అక్షర తూణీరం
‘ఇంకా పన్నెండు ఈఎమ్‌ఐలు డ్యూ’’ అన్నాడు విశ్వం. ‘‘నీ యవ్వారం చూస్తుంటే, అమరావతి మహా నిర్మాణం, దాని కబుర్లకు మల్లే ఆన్తున్నాయిరా’’ నిట్టూర్చాడు బాబాయ్.
విశ్వనాథం మంచి కళాకారుడు. కల్చర్‌ని మూలధనంగా, వినయసంపదని, నోటిమాటని పరపతిగా కలిగినవాడు. కాళ్లనపడ్డ పామైనా కరవకుండా పోవచ్చుగానీ విశ్వనాథం మాత్రం కాటు వెయ్యకుండా పోడు. చురుకు, వృత్తికి తగిన వేగం విస్సు స్వార్జితాలు. మాది ఓ మాదిరి అంటే టాబ్లాయిడ్ సైజు టౌను. ‘పడింది రోయ్’ అని నలుగురూ చేరి వార్తలు చదువుకునే తీరిక, పదహారు పేజీల లోకల్ ఫీలింగూ పుష్కలంగా ఉందక్కడ. విశ్వం బుర్రలో బృహస్పతి సదా కొలువై ఉంటాడు. టెక్నాలజీ వినియోగించి బృహుణ్ణి లచ్చిందేవిలోకి మార్చుకుంటాడు.
‘‘బాబాయ్, ఈసారి కాదనకూడదు. ఇది ఆత్మగౌరవ అంశం’’ అన్నాడు– అప్పుడే షట్టర్ తీసి, సరుకు సద్దుకుంటున్న ఆసామితో. ‘‘ఛ... నాకేమిట్రా’’ అన్నాడాసామి ఉలిక్కిపడి. ‘‘కాదు. నీకే’’ రొక్కించాడు విశ్వనాథం. ‘‘ఛ.. పో...’’ ‘‘చచ్చినా పోను. పోనంటే పోను’’ ‘‘అఘోరించావ్ లే’’ అన్నాడు వాత్సల్య స్వరంతో. మూడొంతులు మింగుడు పడ్డట్టే!
‘‘కిందటేడు షాపులో బేరాలు మందకొడిగా ఉన్నాయంటే, నోట్ల రద్దు దెబ్బ పడిందంటే మెత్తబడ్డా. ఈసారి కుదర్దు బాబాయ్’’. ‘‘అయితే ఇంతకీ ఏమంటావురా?!’’ ఆశ్చర్యం ప్రశ్నార్థకం జమిలిగా ధ్వనించాయ్. ‘‘నేనిప్పుడే పేర్లు బయట పెట్టనుగానీ, ఇద్దరు మిని ష్టర్లు కనిపిస్తే తినేస్తున్నారు. వాళ్లకేం మైకులు దొరక్కనా’’ ‘‘ఇంతకీ ఏమంటావురా’’. ‘‘భోజనాలు పెట్టుకోవద్దు బాబాయ్ అలసిపోతాం. ఎటూ ఓ వందమందికి తప్పదు’’. ‘‘అది కాదురా విశ్వం...’’
‘‘మన జై భవాని కల్యాణమండపం ఇప్పుడే ఖాయం చేద్దాం. మెయిన్ రోడ్డెంట మన షాపు ముందు నించి చిన్న ఊరేగింపు తీద్దాం. బాణాసంచా ఇక్కడ కొనద్దు అవసరమైతే ఓ పూట శివకాశి వెళ్లొస్తా. చెన్నై నించి కమ్మటి నాదస్వరం వస్తుంది. ఒక్కమాట ముందే చెబుతున్నా. ఇన్విటేషన్ మీద పిన్ని ఫొటో ఉండితీరాలి. నాకొదిలెయ్’’
‘‘ఎందుకురా ఈ ఆర్భాటాలు? చెబితే వినే మనిషివికాదు’’ అని గొణుగుతూనే తొలి విడతగా కొంత రొక్కం అందించాడు.
విశ్వం రెండో అడుగు సావనీర్ మీద పడింది. షాపులు, అంగళ్లు, కొట్లు, దుకాణాలు ఇలా టౌన్లో ఉన్న వాటన్నింటినీ తడిమాడు. టౌను చాంబర్ ఆఫ్ కామర్స్, శ్రీ సాధుసాయి డెవలపర్స్ హనుమ సూపర్ స్పెషాలిటీస్ అంటూ పుట్టని బిడ్డలకి పేర్లు పెట్టి, గొప్ప ఆశలు మొలిపించి ఫుల్‌పేజి యాడ్ డిజైన్లు అరచేతిలో చూపించాడు. ఈఎమ్‌ఐ వసతి ఉందని మొదటి కిస్తీ లాగేశాడు మధ్యే మధ్యే ఉదక పానీయంలాగా. స్థానిక రాతగాళ్లకి చక్కిలిగింతలో పెట్టాడు. బుగ్గన పెన్ను పెట్టించి సెల్‌లో వారి ముఖాల్ని బంధించాడు. ఇన్విటేషన్ డమ్మీ కాపీ, సావనీర్ కవరు జిరాక్సు ఓ ఫైల్లో వేసుకుని కుందేలు పరుగుల్లో విశ్వనాథం కనిపిస్తూ, ఈఎమ్‌ఐలు స్వీకరిస్తూ వారాలు, నెలలు, ఏళ్లు నెట్టుకొస్తున్నాడు. రాత కార్మికులెక్కడ కనిపించినా, మీదే ఆలస్యం అనేవాడు. పదమూడో వాయిదా ఇచ్చేసి ‘అయితే ఇంతకీ ఏమంటావురా’ అన్నాడు బాబాయ్ సౌమ్యంగానే. ‘ఇంకా పన్నెండు ఈఎమ్‌ఐలు డ్యూ’’ అన్నాడు విశ్వం.
‘‘నీ యవ్వారం చూస్తుంటే, అమరావతి మహా నిర్మాణం, దాని తాలూకు కబుర్లకు మల్లే ఆన్తున్నాయిరా’’ నిట్టూర్చాడు బాబాయ్.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ
Comments
Please login to add a commentAdd a comment