విజయయాత్ర | Sriramana Article On YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

విజయయాత్ర

Published Sat, Mar 30 2019 12:40 AM | Last Updated on Sat, Mar 30 2019 12:40 AM

Sriramana Article On YS Rajasekhara Reddy - Sakshi

ఆ మధ్య విడుదలై విజయయాత్రగా నిలిచిన యదార్థ గాథా చిత్రం ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. వ్యక్తులకు ప్రచారం కల్పిస్తూ, బంగారు పూతలు పూసి తీసిన చిత్రం కాదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితాన్ని క్లుప్తంగా స్పృశిస్తూ, ఆయన రాజకీయ జీవితంలోని కీలక ఘట్టమైన పాదయాత్రను ముఖ్యాంశంగా మలచిన చిత్రం యాత్ర. అపోజిషన్‌లో ఉన్నా, పొజిషన్‌లో ఉన్నా రాజశేఖరరెడ్డిది ఒక విస్పష్టమైన ముద్ర. ఆయన మాటతీరుని, మనసు తీరుని ఒడిసిపెట్టుకుని సినిమాలోకి దింపారు. ఎక్కడా అతి చెయ్యకుండా, ఆయనకు దైవాంశలు ఆపాదించి ప్రేక్షకులకు వెగటు పుట్టించకుండా కథని రక్తి కట్టించారు.

ఆత్మస్తుతులు పరనిందలు లేవు. ఎక్కడా ఎవ్వరినీ సూటిగా గానీ, మాటుగా గానీ విమర్శించిందీ లేదు. అదే చూపరులకు నచ్చింది. ఎక్కడ రాజకీయాలుండాలో, ఎక్కడ మానవత్వం పరిమళించాలో వైఎస్‌కి సుస్పష్టంగా తెలుసు. దర్పం, రాజసం, పౌరుషం, ఔధార్యం లాంటి దినుసుల్ని ఎక్కడెక్కడ ఏ మోతాదులో వాడాలో వైఎస్‌కి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు. ఏ పీఠమెక్కినా ఆయనది రాజమార్గం. వైఎస్‌ ఆప్త మిత్రులు, వైఎస్‌కి ప్రాణం ఉన్న నీడ, సచివుడు సారథి కేవీపీ రామచంద్రరావుని బహుతూకంగా మలచారు. ఒకరే రావాలని సూచన వచ్చినప్పుడు మేమిద్దరం ఒకరేనని వైఎస్‌ లిప్తపాటు కూడా ఆలోచించకుండా చెప్పడం, వారి స్నేహ గాఢతను చెబుతుంది.

మితభాషిగా, హితాభిలాషిగా యాత్ర నిండా నిండుగా కనిపిస్తారు. అయినా, ఎక్కడా హద్దులు దాటక పోవడం ఆయన నైజం. కొన్నిసార్లు అపర చాణక్యుడు, కొన్నిసార్లు మహామంత్రి తిమ్మరుసు. ఎక్కడా సింహ గర్జనలు, పులి గాండ్రింపులు, నినాదాలు, లేనిపోని విమర్శలు, శుష్కప్రియాలు వినిపించవు. దానివల్ల చిత్రం భలే హాయిగా ఉంది. నటీనటులు పాత్రల్లో సంపూర్ణంగా ప్రతిఫలించారు. వైఎస్‌ ఠీవిలో ఒక సింప్లిసిటీ ఉంది. ఆయన దర్పంలో మానవత తొంగి చూస్తుంది. స్వతస్సిద్ధమైన ఆయన నవ్వులో కరుణ తొణుకుతుంది. ఈ గుణాలన్నీ యాత్రలో ద్యోతకమయ్యాయి.ఆత్మగౌరవ ఉనికి ‘యాత్ర’లో వైఎస్‌ ప్రతి అడుగులోనూ కనిపించింది. అడుగడుగునా అడ్డుపడే అధిష్టానాన్ని తనదైన ధోరణిలో పక్కనపెట్టి, తను అనుకున్నట్టే ముందుకు సాగడం చాలా సన్నివేశాలలో రక్తి కట్టింది. అధిష్టానంపట్ల గౌరవం ఉండటం వేరు, బానిసత్వం చేయడం వేరన్నది విడమరచి చెప్పారు.

రెండోసారి వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికల బరిలోకి దిగినప్పుడు, కొన్నిసార్లు సన్నిహితులముందు అనేవారు. ‘ఒకసారి ముఖ్యమంత్రి అయి, మా నాయన కోరిక తీర్చా, ఇక ఇప్పుడు అంత తాపత్రయం లేదు’ అనేవారు. కచ్చితమైన లక్ష్యాలు, సంతృప్తి ఉన్న వ్యక్తి. జనామోదం పుష్కలంగా గడించిన జననేత. మొనగాడు, ఖలేజా ఉన్న మనిషి అనుకునేవారు గ్రామీణ ప్రజలు. ముఖ్యంగా రైతులు. ఎందుకు అనుకునేవారంటే– అప్పుడు వైఎస్‌ అపోజిషన్‌ లీడర్‌గా అసెంబ్లీలో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి. అప్పట్లో ఆంధ్రలో వానలు లేకపోవడం, దుర్భిక్షం, నివారణోపాయాలు లేకపోవడం ఉంది. రైతుల ఆత్మహత్యలు రోజూ వార్తల్లో విపరీతంగా వస్తున్నాయి.

వైఎస్‌ నోరు చేసుకుని రైతుల పక్షాన వాదించారు. చంద్రబాబు జవాబు చెబుతూ, ప్రతి పురుగుమందు ఆత్మహత్యకి లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నా అధ్యక్షా అన్నారు. ఆ జవాబుకి రెచ్చిపోయిన వైఎస్, ‘రైతుల ప్రాణాలకి విలువ కట్టొద్దు బాబూ, నువ్‌ తాగు నేను కోటి రూపాయలిస్తా’ అన్నారు ఆక్రోశంగా. సభలో గొడవ అయ్యింది. అయినా వైఎస్‌ వెనక్కి తగ్గలేదు. ఆ ఒక్కమాట రైతాంగానికి కొండంత ఓదార్పునిచ్చింది. తర్వాత సీఎంగా నిలబెట్టింది. నిజాయితీ, చిత్తశుద్ధితో పలికే మాటలు బీజాక్షరాలవుతాయ్‌. మంత్రాక్షరాలవుతాయ్‌. పనికిమాలిన ప్రసంగాలు పేలపు గింజలకు సాటికావు.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement