
నిరుద్యోగి కష్టాలపై ఆర్టీఐ
విశ్లేషణ
ఉద్యోగానికి ఎంపిక కాని వారికి కూడా ఎందుకు ఎంపిక కాలేదో వివరించే బాధ్యత ప్రభుత్వ అధికార సంస్థలపైన ఉంటుంది. ఎవరు ఎందుకు ఎంపికయ్యారో మరికొందరిని తిరస్కరించడానికి కారణాలు ఏవో ప్రజలకి వివరించాలి.
ఆర్టీఐ కింద సమాచారం నిరాకరించడానికి అధికారులు అనే కరకాల యుక్తులు పన్నుతుం టారు. సమాచార హక్కు చట్టం కేవలం సమాచారం కోసమే కాని సమస్యల పరి ష్కారానికి కాదనీ, మీ బాధల నివారణ జరగకపోతే అది సమాచార సమస్య కాదని అంటూ ఉంటారు. మొదటి అప్పీలులో సీనియర్ అధికారి న్యాయంగా వ్యవహరించాలని చట్టం ఉద్దేశ్యం. కింద స్థాయిలో సీపీఐఓ ఏది రాస్తే అది ఆమోదించడం కాదు. వారు సమస్య గురించి చెబుతున్నారు. ఆర్టీఐ కింద దానికి పరిష్కారం లేదంటారు. సమాచారం అడిగిన వ్యక్తి విధిలేక సమాచార కమిషన్ ముందుకు రెండో అప్పీలు వేయకతప్పని పరిస్థితి కల్పిస్తారు.
ఒక యువ నిరుద్యోగి ఇ. సామినాథన్ పోస్టాఫీసు పెట్టిన కష్టాలు కమిషన్ ముందు ఏకరువు పెట్టాడు. అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. మరో ఇద్దరికి ఉద్యోగం ఇచ్చారు. వారు చేరి పని చేస్తున్నారు కూడా. తన ఒరి జినల్ సర్టిఫికెట్లయినా తనకు వాపస్ ఇవ్వాలని కోరాడు. అవీ ఇవ్వలేదు. లంచం ఇవ్వకపోవడం వల్లనే తనకు ఉద్యోగం ఇవ్వలేదని, తన ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా అందుకోసమే ఇవ్వలేదని ఆరోపించాడు. తన విద్యా సర్టిఫికెట్లు ఇవ్వనందున కనీసం పై చదువులకు ప్రయత్నిం చడం కూడా సాధ్యం కావడం లేదని వివరించాడు.
అసలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల్లో చేరితే ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించే పేరుమీద వాటిని ఇవ్వకుండా స్వాధీనంలో ఉంచుకునేందుకు అధికారం ఎక్కడినుంచి వచ్చింది, ఆ నియమాలేమిటి, అదేం విధానం, దాన్ని ఎవరు రూపొందించారు. అభ్యర్థులనుంచి ఏ తేదీన ఈవిధంగా సర్టిఫికెట్లు సేకరించారు, సరిచూడడానికి ఎవరికి ఏ తేదీన పంపారు, అవి పరిశీలన తరువాత ఎప్పుడు అంబత్తూర్ సబ్ డివిజన్, అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు తిరిగి పంపారు అనే ప్రశ్నలకు సమాధానం కోరుతూ, పరిశీలన ఫలితాలు వివరిస్తూ పంపిన నివేదికల ప్రతులు, వాటికి సంబంధించిన ఫైల్ నోట్స్ ఇవ్వాలని ఆర్టీఐ కింద ఇ సామినాథన్ అడిగారు.
నియామకాల విధాన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది కనుక అడిగిన సమాచారం ఇవ్వలేం అని అధికారి జవాబు ఇచ్చాడు. కోలతూర్‌లో నియామకాలు ఇంకా ముగియ లేదని వాదించారు. నియామకాల ప్రక్రియ ముగిసేదాకా సమాచారం ఇవ్వకూడదనే నియమం ఆర్టీఐ చట్టంలో ఎక్కడా లేదు. కాని సమస్య పరిష్కారం గురించి కోరే నియమం చట్టంలో లేదని అంటాడు సీపీఐఓ. ఇక మొదటి అప్పీలులో పై అధికారి గుడ్డిగా కింది జవాబును సమర్థించారు.
అసలు నియామకాల ప్రక్రియ మొత్తం ముగిసి పోయి ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారని, కమిషన్‌కు అబద్ధం చెబుతున్నారని సామినాథన్ గట్టిగా వాదిం చారు. అధికారి దగ్గర జవాబు లేదు. సెక్షన్ 18(1) ఆర్టీఐ చట్టం ప్రకారం సమాచారం నిరోధించడానికి ప్రయత్నాలు, కుట్రలు జరిగితే దానిపైన ఫిర్యాదుగా స్వీకరించి కమిషన్ విచారణ చేయించే అవకాశం ఉంది. సర్టిఫికెట్ల నిలిపివేత, సమాచార నిరాకరణ, అవాస్తవాలు చెప్పడం వంటి పనులు చేశారనే ఆరోపణలపైన వెంటనే విచారణ జరిపించాలని, ఒక నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ తమిళనాడు ఛీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్‌ను ఆదేశించింది. సమాచారం ఇవ్వని కారణంగా జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలపాలని తాంబరం పోస్టాఫీస్ సూపరింటెండెంట్ నీలకృష్ణ, సీపీఐఓ కృష్ణమూర్తి కారణాలు వివరించాలని ఈ ఇద్దరు అధికారులమీద క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని ఎందుకు సిఫార్సు చేయకూడదో కూడా వివరించాలని కమిషన్ నోటీసు జారీ చేసింది.
కానీ ఉద్యోగానికి ఎంపిక కాని వారికి కూడా ఎందుకు ఎంపిక కాలేదో వివరించే బాధ్యత ప్రభుత్వ అధికార సంస్థలపైన ఉంటుంది. వారికే కాదు సాధారణ ప్రజలకు కూడా ఎవరు ఎందుకు ఎంపికయ్యారో మరి కొందరిని తిరస్కరించడానికి కారణాలు ఏవో వివరించాలి. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థుల జాబితా, వారికి వచ్చిన మార్కులు, వారి అర్హతలు, అనుభవం వంటి వివరాలు ఇస్తూ పోల్చినపుడు ఎంపికైన వారికి ఎంపిక కాని వారికి మధ్య తేడాలు గమనించే విధంగా పట్టికలు తయారు చేస్తారు. వాటి ప్రతులు అడిగిన వారికి ఇవ్వాలి. సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసే నోడల్ ఏజన్సీ అయిన ఉద్యోగులు శిక్షణ మంత్రిత్వ శాఖ ఒక ఆఫీసు మెమొరాండం జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వివరాలన్నీ ప్రతి ప్రభుత్వ శాఖ తమంత తామే ప్రకటించాలని ఆ మెమొరాండంలో ఆదేశించింది.
ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సమస్యలు, బాధలు, ఫిర్యాదులు ఉన్నాయంటే ఆ సంస్థ పాలనా నిర్వహణలో లోపాలున్నట్టే. ఆ లోపాలను సరిచేసుకుంటే తప్ప సుపరిపాలన సాధ్యం కాదు. సుపరిపాలనకోసమే ఆర్టీఐ అని అర్థం చేసుకోవాలి. (ఇ.సామినాథన్ వర్సస్ పోస్టాఫీస్ కేసు CIC/ POSTS/A-/2017/1358 26లో ఆగస్టు 16న ఇచ్చిన సీఐసీ ఆదేశం ఆధారంగా).
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com