మళ్లీ నగదు బదిలీ
జనవరి ఒకటి నుంచి.. ఆధార్ నంబర్లు సేకరించాలి
కలెక్టర్ రొనాల్డ్ రోస్
ప్రగతినగర్ :జిల్లాలో జనవరి ఒకటో తేదీనుంచి వంటగ్యాస్ కు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. గురువారం ప్రగతి భవన్‌లో పౌరసరఫరాధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారం స్పెషల్ డ్రెవ్ పెట్టుకొని గ్యాస్ డెలివరి బాయ్స్‌తో ఆధార్ వివరాలు సేకరించాలని సూచించారు. డాటా ఎంట్రీ కూడా త్వరగా పూర్తి చేసి సంబంధిత బ్యాంకులకు జాబితాలను అందించాలన్నారు. వంటగ్యాస్ వినియోగదారులంతా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొందడానికి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ ఖాతా జిరాక్స్ ప్రతులను సంబంధిత గ్యాస్ ఏజెన్సీలలో అందించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ డీఎం దివాకర్, డీఎస్‌ఓ కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఓటరు గుర్తింపు కార్డులకు..
ప్రగతినగర్ : ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ లింకేజీ ప్రక్రియపై గురువారం కలెక్టర్ రొనాల్డ్ రోస్ తన చాంబర్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నిజామాబాద్ మండలంలో ఓటర్ల ఆధార్ కార్డు సీడింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. కాగా దీనికి సంబంధించి ఆర్డీఓ యాదిరెడ్డి, తహశీల్దార్ రాజేందర్ ఇప్పటికే చర్యలు చేపట్టారు.