
విశ్లేషణ
సమాచార చట్టం వచ్చి 13 ఏళ్లు దాటుతున్నా ఇంకా సెక్షన్ 8 ని దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ఆరోపణలకు గురైన ఉద్యోగి తప్పిదాన్ని రుజువు చేయడానికి ముందు ఆరోపణలకు సంబంధించిన వివరాలు అతనికి పూర్తిగా ఇవ్వడం న్యాయం.
సమాచార అధికారుల అసంబద్ద సమాధానాలతో సెక్షన్ 8 నియమాలను ఎడా పెడా దుర్వినియోగం చేస్తున్నారు. ఎంక్వయిరీ నడుస్తున్నదన్న కారణంగా కోరిన సమాచారం నిరాకరించడానికి వీల్లేదని, వెల్లడి చేయడం వల్ల ఎంక్వయిరీలో ప్రతిబంధకం ఏర్పడుతుందని రుజువు చేయగలిగినప్పుడే సమాచారం నిరాకరించడం సాధ్యమని సెక్షన్ 8(1) హెచ్ వివరిస్తున్నది. కాని ఆ సెక్షన్ పేరును వాడుకుని నిరాకరిస్తూ ఉన్నారు. కోర్టులో కేసు పెండింగ్, పోలీసులు, ఇతర సంఘాలు దర్యాప్తు చేస్తున్నాయని, నేర నిర్ధారణ జరుగుతున్నదంటూ సమాచారం నిరాకరించడం చట్టవిరుద్ధం.
2007వ సంవత్సరంలో భగత్ సింగ్ వర్సెస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ అదర్స్ కేసులో కేవలం దర్యాప్తు ప్రక్రియ అమలులో ఉన్నంత మాత్రాన అది సమాచార నిరాకరణకు కారణం కాబోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏ అథారిటీ అయితే ఆ కారణంపైన సమాచారాన్ని నిరాకరిస్తున్నదో, ఆ అధికారి సమాచారాన్ని ఇస్తే దర్యాప్తు ప్రక్రియ కుంటుపడుతుందనడానికి సంతృప్తికరమైన కారణాన్ని చూపవలసి ఉంటుంది. పరిశోధనా ప్రక్రియను దెబ్బతీస్తుందనే అభిప్రాయానికి రావడానికి తగిన సాక్ష్యం కూడా ఉండాలి. లేకపోతే సమాచారం ఇవ్వకుండా ఆపడానికి సెక్షన్ 8(1)(హెచ్) నియమం ఒక స్వర్గధామంగా ఉపయోగపడుతుందని హైకోర్టు ఆక్షేపించింది. శ్రీ సత్యారాయణన్ వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో సీఐసీ 2011 నాటి ఉత్తర్వులో ఇటువంటి ఆదేశాన్నే వెలువరించింది. పి. శివకుమార్ వర్సెస్ సిండికేట్ బ్యాంక్ కేసులో కూడా 2012లో ఇచ్చిన తీర్పులో కేంద్ర సమాచార కమిషన్ ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(హెచ్)లో పేర్కొన్న పదాలను వివరిస్తూ, దర్యాప్తు పెండింగ్‌లో ఉంటే సమాచారం ఇవ్వకూడదనేదే పార్లమెంటు ఉద్దేశమయితే ఆ విధంగానే పదాలు రచించేదని ప్రత్యేకంగా దర్యాప్తునకు ప్రతి బంధకంగా కనిపించే సమాచారాన్ని మాత్రమే వెల్లడించవద్దని చెప్పి ఉండేది కాదని పేర్కొన్నది.
తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పటికీ దానికి సంబంధించిన పత్రాల ప్రతులు అడిగితే ఇవ్వలేదని శ్రీనివాసులు సమాచార కమిషన్ ముందు అప్పీలులో విన్నవించారు. తనపై దర్యాప్తు జరిపిన తరువాత నివేదిక ప్రతి తనకే ఇవ్వలేదని, దర్యాప్తు పూర్తయిన తరువాత కూడా తనకు కావలసిన కాగితాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ప్రతి దానికీ సెక్షన్ 8 కింద మినహాయింపు క్లాజులను చూపిస్తారే కాని ఏ నియమం ప్రకారం, ఏ కారణాల వల్ల సమాచారం నిరాకరించారో వివరించకపోవడం జన సమాచార అధికారులు చేసే ప్రధానమైన పొరపాటు. సమాచార చట్టం వచ్చి 13 ఏళ్లు దాటుతున్నా ఇంకా సెక్షన్ 8ని దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ఆరోపణలకు గురైన ఉద్యోగి తప్పిదాన్ని రుజువు చేయడానికి ముందు ఆరోపణలకు సంబంధించిన వివరాలు అతనికి పూర్తిగా ఇవ్వడం న్యాయం. తాను నేరస్తుడు కాదని రుజువు చేసుకోవడానికి, చెప్పుకునేందుకు పూర్తి అవకాశం ఇవ్వాల్సిందే. ఆ అవకాశం ఇవ్వకపోతే సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన కింద ఆ దర్యాప్తు గానీ, దానిపై ఆధారపడి తీసుకున్న చర్య గానీ చెల్లకుండా పోతాయి. అనుమతి తీసుకోకుండా విధులకు హాజరు కాలేదన్నది ఆరోపణ అయితే అందుకు కావలసిన హాజరీ వివరాలు నిందితుడికి ఇవ్వవలసి ఉంటుంది. సమాచార అధికారిగా ఉండవలసిన సీపీఐఓ సూపరిం టెండెంట్ ఆఫ్ పోస్ట్ పదవిలో తొమ్మిదేళ్లనుంచి ఉంటూ పై అధికారులతో కుమ్మక్కయి సమాచార దరఖాస్తులను పూర్తిగా నిరాకరిస్తున్నారని, వీరి ఆధ్వర్యంలో సమాచార చట్టం పూర్తిగా దెబ్బతింటున్నదని ఆరోపించారు దరఖాస్తుదారుడు. ప్రజాసంబంధ అధికారి డీఎస్ పాటిల్‌పై జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలియజేయాలని నోటీసు జారీ చేసింది. అతని హాజరీకి సంబంధించిన రికార్డులను 15 రోజుల్లో ఇవ్వాలని కూడా ఆదేశించింది.
శ్రీనివాసులుకి 10.12.2015 నాడు సమాధానం ఇచ్చామని, 2014–15 నాటి హాజరీ రిజిస్టర్‌లను పరిశీలించడానికి రావచ్చునని అతనికి అవకాశం ఇచ్చామని తన వివరణలో డీఎస్ పాటిల్ (మాజీ సీపీఐఓ) వివరించారు. 21.06.2017 నాడు కమిషన్ ఉత్తర్వులు వచ్చిన తరువాత పూర్తి సమాచారం ఇచ్చామని చెప్పారు.
పై అధికారిని ధిక్కరించినందున శ్రీనివాసులు పైన రూల్ 16 కింద క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు నోటీసు జారీ చేసి దర్యాప్తు చేపట్టామనీ, విచారణలో ఆరోపణలు రుజువై ఇంక్రిమెంట్‌ను మూడేళ్లపాటు నిలిపివేయాలని నిర్ణయించారని వివరించారు. శ్రీనివాసులు మొదటి అప్పీలు తిరస్కరించిన తరువాత అతనిపై దర్యాప్తు పూర్తయి ఇంక్రిమెంట్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారని సీపీఐఓ పాటిల్ చెప్పారు. కేవలం కోర్టులో సవాలు చేయడానికి మాత్రమే ఈ పత్రాలు అడుగుతున్నాడని, కనుక ముందుగా సమాచారం ఇవ్వలేదని వివరిం చారు. సీపీఐఓ మరో వాదం లేవదీశారు. తనపై విచారణకు సంబంధించిన సమాచారం అడుగుతూ ఉంటే అది మూడో వ్యక్తి సమాచారం కాబట్టి సెక్షన్ 11 ప్రకారం తాను సమాచారం ఇవ్వలేదని చెప్పారు.
అయితే సీపీఐఓ అది ఏ మూడోవ్యక్తి సమాచారమో తెలియజేయలేదు. ఆ వ్యక్తిని సంప్రదించారో లేదో తెలియదు. తనపై క్రమశిక్షణా చర్యల వివరాలు అడిగితే అది మూడో వ్యక్తి సమాచారం ఏ విధంగా అవుతుందో చెప్పలేకపోయారు. హాజరీ పట్టిక విచారణకు సంబంధించిన వివరాలు ఇవ్వవలసినవే. ఆ పత్రాలు అతని కోర్టు వివాదానికి అవసరమో కాదో పూర్తిగా తెలుసుకోకుండా, కోర్టుకు కేసును తీసుకువెళ్తాడు కనుక అడిగిన సమాచారం ఇవ్వబోమనడం మరొక తప్పు.
మొత్తానికి సమాచారాన్ని అన్యాయంగా నిరాకరించారని తేలింది. అందుకు బాధ్యుడైన సీపీఐఓ డీఎస్ పాటిల్ పైన సమాచార హక్కు చట్టం 20 కింద 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. (CIC/BS/A/2016/ 000955 ఎం. శ్రీనివాసులు వర్సెస్ పోస్టల్ డిపార్ట్ మెంట్. కేసులో 18.1.2018 నాటి ఆదేశం ఆధారంగా).
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
మాడభూషి శ్రీధర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment