సాక్షి, హైదరాబాద్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసుకునే వారికి పీఐవోలు సమాచారం ఇచ్చే ముందు సంబంధిత విభాగం ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని హైకోర్టు స్పష్టం చేసింది. విధి నిర్వహణలో భాగంగా ప్రజా సమాచార అధికారులు (పీఐవో) ఇతర అధికారుల సాయం కోరవచ్చని వెల్లడించింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వుల్లో అనుమతి తీసు కోవాలని పేర్కొనడం సరికాదని అభిప్రాయ పడింది.
సమాచారం ఇచ్చే ముందు పీఐవోలు తమ శాఖల అధిపతులు, ముఖ్య కార్యదర్శులు, కార్య దర్శులు, ప్రత్యేక కార్యదర్శుల నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈనెల 13న జారీ చేసిన సర్క్యులర్ అమ లును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది.
ఆర్టీఐ చట్టంపై సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమంటూ న్యాయశాస్త్ర విద్యార్థిని చిత్రపు శ్రీధృతి పార్టీ ఇన్ పర్సన్‌గా, ఆర్టీఐ ఉద్యమకారుడు గంజి శ్రీనివాసరావులు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి...
సమాచారం ఇచ్చే ముందు పీఐవోలు ముందస్తు అనుమతి పొందాలని చట్టంలో ఎక్కడా లేదని, ఈ తరహా నిబంధనలతో సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని పిటిషనర్లు నివే దించారు. పీఐవోలు కొన్ని సందర్భాల్లో అసంపూర్ణ సమాచారం ఇస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగానే సీఎస్ ఈ ఉత్తర్వు లిచ్చారని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు.
పీఐవోలు కోరిన సమాచారం ఇవ్వడం లేదని పలువురు హైకోర్టును ఆశ్రయిస్తు న్నారని తెలిపారు. సమాచారం ఇచ్చే ముందు ఇతర అధికారుల సాయం కోరవచ్చని చట్టంలోని సెక్షన్ 5(4) స్పష్టం చేస్తోందని వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. పీఐవోలు సాయం కోరడం వేరని, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవడం వేరని, అనుమతి తీసుకోవాలని చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment