డీమోనిటైజేషన్‌పై చర్చల వివరాలు చెప్పలేం
ఆర్‌టీఐ దరఖాస్తుకు ఆర్‌బీఐ స్పందన
న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్‌ను ప్రకటించే ముందు ఆ విషయమై ఆర్‌బీఐ బోర్డులో జరిగిన చర్చల వివరాలను వెల్లడించడానికి రిజర్వ్ బ్యాంకు నిరాకరించింది. నవంబర్ 8న ప్రధాని రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆర్‌బీఐ జరిపిన చర్చల వివరాలు కావాలంటూ వెంకటేష్ నాయక్ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దరఖాస్తు చేశారు. అయితే, సెక్షన్ 8(1)ఏ కింద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశ వివరాలను వెల్లడించలేమంటూ ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించే సమాచారం వెల్లడించకుండా సెక్షన్ 8(1)ఏ అవకాశం కల్పిస్తోంది. దీనిపై వెంకటేష్ నాయక్ స్పందిస్తూ.. ‘‘డీమోనిటైజేషన్ నిర్ణయం వెల్లడించడానికి ముందు గోప్యత పాటించడం అర్థం చేసుకోతగినది. అయితే, కోట్లాది మంది నగదు కొరతతో ఇక్కట్లు పడుతుంటే, ఈ గోప్యత కొనసాగించడం ఎందుకో అర్థం కావడం లేదు’’ అని అన్నారు. ఈ సమాచారం కోసం మళ్లీ ప్రయత్నిస్తానని చెప్పారు.