సాక్షి, ముమ్మడివరం : తూర్పు గోదావరి జిల్లాలో చిరుత పులి సంచారం టెర్రర్ పుట్టిస్తోంది. నాలుగు రోజుల అనంతరం ఎట్టకేలకు చిరుత పులి చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఓ గుడిసెలో బంధించిన చిరుతను అదుపులోకి తీసుకునేందుకు అటవీ, పోలీసు శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు చిరుత దాడిలో గాయపడిన వ్యక్తులు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా ఈ నెల 4వ తేదీన అంకంపాలెం గ్రామంలో చిరుత పులి బీభత్సం సృష్టించి నలుగురిని గాయపరిచి చెట్టుపైకి చేరిన సంగతి తెలిసిందే. అయితే చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు లైట్లు ఆపివేయడంతో చిరుత తప్పించుకుని పొలాల్లోకి పారిపోయింది. అక్కడినుంచి పరారైన చిరుతపులి...ఇప్పుడు ముమ్మడివరం మండలం గేదెల్లంకలో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం గేదెల్లంకలోనే వున్న ఓ కొబ్బరితోటలోని గుడిసెలో దూరింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై గుడిసెను తాళ్లతో కట్టి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గతంలో చిరుతను పట్టుకోవడంలో అధికారులు విఫలం అవడం వల్లే ఇప్పుడు తమ వూరిపై పడిందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి అటవీ శాఖ సాంకేతిక సిబ్బందిని రంగంలోకి దించకుండా, చిరుతపులిని పట్టుకోకుండా, కాలక్షేపం చేయడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుత ఎక్కడ తప్పించుకుని, మళ్లీ దాడికి దిగుతుందేమో అని స్థానికులు భయంతో వణికిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment