professorsridhar
-
సమాచార నిరాకరణ నేరం
విశ్లేషణ సమాచార చట్టం వచ్చి 13 ఏళ్లు దాటుతున్నా ఇంకా సెక్షన్ 8 ని దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ఆరోపణలకు గురైన ఉద్యోగి తప్పిదాన్ని రుజువు చేయడానికి ముందు ఆరోపణలకు సంబంధించిన వివరాలు అతనికి పూర్తిగా ఇవ్వడం న్యాయం. సమాచార అధికారుల అసంబద్ద సమాధానాలతో సెక్షన్ 8 నియమాలను ఎడా పెడా దుర్వినియోగం చేస్తున్నారు. ఎంక్వయిరీ నడుస్తున్నదన్న కారణంగా కోరిన సమాచారం నిరాకరించడానికి వీల్లేదని, వెల్లడి చేయడం వల్ల ఎంక్వయిరీలో ప్రతిబంధకం ఏర్పడుతుందని రుజువు చేయగలిగినప్పుడే సమాచారం నిరాకరించడం సాధ్యమని సెక్షన్ 8(1) హెచ్ వివరిస్తున్నది. కాని ఆ సెక్షన్ పేరును వాడుకుని నిరాకరిస్తూ ఉన్నారు. కోర్టులో కేసు పెండింగ్, పోలీసులు, ఇతర సంఘాలు దర్యాప్తు చేస్తున్నాయని, నేర నిర్ధారణ జరుగుతున్నదంటూ సమాచారం నిరాకరించడం చట్టవిరుద్ధం. 2007వ సంవత్సరంలో భగత్ సింగ్ వర్సెస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ అదర్స్ కేసులో కేవలం దర్యాప్తు ప్రక్రియ అమలులో ఉన్నంత మాత్రాన అది సమాచార నిరాకరణకు కారణం కాబోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏ అథారిటీ అయితే ఆ కారణంపైన సమాచారాన్ని నిరాకరిస్తున్నదో, ఆ అధికారి సమాచారాన్ని ఇస్తే దర్యాప్తు ప్రక్రియ కుంటుపడుతుందనడానికి సంతృప్తికరమైన కారణాన్ని చూపవలసి ఉంటుంది. పరిశోధనా ప్రక్రియను దెబ్బతీస్తుందనే అభిప్రాయానికి రావడానికి తగిన సాక్ష్యం కూడా ఉండాలి. లేకపోతే సమాచారం ఇవ్వకుండా ఆపడానికి సెక్షన్ 8(1)(హెచ్) నియమం ఒక స్వర్గధామంగా ఉపయోగపడుతుందని హైకోర్టు ఆక్షేపించింది. శ్రీ సత్యారాయణన్ వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో సీఐసీ 2011 నాటి ఉత్తర్వులో ఇటువంటి ఆదేశాన్నే వెలువరించింది. పి. శివకుమార్ వర్సెస్ సిండికేట్ బ్యాంక్ కేసులో కూడా 2012లో ఇచ్చిన తీర్పులో కేంద్ర సమాచార కమిషన్ ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(హెచ్)లో పేర్కొన్న పదాలను వివరిస్తూ, దర్యాప్తు పెండింగ్‌లో ఉంటే సమాచారం ఇవ్వకూడదనేదే పార్లమెంటు ఉద్దేశమయితే ఆ విధంగానే పదాలు రచించేదని ప్రత్యేకంగా దర్యాప్తునకు ప్రతి బంధకంగా కనిపించే సమాచారాన్ని మాత్రమే వెల్లడించవద్దని చెప్పి ఉండేది కాదని పేర్కొన్నది. తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పటికీ దానికి సంబంధించిన పత్రాల ప్రతులు అడిగితే ఇవ్వలేదని శ్రీనివాసులు సమాచార కమిషన్ ముందు అప్పీలులో విన్నవించారు. తనపై దర్యాప్తు జరిపిన తరువాత నివేదిక ప్రతి తనకే ఇవ్వలేదని, దర్యాప్తు పూర్తయిన తరువాత కూడా తనకు కావలసిన కాగితాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ప్రతి దానికీ సెక్షన్ 8 కింద మినహాయింపు క్లాజులను చూపిస్తారే కాని ఏ నియమం ప్రకారం, ఏ కారణాల వల్ల సమాచారం నిరాకరించారో వివరించకపోవడం జన సమాచార అధికారులు చేసే ప్రధానమైన పొరపాటు. సమాచార చట్టం వచ్చి 13 ఏళ్లు దాటుతున్నా ఇంకా సెక్షన్ 8ని దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ఆరోపణలకు గురైన ఉద్యోగి తప్పిదాన్ని రుజువు చేయడానికి ముందు ఆరోపణలకు సంబంధించిన వివరాలు అతనికి పూర్తిగా ఇవ్వడం న్యాయం. తాను నేరస్తుడు కాదని రుజువు చేసుకోవడానికి, చెప్పుకునేందుకు పూర్తి అవకాశం ఇవ్వాల్సిందే. ఆ అవకాశం ఇవ్వకపోతే సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన కింద ఆ దర్యాప్తు గానీ, దానిపై ఆధారపడి తీసుకున్న చర్య గానీ చెల్లకుండా పోతాయి. అనుమతి తీసుకోకుండా విధులకు హాజరు కాలేదన్నది ఆరోపణ అయితే అందుకు కావలసిన హాజరీ వివరాలు నిందితుడికి ఇవ్వవలసి ఉంటుంది. సమాచార అధికారిగా ఉండవలసిన సీపీఐఓ సూపరిం టెండెంట్ ఆఫ్ పోస్ట్ పదవిలో తొమ్మిదేళ్లనుంచి ఉంటూ పై అధికారులతో కుమ్మక్కయి సమాచార దరఖాస్తులను పూర్తిగా నిరాకరిస్తున్నారని, వీరి ఆధ్వర్యంలో సమాచార చట్టం పూర్తిగా దెబ్బతింటున్నదని ఆరోపించారు దరఖాస్తుదారుడు. ప్రజాసంబంధ అధికారి డీఎస్ పాటిల్‌పై జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలియజేయాలని నోటీసు జారీ చేసింది. అతని హాజరీకి సంబంధించిన రికార్డులను 15 రోజుల్లో ఇవ్వాలని కూడా ఆదేశించింది. శ్రీనివాసులుకి 10.12.2015 నాడు సమాధానం ఇచ్చామని, 2014–15 నాటి హాజరీ రిజిస్టర్లను పరిశీలించడానికి రావచ్చునని అతనికి అవకాశం ఇచ్చామని తన వివరణలో డీఎస్ పాటిల్ (మాజీ సీపీఐఓ) వివరించారు. 21.06.2017 నాడు కమిషన్ ఉత్తర్వులు వచ్చిన తరువాత పూర్తి సమాచారం ఇచ్చామని చెప్పారు. పై అధికారిని ధిక్కరించినందున శ్రీనివాసులు పైన రూల్ 16 కింద క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు నోటీసు జారీ చేసి దర్యాప్తు చేపట్టామనీ, విచారణలో ఆరోపణలు రుజువై ఇంక్రిమెంట్‌ను మూడేళ్లపాటు నిలిపివేయాలని నిర్ణయించారని వివరించారు. శ్రీనివాసులు మొదటి అప్పీలు తిరస్కరించిన తరువాత అతనిపై దర్యాప్తు పూర్తయి ఇంక్రిమెంట్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారని సీపీఐఓ పాటిల్ చెప్పారు. కేవలం కోర్టులో సవాలు చేయడానికి మాత్రమే ఈ పత్రాలు అడుగుతున్నాడని, కనుక ముందుగా సమాచారం ఇవ్వలేదని వివరిం చారు. సీపీఐఓ మరో వాదం లేవదీశారు. తనపై విచారణకు సంబంధించిన సమాచారం అడుగుతూ ఉంటే అది మూడో వ్యక్తి సమాచారం కాబట్టి సెక్షన్ 11 ప్రకారం తాను సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అయితే సీపీఐఓ అది ఏ మూడోవ్యక్తి సమాచారమో తెలియజేయలేదు. ఆ వ్యక్తిని సంప్రదించారో లేదో తెలియదు. తనపై క్రమశిక్షణా చర్యల వివరాలు అడిగితే అది మూడో వ్యక్తి సమాచారం ఏ విధంగా అవుతుందో చెప్పలేకపోయారు. హాజరీ పట్టిక విచారణకు సంబంధించిన వివరాలు ఇవ్వవలసినవే. ఆ పత్రాలు అతని కోర్టు వివాదానికి అవసరమో కాదో పూర్తిగా తెలుసుకోకుండా, కోర్టుకు కేసును తీసుకువెళ్తాడు కనుక అడిగిన సమాచారం ఇవ్వబోమనడం మరొక తప్పు. మొత్తానికి సమాచారాన్ని అన్యాయంగా నిరాకరించారని తేలింది. అందుకు బాధ్యుడైన సీపీఐఓ డీఎస్ పాటిల్ పైన సమాచార హక్కు చట్టం 20 కింద 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. (CIC/BS/A/2016/ 000955 ఎం. శ్రీనివాసులు వర్సెస్ పోస్టల్ డిపార్ట్ మెంట్. కేసులో 18.1.2018 నాటి ఆదేశం ఆధారంగా). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
ఆ ఆదాయంపై కోడలి హక్కు
విశ్లేషణ వేతనం వలే పింఛను వివరాలు కూడా ఎవ్వరడిగినా ఇవ్వవలసినవే అని సమాచార హక్కు చట్టం నిర్దేశిస్తున్నది. పింఛను మూడో వ్యక్తి సమాచారం అని అనుకుంటే ఆయన అభ్యంతరం ఏమీ లేనపుడు వెల్లడించాల్సిందే. పెళ్లిళ్ల ధోరణులు, తగాదాల అంశంపైన ఈ మధ్య సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహించారు. ప్రేమ పెళ్లికి ముందు ఇద్దరి మధ్య పూర్తి వివరాలు ఒకరికొకరు చెప్పకపోవడంవల్ల వచ్చే సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో వక్తలు తెలియజేశారు. ఈ సమావేశంలో కోర్టుకు వెళ్లకుండా సమస్యలను పరిష్కరించే అంశాల గురించి కూడా చర్చించారు. ఇరువురి మధ్య పూర్తి వివరాల మార్పిడి జరిగితే సమస్యలు రావు. పూర్తి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని బీమా సంస్థకు వివరాలు ఇస్తే తప్ప బీమా పాలసీ ఇవ్వరు. కానీ జీవిత భాగస్వామి విషయంలో ఆరోగ్య వివరాలు చెప్పడానికి నిరాకరిస్తారు. లోపాలుంటే దాస్తారు. నపుంసకుడనే విషయమైతే అసలే చెప్పరు. భర్త, అత్తమామ, ఆడపడుచు వధువును వేధిస్తూ ఉంటారు. తమ లోపాన్ని దాచడానికి క్రూరంగా వ్యవహరిస్తారు. పైకి మంచి వారిలా నటిస్తుంటారు. నాలుగ్గోడలమధ్య నపుంసకత్వం లేదా అర్ధనపుంసకత్వానికి రుజువులు ఉండవు. ఈ విషయం బయటపెడితే, కోడలి శీలం పైన అభాండాలు వేసి తప్పుడు సాక్ష్యాలు తయారు చేస్తుంటారు. ఇవన్నీ నిరోధించాలంటే పెళ్లికిముందే పూర్తి ఆరోగ్య సమాచారాన్ని తెలియజేయడం తప్పనిసరిచేసే స్పష్టమైన చట్టాలు ఉండాలి. వివాదాలు రాగానే కోడలిని ఇంటినుంచి వెళ్లగొడతారు లేదా భర్త విడిగా ఎక్కడో ఉంటాడు. జీవిం చడం కష్టమవుతుంది. వివాహం చేసుకుని వదిలేసిన భర్తలనుంచి జీవనభృతి (మెయింటెనెన్స్) కోరే అధికారం భార్యలకు ఉంది. ఈ కేసుల విచారణలో భార్యాభర్తలు తమ ఆర్థిక స్తోమత గురించి పూర్తి వివరాలు ఇవ్వకపోతే ఎంత జీవనభృతి ఇవ్వడం న్యాయమో చెప్పడం సాధ్యం కాదు. ఆర్టీఐ ఈ సందర్భాలలో విడిగా జీవించే భార్యాభర్తలకు ఉపయోగపడే పరికరంగా మారిపోయింది. మామగారి పెన్షన్ డబ్బు ఎంత, వారి బకాయిల మొత్తం ఎంత తెలియజేయాలని ఒక కోడలు ఆర్టీఐ చట్టం కింద పోస్టల్ శాఖను కోరారు. ఆయన కోడలు హోదాలో తాను సమాచారం కోరుతున్నానని ఆమె వివరించారు. యథాప్రకారం అది మూడో పార్టీ సమాచారమనీ, ఆయన వ్యక్తిగత సమాచారమనీ అంటూ పీఐఓ గారు తిరస్కరించారు. మొదటి అప్పీలులో అధికారి కనీసం ఎందుకు అడుగుతున్నారు, ఇవ్వడం న్యాయమా కాదా అని చూడకుండా తిరస్కరించారు. తానెవరో తన సంబంధం ఏమిటో రుజువు చేసే సాక్ష్యాలు ఇవ్వలేదు కనుక సమాచారం ఇవ్వలేమని అధికారి వివరించారు. మరణించిన వ్యక్తి ఆస్తిపాస్తులను కూతుళ్లు, కొడుకులు సమానంగా స్వీకరించవలసి ఉంటుంది. తరువాత కొడుకు మరణిస్తే, ఆ కొడుక్కు రావలసిన వాటాను ఆ కొడుకు కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ కేసులో కోడలు తన వంతు వాటా కోరే హక్కు కలిగి ఉంది. కనుక మామగారి ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకోవచ్చు. పెన్షన్ నిజానికి మామగారి సొంత ఆస్తి, కోడలు సమాచార హక్కు దరఖాస్తు ద్వారా పెన్షన్‌లో వాటా అడగడానికి వీలుండదు. కేవలం సమాచారం అడుగుతున్నారామె. కనుక ఆ సమాచారం ఇవ్వాల్సిందే. ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రభుత్వాధికారి వేతనం రహస్య వ్యక్తిగత సమాచారం కాదు. పింఛను కూడా వేతనం వంటిదే. ఉద్యోగి సేవలకుగాను విరమణ తరువాత ఇచ్చే ప్రతిఫలం కనుక అదికూడా వ్యక్తిగత సమాచారం కాదు. కనుక ఆ సమాచారం ఇవ్వడం బాధ్యత. (కృష్ణశర్మ వర్సెస్ పోస్టాఫీస్ CIC/POSTS/A-/2017/312187 కేసులో 27.7. 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మరొక కేసులో నిషాబెన్ తన మామగారికి నెలనెలా వచ్చే పెన్షన్ ఎంతో వివరించాలని ఒక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కోరింది. తనకు భర్తకు మధ్యవిభేదాలు వచ్చి విడిగా ఉంటున్నామని, తనకు తన మైనర్ కూతురికి జీవనభృతికోసం కోర్టులో పిటిషన్ వేశానని ఆమె వివరించారు. తన తండ్రి తనపై పూర్తిగా ఆధారపడి ఉన్నారని, కనుక భార్య కోరి నంత జీవనభృతి ఇవ్వలేనని భర్త తన జవాబు దావాలో పేర్కొన్నారు. తండ్రికి పింఛను వస్తుందని ఆయన కొడుకుపైన ఆధారపడి లేరని కోడలు వాది స్తున్నది. అందుకు రుజువుగా మామగారి పింఛను వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద ఆమె కోరుతున్నది. తన కోడలికి తన పింఛను వివరాలు ఇవ్వవచ్చునని మామ తన అంగీకారం తెలిపిన తరువాత కూడా అధికారులు సమాచారం ఇవ్వడం లేదని రెండో అప్పీలులో పేర్కొన్నారు. పింఛను మూడో వ్యక్తి సమాచారం అని అనుకుంటే ఆయన అభ్యంతరం ఏమీ లేనపుడు వెల్లడించాల్సింది. అది వ్యక్తిగత సమాచారం అనుకున్నా, ఒక న్యాయ వివాద పరిష్కారానికి ఉపయోగపడే సమాచారం కనుక ప్రజాప్రయోజనం దృష్ట్యా నైనా ఇవ్వాల్సింది. కోడలికి ఆ సమాచారం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. (నిషాబెన్ వివేక్ భాయ్ భట్ వర్సెస్ పోస్టాఫీస్, CIC/POSTS /A-/2017/180150 కేసులో ఆగస్టు 1, 2017 నాడు ఇచ్చిన తీర్పు ఆధారంగా). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
అబద్ధాలు చెబితే ఎన్నిక చెల్లదు
విశ్లేషణ డిగ్రీల విషయంలో అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదనే ఈ తీర్పు రాజకీయులకు ఒక హెచ్చరిక. ఎన్నిక రద్దు చేయడంతో సరిపోదు. అబద్ధం చెప్పిన నేరానికి జైలుకు పంపాలి, ఎన్నిక ఖర్చునంతా ఆ నేతనుంచి రాబట్టాలి. మనకు నిజం విలువ ఎట్లాగూ తెలియదు, కనీసం అబద్ధం ఖరీదు తెలుసా? డిగ్రీ లేకున్నా ఉన్నట్టు అబద్ధం చెప్పిన ఎంఎల్ఏ (ఎన్సీపీ) మెరియంబం పృథ్వీరాజ్ ఎన్నిక రద్దు చేస్తూ మణిపూర్ హైకోర్టు ప్రకటించింది. మెరి యంబం నామినేషన్లో విద్యా ర్హత గురించి అవాస్తవ ప్రకటన ఉందని ప్రత్యర్థి శరత్ చంద్ర సింగ్ అభ్యంతరం తెలిపినా ఆమోదించారు. పృథ్వీరాజ్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని గువాహటి హైకోర్టులో శరత్చంద్ర పిటిషన్ వేశారు. ఫారం 26లో మైసూర్ యూనివర్సిటీ తనకు ఎంబీఏ డిగ్రీ ఇచ్చిందని ప్రమాణపత్రంలో చెప్పినా ఆ డిగ్రీ లేదన్నారు. అది క్లరి కల్ తప్పనీ, ఎన్నిక రద్దు చేయాల్సిన అవసరం లేదనీ, చదువు విషయంలో పొరబాటు జరిగినంత మాత్రాన ఎన్నిక గణనీయంగా ప్రభావితం కాబోదని ప్రతివాది ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 100 (1)(డి) ప్రకారం ఎన్నికను గణనీయంగా ప్రభా వితం చేసిన అంశం అవాస్తవ ప్రకటన అయితే ఎన్నిక రద్దు చేయాలని కోరే పిటిషన్ దాఖలు చేయవచ్చు. అవాస్తవ ప్రమాణపత్రంతో కూడిన నామినేషన్‌ను ఆమోదించడమే తప్పని, ఆ తప్పుపై ఆధారపడి జరిగిన ఎన్నిక చెల్లదని హైకోర్టు వివరించింది. నామినేషన్ తప్పుడుదనే కారణంగా ఎన్నిక రద్దు చేయడానికి వీల్లేదని, సెక్షన్ 100 కింద గణనీయంగా ప్రభావితం చేసే తప్పు జరిగిందని రుజువైతేనే ఎన్నిక దెబ్బ తింటుందని మొయింరంబం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడీఆర్ (2002(5)ఎస్సీసీ 294), పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2003(4) ఎస్సీసీ399) కిసాన్ శంకర్ కాథోర్ వర్సెస్ అరుణ్ దత్తాత్రేయ సావంత్ 2014(14)ఎస్సీసీ162, రిసర్జెన్స్ ఇండియా వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2014(14) ఎస్సీసీ 189 కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అభ్యర్థి చదువు అర్హతలు తెలుసుకునే హక్కు ఓటరుకు ఉందని, ఆ డిగ్రీ లేకపోతే, ఆ తప్పుడు నామినేషన్‌ను తిరస్కరించాలన్నారు. హరికృష్ణ లాల్ వర్సెస్ బాబూ లాల్ మరాండీ 2003(8) ఎస్సీసీ 613 కేసులో కూడా తప్పుడు డిగ్రీ ఆరోపణతో దాఖలైన నామినేషన్‌ను పనికి రాకుండా చేసే గణనీయమైన ఘనలోపమే అని సుప్రీం కోర్టు తేల్చింది. సెక్షన్ 33 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద సరైన నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. 33ఎ నియ మాన్ని 2002లో సవరణ ద్వారా చట్టంలో చేర్చారు. దీని కింద నేర, ధన, చదువు వివరాలు అదనంగా ప్రమాణ పత్రాల్లో ఇవ్వాలి. గణనీయమైన లోపం లేకపోతే నామి నేషన్‌ను తిరస్కరించరాదని సెక్షన్ 36 నిర్ధారిస్తున్నది. సెక్షన్ 100లో ఎన్నిక రద్దు చేసే కారణాలను వివరిం చారు. (ఎ) గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరి టరీస్ చట్టం 1963 కింద లేదా రాజ్యాంగం కింద ఖాళీ అయిన స్థానం నుంచి ఎన్నికయ్యే అర్హత లేకపోతే, (బి) అభ్యర్థిగానీ, ఆయన అనుమతితో మరెవరైనా గానీ, ఏజంట్ గానీ అవినీతి (కరప్ట్ ప్రాక్టీస్)కి పాల్పడితే (సి) ఏదయినా నామినేషన్‌ను అక్రమంగా తిరస్కరిస్తే, లేదా (డి) ఎన్నికయిన అభ్యర్థి నామినేషన్ గణనీయంగా ఈ కింది కారణాలవల్ల ప్రభావితం అయితే (1) నామినే షన్ను అక్రమంగా అంగీకరించడం, (2) ఎన్నికయిన అభ్యర్థి కోసం అక్రమంగా అవినీతికి పాల్పడినందుకు, (3) అక్రమంగా ఏ ఓటునైనా తీసుకున్నా, తిరస్కరిం చినా, పనికిరాని ఓటును తీసుకున్నా, (4) రాజ్యాంగం లోని లేదా ఈ చట్టంలోని ఏ నియమాన్నయినా ఉత్త ర్వునైనా ఉల్లంఘించినా ఎన్నిక రద్దు చేయవచ్చు. అయితే అభ్యర్థి ఏజంటు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి ఉత్తర్వులకు భిన్నంగా ఎవరైనా అవినీతికి పాల్పడి ఉంటే అప్పుడు ఎన్నిక రద్దు కాబోదు. సెక్షన్ 125 ఎ కింద సెక్షన్ 33ఎ ప్రకారం సమర్పించవలసిన ప్రమాణ పత్రంలో తప్పుడు అంశాలు చేర్చినందుకు ఆరునెలల జైలు లేదా జరిమానా వరకు విధించవచ్చు. 33ఎ కింద చెప్పవలసిన వివరాలు చెప్పకపోయినా నామినేషన్ చెల్లదని కిసాన్ శంకర్ కాథోర్ కేసులో చెప్పారు. రీసర్జెన్స్ ఇండియా కేసులో క్రిమినల్ కేసుల వివరాలు, ఆస్తిపాస్తులు, చదువుల వివరాలలో అవాస్త వాలు చెప్పినా లేదా ఫారంలో వివరాలు చెప్పకుండా గడులను ఖాళీగా వదిలినా చెల్లదన్నారు. ఎంబీఏ అర్హత ఉందనడం క్లరికల్ తప్పిదం అన్న వాదాన్ని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ అనిల్ కుమార్ దవేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఆ గణనీయమైన తప్పువల్ల నామినే షన్, ఎన్నిక చెల్లబోవని తేల్చింది. కానీ ప్రత్యర్థి ఎన్నికైనట్టు ప్రకటించేందుకు నిరాకరించింది. డిగ్రీల విష యంలో అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదనే ఈ తీర్పు రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక. ఎన్నిక రద్దు చేయడంతో సరిపోదు. అబద్ధం చెప్పిన నేరానికి జైలుకు పంపాలి, ఎన్నిక ఖర్చునంతా ఆ అబద్ధపు నేత నుంచి రాబట్టాలి. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ ఈ–మెయిల్: professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్