ఆత్రేయపురం : ఒక్క ఫోన్‌కాల్.. అంతే ఆ అధికారులకు వణుకుపుట్టింది. తిమ్మిని బమ్మి చేసేశారు. వందలాది ట్రాక్టర్ల మట్టిని అక్రమార్కులు కొల్లగొడితే.. కేవలం 54 ట్రాక్టర్లే అని లెక్క తేల్చేశారు. కేవలం కొసర చూపించి అసలుకే టెండర్ వేసిన ఈ ఘనత ఆత్రేయపురం ఇరిగేషన్ అధికారుకే దక్కింది. గతేడాది నీరు-చెట్టు పథకంలో వెలిచేరు-పేరవరం మధ్య సెంట్రల్ డెల్టాకు సాగు నీరందించే ప్రధాన కాలువల్లో మట్టి తవ్వకాలకు మంజూరు లభించింది. ఈ ఏడాది ఎలాంటి మంజూరు లేకుండా ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో దాదాపు 1,500 ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలించేశారు.
దీనిపై ‘కాలువ మట్టి కొల్లగొట్టి..’ శీర్షికన ‘సాక్షి’లో వార్త వెలువడిన విషయం విదితమే. కలెక్టర్ ఆదేశాలతో ఆయా ప్రాంతాలను అధికారులు పరిశీలించి, విచారణ కూడా చేపట్టారు. కానీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో మాత్రం కేవలం 54 ట్రాక్టర్ల మట్టి మాత్రమే అక్రమంగా తరలించినట్టు కేసు నమోదైంది. కొల్లగొట్టినది సుమారు రూ.18 లక్షల విలువైన దాదాపు 1,500 ట్రాక్టర్ల మట్టి అయితే, అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒక్క ఫోన్‌కాల్ చేయడంతో పరిస్థితి అంతా మారిపోయింది.
ఇరిగేషన్ అధికారులు ఆ 1,500 ట్రాక్టర్లను కాస్తా 54 ట్రాక్టర్లుగా కుదించారు. దీనిపై ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్‌ను వివరణ కోరగా, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం సుమారు రూ.30 వేల విలువైన 54 ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తవ్వినట్టు గుర్తించి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇరిగేషన్ అధికారుల మాయాజాలంతో.. కేవలం 54 ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలించినట్టు పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు.
లెక్క మార్చేసిన ఫోన్‌కాల్
Published Fri, Apr 29 2016 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM
Advertisement
Advertisement