జయ వీలునామా రాశారా? ఆస్తి ఏం కానుంది?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగతంగా వీలునామా రాశారంటూ అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయమై ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా స్పష్టత వచ్చింది. జయలలిత ఎలాంటి వీలునామా రాసినట్టు అధికారికంగా నమోదు కాలేదని తాజాగా ఆర్టీఐ దరఖాస్తుకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
ఇటీవల జయలలిత వీలునామా గురించి సమాచారం తెలుపాలంటూ సమాచార కార్యకర్త ఎస్ భాస్కరన్ తమిళనాడు వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ (సీటీడీఆర్)కు ఆర్టీఐ దరఖాస్తు చేశారు. అధికారికంగా వీలునామాల నమోదును సీటీడీఆర్ చేపడుతుంది. ఈ నేపథ్యంలో సీటీడీఆర్ స్పందిస్తూ జయలలిత వీలునామా గురించి ఎలాంటి పత్రాలుగానీ, సమాచారంగానీ తమ వద్ద లేదని తెలియజేసింది.
గత ఏడాది డిసెంబర్ 5న జయలలిత మరణించినప్పటి నుంచి ఆమె చట్టబద్ధ వారసుడు ఎవరు? పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయం సహా ఆమె ఆస్తులు ఎవరి పరం అవుతాయనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జయలలిత పేరిట సుమారు. రూ. 113.72 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తన వారసుడి గురించి, తన ఆస్తులు ఎవరికి చెందాలనే దాని గురించి జయలలిత వీలునామా రాసినట్టు గతంలో కథనాలు వచ్చాయి. అయితే, జయలలిత వీలునామా రాసినట్టు తమకు తెలియదని ఆమె వ్యక్తిగత లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించిన అన్నాడీఎంకే న్యాయవాదులు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం కూడా ఇలాంటి సమాచారమే ఇవ్వడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయనే మిస్టరీ కొనసాగుతూనే ఉంది.