థాంక్స్ టు బైపోల్!
అక్షర తూణీరం
నంద్యాల ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే కొండను తవ్వి ఎలుకను పట్టాడంటారు. జగన్ గెలిస్తే కొండను ఢీకొట్టి నిలిచాడంటారని ఓ పెద్దమనిషి విశ్లేషించాడు.
దాదాపు మూడు నెలలుగా నంద్యాల పేరు సర్వత్రా మారు మోగిపోతోంది. అక్కడికి కొత్త విశ్వవిద్యాలయమో, విమానాశ్రయమో రాలేదు. అక్కడ చమురు బావి పడనూ లేదు. కొత్తగా దేవుడు వెలవలేదు. కనీసం మహత్తుల కొత్త బాబా నంద్యాల గడ్డపై అవతరించనూ లేదు. ఒక ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నిక. కేవలం రెండేళ్ల ఆయుష్షున్న పదవికి సాగుతున్న పోరాటం. కాని అది ప్రతిష్టాత్మక పోరు అయిపోయింది. అందరూ కలసి సూదిని దూలానికి గుచ్చారు. బాధ్యులంతా వెన్నువిరగా మోస్తున్నారు. ఇది పొజిషన్‌కి, అపోజిషన్‌కి పోటాపోటీ అయింది. బాహాబాహీ అయింది. మాటల తూటాలు పేల్తున్నాయి.
అపోజిషన్ లీడర్ ఇది ధర్మానికీ అధర్మానికీ, న్యాయానికీ అన్యాయానికీ మధ్య పోరంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వ అక్రమ అవినీతి ధోరణులపై ఈ ఎన్నిక రిఫరెండమ్ అంటూ బాంబు పేల్చారు. దాంతో ట్రాక్ లేకుండానే తెలుగుదేశం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయ్. దాంతో క్యాపిటల్ అమరావతి మొత్తంగా లేచి వచ్చి మిడతల దండులా నంద్యాల మీద వాలింది. ప్రతిపక్షనేత, రాబోయే 2019 ఎన్నికల కురుక్షేత్ర మహా సంగ్రామానికి ఇది నాంది ప్రస్తావనగా అభివర్ణించారు. దాంతో నంద్యాల మరింత వేడెక్కింది. మంత్రులు, సామంతులు రెండు నెలలుగా హాల్ మకాం నంద్యాలకు మార్చారు. ఇక చంద్రబాబు అయితే సరేసరి. ఆయన దేహం అమరావతిలో ఉంది గానీ, ఆత్మ మాత్రం భయం భయంగా నంద్యాల నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. వచ్చారు, మళ్లీ వచ్చారు, మళ్లీ మళ్లీ వస్తారు.
రోడ్ షోలతో అక్కడ దుమ్ము లేస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ పక్షాన ఒంటరి పోరు చేస్తున్నారు. అక్కడే మకాం పెట్టారు. చంద్రబాబు నాయుడు కిందటి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ మాయమాటలేనని జాబితా చదువుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు సుమారు ఓ ఇరవై సంస్థలు, పథకాలు, ఇతరాలు. ఒక్కటంటే ఒక్కటైనా కనీసం పునాదిరాయికైనా నోచుకోలేదని వైఎస్సార్‌సీపీ అధినేత జనానికి గుర్తు చేస్తున్నారు. దీనికేమీ జవాబు చెప్పలేక తెలుగుదేశం నేతలు పక్కదారిన వెళ్తున్నారు. ఒక్క అర్ధాయుష్షు సీటుకోసం ఎంత డబ్బు, ఎంత శ్రమ వృథా చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు.
ఇలాంటప్పుడు గవర్నర్ పెద్దరికంతో కలగజేసుకుని, ఈ ఎనర్జీని అభివృద్ధి కోసం, శుచీ, శుభ్రత కోసం వినియోగించుకోమని సూచించవచ్చు. ఈ రెండ్రోజులూ అయిపోతే, ఊళ్లోంచి ఓ గ్రాండ్ సర్కస్ డేరా వెళ్లిపోయినట్లు సినిమా షూటింగ్ యూనిట్ ప్యాకప్ చేసినట్లు ఊరు బావురుమంటుంది– అన్నాడొక స్థాని కుడు. చంద్రబాబు గెలిస్తే కొండను తవ్వి ఎలుకను పట్టాడంటారు. జగన్ గెలిస్తే కొండను ఢీకొట్టి నిలిచాడంటారని ఓ పెద్ద విశ్లేషించాడు. ‘ఫేస్’ వ్యాల్యూ ఉన్నవాళ్లు గడపలోకి వచ్చి సెల్ఫీలిచ్చారు. ‘థ్యాంక్స్ టు బైపోల్’ అన్నదో అమ్మాయి.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ