కల్చర్‌లో అఫైర్స్‌ | Sree Ramana Article On Cultural Affairs | Sakshi
Sakshi News home page

కల్చర్‌లో అఫైర్స్‌

Published Sat, Jul 20 2019 1:21 AM | Last Updated on Sat, Jul 20 2019 1:22 AM

Sree Ramana Article On Cultural Affairs - Sakshi

చాలా రోజుల క్రితం నా మిత్రుడొకాయన రాష్ట్ర సాంస్కృతిక శాఖలో, కొంచెం ఎత్తు కుర్చీలో ఉండేవాడు. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్లం. ఒకసారి కలిసినపుడు మిత్రమా కుశలమా అని పలకరిస్తూ, ఈ మధ్య మీ శాఖలో కల్చర్‌ తక్కువగానూ, అఫైర్స్‌ ఎక్కువగానూ తూగుతున్నాయని వినిపిస్తోంది. నిజమా?! అని అడిగాను. మిత్రుడు నవ్వేసి రెండూ తక్కువగానే ఉన్నాయంటూ చప్పరించాడు.

‘మన నాయకులకి చాలా సంగతులు తెలియవు. కవులని, కళాకారులని గుర్తించి గౌరవిస్తే వచ్చే ఖ్యాతి క్యాపిటల్‌ కట్టినా రాదు’ అంటూ ప్రారంభించాను. కృష్ణదేవరాయలతో మొదలు పెట్టా. అష్టదిగ్గజాల గురించి, వారి ప్రతిభా పాటవాల గురించి, పోషణ గురించి గుక్క తిప్పుకోకుండా మాట్లాడా. కవులు చాలా అల్ప సంతోషులు. పాత రోజుల్లో కూడా పాపం పావలా ఇస్తే ఆనందంతో రెచ్చిపోయి రెండు సీసాలు, వాటికి తోడు రెండు ఎత్తు గీతులు ఆశువుగా డౌన్‌లోడ్‌ చేసేవారు. అన్నీ రాజుగారి మీద పొగడ్తల జల్లులే. యతి ప్రాసలతో కురిపించి ఆనంద పరవశులను చేసేవారు. మీ చంద్రబాబుకి రాజకీయం తప్ప రసికత లేదు– అంటూ అక్కడికి ముగించాను.

విశ్వవిద్యాలయాలు, అకాడెమీలు, నంది అవార్డులిచ్చే పెద్దలు కొంచెం పెద్ద మనసుతో ఉండాలంటారు విజ్ఞులు. అందులో కులాభిమానాన్ని, ప్రాంతీయతత్వాన్ని పులమకూడదంటారు. చంద్రబాబు హయాంలో ఒకసారి, రెండు సార్లు నంది గొడవలు రేగిన జ్ఞాపకం. మొన్న జగన్‌మోహన్‌రెడ్డి తాజా బడ్జెట్‌లో కొన్ని పద్దులు ఉదారంగానే కనిపించాయి. మన ప్రభుత్వాలు ఉదారంగా పింఛన్లు ఇస్తున్నాయి. సంతోషం. అదే గొప్ప కళాకారులుంటారు. జీవితమంతా యాభై, అరవై ఏళ్లు వేరే ఊసు లేకుండా వారు నమ్ముకున్న కళతోనే దీనంగా బతికేస్తూ ఉంటారు.

ఎప్పుడో వారి అదృష్టం కలిసి వస్తే ప్రభుత్వం సొంతంగానో, విశ్వవిద్యాలయం ద్వారానో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ అనే జీవన సాఫల్య పురస్కారాన్ని ఘనంగా ప్రతిపాదిస్తుంది. ఇంతా చేసి ఆ పురస్కారం అవార్డు పాతిక లేదా యాభై వేలుంటుంది. ‘దాన్ని విలువ కట్టకూడదు. తప్పు. అందులో మా ముఖ్యమంత్రిగారి దీవెనలున్నాయ్‌. మా ఇతర మంత్రుల ఆకాంక్షలున్నాయ్‌’ అంటూ భయపెట్టి సమర్థించుకుంటారు. నిజానికి అరవై ఏళ్ల కృషికి గాను ఆ కాస్తని భాగించి లెక్కిస్తే రోజుకి పావలా కూడా పడదని ఒక గ్రహీత వాపోయాడు. చంద్రబాబు చేతికి ఎముకలెక్కువ, మనిషికి ఔదార్యం తక్కువ అని నిట్టూర్చాడు.

రాష్ట్ర భాషాభివృద్ధికి సమృద్ధిగా నిధులుంటాయ్‌. అవి కేంద్రం నించి వస్తాయ్‌. ఇక్కడి పసుపు కుంకుమ ఖాతాలోంచి తియ్యక్కర్లేదు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఆ నిధులు సద్వినియోగం అయిన పాపాన పోలేదు. ఈ డబ్బులతో ఎన్నో మంచి తెలుగు పుస్తకాలు అచ్చు వేయవచ్చు. ఎన్నో అమూల్యమైన పుస్తకాలను పునర్‌ ముద్రించి ఈతరం వారికి అందు బాటులోకి తేవచ్చు. ప్రతి చిన్న స్కూలు లైబ్రరీలోనూ పిల్లలు విధిగా చదవాల్సిన పుస్తకాలను పెట్టవచ్చు. చంద్రబాబు పాలనలో, గడచిన సంవత్సరాలలో దీనికి సంబంధించిన నిధులు కోట్లాదిగా మురిగిపోయాయి. ఇటువంటి నిధులు గడువుదాటిపోతే అవి వృథా అయినట్టే. 

ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగి పోతుంటాయి. ఇలా కేంద్రం నుంచి, ఇతర చోట్ల నుంచి వచ్చే నిధులను రాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి ప్రత్యేకించి ఒక కార్యాలయం బాధ్యతాయుతంగా పనిచేయాలి. అంతర్జాతీయంగా చదువు, గ్రామీణ క్రీడలు ఇలాంటి వాటి ఉద్ధరణకి వచ్చే నిధులు అనేకం ఉన్నాయి. వాటిని సకాలంలో సంప్రదించి అందుకోవాలి. వినియోగించుకోవాలి. ప్రతి చిన్న అంశాన్ని పరిశీలనగా చూస్తున్న జగన్‌ ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తుందని ఆశిద్దాం. కల్చర్, అఫైర్స్‌ సమతుల్యంతో నడుస్తాయని నమ్ముతున్నాం.


శ్రీరమణ
ప్రముఖ కథకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement