఖ్య సూత్రం. ఆశా ఆ సూత్రాన్ని పాటిస్తున్నారు. పాలకూర, మెంతికూర, శనగలు, సజ్జలు, గోధుమలను కూడా అంతరపంటలుగా సాగు చేస్తూ ఉత్తమ రైతుగా ఆశా పేరు గడించారు. అదే తోటలో సీతాఫలం మొక్కలను కూడా నాటాలని ఆమె అనుకుంటున్నారు. తొలుత రెండేళ్ల పాటు సాధారణ దిగుబడితో పోల్చితే 40 శాతం మేరకే దిగుబడి వచ్చిందని, అయినా మక్కువతో ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించి, ఇప్పుడు మంచి దిగుబడులు పొందుతున్నానని ఆశా తెలిపారు. ఏ రోజైనా ఇంటిపనులు చేసుకున్న తర్వాత ఉదయం, సాయంత్రం తోటలోకి వెళ్లి పనులు స్వయంగా చేసుకోవడం ఆశాకు, ఆమె కోడలికి అలవాటు. ప్రతిరోజూ శ్రద్ధగా తోటను గమనించుకుంటూ.. ఎక్కడైనా చీడపీడల జాడ కనిపిస్తే వెంటనే కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేసి అదుపు చేయడం ముఖ్యమైన సంగతి అని ఆశ అంటున్నారు. గొయ్యిలో పాతిపెట్టిన మట్టి పాత్రలో పుల్లమజ్జిగ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చీడపీడలకు దాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తారు. ఔషధ చెట్ల నుంచి సేకరించిన జిగురుకు నిప్పు అంటించి తోటలో పొగబెట్టడం ద్వారా చీడపీడలను సంప్రదాయ పద్ధతిలో ఆశా పారదోలుతున్నారు. ‘పంటలు పూత దశలో మా బామ్మ ఇలాగే చేసేది’ అంటున్నారామె. ప్రతి రెండు నెలలకోసారి ద్రవ జీవామృతాన్ని తోటకు అందిస్తూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. వర్మీకంపోస్టును సైతం తయారు చేసి పంటలకు వాడుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఎరువులు, పురుగుమందులను తయారు చేసుకుంటున్నారు. బయట ఏవీ కొనడం లేదు. బోరు నీటిని స్ప్రింక్లర్లు, డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ‘ఈ తరహా ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి చాలా తక్కువే. అయితే, కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది’ అంటున్నారు ఆశా కోడలు జ్యోతి. సతత్ సంపద అనే స్వచ్ఛందసంస్థ హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను పరిచయం చేస్తూ ఉంటుంది. ఆశకు ఈ సంస్థ తోడ్పాటునందించింది. సతత్ సంపద డైరెక్టర్ జ్యోతి అవస్థి ఇలా అంటున్నారు.. ‘భూమిలో డీఏపీ, యూరియా వెయ్యకుండా పంటలు ఎలా పండుతాయి? అని రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. భూమిలో సారం పెరగడానికి రెండేళ్లు పడుతుంది. అందుకే ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తొలి రెండేళ్లలో దిగుబడి తక్కువగా ఉంటుంది. ఎంతో మక్కువతో ప్రారంభించిన ఆశ వంటి రైతులు తట్టుకొని నిలబడగలరు. కానీ, మరీ చిన్న రైతులు దీనికి తట్టుకోలేరు. అందుకే మేం ఈ రైతులతో పనిచేస్తున్నాం. మార్పు నెమ్మదిగా వస్తుంది..’. -
ఫీల్ ది పీల్..
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నారింజ రసాన్ని ఎంచక్కా ఆస్వాదించే ఉంటాం మనం. రసం తాగేసిన తర్వాత మిగిలిపోయే పిప్పి గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం. కానీ.. ఇటలీ డిజైనింగ్ కంపెనీ కార్లో రట్టీ అసోసియాటీ మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంది. అందుకే వృథాగా పారబోసే పిప్పితోనే గ్లాస్‌లను తయారు చేయడం మొదలుపెట్టింది. ఈ యంత్రం అదే. ‘ఫీల్ ద పీల్’అని పిలుస్తున్న ఈ యంత్రం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. పైన ఉన్న గుండ్రటి ఛత్రం వంటి నిర్మాణంలో సుమారు 1500 నారింజ పండ్లు ఉంటాయి. అవసరమైనప్పుడు ఇవి నేరుగా కిందకు వస్తాయి. ఒక్కో పండును రెండుగా కోసేందుకు బ్లేడ్ ఉంటే.. రసం తీసేందుకు ఇంకో యంత్రం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మిగిలిపోయే తోలును, పిప్పిని అక్కడికక్కడే సూక్ష్మస్థాయి పోగులుగా మార్చి, త్రీడీ ప్రింటర్ సాయంతో కప్పులు తయారు చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. -
ఉదర సంబంధ వ్యాధులకు బత్తాయితో చెక్
ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లలో బత్తాయి ముఖ్యమైనది. పండిన బత్తాయి లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. బత్తాయి రసంలో పోషక విలువలతోపాటు ఔషధపరంగా కూడా అనేక లాభాలు. బత్తాయిలో ముఖ్యంగా విటమిన్ –సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల ఏర్పడే వ్యాధులను నివారిస్తుంది. ఇది దంత చిగుళ్ళ వాపులను తగ్గిస్తుంది. ఇంకా దగ్గు, జలుబు, పెదాల పగుళ్ళను నివారిస్తుంది. బత్తాయి రసంలో ఉండే విటమిన్ సి ఇన్ని రకాలుగా సహాయపడుతుంది. పీచుపదార్థాలు, జింక్, కాపర్, ఐరన్ శక్తి, క్యాల్షియం వంటివి దాగివున్నాయి. క్యాలరీలు, ఫ్యాట్ కూడా తక్కువ. ఉదర సంబంధిత రోగాలకు బత్తాయి పండ్లు చెక్ పెడతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ పండ్ల రసాన్ని రోజూ ఓ గ్లాసుడు తీసుకోవడం ద్వారా శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. శరీరానికి కావలసిన ధాతువులు, పీచు పదార్థాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. గర్భిణులు తరచూ బత్తాయి రసాన్ని తీసుకుంటే, అందులో ఉండే క్యాల్షియం, కడుపులో పెరిగే బిడ్డకు, తల్లికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది.ఒంట్లోని వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది. శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి రసంలో గ్లూకోజ్ లేదా పంచదార కలుపుకుని తీసుకున్నట్లయితే మంట తగ్గటమే కాకుండా, మూత్రం సాఫీగా వస్తుంది. బత్తాయిరసంలో ఉండే యాసిడ్ గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. బత్తాయి రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల నోటి అల్సర్లు రాకుండా ఉంటాయి. బత్తాయి రసం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉంటాయి. ఈ జ్యూస్ లోని ఫ్లేవనాయిడ్స్ పిత్తం, జీర్ణ రసాలను, యాసిడ్స్‌ను విడగొడుతుంది. కాబట్టి, బత్తాయి రసం త్రాగడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు, పొట్ట సమస్యలు, అజీర్ణం, వికారం, కళ్ళు తిరగడం వంటి సమస్యలను నివారిస్తుంది. బత్తాయి జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో గుండె ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది.+ -
నారింజ క్యాన్సర్ నివారిణి
నారింజ పండ్లు అంటే వ్యాధుల నివారణకు అడ్డుగోడలా నిలిచే రక్షణ కవచాలని అర్థం. పీచు ఎక్కువ, వ్యాధినిరోధకతను కలిగించే పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ కావడం వల్ల వీటిని కాస్త ఎక్కువగా తిన్నా లాభమే తప్ప నష్టం లేదు. నారింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... ►నారింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇవి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. ∙కణాలను నాశనం చేసి, ఏజింగ్‌కు తోడ్పడే ఫ్రీరాడికల్స్‌ను నారింజల్లోని హెస్పరిడిన్, హెస్పరెటిన్ వంటి బయోఫ్లేవనాయిడ్స్ సమర్థంగా అరికడతాయి. అందువల్ల నారింజలను తినేవారు దీర్ఘకాలం యౌవనంగా ఉంటారు. ∙నారింజపండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. అది అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నారింజ చాలా వ్యాధులకు రుచికరమైన నివారణ అని చెప్పవచ్చు. ∙నారింజలో పీచు చాలా ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి నారింజ బాగా తోడ్పడుతుంది. ►మనలోని కొలెస్ట్రాల్‌ను అరికట్టడం ద్వారా రక్తప్రవాహం సాఫీగా జరగడానికి నారింజ బాగా ఉపయోగపడుతుంది. ఈ కారణం వల్ల గుండె ఆరోగ్యం దీర్ఘకాలం బాగుండటమే కాకుండా, చాలా రకాల గుండెజబ్బులూ నివారితమవుతాయి. అంతేకాదు... ఈ పండులోని పొటాషియమ్ రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. ఈ కారణం గా చూసినా ఇది గుండెకు మంచిది. ∙ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల స్థూలకాయం, బరువు తగ్గడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. ∙ఇందులో విటమిన్–ఏ కూడా పుష్కలంగా ఉండటం వల్ల కంటిచూపునూ మెరుగుపరుస్తుంది. -
కూలీ... ఊరి తలరాతే మార్చాడు!
అర్థవంతం: ఒక విదేశీ జంట అతడి వద్దకు వచ్చి డజను ఆరెంజ్ పళ్లు అడిగింది. కన్నడ మాత్రమే వచ్చిన హజప్ప వారికి వాటి ధర చెప్పలేకపోయాడు. మనిషికి దేవుడు జీవితమనే ఒక బ్లాంక్ చెక్ ఇస్తాడు. మనిషి దానిమీద ఏం రాసుకుంటాడో అతనికి అది దక్కుతుంది. ఈ ప్రపంచంలో అందరి జీవితాలు ఒకేలా ఉండకపోవడానికి ఇదే కారణం. ఇంత ఇంటెన్సిటీ ఉన్న విషయాన్ని ఇపుడు చెప్పడానికి ఒక బలమైన కారణం.. హజప్పా అనే ఒక స్ట్రీట్ వెండర్. తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక వ్యక్తి! కొందరు కారణ జన్ములు. వారిలో ఒకరు హజప్పా. అతను సామాన్యుడే. రోడ్డు పక్కన పళ్లు అమ్ముకుని బతికే ఓ చిరు వ్యాపారి. పనిచేస్తే కడుపు నిండుతుంది. చిన్నపుడు బీడీలు చుట్టి పెరిగాడు. పెద్దయ్యాక పెళ్లయ్యాక ఆ ఆదాయం చాలక రోజూ మార్కెట్లో పళ్లు కొనుక్కుని గంపలో నెత్తిమీద పెట్టుకుని మంగళూరులో అమ్మేవాడు. ప్రతిరోజూ తన స్వగ్రామం నెవపాడు హరేకళ నుంచి మంగళూరు (కర్ణాటక) వెళ్లొచ్చేవాడు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా అతను ఒక విషయాన్ని గమనించాడు. తన ఊరు పిల్లలు ఊర్లో బడిలేక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోని బడికి వెళ్లి చదువుకుంటున్నారు. బస్సుల్లేక అంతదూరం నడిచి వెళ్లడం రోజూ చూస్తున్న హజప్పకు అది అస్సలు నచ్చలేదు. ఆ పిల్లలు, తల్లిదండ్రులకు అలవాటైనా హజప్పలో మాత్రం... బడికోసం పిల్లలు ఎందుకు నడవాలి? అని ప్రశ్నించుకున్నాడు. ఓ సంపన్నుడు స్పందిస్తే అనుకున్న పది రోజుల్లో బడి కట్టేయగలడు. కానీ దిన సరి వ్యాపారి అయిన హజప్ప ఏం చేయగలడు? ఎవరిని ఒప్పించగలడు. అయినా తన కల మానలేదు. తన దారిన తాను పోలేదు. తన పని తాను చూసుకోలేదు. ఈ ఆలోచనలో ఉన్న అతనికి ఒక రోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఒక విదేశీ జంట అతడి వద్దకు వచ్చి డజను ఆరెంజ్ పళ్లు అడిగింది. కన్నడ మాత్రమే వచ్చిన హజప్ప వారికి వాటి ధర చెప్పలేకపోయాడు. అసలే మథనంలో ఉన్న అతన్ని ఈ ఘటన ఇంకా తీవ్రమైన ఆలోచనలో పడేసింది. నేను చదువుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అసలు మా ఊర్లో గవర్నమెంటు బడి ఉంటే నేను కూడా చదువుకునే వాడిని కదా, అని అనుకున్నాడు. బడి ఊర్లో లేకపోవడం వల్ల కొందరసలు బడే మానేశారు. దీంతో ఆరోజు నుంచే తన ఊళ్లో బడి కట్టాలని డిసైడయ్యాడు. మంగళూరు కలెక్టరేటుకు బడికోసం అర్జీ పెట్టాడు. కానీ, బడి మంజూరు అవడం అంటే నిధులతో పని కాబట్టి అంత సులువు కాదు. అయినా అతను ఆపలేదు. వారం వారం అదేపని. అక్కడున్న కొందరు ‘ఎందుకయ్యా ఊరికే నీ ప్రయత్నం, నీ పని నువ్వు చూసుకోక. బడి పెట్టాలంటే బిల్డింగు ఉండాలి కదా, ఇపుడది అయ్యేపనేనా’ అని కసిరేశారు. ఇది ఇంకో మలుపు. అతను ఆరోజు నుంచి తన ఆదాయంలో కొంత బడికోసం దాచడం మొదలుపెట్టాడు. అతడి భార్య నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీకు వచ్చేదే 100-150. అందులో ‘బడికి దాస్తావా బుద్ధి లేకపోతే సరి’ అంటూ ఆమె తిట్టే తిట్లకు అతను రోజూ అలవాటు పడ్డాడే కానీ తన ఆలోచన మార్చుకోలేదు. అలా తీవ్రంగా ప్రయత్నించి కొన్ని సంవత్సరాల పాటు శ్రమించాక కాళ్లరిగేలా తిరిగాక గవర్నమెంటు బడి మంజూరు చేసింది. కానీ దానికి బిల్డింగ్ లేదు. దీంతో తను దాచుకున్న డబ్బుకు తోడు విరాళాలు సేకరించి ఒక చిన్న గది కట్టించాడు. అది కొందరికి పిచ్చి అనిపిస్తే ఇంకొందరికి ఆశ్చర్యం అనిపించింది. ఈ విషయం తెలిసిన కన్నడ దినపత్రిక అతనిని మ్యాన్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించడంతో అభినందనలతో పాటు విరాళాలు వచ్చాయి. ప్రభుత్వం కూడా రూ.లక్ష విడుదల చేసింది. హజప్పలో ఉత్సాహం రెట్టించి ఆ డబ్బులతో హైస్కూలు కూడా కట్టించేశాడు. అక్కడితో ఆపలేదు. మా ఊరికి కాలేజీ కూడా కావాల్సిందే అని పట్టబట్టేశాడు హజప్ప. ఇపుడదే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది వన్ మాన్ షో. ఫలితం దక్కాలంటే అడ్డంకులు దాటాలి, తీవ్రంగా శ్రమించాలి... అది ఎంతకాలమైనా పట్టొచ్చు. ఏడేళ్ల పాటు ఇంట్లో వారితో తిట్లు, ఊర్లో వాళ్లతో చీవాట్లు తిన్న హజప్పపై అతని ప్రయత్నం ఫలించాక అవార్డుల వర్షం, రివార్డుల వరద కురిసింది. విచిత్రం ఏంటంటే... ఆయన ఇంకా పళ్లు అమ్ముతూనే తన ఇంటిని పోషిస్తున్నాడు. పొట్టకూటి కోసం కాదు, అది తన వృత్తి. ఆ ఊరు మాత్రం సరస్వతీ క్షేత్రం అయ్యింది. ఆయన ఒక రియల్ హీరో. హజప్ప జీవితం సమాజాన్ని తీర్చిదిద్దాలనుకున్న వారికే కాదు, తమ జీవితాలు మార్చుకోవాలనుకున్న వారికీ పనికొస్తుంది. అందుకే మీ జీవితం మీకు నచ్చినట్లు తీర్చిదిద్దుకోవాల్సింది మీరే! - ప్రకాష్ చిమ్మల