అసహనం విశ్వామిత్ర సృష్టి | sriramana article on viswamitra | Sakshi
Sakshi News home page

అసహనం విశ్వామిత్ర సృష్టి

Published Sat, Nov 7 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

అసహనం విశ్వామిత్ర సృష్టి

అసహనం విశ్వామిత్ర సృష్టి

అక్షర తూణీరం
ఉన్నట్టుండి ‘అసహనం’ తెరమీదకు వచ్చి హల్‌చల్ చేస్తోంది. మూలాల్లోకి వెళితే సహనం బ్రహ్మ సృష్టి, అసహనం విశ్వామిత్ర సృష్టి. అసహనం రోషానికి పమిటలాం టిది. కోపానికి అంచులాంటిది. అసలు ఎప్పుడు పుట్టిందీ సహనం? అమీబాతో పాటే పుట్టిందని ప్రాచీనులు సంస్కృత శ్లోకంలో చెప్పారు. అసహనంలోంచే కల్పాంతం సంభవిస్తుందనీ, దరిమిలా అసహనం పొటమరిస్తుందనీ గ్రీకు వేదాంతంలో చెప్పబడి ఉందని మనవాళ్లంటారు.
 
 దుర్వాసుడు మూర్తీభవించిన అసహనంగా పురాణాలకెక్కాడు. ఆయనకు పిచ్చి అసహనం. అందుకే సుదర్శన చక్రం తరిమితరిమి కొట్టి, అంబరీషో పాఖ్యానాన్ని ఆవిష్కరించింది. విశ్వామిత్రుడు అసహనం వల్లనే తపః ఫలాలను గంగపాలు చేసుకుని, పరమ కోపిష్టి సన్నాసిగా మిగిలాడు. దుర్వాసుడు ఎండిన డొక్కలతో బక్కగా ఉండేవాడు. ఆకలి వల్ల, పౌష్టి కాహార లోపం వల్ల అసహన మూర్తిగా మిగిలాడని కొందరు మేధా వుల అంచనా. ఆకలిలోంచి అసహనం, అందులోంచి విప్లవం చీల్చుకు వస్తుందని మన స్థానిక విప్లవ వాదులు అంటూ ఉంటారు.
 
కృతయుగమంతా అసహనాలతోనే గడిచింది. త్రేతాయుగంలో అనేక సహనాలు, కొన్ని అస హనాలు కలసి, రామాయణ మనే గొప్ప ఇతిహాసాన్ని తీర్చి దిద్దాయి. కైక అసహనంతో రామకథ శ్రీకారం చుట్టుకుం ది. రాముడు చాలాసార్లు అస హనాన్ని ఆశ్రయించాడు. చెట్టు చాటు నుంచి వాలిని చంపడం అసహనం కాదా అని ప్రశ్నిస్తు న్నాను. శూర్పనఖ ముక్కు చెవులు కోయించడం మాత్రం కాదా అసహనం? చివరికి సముద్రుడి మీద కోపించి రామబాణం ఎక్కుపెట్టడం అసహనానికి పరాకాష్ట.
 
 ఏమాటకామాట చెప్పుకోవాలి. ఒక లింకు తక్కువైనా హను మంతుడికి అసహనం మీద గట్టి పట్టుంది. సముద్రం మీద గానీ, లంకలో గానీ చాలా నీట్‌గా బిహేవ్ చేశాడు. శక్తి సామర్థ్యాలున్నా గౌర వంగా బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాడు. సుందరకాండలో ఆనందమే గానీ అసహనం లేదు.
 
ఇక ద్వాపరయుగమే అసహన యుగం. కంసుడి అసహనం అంతా ఇంతా కాదు. ధృతరాష్ట్రుడికి చూపులేనందువల్ల శంకించే నైజం అలవడింది. మనక్కూడా టీవీలో బొమ్మ సరిగ్గా రాకపోయినా, ఫోన్లో సిగ్నల్ కట్ అవుతున్నా అసహనం పూనేస్తుంది. ద్రౌపదికి నిలువెల్లా అసహనమే. ‘నన్నోడి తానోడెనా, తానోడి నన్నోడెనా’ అన్న ఒకే ఒక్క ప్రశ్న భారతానికి కేంద్ర బిందువైంది. స్వర్గారోహణ పర్వం దాకా ధర్మ రాజుని ఈ ప్రశ్న తాలూకు అసహనం వెంటాడింది. కృష్ణుడంతటి పర బ్రహ్మ స్వరూపం ఎన్నోసార్లు సహనం కోల్పోయాడు. కురుక్షేత్రంలో భీష్ముడి మీదికి లంఘించబోలేదా! అక్కడ భీష్ముడు ఆనందంగా శిర సొగ్గడం ఒక గొప్ప టచ్. అదీ అసహనమే. ఎన్నాల్టికీ మరణం రాని జన్మ. పాత కట్టెతో విసిగి వేసారి పోయి ఉన్నాడు. మరణం రాకపోడం కన్నా మరణం లేదన్నారు పెద్దలు.
 
కలియుగం అంతా సహనలోపమే. చరిత్రకెక్కిన మహాయుద్ధాలన్నీ అసహన స్పందనలే. హిరోషిమాపై ఆటంబాంబు, జలియన్ వాలాబాగ్, గాంధీ హత్య, లాహోర్ గొడవలు, చైనా దురాక్రమణ, ఎమర్జెన్సీ- ఇవన్నీ అసహనానికి సంకేతాలే. నాస్తికోద్యమం ఒక అస హన ఉద్యమం. భిన్నత్వంలో ఏకత్వమంటూ ఒక గొడుగులో ఉన్నట్టు అరవడం అసహనమే. అసహనంలోంచే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమానికి బీజం అసహనం. ధర్మాగ్రహం లాగే కొన్ని అసహనాలు జాతికి మంచి చేస్తాయి. సహనం మన సంస్కృతి అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ. అది మాత్రం సత్యం.
 

శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement