‘నోట్ల రద్దు’ వివరాలివ్వలేం : ఆర్‌బీఐ
న్యూఢిల్లీ : దేశంలో 500, 1000 నోట్లను రద్దు చేసిన ఆరు నెలల తర్వాత కూడా వాటి వివరాలను బహిర్గతం చేయడానికి రిజర్వు బ్యాంకు నిరాకరించింది. దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో రద్దయిన నోట్ల వివరాలను ఇవ్వలేమని తేల్చిచెప్పింది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి జరిగిన సమావేశం వివరాలివ్వాలను వెల్లడించాలని కోరుతూ పీటీఐ విలేకరి ఒకరు దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు ఆర్‌బీఐ ఇలా స్పందించింది. నోట్ల రద్దుపై పీఎంఓ, ఆర్థిక శాఖలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తర కాపీలను కూడా దరఖాస్తుదారుడు కోరారు.
‘నోట్ల రద్దుకు ముందు జరిపిన పరిశోధన, సర్వేలు, అభిప్రాయ సేకరణకు సంబంధించిన కీలక సమాచారాన్ని దరఖాస్తుదారుడు కోరాడు. అలాంటి వివరాలను వెల్లడించడం దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రమాదకరం’ అని ఆర్‌బీఐ పేర్కొంది. భవిష్యత్తులో ప్రభుత్వం రూపొందించే ఆర్థిక, ద్రవ్య విధానాలకు ఇది ప్రతిబంధకంగా మారొచ్చని తెలిపింది. ఈ సమాచారాన్ని వెల్లడించకుండా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లోని సెక‌్షన్ 8(1)(ఏ) మినహాయింపు ఇస్తుందని పేర్కొంటూ దరఖాస్తును తోసిపుచ్చింది.