
అబద్ధాలు చెబితే ఎన్నిక చెల్లదు
విశ్లేషణ
డిగ్రీల విషయంలో అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదనే ఈ తీర్పు రాజకీయులకు ఒక హెచ్చరిక. ఎన్నిక రద్దు చేయడంతో సరిపోదు. అబద్ధం చెప్పిన నేరానికి జైలుకు పంపాలి, ఎన్నిక ఖర్చునంతా ఆ నేతనుంచి రాబట్టాలి.
మనకు నిజం విలువ ఎట్లాగూ తెలియదు, కనీసం అబద్ధం ఖరీదు తెలుసా? డిగ్రీ లేకున్నా ఉన్నట్టు అబద్ధం చెప్పిన ఎంఎల్‌ఏ (ఎన్‌సీపీ) మెరియంబం పృథ్వీరాజ్ ఎన్నిక రద్దు చేస్తూ మణిపూర్ హైకోర్టు ప్రకటించింది. మెరి యంబం నామినేషన్‌లో విద్యా ర్హత గురించి అవాస్తవ ప్రకటన ఉందని ప్రత్యర్థి శరత్ చంద్ర సింగ్ అభ్యంతరం తెలిపినా ఆమోదించారు. పృథ్వీరాజ్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని గువాహటి హైకోర్టులో శరత్‌చంద్ర పిటిషన్ వేశారు. ఫారం 26లో మైసూర్ యూనివర్సిటీ తనకు ఎంబీఏ డిగ్రీ ఇచ్చిందని ప్రమాణపత్రంలో చెప్పినా ఆ డిగ్రీ లేదన్నారు. అది క్లరి కల్ తప్పనీ, ఎన్నిక రద్దు చేయాల్సిన అవసరం లేదనీ, చదువు విషయంలో పొరబాటు జరిగినంత మాత్రాన ఎన్నిక గణనీయంగా ప్రభావితం కాబోదని ప్రతివాది ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 100 (1)(డి) ప్రకారం ఎన్నికను గణనీయంగా ప్రభా వితం చేసిన అంశం అవాస్తవ ప్రకటన అయితే ఎన్నిక రద్దు చేయాలని కోరే పిటిషన్ దాఖలు చేయవచ్చు. అవాస్తవ ప్రమాణపత్రంతో కూడిన నామినేషన్‌ను ఆమోదించడమే తప్పని, ఆ తప్పుపై ఆధారపడి జరిగిన ఎన్నిక చెల్లదని హైకోర్టు వివరించింది.
నామినేషన్ తప్పుడుదనే కారణంగా ఎన్నిక రద్దు చేయడానికి వీల్లేదని, సెక్షన్ 100 కింద గణనీయంగా ప్రభావితం చేసే తప్పు జరిగిందని రుజువైతేనే ఎన్నిక దెబ్బ తింటుందని మొయింరంబం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడీఆర్ (2002(5)ఎస్సీసీ 294), పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2003(4) ఎస్సీసీ399) కిసాన్ శంకర్ కాథోర్ వర్సెస్ అరుణ్ దత్తాత్రేయ సావంత్ 2014(14)ఎస్సీసీ162, రిసర్జెన్స్ ఇండియా వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2014(14) ఎస్సీసీ 189 కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అభ్యర్థి చదువు అర్హతలు తెలుసుకునే హక్కు ఓటరుకు ఉందని, ఆ డిగ్రీ లేకపోతే, ఆ తప్పుడు నామినేషన్‌ను తిరస్కరించాలన్నారు. హరికృష్ణ లాల్ వర్సెస్ బాబూ లాల్ మరాండీ 2003(8) ఎస్సీసీ 613 కేసులో కూడా తప్పుడు డిగ్రీ ఆరోపణతో దాఖలైన నామినేషన్ను పనికి రాకుండా చేసే గణనీయమైన ఘనలోపమే అని సుప్రీం కోర్టు తేల్చింది. సెక్షన్ 33 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద సరైన నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. 33ఎ నియ మాన్ని 2002లో సవరణ ద్వారా చట్టంలో చేర్చారు. దీని కింద నేర, ధన, చదువు వివరాలు అదనంగా ప్రమాణ పత్రాల్లో ఇవ్వాలి. గణనీయమైన లోపం లేకపోతే నామి నేషన్‌ను తిరస్కరించరాదని సెక్షన్ 36 నిర్ధారిస్తున్నది.
సెక్షన్ 100లో ఎన్నిక రద్దు చేసే కారణాలను వివరిం చారు. (ఎ) గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరి టరీస్ చట్టం 1963 కింద లేదా రాజ్యాంగం కింద ఖాళీ అయిన స్థానం నుంచి ఎన్నికయ్యే అర్హత లేకపోతే, (బి) అభ్యర్థిగానీ, ఆయన అనుమతితో మరెవరైనా గానీ, ఏజంట్ గానీ అవినీతి (కరప్ట్ ప్రాక్టీస్)కి పాల్పడితే (సి) ఏదయినా నామినేషన్ను అక్రమంగా తిరస్కరిస్తే, లేదా (డి) ఎన్నికయిన అభ్యర్థి నామినేషన్ గణనీయంగా ఈ కింది కారణాలవల్ల ప్రభావితం అయితే (1) నామినే షన్ను అక్రమంగా అంగీకరించడం, (2) ఎన్నికయిన అభ్యర్థి కోసం అక్రమంగా అవినీతికి పాల్పడినందుకు, (3) అక్రమంగా ఏ ఓటునైనా తీసుకున్నా, తిరస్కరిం చినా, పనికిరాని ఓటును తీసుకున్నా, (4) రాజ్యాంగం లోని లేదా ఈ చట్టంలోని ఏ నియమాన్నయినా ఉత్త ర్వునైనా ఉల్లంఘించినా ఎన్నిక రద్దు చేయవచ్చు. అయితే అభ్యర్థి ఏజంటు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి ఉత్తర్వులకు భిన్నంగా ఎవరైనా అవినీతికి పాల్పడి ఉంటే అప్పుడు ఎన్నిక రద్దు కాబోదు. సెక్షన్ 125 ఎ కింద సెక్షన్ 33ఎ ప్రకారం సమర్పించవలసిన ప్రమాణ పత్రంలో తప్పుడు అంశాలు చేర్చినందుకు ఆరునెలల జైలు లేదా జరిమానా వరకు విధించవచ్చు.
33ఎ కింద చెప్పవలసిన వివరాలు చెప్పకపోయినా నామినేషన్ చెల్లదని కిసాన్ శంకర్ కాథోర్ కేసులో చెప్పారు. రీసర్జెన్స్ ఇండియా కేసులో క్రిమినల్ కేసుల వివరాలు, ఆస్తిపాస్తులు, చదువుల వివరాలలో అవాస్త వాలు చెప్పినా లేదా ఫారంలో వివరాలు చెప్పకుండా గడులను ఖాళీగా వదిలినా చెల్లదన్నారు.
ఎంబీఏ అర్హత ఉందనడం క్లరికల్ తప్పిదం అన్న వాదాన్ని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ అనిల్ కుమార్ దవేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఆ గణనీయమైన తప్పువల్ల నామినే షన్, ఎన్నిక చెల్లబోవని తేల్చింది. కానీ ప్రత్యర్థి ఎన్నికైనట్టు ప్రకటించేందుకు నిరాకరించింది. డిగ్రీల విష యంలో అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదనే ఈ తీర్పు రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక. ఎన్నిక రద్దు చేయడంతో సరిపోదు. అబద్ధం చెప్పిన నేరానికి జైలుకు పంపాలి, ఎన్నిక ఖర్చునంతా ఆ అబద్ధపు నేత నుంచి రాబట్టాలి.
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
ఈ–మెయిల్: professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్