వంట గ్యాస్‌కు ‘మంట’
Published Fri, Jan 3 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
సాక్షి, చెన్నై:కొత్త సంవత్సరం కానుకగా ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్రం గ్యాస్ ధరను పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గ్యాస్‌కు ఆధార్ కార్డుకు లింక్ పెట్టి, నగదు బదిలీ పథకాన్ని బుధవారం ఆరంభించారు. ఈ ప్రక్రియను సర్వత్రా వ్యతిరేకిస్తున్న క్రమంలో గ్యాస్ ధర పిడుగును ప్రజల నెత్తిన కేంద్రం వేసింది. తమకు ఆధార్ కార్డులు ఇంకా అందలేదంటూ గ్యాస్ వినియోగదారులు గగ్గోలు పెడుతున్న సమయంలో ధర పెంపు మరింత గుది బండగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరను కుంటి సాకుగా చూపు తూ గ్యాస్ భారాన్ని తమ నెత్తిన కేంద్రం రుద్దడాన్ని వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇదీ ధర: 2012 సెప్టెంబరు సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర రాష్ట్రంలో రూ.780గా ఉండేది. క్రమంగా పెరుగుతూ వస్తున్న ధర, తాజాగా పెరిగిన రూ.220తో గ్యాస్ సిలిండర్ రూ.1234కు చేరింది.
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీతో సబ్సిడీ సిలిండర్ ధర ఇది వరకు రూ.398.50గా ఉండేది. గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు చేరేలోపు అదనంగా రూ.20 నుంచి 30 వరకు భారం పడుతుంది. తాజాగా పెంచిన రూ.220తో ఒక్కో సబ్సిడీ సిలిండర్‌పై అదనంగా రూ.20 పెరిగినట్టు అవుతోంది. ఇక రాష్ట్రంలో సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు చేరేలోపు మొత్తంగా రూ.460కు చేరబోతున్నది. ఈ ధరల మోతపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు మండి పడుతున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్, సీపీఐ కార్యదర్శి టీ పాండియన్‌లు కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం తథ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెంపును ఉప సంహరించుకోని పక్షంలో ఆందోళన బాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.
24 సిలిండర్లు ఇవ్వండి: కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా కొత్త సంవత్సరం వేళ నిర్ణయాన్ని ప్రకటించాల్సిన కేంద్రం, ప్రజల జీవితాలతో చెలాగటం ఆడే నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజల కళ్లల్లో ఆనందాన్ని చూడాలే గానీ, కన్నీళ్లు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండని హితవు పలికారు. ఏడాదికి తొమ్మిది సిలిండర్లు అన్న నిబంధన అమల్లోకి రాగానే, ఆధార్‌ను గ్యాస్‌కు లింకు పెట్టారని, ఇప్పుడేమో కుంటి సాకులతో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ధరను పెంచారని ధ్వజమెత్తారు. పెంచిన ధరను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తొమ్మిది సిలిండర్ల నిబంధనను సడలించి ఏడాదికి 24 సిలిండర్ల పంపిణీకి సిద్ధం కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement