కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సమాచార హక్కు చట్టం కింద ఏర్పాటయిన స్వతంత్ర వ్యవస్థ. సమాచార అభ్యర్థనలను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తున్నదా? ప్రభుత్వ అధికారి మీద వచ్చిన అక్రమాల ఆరోపణల ఫిర్యాదులు, వాటి విచారణ వివరాలు ఇవ్వమంటే అది వ్యక్తిగత సమాచారమనీ ఇవ్వరాదని పీఐఓలు నిర్ణయించుకున్నట్టుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ సాగించిన పనుల పర్యవసానాన్ని వ్యక్తిగత సమాచారం అని ఏ విధంగా అంటారు. యజమాని ప్రభుత్వం అయినపుడు, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధుల హోదాలో లేదా ప్రజాసేవకుల హోదాలో పనిచేస్తున్నప్పుడు యజమానులైన ప్రజలకు వారి సమాచారం ఎందుకు ఇవ్వరు? అనేవి మౌలికమయిన ప్రశ్నలు. కానీ ప్రజాసమాచార అధికారి ఇవేవీ ఆలోచించకుండానే నిరాకరిస్తాడు. మొదటి అప్పీలులో పై అధికారి కూడా ఆలోచించడం లేదు.
అప్పుడు విధి లేక రెండో అప్పీలులో సమాచార కమిషన్ ముందుకు రావాల్సి ఉంటుంది. కమిషన్ స్వతంత్రంగా అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా రాజకీయ నాయకులకు భయపడకుండా సమాచారం ఇవ్వాలో వద్దో తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా తీర్పులు చెప్పింది కూడా. ఉదాహరణకు పైన ఉదహరించినట్టు ఉద్యోగిపైన వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు వ్యక్తిగత సమాచారం కాదని, ఆ సమాచారం ఇవ్వవలసిందే అని ఆదేశాలు జారీ చేసింది. దానిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సుప్రీంకోర్టు ప్రజాప్రయోజనం ఉంటే ఇవ్వవచ్చునని ఒక షరతు విధించింది. నిజానికి ఈ షరతు వ్యక్తిగత సమాచారం అడిగినప్పుడు మాత్రమే వర్తిస్తుందని చట్టం చాలా స్పష్టంగా పేర్కొంది. కానీ దురదృష్టవశాత్తూ బొంబాయ్ హైకోర్టు సమాచార చట్ట వ్యతిరేక తీర్పు ఇచ్చింది. దానిపైన అప్పీలు అనుమతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అప్పీలు అనుమతి తిరస్కరణను సుప్రీంకోర్టు తీర్పుతో సమానంగా భావించి సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు.
ఇది సమాచార హక్కును నీరుగార్చే ప్రయత్నం. కొన్నిసార్లు కమిషనర్ అనుకూల తీర్పు ఇచ్చినా, బలంగా ఉన్న అవినీతి అధికారి తరఫున ప్రభుత్వమే రిట్ పిటిషన్ వేస్తున్నది. హైకోర్టులు వందలాది స్టే ఉత్తర్వులు ఇస్తున్నాయి. ఇప్పటికి కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన వెల్లడి ఉత్తర్వులపైన 1700 రిట్ పిటిషన్లు ఉన్నాయని అంచనా. రాష్ట్ర సమాచార కమిషనర్ల ఉత్తర్వులపైన కొన్ని వందల కేసులైనా ఉంటాయి.
పదిరూపాయల ఫీజుతో సమాచారం అడగడం ద్వారా సమస్య పరిష్కరించుకున్న వారు లక్షలాది మంది ఉంటారు. అక్కడ అధికారులు కూడా సహకరిస్తారు. కానీ సమాచారం ఇవ్వకపోవడం వల్ల వేధిం పులకు గురయ్యే వారు కూడా లక్షలాది మంది ఉంటారు. వారికి సమాచారం ఇవ్వనక్కరలేదని కమిషనర్లుగా ఉన్న మాజీ ఉన్నతాధికారుల్లో కొందరు భావిస్తారు. వారు తమకు ఇన్నాళ్లూ అధికారం ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరించిన ప్రభుత్వ రహస్యాలను రక్షించే బాధ్యత ఉందనే భావనలో ఉంటారు. రాజకీయంగా తమను ఆదుకుని, పదవీ విరమణ తరువాత ఇంత గొప్ప పదవినిచ్చి, అయిదేళ్లపాటు అందలంలో ఉండి పల్లకీ ఊరేగే అవకాశం ఇచ్చిన నాయకుడికి కృతజ్ఞతతో ఉండటం కోసం సమాచారం ఇవ్వకుండా కాపాడుతూ ఉంటారు. వీరిమీద రిట్ పిటిషన్ వేసేంత తీరిక, డబ్బు సామాన్యుడికి ఉండదు. కేంద్ర కమిషన్ భారత ప్రభుత్వానికి చెందిన సర్వోన్నత న్యాయస్థానం వంటి సంస్థ. అది ప్రభుత్వ విభాగం కాదు.
అక్కడ ఉన్నది సమాచార అధికారి కాదు కమిషన్. నిజానికి అది ట్రిబ్యునల్ వలె కోర్టువలె పని చేస్తున్నది. పని చేయాలి. పనిచేయనీయాలి. చట్టం ప్రకారం ఏర్పడిన ఒక నిర్ణాయక సంస్థ, చట్టం కింద నిర్ణయం ప్రకటిస్తే, ఆ నిర్ణయం చట్టం ప్రకారం ఉందో లేదో పరిశీలించడానికి హైకోర్టుకు వెళ్లవచ్చు. కానీ అందులో సీఐసీని పార్టీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరయినా కమిషన్ మీద కేసు వేస్తే రక్షించడానికి ప్రభుత్వం లాయర్‌ను నియమించాల్సింది పోయి, ప్రభుత్వమే కేసు వేయడం ఎంత అన్యాయం. కింది కోర్టు తీర్పు మీద ప్రభుత్వం హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. కానీ అందులో కింది కోర్టును ప్రతివాదిగా చేర్చదు. కమిషన్‌పైన ప్రభుత్వం స్వయంగా కేసులు వేయడం ఎందుకు? పార్లమెంటు చేసిన చట్టాన్ని ప్రభుత్వం వంచించడం ఎందుకు?
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment