sreeramana
-
కల్చర్‌లో అఫైర్స్
చాలా రోజుల క్రితం నా మిత్రుడొకాయన రాష్ట్ర సాంస్కృతిక శాఖలో, కొంచెం ఎత్తు కుర్చీలో ఉండేవాడు. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్లం. ఒకసారి కలిసినపుడు మిత్రమా కుశలమా అని పలకరిస్తూ, ఈ మధ్య మీ శాఖలో కల్చర్ తక్కువగానూ, అఫైర్స్ ఎక్కువగానూ తూగుతున్నాయని వినిపిస్తోంది. నిజమా?! అని అడిగాను. మిత్రుడు నవ్వేసి రెండూ తక్కువగానే ఉన్నాయంటూ చప్పరించాడు. ‘మన నాయకులకి చాలా సంగతులు తెలియవు. కవులని, కళాకారులని గుర్తించి గౌరవిస్తే వచ్చే ఖ్యాతి క్యాపిటల్ కట్టినా రాదు’ అంటూ ప్రారంభించాను. కృష్ణదేవరాయలతో మొదలు పెట్టా. అష్టదిగ్గజాల గురించి, వారి ప్రతిభా పాటవాల గురించి, పోషణ గురించి గుక్క తిప్పుకోకుండా మాట్లాడా. కవులు చాలా అల్ప సంతోషులు. పాత రోజుల్లో కూడా పాపం పావలా ఇస్తే ఆనందంతో రెచ్చిపోయి రెండు సీసాలు, వాటికి తోడు రెండు ఎత్తు గీతులు ఆశువుగా డౌన్లోడ్ చేసేవారు. అన్నీ రాజుగారి మీద పొగడ్తల జల్లులే. యతి ప్రాసలతో కురిపించి ఆనంద పరవశులను చేసేవారు. మీ చంద్రబాబుకి రాజకీయం తప్ప రసికత లేదు– అంటూ అక్కడికి ముగించాను. విశ్వవిద్యాలయాలు, అకాడెమీలు, నంది అవార్డులిచ్చే పెద్దలు కొంచెం పెద్ద మనసుతో ఉండాలంటారు విజ్ఞులు. అందులో కులాభిమానాన్ని, ప్రాంతీయతత్వాన్ని పులమకూడదంటారు. చంద్రబాబు హయాంలో ఒకసారి, రెండు సార్లు నంది గొడవలు రేగిన జ్ఞాపకం. మొన్న జగన్మోహన్రెడ్డి తాజా బడ్జెట్లో కొన్ని పద్దులు ఉదారంగానే కనిపించాయి. మన ప్రభుత్వాలు ఉదారంగా పింఛన్లు ఇస్తున్నాయి. సంతోషం. అదే గొప్ప కళాకారులుంటారు. జీవితమంతా యాభై, అరవై ఏళ్లు వేరే ఊసు లేకుండా వారు నమ్ముకున్న కళతోనే దీనంగా బతికేస్తూ ఉంటారు. ఎప్పుడో వారి అదృష్టం కలిసి వస్తే ప్రభుత్వం సొంతంగానో, విశ్వవిద్యాలయం ద్వారానో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనే జీవన సాఫల్య పురస్కారాన్ని ఘనంగా ప్రతిపాదిస్తుంది. ఇంతా చేసి ఆ పురస్కారం అవార్డు పాతిక లేదా యాభై వేలుంటుంది. ‘దాన్ని విలువ కట్టకూడదు. తప్పు. అందులో మా ముఖ్యమంత్రిగారి దీవెనలున్నాయ్. మా ఇతర మంత్రుల ఆకాంక్షలున్నాయ్’ అంటూ భయపెట్టి సమర్థించుకుంటారు. నిజానికి అరవై ఏళ్ల కృషికి గాను ఆ కాస్తని భాగించి లెక్కిస్తే రోజుకి పావలా కూడా పడదని ఒక గ్రహీత వాపోయాడు. చంద్రబాబు చేతికి ఎముకలెక్కువ, మనిషికి ఔదార్యం తక్కువ అని నిట్టూర్చాడు. రాష్ట్ర భాషాభివృద్ధికి సమృద్ధిగా నిధులుంటాయ్. అవి కేంద్రం నించి వస్తాయ్. ఇక్కడి పసుపు కుంకుమ ఖాతాలోంచి తియ్యక్కర్లేదు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఆ నిధులు సద్వినియోగం అయిన పాపాన పోలేదు. ఈ డబ్బులతో ఎన్నో మంచి తెలుగు పుస్తకాలు అచ్చు వేయవచ్చు. ఎన్నో అమూల్యమైన పుస్తకాలను పునర్ ముద్రించి ఈతరం వారికి అందు బాటులోకి తేవచ్చు. ప్రతి చిన్న స్కూలు లైబ్రరీలోనూ పిల్లలు విధిగా చదవాల్సిన పుస్తకాలను పెట్టవచ్చు. చంద్రబాబు పాలనలో, గడచిన సంవత్సరాలలో దీనికి సంబంధించిన నిధులు కోట్లాదిగా మురిగిపోయాయి. ఇటువంటి నిధులు గడువుదాటిపోతే అవి వృథా అయినట్టే. ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగి పోతుంటాయి. ఇలా కేంద్రం నుంచి, ఇతర చోట్ల నుంచి వచ్చే నిధులను రాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి ప్రత్యేకించి ఒక కార్యాలయం బాధ్యతాయుతంగా పనిచేయాలి. అంతర్జాతీయంగా చదువు, గ్రామీణ క్రీడలు ఇలాంటి వాటి ఉద్ధరణకి వచ్చే నిధులు అనేకం ఉన్నాయి. వాటిని సకాలంలో సంప్రదించి అందుకోవాలి. వినియోగించుకోవాలి. ప్రతి చిన్న అంశాన్ని పరిశీలనగా చూస్తున్న జగన్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తుందని ఆశిద్దాం. కల్చర్, అఫైర్స్ సమతుల్యంతో నడుస్తాయని నమ్ముతున్నాం. శ్రీరమణ ప్రముఖ కథకుడు -
గిరిధర్‌గౌడ్ కుంచెకు సన్మానం!
‘ప్యారిస్ ఆఫ్ ఆంధ్రా’ తెనాలికి సమీపంలో, సుక్షేత్రం సంగం జాగర్లమూడికి పది అంగల దూరంలో ఉంటుంది గరువుపాలెం. రాయన గిరిధర్ గౌడ్ అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే ఉంటున్నారు. తండ్రి తెలుగు ఉపాధ్యాయులు. బోర్డుమీద బొమ్మలు గీస్తూ, ఆసక్తికరంగా పాఠాలు చెప్పడం ఆయనకు ఇష్టం. అలా పరంపరగా గిరిధర్‌కి రేఖలు అంటుకున్నాయ్. తర్వాత అవి నిగ్గుతేలాయి. పది పదకొండేళ్ల వయసులో జాగర్లమూడిలో డ్రాయింగ్ మాస్టారు దీవి సుబ్బరాయశాస్త్రి కొంత శిక్షణ, మరింత ప్రోత్సాహం ఇచ్చారు. ఇంటర్మీడియట్ కాగానే మైసూరు చామరాజేంద్ర అకాడమీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ కళాశాలలో స్వయంప్రతిభతో సీటు సంపాయించుకున్నారు. ఇక్కడ పట్టా తీసుకున్నాక రెండేళ్లు బెంగళూరులో ఉన్నారు. జానపద అకాడమీ వారి కోసం పలు మీనియేచర్స్ రచించి ఇచ్చే సదవకాశం వచ్చింది. లఘుచిత్ర క్షేత్రంలో పలువురు పెద్దలవద్ద మెలకువలు నేర్చుకున్నారు. చిత్రకారునిగా నిలదొక్కుకుంటున్న తరుణంలో, భుజంమీద వాత్సల్యాభిమానాలతో చేయివేసి కొండంత భరోసా ఇచ్చిన పోలీస్ ఉన్నతాధికారి కె. సదాశివరావుకి వినమ్రంగా శిరసు వంచుతాడు. తర్వాత మజిలీలో సద్విమర్శలతో ఆదరించిన కాండ్రేగుల నాగేశ్వరరా వుని అనుక్షణం గుర్తు చేసుకుంటారు. ప్రపంచ చిత్రకళకు హద్దులు చెరిపేసిన పికాసో ఎన్నో వినూత్న పంథాలకు దారులు వేశాడు. ఆయన దక్షిణ ఫ్రాన్స్‌లో మధ్యధరా సముద్ర తీరాన ఉన్న ఒక విశాల సౌధంలో ఉండేవాడు. అదొక చిన్న గ్రామం. అది పికాసో గ్రామం. అక్కడి చేతివృత్తుల వారితో పికాసో చెలిమి. వడ్రంగులు, కుంభకారులు, బెస్తవారు, నేతపని వారు, రైతులు, వీధి కళాకారులు వీరితో మాత్రమే కలిసేవాడు. వారితో ఆడేవాడు, పాడేవాడు, తాగి తందనాలాడేవాడు. పికాసోని వేరొకరికి కలవడం, మాట్లాడ్డం అయ్యేపని కాదు. ప్రముఖ పాత్రికేయులు, నాటి ఇలస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకులు ఎ.ఎస్. రామన్ తను ఎంత శ్రమతో పికాసో దర్శనం చేసిందీ తన జ్ఞాపకాల్లో రాశారు. చివరకు జీన్ అనే ఒక వృద్ధుని ద్వారా సాధ్యపడిం దని చెప్పారు. గరువు పాలేన్ని గిరిధర్ గౌడ్‌ని కలిపి చూసినపుడు నాకీ సంఘటన జ్ఞాపకం వచ్చింది. గిరిధర్లోంచి ఆ గ్రామాన్ని బయటకు లాగలేం. ఆయనని కూడా గ్రామం నించీ లాగలేం. అదే ఆయనకు శ్రీరామ రక్ష. గిరిధర్‌కి చిన్నతనంలోనే ప్రఖ్యాత కళా స్రష్ట, విమర్శకులు సంజీవ్ దేవ్‌తో పరిచయమైంది. సంజీవ్ దేవ్ తుమ్మపూడిలో నిలబడి, రంగురంగుల ఊలుదారంతో భూగోళాన్ని బెలూన్‌గా ఎగరేసిన అసాధారణ వ్యక్తి. గిరిధర్ గౌడ్ పూర్తిగా జానపద కళాకారుడు. తన నేత పనులు చేత పనులు తన నట్టింట కూచుని నెలల తరబడి చేసుకుంటాడు. నగరాలలో ఉండే సంతల్లో ప్రదర్శించి సొమ్ము చేసుకుంటాడు. మళ్లీ కొత్త ఆలోచనలతో గరువుపాలెం వస్తాడు. కలువలు నిండిన ఊర చెరువు, పంట కాలువలు, రెల్లు దుబ్బులకు వేలాడే గిజిగాడి గూళ్లు, అవిశె చెట్లకు అల్లుకున్న తమలపాకు తీగెలు, పచ్చపచ్చని అరటి, నిమ్మతోటలు బోలెడు ఐడియాలిస్తాయి. గిరిధర్ ప్రాచీనులు వాడిన రంగుల్ని కొత్తగా వాడతాడు. గుంటూరు అన్నమయ్య లైబ్రరీలో గిరిధర్ చిత్రించిన పోట్రెయిట్స్ పదిదాకా కనిపిస్తాయ్. గాంధీ, ఠాగోర్, ఆదిభట్ల నారాయణ దాసు ఇత్యాదులంతా కళ్లెదుట కనిపిస్తారు. ఆయన చిత్రించిన వృషభధారా వాహిక ఒక అద్భుతం. చాలా శాస్త్రీయంగా అధ్యయనం చేసి వేసిన ‘దశావతారం’ కన వేడుక. గిరిధర్‌కి చిత్ర శిల్పిగా కొన్ని లెక్కలున్నాయ్. వేసే బొమ్మపై పూర్తి అవగాహన లేకుండా రంగంలోకి దిగరు. చూసే కొందరికి ఇది చాదస్తం అన్పించవచ్చు. దాన్నాయన ఖాతరు చెయ్యరు. శ్రీనాథుడు తన రచనల్లో దేవుళ్లని మనుషుల్లోకి దింపేశాడని ప్రతీతి. గిరిధర్ ఒక సిరీస్‌లో అదే పని చేశాడు. పార్వతి కాళ్లమీద వేసుకుని గణపయ్యకి నీళ్లుపోస్తూ ఉంటుంది. ఎంత ముచ్చటైన ఆలోచన. గిరిధర్ కళారంగంలో చాలా విస్తృతంగా పరిశీలించాడు. పరిశోధించాడు. రూప లావణ్యాలలో ప్రత్యేకత ఉంది. రంగుల రంగరింపులో గిరిధర్ వేలిముద్ర కనిపిస్తుంది. చిత్ర కళారంగంలో ఉన్న శాఖలన్నింటిలో రాణకెక్కారు. ఇంకా వయసులో చిన్నవారు. గిరిధర్ గౌడ్‌లో ఉన్న కల్తీలేని నమ్రత ఆయనని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్తుంది. సందేహం లేదు. అప్పుడు అందరం మా గిరిధర్, మా తెనాలి, మా తెలుగు, మన భారతీయుడు అని కాలర్ ఎగరేసుకుంటాం. తథాస్తు! (జనవరి 4న గిరిధర్ గౌడ్ అజో,విభో అవార్డు అందుకుంటున్న సందర్భంగా) వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
పుట్టని బిడ్డకు పేర్లు
అక్షర తూణీరం ‘ఇంకా పన్నెండు ఈఎమ్ఐలు డ్యూ’’ అన్నాడు విశ్వం. ‘‘నీ యవ్వారం చూస్తుంటే, అమరావతి మహా నిర్మాణం, దాని కబుర్లకు మల్లే ఆన్తున్నాయిరా’’ నిట్టూర్చాడు బాబాయ్. విశ్వనాథం మంచి కళాకారుడు. కల్చర్‌ని మూలధనంగా, వినయసంపదని, నోటిమాటని పరపతిగా కలిగినవాడు. కాళ్లనపడ్డ పామైనా కరవకుండా పోవచ్చుగానీ విశ్వనాథం మాత్రం కాటు వెయ్యకుండా పోడు. చురుకు, వృత్తికి తగిన వేగం విస్సు స్వార్జితాలు. మాది ఓ మాదిరి అంటే టాబ్లాయిడ్ సైజు టౌను. ‘పడింది రోయ్’ అని నలుగురూ చేరి వార్తలు చదువుకునే తీరిక, పదహారు పేజీల లోకల్ ఫీలింగూ పుష్కలంగా ఉందక్కడ. విశ్వం బుర్రలో బృహస్పతి సదా కొలువై ఉంటాడు. టెక్నాలజీ వినియోగించి బృహుణ్ణి లచ్చిందేవిలోకి మార్చుకుంటాడు. ‘‘బాబాయ్, ఈసారి కాదనకూడదు. ఇది ఆత్మగౌరవ అంశం’’ అన్నాడు– అప్పుడే షట్టర్ తీసి, సరుకు సద్దుకుంటున్న ఆసామితో. ‘‘ఛ... నాకేమిట్రా’’ అన్నాడాసామి ఉలిక్కిపడి. ‘‘కాదు. నీకే’’ రొక్కించాడు విశ్వనాథం. ‘‘ఛ.. పో...’’ ‘‘చచ్చినా పోను. పోనంటే పోను’’ ‘‘అఘోరించావ్ లే’’ అన్నాడు వాత్సల్య స్వరంతో. మూడొంతులు మింగుడు పడ్డట్టే! ‘‘కిందటేడు షాపులో బేరాలు మందకొడిగా ఉన్నాయంటే, నోట్ల రద్దు దెబ్బ పడిందంటే మెత్తబడ్డా. ఈసారి కుదర్దు బాబాయ్’’. ‘‘అయితే ఇంతకీ ఏమంటావురా?!’’ ఆశ్చర్యం ప్రశ్నార్థకం జమిలిగా ధ్వనించాయ్. ‘‘నేనిప్పుడే పేర్లు బయట పెట్టనుగానీ, ఇద్దరు మిని ష్టర్లు కనిపిస్తే తినేస్తున్నారు. వాళ్లకేం మైకులు దొరక్కనా’’ ‘‘ఇంతకీ ఏమంటావురా’’. ‘‘భోజనాలు పెట్టుకోవద్దు బాబాయ్ అలసిపోతాం. ఎటూ ఓ వందమందికి తప్పదు’’. ‘‘అది కాదురా విశ్వం...’’ ‘‘మన జై భవాని కల్యాణమండపం ఇప్పుడే ఖాయం చేద్దాం. మెయిన్ రోడ్డెంట మన షాపు ముందు నించి చిన్న ఊరేగింపు తీద్దాం. బాణాసంచా ఇక్కడ కొనద్దు అవసరమైతే ఓ పూట శివకాశి వెళ్లొస్తా. చెన్నై నించి కమ్మటి నాదస్వరం వస్తుంది. ఒక్కమాట ముందే చెబుతున్నా. ఇన్విటేషన్ మీద పిన్ని ఫొటో ఉండితీరాలి. నాకొదిలెయ్’’ ‘‘ఎందుకురా ఈ ఆర్భాటాలు? చెబితే వినే మనిషివికాదు’’ అని గొణుగుతూనే తొలి విడతగా కొంత రొక్కం అందించాడు. విశ్వం రెండో అడుగు సావనీర్ మీద పడింది. షాపులు, అంగళ్లు, కొట్లు, దుకాణాలు ఇలా టౌన్లో ఉన్న వాటన్నింటినీ తడిమాడు. టౌను చాంబర్ ఆఫ్ కామర్స్, శ్రీ సాధుసాయి డెవలపర్స్ హనుమ సూపర్ స్పెషాలిటీస్ అంటూ పుట్టని బిడ్డలకి పేర్లు పెట్టి, గొప్ప ఆశలు మొలిపించి ఫుల్‌పేజి యాడ్ డిజైన్లు అరచేతిలో చూపించాడు. ఈఎమ్ఐ వసతి ఉందని మొదటి కిస్తీ లాగేశాడు మధ్యే మధ్యే ఉదక పానీయంలాగా. స్థానిక రాతగాళ్లకి చక్కిలిగింతలో పెట్టాడు. బుగ్గన పెన్ను పెట్టించి సెల్లో వారి ముఖాల్ని బంధించాడు. ఇన్విటేషన్ డమ్మీ కాపీ, సావనీర్ కవరు జిరాక్సు ఓ ఫైల్లో వేసుకుని కుందేలు పరుగుల్లో విశ్వనాథం కనిపిస్తూ, ఈఎమ్ఐలు స్వీకరిస్తూ వారాలు, నెలలు, ఏళ్లు నెట్టుకొస్తున్నాడు. రాత కార్మికులెక్కడ కనిపించినా, మీదే ఆలస్యం అనేవాడు. పదమూడో వాయిదా ఇచ్చేసి ‘అయితే ఇంతకీ ఏమంటావురా’ అన్నాడు బాబాయ్ సౌమ్యంగానే. ‘ఇంకా పన్నెండు ఈఎమ్ఐలు డ్యూ’’ అన్నాడు విశ్వం. ‘‘నీ యవ్వారం చూస్తుంటే, అమరావతి మహా నిర్మాణం, దాని తాలూకు కబుర్లకు మల్లే ఆన్తున్నాయిరా’’ నిట్టూర్చాడు బాబాయ్. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
థాంక్స్ టు బైపోల్!
అక్షర తూణీరం నంద్యాల ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే కొండను తవ్వి ఎలుకను పట్టాడంటారు. జగన్ గెలిస్తే కొండను ఢీకొట్టి నిలిచాడంటారని ఓ పెద్దమనిషి విశ్లేషించాడు. దాదాపు మూడు నెలలుగా నంద్యాల పేరు సర్వత్రా మారు మోగిపోతోంది. అక్కడికి కొత్త విశ్వవిద్యాలయమో, విమానాశ్రయమో రాలేదు. అక్కడ చమురు బావి పడనూ లేదు. కొత్తగా దేవుడు వెలవలేదు. కనీసం మహత్తుల కొత్త బాబా నంద్యాల గడ్డపై అవతరించనూ లేదు. ఒక ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నిక. కేవలం రెండేళ్ల ఆయుష్షున్న పదవికి సాగుతున్న పోరాటం. కాని అది ప్రతిష్టాత్మక పోరు అయిపోయింది. అందరూ కలసి సూదిని దూలానికి గుచ్చారు. బాధ్యులంతా వెన్నువిరగా మోస్తున్నారు. ఇది పొజిషన్‌కి, అపోజిషన్‌కి పోటాపోటీ అయింది. బాహాబాహీ అయింది. మాటల తూటాలు పేల్తున్నాయి. అపోజిషన్ లీడర్ ఇది ధర్మానికీ అధర్మానికీ, న్యాయానికీ అన్యాయానికీ మధ్య పోరంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వ అక్రమ అవినీతి ధోరణులపై ఈ ఎన్నిక రిఫరెండమ్ అంటూ బాంబు పేల్చారు. దాంతో ట్రాక్ లేకుండానే తెలుగుదేశం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయ్. దాంతో క్యాపిటల్ అమరావతి మొత్తంగా లేచి వచ్చి మిడతల దండులా నంద్యాల మీద వాలింది. ప్రతిపక్షనేత, రాబోయే 2019 ఎన్నికల కురుక్షేత్ర మహా సంగ్రామానికి ఇది నాంది ప్రస్తావనగా అభివర్ణించారు. దాంతో నంద్యాల మరింత వేడెక్కింది. మంత్రులు, సామంతులు రెండు నెలలుగా హాల్ మకాం నంద్యాలకు మార్చారు. ఇక చంద్రబాబు అయితే సరేసరి. ఆయన దేహం అమరావతిలో ఉంది గానీ, ఆత్మ మాత్రం భయం భయంగా నంద్యాల నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. వచ్చారు, మళ్లీ వచ్చారు, మళ్లీ మళ్లీ వస్తారు. రోడ్ షోలతో అక్కడ దుమ్ము లేస్తోంది. జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ పక్షాన ఒంటరి పోరు చేస్తున్నారు. అక్కడే మకాం పెట్టారు. చంద్రబాబు నాయుడు కిందటి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ మాయమాటలేనని జాబితా చదువుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు సుమారు ఓ ఇరవై సంస్థలు, పథకాలు, ఇతరాలు. ఒక్కటంటే ఒక్కటైనా కనీసం పునాదిరాయికైనా నోచుకోలేదని వైఎస్సార్సీపీ అధినేత జనానికి గుర్తు చేస్తున్నారు. దీనికేమీ జవాబు చెప్పలేక తెలుగుదేశం నేతలు పక్కదారిన వెళ్తున్నారు. ఒక్క అర్ధాయుష్షు సీటుకోసం ఎంత డబ్బు, ఎంత శ్రమ వృథా చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటప్పుడు గవర్నర్ పెద్దరికంతో కలగజేసుకుని, ఈ ఎనర్జీని అభివృద్ధి కోసం, శుచీ, శుభ్రత కోసం వినియోగించుకోమని సూచించవచ్చు. ఈ రెండ్రోజులూ అయిపోతే, ఊళ్లోంచి ఓ గ్రాండ్ సర్కస్ డేరా వెళ్లిపోయినట్లు సినిమా షూటింగ్ యూనిట్ ప్యాకప్ చేసినట్లు ఊరు బావురుమంటుంది– అన్నాడొక స్థాని కుడు. చంద్రబాబు గెలిస్తే కొండను తవ్వి ఎలుకను పట్టాడంటారు. జగన్ గెలిస్తే కొండను ఢీకొట్టి నిలిచాడంటారని ఓ పెద్ద విశ్లేషించాడు. ‘ఫేస్’ వ్యాల్యూ ఉన్నవాళ్లు గడపలోకి వచ్చి సెల్ఫీలిచ్చారు. ‘థ్యాంక్స్ టు బైపోల్’ అన్నదో అమ్మాయి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ