ఒకటి మమ్మీ, రెండు మ్యాగీ..
అక్షర తూణీరం
‘‘జీవితానికి కావల్సినవి రెండే రెండు. ఒకటి మమ్మీ, రెండు మ్యాగీ’’ అని ఒక తరం ప్రగాఢంగా నమ్ముతున్న తరుణం లో ఒక్కసారి తేడా పడింది. అసలు మన దేశంలో యింతే. ఏదైనా సరే, బావుందిలే అని మొదలు పెట్టి అలవాటు పడగానే -అది తింటేనో తాగితేనో అయి పోతారంతేనంటూ వార్నింగులు వస్తాయి. అమెరికన్ కోడి వేపుడు ముక్కలు తింటే కిడ్నీలు, కళ్లు పోతాయంటున్నారు. మనకి ఏదొచ్చినా విడ్డూరమూ, విపరీతమే.
సిగరెట్టు తయారీని పరిశ్రమగా గౌరవిస్తారు. పొగాకు పంటని ప్రో త్సహిస్తారు. సిగరెట్లు కాల్చడం హానికరమని టాంటాం వేస్తారు. ఎక్కడంటే అక్కడ పొగ తాగరాదంటారు. చిల్లరగా ఒకటీ అరా అమ్మకానికి దొరకవు. టోకున ప్యాకెట్ కొనుక్కోవల్సిందే. మళ్లీ బీడీల జోలికి వెళ్లరు. అక్కడ పుర్రె బొమ్మ పెట్టడానికి భయపడతారు. ఎందుకంటే బీడీ తయారీ ఒక పెద్ద కుటీర పరిశ్రమ. పొగాకుని కూడా గంజాయిని నిషేధించినట్లు పూర్తిగా పక్కన పెట్టచ్చు. దేనికైనా చిత్తశుద్ధి వుండాలి.
మా నాయనమ్మ నవగ్రహాలకి ఒక్క కొబ్బరి కాయ చాలు, విడివిడిగా తొమ్మిది అక్కర్లేదని అరిచి కేకలు పెట్టి మరీ చెబుతుండేది. మన ప్రభుత్వాలవి కూడా నాయనమ్మ ఆలోచనలే. నిజంగానే ప్రజల ఆరోగ్యం కాపాడాలనే చిత్త శుద్ధి ఉంటే, ముందస్తుగా మన మంచినీళ్లను నిషేధించాలి. పాలు, పెరుగు, బియ్యం, నెయ్యి, కూరగాయ-సమస్తం రసాయన కలుషితం. ఆఖరికి అరటిపళ్లను, మామిడిపళ్లను భయం కరమైన కెమికల్స్‌లో ముందే పండించి సిద్ధం చేస్తున్నారు.
మనం తాగే ఎన్ని శీతల పానీయాలు స్వచ్ఛమైనవి? పాన్ సుపారి, గుట్కా నమలచ్చా? అసలిప్పుడు సెల్‌ఫోన్ అత్యంత ప్రమాదభరితమై పోయింది. సెల్‌ఫోన్ దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, నైతిక అంశాలపై దుష్ర్పభావాన్ని చూపిస్తోంది. అంతమాత్రం చేత నిషేధిస్తామా అంటే, మరి చిత్తశుద్ధి ఉంటే నిషేధించాల్సిందే. మనం శుక్రనీతిని పాటిస్తాం. ప్రాణవిత్త మానములకు భంగం వాటిల్లినప్పుడు బొంకవచ్చు అని రాక్షస గురువు స్పష్టంగా చెప్పాడు. మనం కూడా ఆ గణంలో వాళ్లమే కాబట్టి అటువైపు మొగ్గుతున్నాం. లేకపోతే, మద్యం ఎందుకు నిషేధించరు? కల్లుపై ఎందు కు నిఘా పెట్టరు?
ఇదంతా ఒక తీరు అయితే మ్యాగీ నుంచి కోడిగుడ్డు దాకా ప్రచారకులుగా నిలబడే పెద్ద మనుషులు కొందరు. సామాన్య ప్రజలే వారిని సెలెబ్రిటీలను చేస్తారు. వారా ముఖం తొడుక్కొ ని అనేక చెత్త సందర్భాలకు బ్రాండ్ దూతలుగా నిలబడి సొమ్ము చేసుకుంటారు. దీన్నే విధి వైపరీత్యం అంటారు. ఫలానా వారి బంగారు ఆభరణాలకు ఒకాయన భరోసా యిస్తుంటాడు. ఇంకో రియల్ ఎస్టేట్ గొప్పతనాన్ని మరొకాయన వల్లిస్తుంటాడు. చిట్‌ఫండ్ కంపెనీలకి, రుణ సౌకర్యాలకు పక్కన నిలబడి వాళ్లేం చెప్పమంటే అవి చెప్పేసి సొమ్ములు చేసుకుంటారు. మన దురదృష్టం కొద్దీ కొన్ని విలువలు మూలాల్లోనే సడలిపోయాయి.
విచిత్రమేమంటే యీ మహానుభావులే స్వచ్ఛ భారత్‌కి కూడా ప్రచార దూతలుగా ప్రచార మాధ్యమాలను అలంకరించడం. ఇటీవల రోజుల్లో వరదలా వస్తున్న చిత్ర విచిత్రమైన వార్తలను వింటున్నప్పుడు ఎవరికైనా మనసు వికలం అవుతుంది. ఒక పెద్దాయనని మీకెలా అనిపిస్తోందండీ అని మాట వరసగా అడిగాను. ఆయన నిర్లిప్తంగా నవ్వి, ఏ అలవాటు లేకుండా యీ దేశాన్ని యిన్నేళ్లు కాపాడాను. చాలా వృథా. నాకిప్పుడు ఆత్మహత్య చేసుకోవా లనుంది అన్నారు. పాపం!
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)