ఏం తింటున్నాం? దేహానికి అవసరమైన ఆహారాన్ని తింటున్నామా? జంక్‌తో పొట్ట నింపేస్తున్నామా? అనే జాగ్రత్తల వరకు చైతన్యవంతంగానే ఉంటున్నాం. కానీ మనం తిన్న ఆహారాన్ని మన దేహం సక్రమంగా గ్రహిస్తోందా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతోంది. మాల్‌న్యూట్రిషన్ ఎంత ప్రమాదమో మాల్ అబ్జార్షన్ కూడా అంతే ప్రమాదకరం. మాల్ అబ్జార్షన్ అంటే అపశోషణం. తేలిక పదాల్లో చెప్పాలంటే జీర్ణాశయంలోకి చేరిన ఆహారం అక్కడ సరిగ్గా పచనం కావడం, చిన్నపేగుల్లోకి చేరిన తర్వాత ఆహారంలోని శక్తిని పేగులు పీల్చుకోవడం అనే క్రియలు సక్రమంగా జరగకపోవడం. ఆహారంలోని పోషకాలు దేహానికి అందకుండా వ్యర్థాలతోపాటు విసర్జితం కావడం అన్నమాట. సామాన్య భాషలో తిన్నది ఒంటికి పట్టకపోవడం అంటుంటాం. తినడమే కాదు, తిన్నది ఒంట పట్టిందా లేదా అనేది కూడా ముఖ్యమే.
ఈ సమస్య చిన్నదిగానే అనిపించవచ్చు, కానీ తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అనేక అనుబంధ ఆరోగ్యసమస్యలకు కారణమవుతుంది. మొదటగా విరేచనాల రూపంలో బయటపడుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంగా కొనసాగుతున్నా, తరచుగా ఎదురవుతూ ఉన్నా... దేహం శక్తిహీనం అవుతూ బరువు తగ్గడం మొదలవుతుంది. మాల్ అబ్జార్షన్‌కు దారి తీసే ప్రత్యక్ష కారణం జీర్ణ ప్రక్రియలో ఎదురయ్యే అంతరాయాలు. అయితే ఇందులో జీర్ణరసాల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, పైత్యరసం ఉత్పత్తి తగ్గిపోవడం, ఆమ్లాల ఉత్పత్తి మితిమీరడం, చిన్న పేగుల్లో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందడం వంటి కారణాలు పరోక్షంగా ఉంటాయి.
అన్నీ కలిపి తింటే ఇంతే...
ఒక్కో ఆహారాన్ని జీర్ణం చేయడానికి దేహం ఒక్కో రకమైన జీర్ణరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏకకాలంలో పరస్పరం పొంతన లేని జీర్ణరసాల అవసరం ఏర్పడినప్పుడు జీర్ణవ్యవస్థ కొంత అయోమయానికి, సంక్లిష్టతకు లోనవుతుంది. అలాంటప్పుడు కూడా ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా ఇబ్బంది ఎదురవుతుంది. ఇది ప్రధానంగా డిన్నర్‌లలో భోజనం చేసినప్పుడు వస్తుంటుంది. రకరకాల పదార్థాలతో జీర్ణాశయాన్ని నింపేయడం వల్ల ఏ రకమైన జీర్ణరసం ఉత్పత్తి ఎంత మోతాదులో జరగాలో అనే అయోమయం ఏర్పడుతుంది. కొందరిలో అప్పటికే జీర్ణరసాల ఉత్పత్తి లోపించి ఉండడం వంటి కారణాలతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మరుసటి రోజు విరేచనాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. అలాగే బయట ఆహారం, పరిశుభ్రత లోపించిన ప్రదేశాల్లో వండిన ఆహారం తినాల్సి రావడం వల్ల కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. డయేరియా అనేది నెలలో ఒకటి లేదా రెండు సార్లు అయితే ప్రమాదకరం కాదు. కానీ ఇలా తరచూ జరుగుతుంటే దేహంలో ఇతర అవయవాల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. డయేరియా వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ కోలుకునే వరకు మసాసాలు, పాలు మానేసి మజ్జిగ, పెరుగు తీసుకోవాలి. వంటి పుల్లటి పండ్లకు బదులు అర బత్తాయి, కమలాటి, బొప్పాయి వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment