ఆ ఆదాయంపై కోడలి హక్కు | madabushi sridher over rti | Sakshi
Sakshi News home page

ఆ ఆదాయంపై కోడలి హక్కు

Published Fri, Aug 4 2017 1:11 AM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM

ఆ ఆదాయంపై కోడలి హక్కు

ఆ ఆదాయంపై కోడలి హక్కు

విశ్లేషణ
వేతనం వలే పింఛను వివరాలు కూడా ఎవ్వరడిగినా ఇవ్వవలసినవే అని సమాచార హక్కు చట్టం నిర్దేశిస్తున్నది. పింఛను మూడో వ్యక్తి సమాచారం అని అనుకుంటే ఆయన అభ్యంతరం ఏమీ లేనపుడు వెల్లడించాల్సిందే.

పెళ్లిళ్ల ధోరణులు, తగాదాల అంశంపైన ఈ మధ్య సైబరాబాద్‌ పోలీసులు హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహించారు. ప్రేమ పెళ్లికి ముందు ఇద్దరి మధ్య పూర్తి వివరాలు ఒకరికొకరు చెప్పకపోవడంవల్ల వచ్చే సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో వక్తలు తెలియజేశారు. ఈ సమావేశంలో కోర్టుకు వెళ్లకుండా సమస్యలను పరిష్కరించే అంశాల గురించి కూడా చర్చించారు. ఇరువురి మధ్య పూర్తి వివరాల మార్పిడి జరిగితే సమస్యలు రావు. పూర్తి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని బీమా సంస్థకు  వివరాలు ఇస్తే తప్ప బీమా పాలసీ ఇవ్వరు.  కానీ జీవిత భాగస్వామి విషయంలో ఆరోగ్య వివరాలు చెప్పడానికి నిరాకరిస్తారు. లోపాలుంటే దాస్తారు. నపుంసకుడనే విషయమైతే అసలే చెప్పరు.  భర్త, అత్తమామ, ఆడపడుచు వధువును వేధిస్తూ ఉంటారు.

తమ లోపాన్ని దాచడానికి క్రూరంగా వ్యవహరిస్తారు. పైకి మంచి వారిలా నటిస్తుంటారు. నాలుగ్గోడలమధ్య నపుంసకత్వం లేదా అర్ధనపుంసకత్వానికి రుజువులు ఉండవు. ఈ విషయం బయటపెడితే, కోడలి శీలం పైన అభాండాలు వేసి తప్పుడు సాక్ష్యాలు తయారు చేస్తుంటారు.  ఇవన్నీ నిరోధించాలంటే పెళ్లికిముందే పూర్తి ఆరోగ్య సమాచారాన్ని తెలియజేయడం తప్పనిసరిచేసే స్పష్టమైన చట్టాలు  ఉండాలి. వివాదాలు రాగానే కోడలిని ఇంటినుంచి వెళ్లగొడతారు లేదా భర్త విడిగా ఎక్కడో ఉంటాడు. జీవిం చడం కష్టమవుతుంది. వివాహం చేసుకుని వదిలేసిన భర్తలనుంచి జీవనభృతి (మెయింటెనెన్స్‌) కోరే అధికారం భార్యలకు ఉంది. ఈ కేసుల విచారణలో భార్యాభర్తలు తమ ఆర్థిక స్తోమత గురించి పూర్తి వివరాలు ఇవ్వకపోతే ఎంత జీవనభృతి ఇవ్వడం న్యాయమో చెప్పడం సాధ్యం కాదు. ఆర్టీఐ ఈ సందర్భాలలో విడిగా జీవించే భార్యాభర్తలకు ఉపయోగపడే పరికరంగా మారిపోయింది.

మామగారి పెన్షన్‌ డబ్బు ఎంత, వారి బకాయిల మొత్తం ఎంత తెలియజేయాలని ఒక కోడలు ఆర్టీఐ చట్టం కింద పోస్టల్‌ శాఖను కోరారు.  ఆయన కోడలు హోదాలో తాను సమాచారం కోరుతున్నానని ఆమె వివరించారు. యథాప్రకారం అది మూడో పార్టీ సమాచారమనీ, ఆయన వ్యక్తిగత సమాచారమనీ అంటూ పీఐఓ గారు తిరస్కరించారు. మొదటి అప్పీలులో అధికారి కనీసం ఎందుకు అడుగుతున్నారు, ఇవ్వడం న్యాయమా కాదా అని చూడకుండా తిరస్కరించారు. తానెవరో తన సంబంధం ఏమిటో రుజువు చేసే సాక్ష్యాలు ఇవ్వలేదు కనుక సమాచారం ఇవ్వలేమని అధికారి వివరించారు.

మరణించిన వ్యక్తి ఆస్తిపాస్తులను కూతుళ్లు, కొడుకులు సమానంగా స్వీకరించవలసి ఉంటుంది. తరువాత కొడుకు మరణిస్తే, ఆ కొడుక్కు రావలసిన వాటాను ఆ కొడుకు కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ కేసులో కోడలు తన వంతు వాటా కోరే హక్కు కలిగి ఉంది. కనుక మామగారి ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకోవచ్చు. పెన్షన్‌ నిజానికి మామగారి సొంత ఆస్తి, కోడలు సమాచార హక్కు దరఖాస్తు ద్వారా పెన్షన్లో  వాటా అడగడానికి వీలుండదు. కేవలం సమాచారం అడుగుతున్నారామె. కనుక ఆ సమాచారం ఇవ్వాల్సిందే.

ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 4(1)(బి) ప్రకారం ప్రభుత్వాధికారి వేతనం రహస్య వ్యక్తిగత సమాచారం కాదు. పింఛను కూడా వేతనం వంటిదే. ఉద్యోగి సేవలకుగాను విరమణ తరువాత ఇచ్చే ప్రతిఫలం కనుక అదికూడా వ్యక్తిగత సమాచారం కాదు. కనుక ఆ సమాచారం ఇవ్వడం బాధ్యత. (కృష్ణశర్మ వర్సెస్‌ పోస్టాఫీస్‌ CIC/POSTS/A-/2017/312187 కేసులో 27.7. 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మరొక కేసులో నిషాబెన్‌ తన మామగారికి నెలనెలా వచ్చే పెన్షన్‌ ఎంతో వివరించాలని ఒక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కోరింది. తనకు భర్తకు మధ్యవిభేదాలు వచ్చి విడిగా ఉంటున్నామని, తనకు తన మైనర్‌ కూతురికి జీవనభృతికోసం కోర్టులో పిటిషన్‌ వేశానని ఆమె వివరించారు. తన తండ్రి తనపై పూర్తిగా ఆధారపడి ఉన్నారని, కనుక భార్య కోరి నంత జీవనభృతి ఇవ్వలేనని భర్త తన జవాబు దావాలో పేర్కొన్నారు. తండ్రికి పింఛను వస్తుందని ఆయన కొడుకుపైన ఆధారపడి లేరని కోడలు వాది స్తున్నది. అందుకు రుజువుగా మామగారి పింఛను వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద ఆమె కోరుతున్నది.

తన కోడలికి తన పింఛను వివరాలు ఇవ్వవచ్చునని మామ తన అంగీకారం తెలిపిన తరువాత కూడా అధికారులు సమాచారం ఇవ్వడం లేదని రెండో అప్పీలులో పేర్కొన్నారు. పింఛను మూడో వ్యక్తి సమాచారం అని అనుకుంటే ఆయన అభ్యంతరం ఏమీ లేనపుడు వెల్లడించాల్సింది. అది వ్యక్తిగత సమాచారం అనుకున్నా, ఒక న్యాయ వివాద పరిష్కారానికి ఉపయోగపడే సమాచారం కనుక ప్రజాప్రయోజనం దృష్ట్యా నైనా ఇవ్వాల్సింది. కోడలికి ఆ సమాచారం ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించింది. (నిషాబెన్‌ వివేక్‌ భాయ్‌ భట్‌ వర్సెస్‌ పోస్టాఫీస్, CIC/POSTS /A-/2017/180150 కేసులో ఆగస్టు 1, 2017 నాడు ఇచ్చిన తీర్పు ఆధారంగా).

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement