Jayalalith
-
Tamil Nadu: జయలలిత మరణించిన ఐదేళ్లకు.. కమిషన్ విచారణ పూర్తి
ఎడతెగని ఊహాగానాలు, నిత్యకృత్యంగా మారిన వాయిదాలు, విమర్శలు, నిట్టూర్పులు వెరసి ఐదేళ్ల తరువాత అమ్మ మరణంపై ఎట్టకేలకూ నివేదిక సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విచారణ కమిషన్ సమగ్ర వివరాలను సమర్పించింది. ఆ నివేదికలో ఏం ఉందోననే ఉత్కంఠ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. జయలలిత మృతి కేసులో ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని గతంలోనే సీఎం స్టాలిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జె.జయలలిత మృతి కేసులో విచారణ ముగిసింది. వాయిదాల పర్వంతో ఐదేళ్ల పాటూ సాగిన విచారణలో వెలుగు చూసిన అంశాలతో ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదిక సిద్ధం చేసింది. దీనిని శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆర్ముగ స్వామి సమర్పించారు. 600 పేజీలతో ఈ నివేదిక రూపొందింది. నేపథ్యం ఇదీ.. 2016 డిసెంబర్ 5న అప్పటి సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్ 24న హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్‌ను ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీ నుంచి∙విచారణను ఆర్ముగ స్వామి కమిషన్ ప్రారంభించింది. ఐదేళ్ల పాటుగా సాగిన విచారణకు అనేక అడ్డంకులు తప్పలేదు. అపోలో రూపంలో.. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణలో తమ వైద్యులు తెలియజేస్తున్న అంశాలు, వివరాలు బయటకు రావడం, అవన్నీ కొత్త వాదనలకు దారి తీయడంతో అపోలో యాజమాన్యం కోర్టు తలుపు తట్టింది. తమను ప్రత్యేకంగా విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అపోలో యాజమాన్యం సవాలు చేసింది. ఈ పరిణామాలతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించాల్సి వచ్చింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగియడం, ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్ వైద్యులు రంగంలోకి దిగడంతో మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా ఎయిమ్స్ వైద్య బృందం సహకారంతో ఆర్ముగ స్వామి కమిషన్ వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకుంది. విచారణను వేగవంతం చేసింది. తొలి విచారణ నాటి నుంచి చివరి వరకు ఈ కమిషన్ పదవీ కాలాన్ని 14 సార్లు పొడిగించాల్సిన పరిస్థితి పాలకులకు ఏర్పడింది. ఈ కేసులో 159 మందిని విచారించారు. 8 మంది వద్ద లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ కేసులో తొలి విచారణ డాక్టర్ శరవణన్‌తో మొదలు కాగా, చివరగా అన్నాడీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో ముగించారు. చదవండి: 14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు! నివేదికలో మిస్టరీ... విచారణను ముగించిన ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదికను శనివారం ఉదయం సీఎం ఎంకే స్టాలిన్‌కు సమర్పించింది. సచివాలయంలో ఈ నివేదికను స్వయంగా స్టాలిన్‌కు ఆర్ముగ స్వామి అందజేశారు. 608 పేజీలతో నివేదికను సిద్ధం చేసినా, 600 పేజీలలో మరణం కేసు విచారణ సమగ్ర వివరాలను పొందుపరిచారు. తొలుత 550 పేజీల్లో వివరాలను ముగించేందుకు నిర్ణయించినా, ఎయిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాలతో అదనంగా మరో 50 పేజీలు చేర్చారు. తమిళం, ఆంగ్ల భాషల్లో రెండు రకాల నివేదికను సమర్పించారు. ఇందులో జయలలితను పోయెస్ గార్డెన్ నుంచి అపోలో ఆస్పత్రికి తరలించడం, అక్కడ అందించిన వైద్య చికిత్సల వివరాలను పేర్కొన్నారు. అపోలో వైద్యుల చికిత్స సరైన మార్గంలోనే జరిగినట్లుగా పొందు పరిచినట్లు భావిస్తున్నారు. అలాగే, అదనంగా మరో 200 పేజీల నివేదికలో ముఖ్యాంశాలను సీఎంకు సమర్పించారు. ప్రధాన నివేదికలోని కొన్ని కీలక వివరాలను ముఖ్యాంశాలుగా ఇందులో పేర్కొని ఉండటం గమనార్హం. ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. అలాగే, ఈనెల 29వ తేదీన మంత్రి వర్గం భేటీ కావాలని నిర్ణయించారు. అందులో ప్రత్యేక అంశంగా ఈ నివేదిక గురించి చర్చించి మిస్టరీని నిగ్గు తేల్చబోతున్నారు. ఆపై తదుపరి చర్యలకు సిద్ధం కాబోతున్నారు. కాగా జయలలిత మరణం వెనుక ఎవరైనా ఉండివుంటే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయో అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే శ్రేణులతో పాటూ రాష్ట్ర ప్రజల్లోనూ నెలకొంది. శశికళ లిఖిత పూర్వకంగా.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ స్వయంగా కాకుండా లిఖిత పూర్వకంగా ఈ కమిషన్‌కు వివరాలను సమర్పించారు. ఆమె తరపున న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ మాత్రం విచారణకు హాజరయ్యారు. అలాగే, చిన్నమ్మ వదిన ఇలవరసి మాత్రం స్వయంగా విచారణకు వచ్చారు. నివేదిక సమర్పించిన అనంతరం మీడియాతో ఆర్ముగ స్వామి మాట్లాడుతూ, శశికళ నేరుగా విచారణకు రాలేదని, లఖిత పూర్వకంగా వివరణ ఇచ్చినట్టు వెల్లడించారు. పోయెస్ గార్డెన్ ఇంట్లో నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఎలాంటి అనుమానాలు లేవు అని పేర్కొంటూ, పోయెస్ గార్డెన్లో విచారణ జరపలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విచారణలో ఎలాంటి జాప్యం జరగలేదని, తన విచారణలో వెలుగు చూసిన అంశాలు, సాక్షాలు, ఆధారాలు, రికార్డులు అన్నీ సమగ్రంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేశానని తెలిపారు. అన్ని వివరాలను ఓ నివేదిక రూపంలో, ముఖ్యమైన అంశాలను మరో నివేదిక రూపంలో తెలియజేసినట్లు వివరించారు. ఎయిమ్స్ వైద్యుల సహకారం, రెండు ప్రభుత్వాల సహకారంతో (గత అన్నాడీఎంకే, ప్రస్తుత డీఎంకే) ఈ కేసు విచారణను ముగించినట్టు చెప్పారు. తన కమిషన్ విచారణకు అధికంగా నిధులు వెచ్చించినట్టు కొందరు పేర్కొనడం శోచనీయమన్నారు. ఇది వరకు ఎన్నో కమిషన్లు మరెన్నో అంశాలపై విచారణలు చేశాయని, అప్పుడు రాని నిధుల ప్రస్తావన ఇప్పుడు ఎందుకోచ్చినట్లు? అని ఓ ప్రశ్నకు సమాధానంగా అభిప్రాయపడ్డారు. -
ఎంత ఓపిక
ఓ పన్నీర్ సెల్వం చరిత్ర నాడు దుఃఖం-నేడు సంతోషం అమ్మ మెచ్చిన నేత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఒకే లక్ష్యం. ఎప్పటికైనా సీఎం కావాలని. సీఎం కుర్చీలో కూర్చున్నపుడు పట్టలేని సంతోషం. అయితే అన్నాడీఎంకే అగ్రనేత ఓ పన్నీర్‌సెల్వం రాజకీయశైలి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. సీఎం అయ్యేటప్పుడు ఎంత బాధపడ్డారో, దిగేటప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:పన్నీర్‌సెల్వం జీవిత కాలంతో రెండుసార్లు సీఎం అయ్యారు. ఈ రెండుసార్లు జయకు కష్టం వచ్చినపుడు కుర్చీ పరువు నిలబెట్టడం కోసమే. టాన్సీ కుంభకోణం ఆరోపణలతో 2001లో జయ జైలుకెళ్లినపుడు అదే ఏడాది సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి అయ్యారు. బాధతప్త హృదయంతో బాధ్యతలు స్వీకరించారు. జయ జైలు నుంచి విడుదల కాగానే 2002 మార్చిన పట్టలేని ఆనందంతో సీఎం పగ్గాలు ఆమెకు అప్పగించారు. తన జీవితకాలంలో ఇటువంటి అవసరం మళ్లీ రాకూడదని ఆశించారు. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుగా అదే రకమైన ఉపద్రవం వచ్చిపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన జయ జైలు కెళ్లగానే పన్నీర్ సెల్వం మరోసారి సీఎం కాకతప్పలేదు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేస్తున్న సమయంలో పన్నీర్‌సెల్వంకు కన్నీళ్లు తన్నుకొచ్చాయి. కన్నీళ్ల పర్యంతం అవుతూనే ప్రమాణాన్ని పూర్తిచేశారు. జయకు ప్రత్యామ్నాయంగా సీఎం పదవిలో ఉన్నా సచివాలయంలోని జయ చాంబర్లో కూర్చోకుండా ఆర్థికమంత్రిగా తన చాంబర్ నుంచి పాలన కొనసాగించారు. కేసు నుంచి జయ నిర్దోషిగా బైటపడ గా ఈనెల 21వ తేదీన పన్నీర్‌సెల్వం సీఎం పదవికి రెండోసారి రాజీనామా చేశారు. పట్టలేని ఆనందంతో సీఎం పదవి నుంచి తప్పుకోవడం రాజకీయాల్లో విశేషమే. ఎంజీఆర్ కాలం నుంచి అన్నాడీఎంకేలో ఎంతో విశ్వాసపాత్రుడిగా మెలుగుతున్న ఓ పన్నీర్‌సెల్వం...జయ వద్ద కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా అధికారులపై ఆగ్రహించి ఎరుగరని ప్రతీతి. ఎవరు ఏ విషయం చెప్పినా ఓపిగ్గా వింటారనే మంచిపేరును ఆయన మూటకట్టుకున్నారు. ఈ గుణగణాల వల్లనే జయ సైతం సీఎం పదవికి పన్నీర్‌సెల్వంను ఎంచుకున్నారు. ప్రభుత్వాన్ని జయ తెరవెనుక నుంచి నడిపిస్తోంది, పన్నీర్‌సెల్వం డమ్మీ ముఖ్యమంత్రి, జయ చేతిలో రోబో అనే విమర్శలు ఈ ఏడునెలల కాలంలో ఎన్నివచ్చినా పన్నీర్ సెల్వం నోరు మెదపలేదు. ఓపీగా పేరుగాంచిన ఓ పన్నీర్‌సెల్వంకు నిజంగా ఎంత ‘ఓపి’క. -
వలసలు షురూ
: అన్నాడీఎంకేలోకి వలసలు మొదలయ్యూరుు. డీఎండీకే తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్ సుబ్రమణ్యం సీఎం జయలలితతో భేటీ అయ్యారు. డీఎండీకే రెబల్స్ జాబితాలో ఆయన కూడా చేరారు. పార్టీ నుంచి వలసలు మొదలవడంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష హోదాకు గండి పడనున్నది. ఆ పార్టీ మాజీ నేత బన్రూటి రామచంద్రన్ నేతృత్వంలో పలువురు నాయకులు గురువారం అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో అవతరించారు. అయితే, అన్నాడీఎంకేతో ఏర్పడిన వైరంతో ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్నాడీఎంకే పంచన చేరారు. డీఎండీకే రెబల్స్‌గా పార్టీ అధినేత విజయకాంత్‌కు ఆ ఏడుగురు చుక్కలు చూపిస్తున్నారు. ఇక, పార్టీ ప్రిసీడియం చైర్మన్ బన్రూటి రామచంద్రన్ అనారోగ్య కారణాలతో వైదొలిగారు. ఎమ్మెల్యే పదవికి , పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో డీఎండీకే సంఖ్యా బలం 29 నుంచి 21కు తగ్గింది. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న బన్రూటి రామచంద్రన్ ప్రస్తుతం అన్నాడిఎంకే పక్షాన చేరారు. ఆయన చేరికతో డీఎండీకే లో పెద్ద ఎత్తున వలసలు బయలుదేరడం తథ్యమన్న ఊహించినట్టుగానే వలసలు ప్రారంభమయ్యూరుు. వ లసలు: బన్రూటి రామచంద్రన్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు రామనాథన్, చిన్నస్వామి, అశోక్, తదితరులు పెద్ద ఎత్తు న తమ మద్దతుదారులతో గురువారం అన్నాడీఎం కే తీర్థం పుచ్చుకున్నారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో అధినేత్రి, సీఎం జయలలిత సమక్షంలో వీరంతా అన్నాడీఎంకేలో చేరారు. మరి కొం దరు అన్నాడీఎంకేలో చేరడానికి సిద్ధం అవుతోండటంతో డీఎండీకేలో గుబులు మొదలైంది.పార్టీ జిల్లా ల కార్యదర్శులు, ఇది వరకు బన్రూటితో సన్నిహితంగా ఉన్న నేతలందరూ అన్నాడీఎంకే బాట పట్టే పనిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ వర్గా లు బయటకు వెళుతుండటంతో వారిని అడ్డుకుని పార్టీని రక్షించుకునేందుకు విజయకాంత్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బృందాలు రంగంలోకి దిగాయి. పదవీ గండం:విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు గండి పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ పార్టీ తిరుత్తణి శాసన సభ్యుడు అరుణ్ సుబ్రమణ్యం సీఎం జయలలికు జై కొట్టారు. దీంతో డీఎండీ కే రెబల్స్ జాబితా ఎనిమిదికి చేరింది. సచివాల యంలో సీఎం జయలలితను నియోజకవర్గ అభివృ ద్ధి పేరుతో అరుణ్ సుబ్రమణ్యం కలిశారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని విన్నవించుకుంటూ, జయలలితకు ఆయన జై కొట్టారు. దీంతో విజయకాంత్ ఎమ్మెల్యే ల సంఖ్య 20కు పడిపోయింది. ఈ దృష్ట్యా, ఆయ న ప్రధాన ప్రతి పక్ష నేత పదవికి ఎసరు పెట్టేందుకు అన్నాడీఎంకే సిద్ధమవుతోంది.డీఎండీకేకన్నా, డీఎం కేకు ముగ్గురు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతి పక్ష హోదా దక్కే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ నుంచి అధికార పూర్వక ఆదేశాలు వెలువడాల్సి ఉంది. అయితే, అదే జరిగిన పక్షంలో రాష్ట్ర ప్రధాన ప్రతి పక్ష నేతగా డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ కావడం తథ్యం. పీఎంకే ఎమ్మెల్యే మంతనాలు: అసెంబ్లీలో పీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అనైకట్టు ఎమ్మెల్యే కళైయరసు ఉదయం సచివాలయంలో సీఎం జయలలితను కలుసుకున్నారు. తన నియోజకవర్గంలో కుంటుపడ్డ అభివృద్ధిని సీఎం దృష్టికి తీసుకెళ్లి, ఆదుకోవాలని విన్నవించారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కళైయరసు సీఎం జయలలితను కలవడంతో ఆయన ఇక ఆ పార్టీలోకి చేరినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈదృష్ట్యా, శాసన సభలో పీఎంకేకు రెబల్ ఎమ్మెల్యేగా కళైయరసు నిలవబోతున్నారు. అంతకు ముందుగా రాయపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీఎండీకే నాయకులతో పాటుగా నటి వెన్నిరాడై నిర్మల, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్‌లకు చెందిన అక్కడి పార్టీల నాయకులు అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. -
వంట గ్యాస్‌కు ‘మంట’
సాక్షి, చెన్నై:కొత్త సంవత్సరం కానుకగా ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్రం గ్యాస్ ధరను పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గ్యాస్‌కు ఆధార్ కార్డుకు లింక్ పెట్టి, నగదు బదిలీ పథకాన్ని బుధవారం ఆరంభించారు. ఈ ప్రక్రియను సర్వత్రా వ్యతిరేకిస్తున్న క్రమంలో గ్యాస్ ధర పిడుగును ప్రజల నెత్తిన కేంద్రం వేసింది. తమకు ఆధార్ కార్డులు ఇంకా అందలేదంటూ గ్యాస్ వినియోగదారులు గగ్గోలు పెడుతున్న సమయంలో ధర పెంపు మరింత గుది బండగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ఉత్పత్తుల ధరను కుంటి సాకుగా చూపు తూ గ్యాస్ భారాన్ని తమ నెత్తిన కేంద్రం రుద్దడాన్ని వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇదీ ధర: 2012 సెప్టెంబరు సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర రాష్ట్రంలో రూ.780గా ఉండేది. క్రమంగా పెరుగుతూ వస్తున్న ధర, తాజాగా పెరిగిన రూ.220తో గ్యాస్ సిలిండర్ రూ.1234కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీతో సబ్సిడీ సిలిండర్ ధర ఇది వరకు రూ.398.50గా ఉండేది. గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు చేరేలోపు అదనంగా రూ.20 నుంచి 30 వరకు భారం పడుతుంది. తాజాగా పెంచిన రూ.220తో ఒక్కో సబ్సిడీ సిలిండర్‌పై అదనంగా రూ.20 పెరిగినట్టు అవుతోంది. ఇక రాష్ట్రంలో సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు చేరేలోపు మొత్తంగా రూ.460కు చేరబోతున్నది. ఈ ధరల మోతపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు మండి పడుతున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్, సీపీఐ కార్యదర్శి టీ పాండియన్లు కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం తథ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెంపును ఉప సంహరించుకోని పక్షంలో ఆందోళన బాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. 24 సిలిండర్లు ఇవ్వండి: కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా కొత్త సంవత్సరం వేళ నిర్ణయాన్ని ప్రకటించాల్సిన కేంద్రం, ప్రజల జీవితాలతో చెలాగటం ఆడే నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజల కళ్లల్లో ఆనందాన్ని చూడాలే గానీ, కన్నీళ్లు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండని హితవు పలికారు. ఏడాదికి తొమ్మిది సిలిండర్లు అన్న నిబంధన అమల్లోకి రాగానే, ఆధార్‌ను గ్యాస్‌కు లింకు పెట్టారని, ఇప్పుడేమో కుంటి సాకులతో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ధరను పెంచారని ధ్వజమెత్తారు. పెంచిన ధరను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తొమ్మిది సిలిండర్ల నిబంధనను సడలించి ఏడాదికి 24 సిలిండర్ల పంపిణీకి సిద్ధం కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.