అలాంటి ప్రశ్నలు వద్దు: ఆర్బీఐ
అలాంటి ప్రశ్నలు వద్దు: ఆర్బీఐ
Published Sun, Mar 26 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM
న్యూఢిల్లీ: సాక్షాత్తూ ప్రధానమంత్రి హామీ ఇచ్చినా పాత నోట్లను మార్చి 31 వరకు ఎందుకు స్వీకరించడం లేదంటూ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆర్‌బీఐ తిరస్కరించింది. అసలు ఇది సమాచారం కిందికి రాదంటూ చేతులు దులుపుకుంది.
పెద్దనోట్లను రద్దు చేస్తూ గత నవంబరు ఎనిమిదిన ప్రకటన చేసిన ప్రధాన నరేంద్ర మోదీ, ఈ ఏడాది మార్చి 31 దాకా పాతనోట్లను మార్చుకోవచ్చని ప్రకటించడం తెలిసిందే. అయితే మార్చి 31కి బదులు, గత ఏడాది డిసెంబరు 30 వరకే నోట్ల మార్పిడికి అనుమతి ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆర్బీఐని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నిస్తే జవాబు రావడం లేదు. కారణమడిగితే ఈ ప్రశ్న ‘సమాచారం’ పరిధిలోకి రాదని వివరణ ఇచ్చింది. అయితే మార్చి 31 వరకు ప్రవాస భారతీయులు పాతనోట్లను మార్చుకోవచ్చని తెలిపింది.
అధికారపక్షం బీజేపీకి ఎన్‌ఐఆర్‌ల నుంచి భారీ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. పాతనోట్ల మార్పిడికి గడువు కుదించడంపై సుప్రీంకోర్టులోనూ కేసు నడుస్తోంది. దీనిపై విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహ్‌తగీ మాట్లాడుతూ ప్రధాని ప్రకటన మేరకు చట్టం చేస్తామని తెలిపారు. నోట్లమార్పిడికి ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే అవకాశం ఇవ్వడం ఏంటని అడిగిన ప్రశ్నకు కూడా ఆర్బీఐ విచిత్రమైన సమాధానం ఇచ్చింది. ఇలాంటి ప్రశ్నలు దేశ ఆర్థికప్రయోజనాలకు వ్యతిరేకమని ఆర్బీఐ కేంద్ర ప్రజాసంబంధాల అధికారి సుమన్ రే తెలిపారు. ప్రభుత్వ సంస్థ దగ్గరున్న ప్రతి ఒక్కటీ సమాచారం పరిధిలోకే వస్తుందని సమాచార హక్కు చట్టం నిర్దేశిస్తోంది.
అంటే రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ–మెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, లాగ్‌బుక్స్, కాంట్రాక్టులు, నివేదికలు, నమూనాలు వంటి అన్నింటినీ సమాచారంగా పరిగణించాలని స్పష్టం చేసింది. నోట్ల రద్దుకు ముందు ఆర్థికమంత్రి వంటి నిపుణుల సలహాలు తీసుకున్నారా ? అనే ప్రశ్నకు కూడా ఆర్బీఐ జవాబు ఇవ్వలేదు. నోట్లరద్దు కోసం ఉద్దేశించిన సమాచారం వివరాలనూ ఇవ్వలేదు. సమాచార హక్కు చట్టం ప్రకారం నోట్లరద్దునకు సంబంధించిన అన్ని వివరాలనూ ఆర్బీఐ ఇవ్వాల్సిందేనని కేంద్ర సమాచారశాఖ మాజీ కమిషనర్ శైలేశ్ గాంధీ స్పష్టం చేశారు.
నోట్ల రద్దు ప్రభావంపై ఆడిట్!
పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై ఆడిట్ చేసే యోచనలో ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) శశికాంత్ శర్మ తెలిపారు. అలాగే ప్రభుత్వ పన్నుల రాబడులపైనా దీని ప్రభావాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆయన మాట్లాడుతూ.. ‘పెద్ద నోట్ల రద్దు ప్రభావానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆడిట్ నిర్వహించాలని యోచిస్తున్నాం. ప్రధానంగా పన్ను రాబడులపై నోట్ల రద్దు ప్రభావంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం..’ అని శశికాంత్ శర్మ పేర్కొన్నారు. కాగా, నోట్ల ముద్రణ వ్యయం, ఆర్బీఐ డివిడెండ్ చెల్లింపులు, బ్యాంక్ లావాదేవీల సమాచారం తదితరాలపై కాగ్ దృష్టి పెట్టే అవకాశముందని నిఫుణులు చెబుతున్నారు.
ఒకే ఖాతాలో రూ. 246 కోట్లు డిపాజిట్
చెన్నై: నోట్ల రద్దు తర్వాత తమిళనాడు, పుదుచ్చేరీలలోని వివిధ బ్యాంకుల్లో 200 మందికిపైగా వ్యక్తులతోపాటు సంస్థలు దాదాపు రూ. 600 కోట్ల మేర కరెన్సీని జమ చేశాయి. పాత పెద్ద నోట్లను గతేడాది నవంబర్, ఎనిమిదో తేదీన కేంద్రం రద్దు చేయడం తెలిసిందే. ఎక్కువ శాతం డిపాజిట్లు తమిళనాడులోని పల్లెప్రాంతాలతోపాటు మరికొన్ని రాజధాని చెన్నైలోనూ జరిగాయి. ఈ విషయాన్ని ఆదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. నమ్మక్కల్ జిల్లా తిరుచెంగోడ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ)లో రూ. 246 కోట్ల పాత నోట్లను జమ చేసినట్టు గుర్తించారు. తొలుత అతడు ఈ విషయాన్ని దాచాడు. అయితే ఆ తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ కింద 45 శాతం మొత్తం చెల్లించేందుకు అంగీకరించాడు. ఇలా జమ అయిన మొత్తం రూ. 1,000 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
85 లక్షల అనుమానాస్పద ఖాతాలు
రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాలను జమ చేసిన ఖాతాల వివరాలను తమకు పంపాలంటూ డిసెంబర్, 31వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను ఆదాయపన్ను శాఖ ఆదేశించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా 85 లక్షల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐటీ శాఖ వివరించింది.
నేపాలీలకూ తప్పని ఇబ్బందులు
కఠ్మాండు: నేపాల్ జాతీయులు గరిష్టంగా రూ.4,500 వరకు మాత్రమే పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ ఆదివారం ప్రకటించింది. ఇందుకు వారం మాత్రమే గడువు ఇస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ నిర్ణయంపై నేపాలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌పౌరులు రూ.25 వేల వరకు పాత నోట్లను మార్పిడి చేసుకోవచ్చని ఆర్‌బీఐ ఇది వరకు ప్రకటించింది. కఠ్మాండులో ఆదివారం ఆర్‌బీఐ, నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అధికారుల మధ్య జరిగిన సమావేశం తరువాత ఈ ప్రకటన వెలువడింది. ఎన్‌ఆర్‌బీ అధికారులు కూడా ఆర్‌బీఐ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు.
Advertisement
Advertisement