ఏపీలో వేగంగా ఆర్టీఐ అప్పీళ్ల పరిష్కారం | Fast resolution of RTI appeals in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో వేగంగా ఆర్టీఐ అప్పీళ్ల పరిష్కారం

Published Mon, Nov 7 2022 4:01 AM | Last Updated on Mon, Nov 7 2022 4:01 AM

Fast resolution of RTI appeals in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో సమాచార కమిషన్‌కు వచ్చే అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌ వేగంగా స్పందిస్తున్నట్లు ‘భారతదేశ సమాచార కమిషన్‌ల పనితీరు 2021–22’ నివేదిక స్పష్టం చేసింది. కేరళలో ఒక ఫిర్యాదును పరిష్కరించడానికి 15 నెలలు, కర్ణాటకలో 14 నెలలు, తెలంగాణలో ఏడాది సమయం పడుతున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేవలం 4 నెలల్లోనే పరిష్కరిస్తున్నట్లు వివరించింది. వివిధ రాష్ట్రాల్లో కమిషన్‌లో పోస్టులు భర్తీ చేయకపోవడం, కమిషనర్లు కేసుల పరిష్కారంలో లక్ష్యాలను నిర్దేశించుకోకపోవడం ఆలస్యానికి కారణంగా పేర్కొంది.

కర్ణాటక సమాచార కమిషన్‌లో ఈ ఏడాది జూన్‌ 30 నాటికి అత్యధికంగా ఫిర్యాదులు, అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, తమిళనాడులో సమాచార చట్టం కింద కోరిన సమాచారాన్ని అందించట్లేదని చెప్పింది. ఆర్టీఐకి వచ్చిన కేసుల్లో బ్యాక్‌లాగ్, నెలవారీ డిస్పోజల్‌ రేట్‌ను ఉపయోగించి ఢిల్లీకి చెందిన సిటిజన్స్‌ గ్రూప్, సతార్క్‌ నాగరిక్‌ సంగతన్‌ (ఎస్‌ఎన్‌ఎస్‌) బృందం ఈ ఏడాది జూలై 1న అప్పీళ్ల పరిష్కారాల సమయాన్ని లెక్కించింది.

2022 జూన్‌ 30 నాటికి దేశ వ్యాప్తంగా 26 సమాచార కమిషన్లలో 3,14,323 అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో కర్ణాటకలో 30,358, తెలంగాణలో 8,902, కేరళలో 6,360, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 2,814 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. 

జరిమానాల్లో కర్ణాటక టాప్‌ 
కర్ణాటకలో 2021 జూన్‌ 1 నుంచి 2022 జూన్‌ 30 మధ్య అత్యధిక అప్పీళ్లు నమోదు, పరిష్కారం పొందాయి. ఇక్కడ 26,694 అప్పీళ్లు వస్తే.. 25,710 కేసులను పరిష్కరించారు. తెలంగాణలో 7,169 కేసులకు గానూ 9,267 (గత ఏడాది పెండింగ్‌ కలిపి) అప్పీళ్లను, ఏపీలో 6,044 కేసులు నమోదవగా, 8,055(పెండింగ్‌తో కలిపి) డిస్పోజ్‌ అయ్యాయి. నిర్దిష్ట సమయానికి సమాచారం ఇవ్వకపోవడం, కావాలని జాప్యం చేయడం వంటి కారణాలతో కర్ణాటక దేశంలోనే అత్యధికంగా 1,265 కేసుల్లో రూ.1.04 కోట్లు జరిమానాలు విధించింది.

కేరళ 51 కేసుల్లో రూ.2.75 లక్షలు, తెలంగాణ 52 కేసుల్లో రూ.2 లక్షలు, ఏపీ 9 కేసుల్లో రూ.55 వేలు జరిమానా విధించాయి. మధ్యప్రదేశ్‌లో రూ.47.50 లక్షలు, హరియాణా రూ.38.81 లక్షలు పెనాల్టీ విధించాయి. అయితే, సమాచారం ఇవ్వడంలో జాప్యానికి జరిమానాలు విధించడానికి అర్హత ఉన్నప్పటికీ, చాలా తక్కువ కేసుల్లో మాత్రమే పెనాల్టీ వేశారని పేర్కొనడం గమనార్హం.  

ఏపీలో కమిషన్‌కు జవసత్వాలు 
రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం అమలు, సమాచార కమిషన్‌ నియామకంపై గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విభజన అనంతరం 2014 నుంచి 2017 వరకు సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. ఆ తర్వాత మొక్కుబడిగా నలుగురు కమిషనర్లను నియమించి చేతులు దులిపేసుకుంది. ఇక్కడ కమిషన్‌ ఉన్నప్పటికీ సరైన మౌలిక వసతులు లేక 2019 వరకు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించలేక ఇబ్బందులు ఎదుర్కొంది.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సమాచార కమిషన్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చింది. అప్పటివరకు ఉన్న నలుగురు కమిషనర్లకు తోడు కొత్తగా మరో నలుగురిని నియమించి కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టింది. ఇటీవల ఇద్దరు కమిషనర్లు పదవీ విరమణ చేయగా.. ఆ పోస్టులను సైతం వెంటనే భర్తీ చేసింది. తద్వారా కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. వేగంగా పరిష్కరించేందుకు వీలు కల్పించింది.

ప్రభుత్వ ఆఫీసుల్లో ఆర్టీఐ డే!
రాష్ట్రంలో పూర్తిస్థాయిలో సమాచార కమిషన్‌ ఉండటంతో ఆర్టీఐపై వచ్చే అప్పీళ్లను వేగంగా పరిష్కరిస్తున్నాం. ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించేలా ఆర్టీఐ వారోత్సవాలను నిర్వహించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి నెల మూడవ శుక్రవారాన్ని ఆర్టీఐ డేగా ప్రకటించింది. ఫలితంగా క్షేత్ర స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషన్‌ను బలోపేతం చేయడం సంతోషంగా ఉంది. 
– ఆర్‌.శ్రీనివాసరావు, చీఫ్‌ కమిషనర్‌ (ఇన్‌చార్జి) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement