కోటమ్మగారి కొబ్బరి మొక్కు! | akshara tuniram by sri ramana on kotamma coconut plant | Sakshi
Sakshi News home page

కోటమ్మగారి కొబ్బరి మొక్కు!

Published Sat, Apr 30 2016 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

కోటమ్మగారి కొబ్బరి మొక్కు!

కోటమ్మగారి కొబ్బరి మొక్కు!

అక్షర తూణీరం
 
కోటమ్మ చిన్నగా నవ్వింది. కొడుకు తల నిమురుతూ ‘‘పిచ్చి సన్నాసీ! కొబ్బరి మొక్క కాస్తేనే మొక్కు చెల్లించాలి. లేకపోతే తూచ్!’’ అంది. మన క్యాపిటల్ వాగ్దానాలు కూడా అంతే- మళ్లీ మళ్లీ కాపు దిగితేనే....!

 
ఆయన చిత్తూరు చాణక్యు డండీ! జనానికి మండు వేసవిలో చందమామని చూపిస్తున్నాడంటూ ఓ పెద్దమనిషి తెగ ఆశ్చర్య పడ్డాడు. మొన్నటికి మొన్న కృష్ణా గోదావరి నదుల్ని అనుసంధానం చేసి పచ్చ పూల హారతి ఇచ్చాడు. నిన్నటికి నిన్న అమరావతి ముఖ్యపట్టణం తాలూకు సచివాలయం నూతన భవనంలోంచి ముఖ్యమంత్రి మహా సంతకాలు చేశారు.

అసలు కొత్త క్యాపిటల్  నూతన సెక్రటేరి యట్ భవనాన్ని రిబ్బన్ కత్తిరించి, స్వజనం కరతాళ ధ్వనుల మధ్య ప్రారంభించడం భళారే చిత్రం! రాష్ట్రం ముందుకు పోతావుంది. సందేహం లేదు. పూర్వం ఎన్నో నిర్మాణాలు శిలాఫలకాల దగ్గరే నిద్ర పోతుండేవి. ఇప్పుడు అట్లా కాదు. ఎంతోకొంత పైకి సాగుతున్నాయి. ‘‘ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవని ముఖ్యమంత్రి పురిట్లోనే బారసాల చేశాడని’’ ఓ మాటకారి చమత్కరించాడు. అంతేగాని నేత చిత్త శుద్ధిని మెచ్చుకోలేదు. పైగా, అమరావతి నిండా కొత్త తాటాకు చలవ పందిళ్లు వెలుస్తాయి చూడండంటూ ప్రత్యక్ష వ్యాఖ్యానం మొదలుపెట్టాడు.
 
ఉమ్మడి రాజధానిలో మనకు స్థానబలిమి లేకుండా పోయింది. గుట్టుగా ఓ ఫోను చేసుకుం దామన్నా రట్టయిపోతోంది. వేరుపడ్డాక భద్రాచల రామయ్య వాళ్ల పక్షానికి వెళ్లాడు. ఇక మన సంగతి ఎంతవరకు పట్టించుకుంటాడో అనుమానమే. మనం దిక్కులేక ఒంటిమిట్టని ఉన్నట్టుండి ఉద్ధరించే పనిలో పడ్డాం. రాముడు నిజం గ్రహించలేడా? గ్రహించినా లౌక్యంగా, పోన్లే ఇన్నాళ్టికి ఈ వైభవం దక్కిందని సరిపెట్టుకుంటాడా? వాటాల్లో మిగిలిన దేవుళ్లు ఎటు చెదిరినా, మనకి కొండంత అండ వెంకన్న మిగిలాడు. చాలు, అదే కోటి వరహాలు. కోటివరాలు! అంతేనా, ఇంకా అన్నమయ్య, ఆయన వేనవేల సంకీర్తనలు మనకు దక్కాయి.

ఇంకానయం వాటాల పంపిణీలో పదివేలు మాకు చెందాలని, దాయి భాగాలకి పేచీ పెట్టరు కదా! ఒకవేళ పెడితే, వారి వాటాకి వెళ్లిన సంకీర్తనలు వారు తప్ప వీరు పలకరాదు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు రాజధాని తరలింపుపై మునికాళ్ల మీద ఉన్నారు. హాయిగా హైకోర్టుకి నాలుగు చలవ పందిళ్లు, అసెంబ్లీకి ఓ పెళ్లిపందిరి- ఇలా వేసుకుంటూ వెళితే తప్పేముంది? ఒకప్పుడు కర్నూలు రాజధాని పటకుటీరాలలో అంటే డేరాలలో నడవలేదా? రాజధానికి భూమి మాత్రం కొదవలేదు. రైతులు వారికిచ్చిన కమ్మర్షియల్ స్థలాల్లో కూడా చక్కటి తాటాకు, కొబ్బరాకు పందిళ్లు వేసుకుని, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు అద్దెలకిచ్చు కుంటారు. దీని మీద విస్తృతంగా చర్చిస్తే అనేక లాభసాటి మార్గాలు, అడ్డదారులు కనిపిస్తాయి.
 
కోటమ్మ గారు వాళ్ల పుట్టింటి నుంచి కొబ్బరి మొక్క తెచ్చి వాళ్ల పెరట్లో నాటింది. రోజూ దానికి నీళ్లు పోసి, ప్రదక్షిణ చేసి, ‘కాశీ విశ్వేశ్వరా! నీకు వెయ్యెనిమిది టెంకాయలు కొడతా’నంటూ మొక్కేది. ఒక్కో వారం ఒక్కో దేవుడికి టెంకాయల మొక్కు మొక్కేది. అది మారాకు తొడిగే సరికి మూడేళ్లు, మాను కట్టేసరికి పుష్కరం పట్టింది. కోటమ్మకి పెద్దతనం వచ్చింది. ఓపిక అయిపోయింది. ఒకరోజు కొడుకుని కోడల్ని పిలిచి, టెంకాయల మొక్కు సంగతి చెప్పింది. ‘‘నువ్వు చెప్పాలా? ఊరందరికీ తెలుసు. అన్నీ కలిపి లక్షన్నర కొబ్బరికాయల పైమాటే. మా నెత్తి మీదకు తెచ్చిపెట్టావ్’’ అని వేష్టపడ్డారు. కోటమ్మ చిన్నగా నవ్వింది. కొడుకు తల నిమురుతూ ‘‘పిచ్చి సన్నాసీ! కొబ్బరిమొక్క కాస్తేనే మొక్కు చెల్లించాలి. లేకపోతే తూచ్!’’ అంది. మన క్యాపిటల్ వాగ్దానాలు కూడా అంతే- మళ్లీ మళ్లీ కాపు దిగితేనే....!
వ్యాసకర్త: శ్రీరమణ (ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement