నకిలీ కరెన్సీ డిపాజిట్లపై సమాచారంలేదు: ఆర్బీఐ
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతర పరిణామాలతో అప్రతిష్టపాలైన రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా మరో పిల్లిమొగ్గ వేసింది. నోట్ల రద్దు అనంతరం, అంటే నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత రూ.1000, రూ.500 నోట్లలో నకిలీ కరెన్సీని గుర్తించారా? ఎంత మొత్తంలో నకిలీ కరెన్సీ బ్యాంకులకు చేరింది? అనే ప్రశ్నలకు ఆర్బీఐ దిమ్మతిరిగిపోయే సమాధానాలు చెప్పింది.
సమాచార హక్కు చట్టం ద్వారా ముంబైకి చెందిన అనిల్ గల్గాని అనే కార్యకర్త అడిగి ప్రశ్నలకు మంగళవారం బదులిచ్చిన ఆర్బీఐ.. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన నకిలీ నోట్ల వివరాలు, వాటికి సంబంధించిన సమాచారమేదీ తన దగ్గర లేదని పేర్కొంది. పాతనోట్లు డిపాజిట్ చేసే క్రమంలో భారీగా నకిలీ కరెన్సీ బ్యాంకులకు చేరిందనే అనుమానాల నేపథ్యంలో అనిల్ ఆర్బీఐ నుంచి సమాచారాన్ని కోరాడు.
అంతేకాదు, నోట్ల రద్దు ప్రకటనపైగానీ, దానికి సంబంధించిన ఇతర ప్రశ్నలకుగానీ సమాధానాలు చెప్పబోమని ఆర్బీఐ స్పష్టం చేసింది. అటు ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఇదే రకమైన సమాధానం చెప్పింది. ‘నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తూ నవంబర్8న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. నకిలీ కరెన్సీ, నల్లధనం అరికట్టేందుకే ఈ చర్య చేపట్టామని ఉద్ఘాటించారు. కానీ ఇప్పుడు ఆర్బీఐ నకిలీ కరెన్సీ వివరాలే లేవంటోంది’అని ఆర్టీఐ కార్యకర్త అనిల్ వాపోయారు.