ఎడతెగని ఊహాగానాలు, నిత్యకృత్యంగా మారిన వాయిదాలు, విమర్శలు, నిట్టూర్పులు వెరసి ఐదేళ్ల తరువాత అమ్మ మరణంపై ఎట్టకేలకూ నివేదిక సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విచారణ కమిషన్ సమగ్ర వివరాలను సమర్పించింది. ఆ నివేదికలో ఏం ఉందోననే ఉత్కంఠ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. జయలలిత మృతి కేసులో ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని గతంలోనే సీఎం స్టాలిన్ వెల్లడించిన విషయం తెలిసిందే.
సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జె.జయలలిత మృతి కేసులో విచారణ ముగిసింది. వాయిదాల పర్వంతో ఐదేళ్ల పాటూ సాగిన విచారణలో వెలుగు చూసిన అంశాలతో ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదిక సిద్ధం చేసింది. దీనిని శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆర్ముగ స్వామి సమర్పించారు. 600 పేజీలతో ఈ నివేదిక రూపొందింది.
నేపథ్యం ఇదీ..
2016 డిసెంబర్ 5న అప్పటి సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్ 24న హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్‌ను ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీ నుంచి∙విచారణను ఆర్ముగ స్వామి కమిషన్ ప్రారంభించింది. ఐదేళ్ల పాటుగా సాగిన విచారణకు అనేక అడ్డంకులు తప్పలేదు.
అపోలో రూపంలో..
రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణలో తమ వైద్యులు తెలియజేస్తున్న అంశాలు, వివరాలు బయటకు రావడం, అవన్నీ కొత్త వాదనలకు దారి తీయడంతో అపోలో యాజమాన్యం కోర్టు తలుపు తట్టింది. తమను ప్రత్యేకంగా విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అపోలో యాజమాన్యం సవాలు చేసింది. ఈ పరిణామాలతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది.
గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించాల్సి వచ్చింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగియడం, ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్ వైద్యులు రంగంలోకి దిగడంతో మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా ఎయిమ్స్ వైద్య బృందం సహకారంతో ఆర్ముగ స్వామి కమిషన్ వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకుంది. విచారణను వేగవంతం చేసింది.
తొలి విచారణ నాటి నుంచి చివరి వరకు ఈ కమిషన్ పదవీ కాలాన్ని 14 సార్లు పొడిగించాల్సిన పరిస్థితి పాలకులకు ఏర్పడింది. ఈ కేసులో 159 మందిని విచారించారు. 8 మంది వద్ద లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ కేసులో తొలి విచారణ డాక్టర్ శరవణన్‌తో మొదలు కాగా, చివరగా అన్నాడీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో ముగించారు.
చదవండి: 14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు!
నివేదికలో మిస్టరీ...
విచారణను ముగించిన ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదికను శనివారం ఉదయం సీఎం ఎంకే స్టాలిన్‌కు సమర్పించింది. సచివాలయంలో ఈ నివేదికను స్వయంగా స్టాలిన్‌కు ఆర్ముగ స్వామి అందజేశారు. 608 పేజీలతో నివేదికను సిద్ధం చేసినా, 600 పేజీలలో మరణం కేసు విచారణ సమగ్ర వివరాలను పొందుపరిచారు. తొలుత 550 పేజీల్లో వివరాలను ముగించేందుకు నిర్ణయించినా, ఎయిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాలతో అదనంగా మరో 50 పేజీలు చేర్చారు. తమిళం, ఆంగ్ల భాషల్లో రెండు రకాల నివేదికను సమర్పించారు.
ఇందులో జయలలితను పోయెస్ గార్డెన్ నుంచి అపోలో ఆస్పత్రికి తరలించడం, అక్కడ అందించిన వైద్య చికిత్సల వివరాలను పేర్కొన్నారు. అపోలో వైద్యుల చికిత్స సరైన మార్గంలోనే జరిగినట్లుగా పొందు పరిచినట్లు భావిస్తున్నారు. అలాగే, అదనంగా మరో 200 పేజీల నివేదికలో ముఖ్యాంశాలను సీఎంకు సమర్పించారు. ప్రధాన నివేదికలోని కొన్ని కీలక వివరాలను ముఖ్యాంశాలుగా ఇందులో పేర్కొని ఉండటం గమనార్హం. ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు.
ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. అలాగే, ఈనెల 29వ తేదీన మంత్రి వర్గం భేటీ కావాలని నిర్ణయించారు. అందులో ప్రత్యేక అంశంగా ఈ నివేదిక గురించి చర్చించి మిస్టరీని నిగ్గు తేల్చబోతున్నారు. ఆపై తదుపరి చర్యలకు సిద్ధం కాబోతున్నారు. కాగా జయలలిత మరణం వెనుక ఎవరైనా ఉండివుంటే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయో అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే శ్రేణులతో పాటూ రాష్ట్ర ప్రజల్లోనూ నెలకొంది.
శశికళ లిఖిత పూర్వకంగా..
దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ స్వయంగా కాకుండా లిఖిత పూర్వకంగా ఈ కమిషన్‌కు వివరాలను సమర్పించారు. ఆమె తరపున న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ మాత్రం విచారణకు హాజరయ్యారు. అలాగే, చిన్నమ్మ వదిన ఇలవరసి మాత్రం స్వయంగా విచారణకు వచ్చారు. నివేదిక సమర్పించిన అనంతరం మీడియాతో ఆర్ముగ స్వామి మాట్లాడుతూ, శశికళ నేరుగా విచారణకు రాలేదని, లఖిత పూర్వకంగా వివరణ ఇచ్చినట్టు వెల్లడించారు.
పోయెస్ గార్డెన్ ఇంట్లో నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఎలాంటి అనుమానాలు లేవు అని పేర్కొంటూ, పోయెస్ గార్డెన్‌లో విచారణ జరపలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విచారణలో ఎలాంటి జాప్యం జరగలేదని, తన విచారణలో వెలుగు చూసిన అంశాలు, సాక్షాలు, ఆధారాలు, రికార్డులు అన్నీ సమగ్రంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేశానని తెలిపారు. అన్ని వివరాలను ఓ నివేదిక రూపంలో, ముఖ్యమైన అంశాలను మరో నివేదిక రూపంలో తెలియజేసినట్లు వివరించారు.
ఎయిమ్స్ వైద్యుల సహకారం, రెండు ప్రభుత్వాల సహకారంతో (గత అన్నాడీఎంకే, ప్రస్తుత డీఎంకే) ఈ కేసు విచారణను ముగించినట్టు చెప్పారు. తన కమిషన్ విచారణకు అధికంగా నిధులు వెచ్చించినట్టు కొందరు పేర్కొనడం శోచనీయమన్నారు. ఇది వరకు ఎన్నో కమిషన్‌లు మరెన్నో అంశాలపై విచారణలు చేశాయని, అప్పుడు రాని నిధుల ప్రస్తావన ఇప్పుడు ఎందుకోచ్చినట్లు? అని ఓ ప్రశ్నకు సమాధానంగా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment