రాములు ఎందరు రాములు?! కౌసల్య రాముడు, దశరథ రాముడు, అయోధ్య రాముడు, కోదండ రాముడు, సీతారాముడు, సకల గుణాభిరాముడు, ధర్మమే మహామాన వుడిగా భువికి దిగివచ్చిన అవతారం. ధర్మరక్షణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో రామాయణం చెబుతుంది. అందుకే రామకథ విశ్వవ్యాప్తమైంది. రాముడూ విశ్వమంతా వ్యాపించి నీరాజనాలందుకుంటున్నాడు యుగయుగాలుగా. అయోధ్య, మిథిల, కిష్కింధ, లంక రామకథలో ముఖ్య భూమికలు పోషిం చాయి. అయోధ్య రాముడు పుట్టినచోటు. పెళ్లికొడుకై సీతాప తిగా ఊరేగిన నగరం మిథిల. కష్టకాలంలో కావల్సిన బలగా లను సమకూర్చుకున్న నేల కిష్కింధ.
అంతేనా, హనుమలాంటి సర్వసమర్థుడు, విద్యావేత్త కిష్కింధలోనే రాముడికి దొరికాడు. నమ్మిన బంటుగా రామ చరితను రసరమ్యంగా నడిపించాడు. అప్పటిదాకా అయ్యో పాపం అనుకుంటూ నీరుకారిపోతున్న జనావళికి ఒక కొత్త వెలుగై హనుమ ముందుకు నడిపిస్తాడు. ఎంతటి కార్యమైనా సుసాధ్యతయే తప్ప అసాధ్యమెరుగని మహనీయుడు. రామా జ్ఞకి బద్దుడై సంజీవి పర్వతాన్ని పెకిలించి తెచ్చి, చేతులమీద నిలుపుకున్నవాడు. ఇతనే నా పూజాఫలం అనుకుని రాముడు ప్రేమగా హనుమని ఆలింగనం చేసుకున్నాడు. ‘నాకిది చాలు’ అనుకున్నాడు యోగి పుంగవుడు హనుమంతుడు.
మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు తన చైనా యాత్రను సవివరంగా రచించారు. అందులో ఆయన– చైనా నేత మావో ఆఫీస్ చాంబర్‌లో మన హనుమంతుడి వర్ణచిత్రం గోడకి చూసి నివ్వెరపోయారట! ‘ఈయన మా పురాణ పురుషుడు..’ అంటూ ప్రశ్నార్థకంగా ఆగిపోయారట అయ్యదేవర. వెంటనే ఆ కమ్యూనిస్టు నేత, ‘ఔను, నాకు తెలుసు. ఆయన గొప్ప కార్యకర్త. రాజు ఒక పని అప్పగిస్తే దాన్ని సమగ్రంగా నిర్వర్తించి తిరిగి కనిపించే కార్యదక్షుడు. పడిన కష్టాల జాబితా వల్లించకుండా ‘వెళ్లినపని అయింది. సీత జాడ దొరికింది’ అని మూడు ముక్కల్లో చెప్ప డంలో ఆయన గుణగణాలన్నీ అర్థమవుతాయి. ఒక సలక్షణ మైన కార్యకర్తకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. వెళ్లేటప్పుడు ఎక్కడా క్షణంసేపు ఆగలేదు. వచ్చేట ప్పుడు తీరికగా మిత్రమూకతో వినోదిస్తూ తన రాజుకి పరో క్షంగా శుభ సందేశం చేర్చాడు. ఆయన అసామాన్యుడు. ప్రపంచంలో ఏ కార్యకర్తకైనా ఆదర్శప్రాయుడు. అందుకే ఆయ నకు సమున్నత స్థానం ఇచ్చానని మావో వివరించారట.
ఎక్కడా ఏ యుగంలోనూ, ఏ చరిత్రలో, ఏ పురాణంలో ఒక బంటుకి ఆలయాలు నిర్మించి రాజుతో సమంగా పూజ లందించే వైనం కనిపించదు. ఆ మర్యాద అందుకున్న మహ నీయుడు ఆంజనేయస్వామి మాత్రమే. తిరిగి ఇన్నాళ్లకి అయో ధ్యలో రామమందిరం చిగురించడంతో యావద్భారతావనిలో వసంతోదయమైంది. న్యాయం, ధర్మం తిరిగి నిలదొక్కుకున్నా యని భారతజాతి మొత్తం నమ్మి ఆనందపడింది. మనుషులకి గుడి కట్టడం మన శాస్త్రంలో లేదు. రాముణ్ణి ఆది నించి భక్తులు దేవుడిగానే కొలిచారు. ఎంతటి చక్రవర్తి కుమారుడైనా పర్ణశా లల్లో, పందిళ్లలో ఒదిగి ఉండటం ఆయన మతం. ఇప్పుడూ అంతేలా జరిగింది. ఆయనతోనే సీత. ఆ పాదాల చెంతనే హనుమ. శ్రీ సీతారామ కళ్యాణమంత తీయగా, చెరకు పానక మంత కమ్మగా అయోధ్య భూమిపూజోత్సవం జరిగింది. ఓ పనై పోయిందని ఆదర్శాలను పక్కనపెట్టి, రాముడికి పూజలు, హారతులు, సేవలు, నైవేద్యాలను సమర్పిస్తూ, వాటిని హైలైట్ చేస్తూ జన సామాన్యాన్ని మభ్యపెట్టకూడదు. వారూ, వీరూ అని లేకుండా ఈ ఉత్సవం, ఆలయం సర్వమత సామరస్యానికి ప్రతిబింబంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. తథాస్తు! పురుషో త్తముడన్న సార్థక నామధేయం పొందినవాడు రాముడు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండగా ఈ మహత్తర కార్యక్రమం జరగడం ఆయన పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా జనం పులకించిపోయారు.
నిజంగా, మన రామభక్త హనుమాన్ బాపు ఉండి ఉంటే ఎంత ఆనందపడేవారో? చూస్తూ ఎన్ని బొమ్మలు వేసేవారో? జీవితకాలంలో బాపు అనేకసార్లు రామాయణానికి బొమ్మలు రచించారు. సెల్యులాయిడ్‌పై పలుసార్లు రామకథ తీశారు. నాటి ప్రధాని వాజ్‌పేయి బాపు రామాయణ పోస్టర్లని పార్ల మెంట్ సెంట్రల్ హాల్‌లో ఆవిష్కరించారు. కపీశ్వరుణ్ణి బాపు చిత్రించినంత అందంగా మరొకరు చిత్రించలేరు. దీక్షగా రామ బొమ్మలు మధురాతిమధురంగా వేలకొద్దీ గీసిన కర్మయోగి బాపు. అయోధ్య ఆలయ ప్రాంగణ మ్యూజియంలో బాపు రాముడికి దోసెడంత చోటు కల్పించాలి. ఇది తెలుగువారి కోరిక, అభ్యర్థన.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
ఆదర్శాలకు గుడి కట్టద్దు
Published Sat, Aug 8 2020 4:37 AM | Last Updated on Sat, Aug 8 2020 4:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment