ది గ్రేట్‌ సర్కార్‌ సర్కస్‌ | The Great Sarkar Circus | Sakshi
Sakshi News home page

ది గ్రేట్‌ సర్కార్‌ సర్కస్‌

Published Sat, May 20 2017 1:45 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

ది గ్రేట్‌ సర్కార్‌ సర్కస్‌

ది గ్రేట్‌ సర్కార్‌ సర్కస్‌

అక్షర తూణీరం

పెద్దవాణ్ణయ్యాను. దేశమనే డేరాలో పెద్ద సర్కారు, రాష్ట్రాల గుడారాల్లో చిన్న సర్కార్లు రంగ ప్రవేశం చేయడం చూశాను.

చిన్నప్పుడు పి.సి. సర్కార్‌ ఇంద్రజాల ప్రదర్శనకి నాన్న తీసుకువెళ్లారు. ఇప్పటికీ ఆ స్టేజీ, సర్కార్‌ డ్రెస్సు, ఆయన టోపీ, చేతిలో మంత్రదండం, చుట్టూ మెరిసే దుస్తుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు, పూర్తిస్థాయిలో పాశ్చాత్య సంగీత రొద బాగా జ్ఞాపకం. ప్రతి ఐంద్రజాలికుడు తప్పక చేసే ఐటమ్‌ టోపీలోంచి చెవులపిల్లిని తీసి బయట పడెయ్యడం. సర్కార్‌ అంటే ఆ రోజుల్లో పెద్ద పేరు. మిగతావారు ఒక కుందేలుని తీస్తే, ఈయన వరసగా చెవులు పట్టి టోపీలోంచి తీస్తూనే ఉండేవాడు. ఇక చప్పట్లు ఆగేవికావు. ‘‘నిజంగానే కుందేళ్లు వచ్చాయా?’’అని నాన్నని అడిగితే; చూశావుగా, వచ్చాయిగా అన్నారు నవ్వుతూ.

‘నాకేదో అనుమానంగా ఉంది... నీకు?’ అని ప్రశ్నించా. ‘‘అదొక విద్య. మనమంతా వినోదించేదీ, చప్పట్లు కొట్టేదీ ఆ విద్యని అద్భుతంగా ప్రదర్శించినందుకు.’’నాన్న జవాబుకి మరింత తికమకలో పడ్డా. ‘ఇంతకీ ఆ కుందేళ్లు ఎక్కడికి వెళ్లాయ్‌?’అన్నాను. ‘వెనకాల వాళ్ల పెట్టెల్లోకి.. మళ్లీ షోకి కావాలి కదా!’’అన్నారు. ఇంకా చాలా అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసి ఇంటికి వచ్చాం. తర్వాత వారం పాటు నాన్నని సందేహాలతో పీడించి వదిలి పెట్టాను. కొన్ని డౌట్స్‌ తీర్చారు. కొన్ని పెద్దయితే నీకే అర్థం అవుతాయని చెప్పి వదిలేశారు.

పెద్దవాణ్ణయ్యాను. దేశమనే డేరాలో పెద్ద సర్కారు, రాష్ట్రాల గుడారాల్లో చిన్న సర్కార్లు రంగ ప్రవేశం చేయడం చూశాను. అదే లైటింగు, అదేలాగ హోరెత్తించే సంగీతం, చుట్టూతా ఆర్భాటంగా అనుచరులు– ఇప్పుడు ఏ అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారనే ఉత్కంఠ ప్రేక్షక ప్రజల్లో, అద్భుతాన్ని ప్రకటించగానే కరతాళ ధ్వనులు. నాన్న చెప్పినట్టే కొంచెం కొంచెం యెరుక కాసాగింది. ఆ సర్కార్‌ లాగే ఈ సర్కార్లన్నీ టోపీలోంచి, జేబుల్లోంచి చెవులపిల్లుల్ని వేదికల మీదికి వదలడం చూస్తున్నా. మాటల్లోంచి పండ్లు, ఫలాలు రాలిపడడం గమనిస్తున్నా. ఆనాడు లేని ఒక కొత్త సంగతి మీడియా. సర్కార్లు కురిపించిన ఫలాలను పదే పదే మన నట్టింట్లో చూపిస్తూ అదే అదేగా ఆనందింప చేస్తున్నారు. సర్కార్లన్నింటికీ రంగు కండువాలుంటాయ్‌.

పెద్దాయన కాషాయ కండువా కప్పి ధాన్యపు రాశుల్ని దర్శింపచేస్తాడు. గులాబీ కండువాలోంచి ఆదర్శాలను దోసిళ్లతో పంచుతాడు మరొకాయన. పచ్చకండువాలోంచి భూతల స్వర్గాన్ని జిగేల్‌మనిపిస్తాడు ఇంకొకాయన. ఇవన్నీ చూసి ఆనందించాల్సిందే గానీ అనుభవించాలని ఆశపడకూడదు. అప్పటి మ్యాజిక్‌ షోలో ఒక ఏనుగుని మాయం చేయడం కళ్లారా చూశాను. ‘‘అదంతా మ్యాజిక్‌. ఏనుగు ఎక్కడికీ పోదు’’ అని చెప్పాడు నాన్న. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏనుగులు నిజంగానే మాయం అవుతున్నాయ్‌!
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement