రేపు రండి
డీఈఓకు సమాచార కమిషన్ నోటీసులు
అడిగిన సమాచారం ఇవ్వరెందుకు?
జిల్లాలోని స్కూళ్లపై వివరాలు ఇచ్చేందుకు నిరాకరణ
కమిషన్ ఆదేశించినా ఇదే పరిస్థితి
వరంగల్ :అలసత్వానికి చిరునామాగా మారిన జిల్లా విద్యాశాఖపై సమాచార కమిషన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితులపై అడిగిన సమాచారాన్ని గడువులోపు ఇవ్వకపోవడంపై జిల్లా విద్యాధికారికి నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదుదారు అడిగిన సమాచారం ఇవ్వడంలో జాప్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సమాచారం ఇచ్చే విషయంలో జరిగిన ప్రక్రియ వివరాలు తీసుకుని ఫిబ్రవరి 11న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజులు ఎక్కువగా ఉన్నాయని.. వసతులు ఎలా ఉన్నాయో తెలపాలని గీసుగొండ మండలం మనుగొండకు చెందిన జె.మురళి డీఈఓకు సమాచార హక్కు చట్టం కింద గతేడాది డిసెంబరు 23న దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారు అడిగిన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లా విద్యాశాఖ తిరస్కరించింది. దీంతో ఫిర్యాదుదారు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ను ఆశ్రయించారు. సమాచార హక్కు కమిషన్ ఆదేశాల మేరకు.. జిల్లా విద్యా శాఖ అధికారులు సమాచారం ఇచ్చేందుకు అంగీకరించారు. తర్వాత అరకొర సమాచారం ఇచ్చారు. దీనిపై అసంతృప్తి చెందిన ఫిర్యాదుదారు సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సమాచార కమిషన్ డీఈవో చంద్రమోహన్ ఈ నెల 11న తమ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది.
ఇదీ కథ..
జిల్లాలో దాదాపు 1,434 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై అప్పటి జిల్లా యంత్రాంగం మొదట పట్టించుకోలేదు. విమర్శలు ఎక్కువ కావడంతో స్పందించింది. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లలోని వసతులు, వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సేకరించేందుకు తనిఖీల ప్రక్రియ చేపట్టింది. పది స్కూళ్లను పరిశీలించిన విద్యాశాఖ ఆరు స్కూళ్లకు కోట్ల రూపాయలలో జరిమానా విధించింది. దీనికి నిరసనగా ప్రైవేటు స్కూళ్ల యూజమాన్యాలు ధర్నా చేశారు. చివరికి అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల జోక్యంతో ఈ విషయం సద్దుమణిగింది. విద్యా శాఖ తీసుకునే చర్యల విషయంలో వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి జరిమానా వసూలు అంశాన్ని కనీసం పట్టించుకోలేదు. దీనిపై పలువురు మళ్లీ విద్యా శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం రాష్ట్ర సమాచార కమిషన్ వరకు చేరింది.