లైంగిక వేధింపులపై ఇంత నిర్లక్ష్యమా? | Madabhushi Sridhar Write Article On RTI And Soumen Sen Issue | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 2 2018 1:34 AM | Last Updated on Fri, Nov 2 2018 1:34 AM

Madabhushi Sridhar Write Article On RTI And Soumen Sen Issue - Sakshi

దామోదర్‌ వ్యాలీ కార్పొరే షన్‌లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులొచ్చాయి, వాటిపైన ఏ చర్యలు తీసు కున్నారు. 2012 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యా దులు పరిష్కరించారో, ఎన్ని పరిష్కరించలేదో తెలియజేయాలని ఆర్టీఐ కింద సౌమెన్‌ సేన్‌ కోరారు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ శంభుదాస్‌పైన చేసిన ఫిర్యా దుపై ఆయన నుంచి వాంగ్మూలం రికార్డు చేసి ఉంటే దాని ప్రతిని ఇవ్వాలని కోరారు.  సీపీఐఓ గానీ మొదటి అప్పీలు అధికారి గాని జవాబు ఇవ్వలేదు.  

కమిషన్‌ ముందు సౌమెన్‌ సేన్, ఆమె భర్త హాజరై నిజాలను దాచి నిందితుడిని డీవీసీ అధికారులు కాపాడుతున్నారని ఆరోపించారు. దామోదర్‌ వ్యాలీ సంస్థగానీ, జాతీయ మహిళా కమి షన్‌గానీ ఏ జవాబూ ఇవ్వకపోవడం న్యాయం కాదని, ఈ రెండు సంస్థల సమాచార అధికారులపై జరిమానా విధించాలని, అడిగిన సమాచారం ఇప్పిం చాలని కోరారు. ఇంటర్నల్‌ కమిటీని నియమించి ప్రాథమిక విచారణ జనవరి 2013లోనే జరిపించి నప్పటికీ ఇంతవరకు విచారణ ముందడుగు వేయ లేదని, అనేక సార్లు కమిటీలను మార్చుతూ కాలం గడుపుతున్నారని వివరించారు.  

బాధిత మహిళ ఫిర్యాదు చేసిన తరువాత నేర సంఘటన జరిగిన మూడు నెలల్లోగా లోకల్‌ కమిటీని గానీ ఇంటర్నల్‌ కమిటీనిగానీ నియమించాలని  2013 చట్టం సెక్షన్‌ 9 వివరిస్తున్నది. నిందితుడు సంస్థలో ఉద్యోగి అయితే సర్వీసు నియమాలను అనుసరించి ఎంక్వయిరీ జరిపించాల్సి ఉందని సెక్షన్‌ 11 నిర్దేశిస్తున్నది. ప్రాథమికంగా ఆరోపించిన నేరం జరిగిందని తేలితే సెక్షన్‌ 509 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సెక్షన్‌ 12 కింద బాధితురాలు తనను గానీ, తనను బాధించిన వ్యక్తినిగానీ మరో చోటికి బదిలీ చేయాలని కమిటీని కోరవచ్చు.

అయితే విచారణ నివేదిక ప్రతిలేకుండా ఈ హక్కులను బాధితురాలు కోరడానికి వీల్లేదు. సెక్షన్‌ 13 బాధితురాలికి విచారణ నివేదిక ప్రతిని విచారణ ముగిసిన పదిరోజులలో ఇచ్చితీరాలని నిర్దేశిస్తున్నది. విచారణలో ఆరోప ణలు రుజువైతే జిల్లా అధికారి నిందితుడిపై ఏ చర్యలు తీసుకోవాలో కమిటీ ఆదేశించే వీలుంది.  ఈ పనిని దుష్ప్రవర్తనగా భావించి అందుకు రూల్స్‌ ప్రకారం చర్య తీసుకోవాలి. అతని జీతం నుంచి కొంత సొమ్మును మినహాయించి, ఆ సొమ్మును బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కూడా ఆదేశించవచ్చు. 

ఈకేసులో బాధితురాలైన మహిళకు విచారణ నివేదిక ప్రతిని ఇవ్వకపోగా, ఆర్టీఐలో అడిగిన తరు వాత కూడా పీఐఓ ఇవ్వలేదు. అంటే 2013 చట్టాన్ని అమలు చేయలేదు. జీవన హక్కుతో పాటు, పనిచేసే హక్కు కూడా ఉల్లంఘిస్తూ ఉంటే అందుకు సంబం ధించిన సమాచారాన్ని కోరినప్పుడు కేవలం రెండు రోజుల్లో ఇవ్వాలని దామోదర్‌ వ్యాలీ సంస్థ గానీ, జాతీయ మహిళా కమిషన్‌గానీ భావించలేదు. మహి ళలపై వివక్ష నిర్మూలన ఒప్పందం (సెడా) విశాఖ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇటువంటి చర్య లను నిరోధించవలసి ఉంటుందని మాజీ ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ వర్మ అభిప్రాయ పడ్డారు. 

రెండు చట్టాలు ఆమెకు ఇచ్చిన హక్కులను రెండు ప్రభుత్వ సంస్థలు, (దామోదర్‌ వ్యాలీ, జాతీయ మహిళా కమిషన్‌) ఉల్లంఘించాయని సమాచార కమిషన్‌ భావించింది. కనుక ఆ రెండు సంస్థల పీఐఓలకు జరిమానా ఎందుకు విధించకూ డదో కారణాలు వివరించాలని నోటీసు జారీ చేసింది. దామోదర్‌ వ్యాలీ సంస్థ అడిగిన పూర్తి సమా చారాన్ని వెంటనే ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించింది. 

2012లో ఇచ్చిన ఫిర్యాదుపైన అయిదేళ్లు దాటినా ఏ చర్య తీసుకోలేదని బాధితురాలు ఫిర్యాదు చేశారు. సమాచార కమిషన్‌ ఆదేశాల తరువాత 29 పేజీలు ఇచ్చినా అనేక కీలకపత్రాలు ఇవ్వలేదు. కొత్త కమిటీ విచారణ జరుపుతుందని తెలిపినా, ఇంతవరకూ ఏ చర్యా తీసుకోలేదని వివ రించింది. బాధితురాలికి పరిష్కారం చూపకపోగా ఫిర్యాదును ఉపసంహరించుకోలేదన్న ఆగ్రహంతో ఆమెని అనేక పర్యాయాలు బదిలీ చేశారు. చివరకు ఆమె ప్రమోషన్‌ కూడా నిలిపివేశారు. 

మహిళా కమిషన్‌ తనకు అందిన ఆర్టీఐ దర ఖాస్తును దామోదర్‌ వ్యాలీ సంస్థకు బదిలీ చేసింది.  లైంగిక వేధింపుల కేసులను పర్యవేక్షించే బాధ్యత కమిషన్‌కు లేదని వాదించింది. సమాచార కమిషన్‌ ఆదేశించిన తరువాత 30 పుటలు ఇచ్చాం కనుక జరి మానా విధించరాదని దామోదర్‌ వ్యాలీ అధికారిణి కోరారు. డీవీసీ అధికారిణి అంశుమన్‌ మండల్‌ పైన 25 వేలరూపాయల జరిమానా విధిస్తూ కమిషన్‌ ఆదే శించింది. అంతేకాకుండా బాధితురాలికి లక్ష రూపా యల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది. (16.10.2018న సౌమెన్‌ సేన్‌ కేసులో సీఐసీ ఆదేశం ఆధారంగా)


వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌, కేంద్ర సమాచార కమిషనర్‌, professorsridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement