రెండేళ్ల క్రితం ఒకేఒక్క స్థానంతో గట్టెక్కిన టీడీపీ
రెండేళ్ల క్రితం కేవలం ఒకేఒక్క స్థానంతో గట్టెక్కిన అధికార టీడీపీకి ఇక్కడ వింత పరిస్థితి ఎదురుకానుంది. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కుదుర్చుకున్న ‘జెంటిల్మెన్ ఒప్పందం’ ఇప్పుడు ఏం తేల్చుతుందోనని ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆత్రేయపురం మండల పరిషత్‌లో తొలి రెండేళ్లు ఒకరికి ఎంపీపీ పదవిని కట్టబెట్టగా, అది కొద్ది రోజుల్లో ముగియనుంది. ఒప్పందం మేరకు తర్వాతి మూడేళ్ల పాటు ఆ పదవిని మరొకరికి అప్పగించాల్సి ఉంది. మరి ఎంపీపీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జెంటిల్మెన్ ఒప్పందమిదే..
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. తొమ్మిది స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపొందింది. టీడీపీ తరఫున ఎంపీపీ స్థానంలో కూర్చొనేందుకు ఇద్దరు పోటీ పడ్డారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల ఏకాభిప్రాయం మేరకు జెంటిల్మెన్ ఒప్పందం కుదిరింది. తొలి రెండేళ్లు వీవీ కృష్ణారావు, ఆ తర్వాత మూడేళ్ల పాటు మద్దూరి సుబ్బారావు ఎంపీపీగా కొనసాగాలనేది ఆ ఒప్పందం సారాంశం. ఈ మేరకు ఎంపీపీగా వీవీ కృష్ణారావు పదవి చేపట్టగా, సుబ్బారావు వైస్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు.
జూలై 4తో రెండేళ్లు
ఆ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూలై నాలుగో తేదీకి కృష్ణారావు ఎంపీపీగా కొనసాగి రెండేళ్లు పూర్తి కానుంది. జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం.. ఆ తర్వాత ఎంపీపీ పగ్గాలు సుబ్బారావుకు అప్పగించాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై నెల రోజుల నుంచి ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. కృష్ణారావు రాజీనామా చేస్తే, సుబ్బారావు ఆ పదవి చేపడతారని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ కృష్ణారావు ఆ పదవిని వీడకపోతే, అధికార పక్షానికి చెందిన ఇద్దరు, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మద్దతు ఉపసంహరించుకోవచ్చని మండల పరిషత్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే జరిగితే ఇప్పటికే 9 మంది సభ్యుల బలం ఉన్న వెఎస్సార్ సీపీకి లబ్ధి చేకూరే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రజా సంక్షేమం అంతంతమాత్రమే..
ఈ విషయం పక్కనపెడితే.. ఎంపీపీగా కృష్ణారావు ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్దగా లేవని సొంత పార్టీవారే పెదవి విరుస్తున్నారు. ఒకవేళ జెంటిల్మెన్ ఒప్పదం అమలు కాకపోతే, స్వపక్షంలోనే వర్గవిభేదాలు పొడచూపే పరిస్థితి తలెత్తవచ్చన్న ఆందోళన వారిలో ప్రస్ఫుటమవుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంపీపీ కృష్ణారావు స్వచ్ఛందంగా పదవి వదులుకుని ‘జెంటిల్మెన్’ ఒప్పందానికి కట్టుబడి ఉంటారా లేక ఆయనే పదవిలో కొనసాగుతూ కొత్త సంక్షోభానికి తెర తీస్తారా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.
నేటి సమావేశంపైనే అందరి దృష్టి
మట్టి తవ్వకాల్లో అక్రమాలు, ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం వంటి విషయాల్లో అధికార పక్ష సభ్యులే బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన పలు సమావేశాల్లోను అటు పార్టీ కేడర్‌తో పాటు సొంత వర్గీయుల నుంచి ఎంపీపీ అసంతృప్తిని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిఏ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. జెంటిల్మెన్ ఒప్పందాన్ని అమలు చేస్తారా లేక ప్రస్తుత ఎంపీపీనే కొనసాగిస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.