ఆ రహస్యం చెప్పకూడదు: ఆర్‌బీఐ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో గుట్టు బయటపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిరాకరించింది. ఇంత పెద్ద నిర్ణయం ప్రకటించే ముందు ఆర్ధికశాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యంగానీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీగానీ ఆర్‌బీఐని సంప్రదించారా..? వారి వ్యూహాలు వివరించారా అనే ప్రశ్నకు బదులు చెప్పనంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి ఆర్‌బీఐని కోరగా ఆయన అడిగిన ప్రశ్న ఆ చట్టం పరిధిలోకి రాదని, కోరిన సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని బదులిచ్చింది.
పెద్ద నోట్ల రద్దును ప్రకటించే సమయంలో అసలు కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐని తన పరిగణనలోకి తీసుకోలేదని, తమకు నచ్చిన అభ్యర్థిని ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమించినందున తమ నిర్ణయానికి ఆయన అడ్డుచెప్పే అవకాశంలేదని కేంద్రం భావించి స్వతహాగా ఈ నిర్ణయం తీసుకుందని పలువురు ఆరోపించారు. ఆర్‌బీఐ వద్దని చెప్పినా ఈ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేశారని విపక్ష నాయకులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసలు కేంద్రం పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆర్‌బీఐని సంప్రదించిందా లేదా తెలియజేయాలంటూ ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా ఓ దరఖాస్తును ఆర్‌బీఐకి, మరోకటి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించగా రెండింటి నుంచి అతడికి సమాధానం రాలేదు. అయితే, ఆ వ్యక్తి కోరిన సమాచారం ఆర్టీఐ పరిధిలోకి రాదంటూ వివరణ మాత్రం ఇచ్చారు.