ఎంత ఓపిక
ఓ పన్నీర్ సెల్వం చరిత్ర
నాడు దుఃఖం-నేడు సంతోషం
అమ్మ మెచ్చిన నేత
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఒకే లక్ష్యం. ఎప్పటికైనా సీఎం కావాలని. సీఎం కుర్చీలో కూర్చున్నపుడు పట్టలేని సంతోషం. అయితే అన్నాడీఎంకే అగ్రనేత ఓ పన్నీర్‌సెల్వం రాజకీయశైలి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. సీఎం అయ్యేటప్పుడు ఎంత బాధపడ్డారో, దిగేటప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:పన్నీర్‌సెల్వం జీవిత కాలంతో రెండుసార్లు సీఎం అయ్యారు. ఈ రెండుసార్లు జయకు కష్టం వచ్చినపుడు కుర్చీ పరువు నిలబెట్టడం కోసమే. టాన్సీ కుంభకోణం ఆరోపణలతో 2001లో జయ జైలుకెళ్లినపుడు అదే ఏడాది సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి అయ్యారు. బాధతప్త హృదయంతో బాధ్యతలు స్వీకరించారు. జయ జైలు నుంచి విడుదల కాగానే 2002 మార్చిన పట్టలేని ఆనందంతో సీఎం పగ్గాలు ఆమెకు అప్పగించారు. తన జీవితకాలంలో ఇటువంటి అవసరం మళ్లీ రాకూడదని ఆశించారు. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుగా అదే రకమైన ఉపద్రవం వచ్చిపడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన జయ జైలు కెళ్లగానే పన్నీర్ సెల్వం మరోసారి సీఎం కాకతప్పలేదు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేస్తున్న సమయంలో పన్నీర్‌సెల్వంకు కన్నీళ్లు తన్నుకొచ్చాయి. కన్నీళ్ల పర్యంతం అవుతూనే ప్రమాణాన్ని పూర్తిచేశారు. జయకు ప్రత్యామ్నాయంగా సీఎం పదవిలో ఉన్నా సచివాలయంలోని జయ చాంబర్‌లో కూర్చోకుండా ఆర్థికమంత్రిగా తన చాంబర్ నుంచి పాలన కొనసాగించారు. కేసు నుంచి జయ నిర్దోషిగా బైటపడ గా ఈనెల 21వ తేదీన పన్నీర్‌సెల్వం సీఎం పదవికి రెండోసారి రాజీనామా చేశారు. పట్టలేని ఆనందంతో సీఎం పదవి నుంచి తప్పుకోవడం రాజకీయాల్లో విశేషమే. ఎంజీఆర్ కాలం నుంచి అన్నాడీఎంకేలో ఎంతో విశ్వాసపాత్రుడిగా మెలుగుతున్న ఓ పన్నీర్‌సెల్వం...జయ వద్ద కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా అధికారులపై ఆగ్రహించి ఎరుగరని ప్రతీతి. ఎవరు ఏ విషయం చెప్పినా ఓపిగ్గా వింటారనే మంచిపేరును ఆయన మూటకట్టుకున్నారు. ఈ గుణగణాల వల్లనే జయ సైతం సీఎం పదవికి పన్నీర్‌సెల్వంను ఎంచుకున్నారు. ప్రభుత్వాన్ని జయ తెరవెనుక నుంచి నడిపిస్తోంది, పన్నీర్‌సెల్వం డమ్మీ ముఖ్యమంత్రి, జయ చేతిలో రోబో అనే విమర్శలు ఈ ఏడునెలల కాలంలో ఎన్నివచ్చినా పన్నీర్ సెల్వం నోరు మెదపలేదు. ఓపీగా పేరుగాంచిన ఓ పన్నీర్‌సెల్వంకు నిజంగా ఎంత ‘ఓపి’క.