నిలదీయడమే నేరమా! | RTI Implementation Not Going Well | Sakshi
Sakshi News home page

నిలదీయడమే నేరమా!

Published Thu, Aug 11 2022 12:24 AM | Last Updated on Thu, Aug 11 2022 12:24 AM

RTI Implementation Not Going Well - Sakshi

పదిహేడేళ్లక్రితం అడుగుపెట్టినప్పుడు అందరిలో ఆశలు రేకెత్తించిన సమాచార హక్కు చట్టం ఆచరణలో క్షీణ చంద్రుణ్ణి తలపిస్తూ నానాటికీ తీసికట్టవుతున్న వైనం అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. గుజరాత్‌ సమాచార కమిషన్‌ సైతం ఆ బాణీలోనే ఒకదాని వెంబడి ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. పౌరులకుండే సమాచార హక్కునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గత పద్దెనిమిది నెలల కాలంలో ఏకంగా పదిమంది దరఖాస్తుదారుల్ని జీవితంలో మరెప్పుడూ ప్రశ్నించొద్దంటూ ఈ కమిషన్‌ నిషేధించింది. వీరంతా ఒకటికి పది ప్రశ్నలు వేస్తూ అధికారులకు చిర్రెత్తిస్తున్నారట! వేధిస్తున్నారట!! 

దురుద్దేశంతో, ప్రతీకార ధోరణితో సమాచారం అడిగారని కొందరిని అయిదు సంవత్సరాల వరకూ కమిషన్‌ గడప తొక్కొద్దని హుకుం జారీ చేసింది. ఒక జంట తమ రెసిడెన్షియల్‌ సొసైటీ గురించి 13 ప్రశ్నలు వేసిందని రూ. 5,000 జరిమానా విధించారు. తమ విలువైన సమయాన్ని వృథాపరిచారని, ఉద్దేశపూర్వకంగా కీలకమైన సమాచారాన్ని దాచారని, దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ న్యాయస్థానాలు పిటిషనర్లపై అడపా దడపా చర్యలు తీసుకుంటున్న ఉదంతాలు ఉంటున్నాయి. న్యాయమూర్తులకు చట్టాలు ఆ అధికారాన్నిచ్చాయి.

కానీ సమాచార హక్కు కమిషన్‌ సైతం అదే తోవన పోతానంటే కుదురుతుందా? వాటిని ఏర్పాటు చేసిన ఉద్దేశమే దెబ్బతినదా? దేశ రక్షణ, చట్టసభల హక్కులకు భంగకరంగా ఉండేవి, మేధోపరమైన హక్కులు, నిఘా విభాగాల కార్యకలాపాలువంటివాటికి సమాచార హక్కు చట్టం నుంచి మొదట్లోనే మినహాయింపు ఇచ్చారు. అనంతరకాలంలో ఆ చట్టం పరిధిలోకి తాము రాబోమని చెప్పే ప్రభుత్వ విభాగాలు ఎక్కువే ఉండేవి. రాను రాను ఎంతోకొంత మార్పు వచ్చింది. 

ఐక్యరాజ్యసమితి 1949లో విడుదల చేసిన విశ్వ మానవ హక్కుల ప్రకటనలోనే సమాచార హక్కు చట్టం మూలాలున్నాయి. ప్రపంచపౌరులందరికీ మానవహక్కులుండాలని ఆ ప్రకటన కాంక్షించడంతోపాటు ఏ మాధ్యమం ద్వారానైనా సమాచారాన్ని కోరే, స్వీకరించే హక్కు దేశదేశాల ప్రజలకూ ఉంటుందని స్పష్టం చేసింది. సమాచార హక్కు కోసం అరుణారాయ్‌వంటి వారెందరో ఉద్యమించారు. ప్రజల్ని చైతన్యవంతులను చేశారు. ఫలితంగా 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది. 

పారదర్శక పాలన అందించటానికి ప్రయత్నిస్తున్న 70 దేశాల సరసన మన దేశం కూడా చేరింది. అంతక్రితం ప్రభుత్వాల పనితీరు గురించి ఎలాంటి ప్రశ్నలు వేసినా పాలకులు 1923 నాటి అధికార రహస్యాల చట్టం మాటున, మరికొన్ని ఇతర చట్టాల మాటున దాగేవారు. రహస్యం పాటించేవారు. ఇందువల్ల పాలకులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం, అయినవారికి ఏకపక్షంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా కావడం రివాజయ్యేది.  సమాచార హక్కు చట్టం వచ్చాక దేశంలో అంతా సవ్యంగా ఉన్నదని, పారదర్శకత పెరిగిందని చెప్పలేం. కానీ అధికారవర్గానికి ఎంతో కొంత జవాబుదారీతనం వచ్చింది. అయిష్టంగానైనా, ఆలస్యంగానైనా పౌరులు అడిగిన సమాచారం బయటికొస్తోంది. చట్టం అంటే వచ్చిందిగానీ దాన్ని ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్న పౌరులకు అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.

వారి ప్రాణాలకు సైతం ముప్పువాటిల్లుతోంది. నిలదీసినవారికి రాజకీయంగా అండదండలు లేవనుకుంటే వారి ఇళ్లకుపోయి బెదిరించటం, దుర్భాషలాడటం, దౌర్జన్యం చేయటంవంటి ఉదంతాలకు లెక్కేలేదు. తొలి దశాబ్దంలోనే దాదాపు 65మంది పౌరులు అవినీతి, ఆశ్రితపక్షపాతం, ప్రభుత్వ పథకాల అమలు వగైరా అంశాలపై ప్రశ్నించిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రశ్నించినవారికి అండగా చట్టం ఉంటే ఈ దుస్థితి ఉండేదికాదు. కానీ ఆర్‌టీఐ చట్టం వచ్చిన ఆరేళ్ల తర్వాత, ఎన్నో ఉద్యమాలు జరిగాక 2011లో విజిల్‌బ్లోయర్‌ చట్టం వచ్చింది. విషాదమేమంటే దాని అమలు కోసం జారీ చేయాల్సిన నోటిఫికేషన్‌కు ఇన్నేళ్లయినా అతీగతీ లేదు. ఇది చాలదన్నట్టు 2019లో సమాచార హక్కు చట్టాన్నే నీరుగార్చే సవరణలు చేశారు.

మరోపక్క సమాచారాన్ని కోరుతూ ఏటా దాదాపు 60 లక్షల దరఖాస్తులు దాఖలవుతుండగా సమాచార కమిషన్‌ కార్యాలయాలు తగిన సంఖ్యలో కమిషనర్‌లు లేక బావురుమంటున్నాయి. అందువల్ల దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవడం, తగిన ఆదేశాలివ్వటం వంటి అంశాల్లో అలవిమాలిన జాప్యం చోటుచేసుకుంటోంది. ప్రభుత్వ విభాగాల సంగతి చెప్పనవసరమే లేదు. అవినీతికి అలవాటుపడిన అధికారులు పౌరులు అడిగిన సమాచారం ఇవ్వకపోగా, ఆ అడిగినవారి గురించి అవతలి పక్షానికి ఉప్పందించి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, పౌరులు కోరిన సమాచారాన్ని అందించేందుకు తప్పనిసరిగా ఒక అధికారి ఉండాలన్న నియమం ఉంది. కానీ అస్తవ్యస్థ ఆచరణతో సమాచారం బయటకు రావడానికి ఏళ్లూ పూళ్లూ పడుతోంది.

ఇన్నివైపులనుంచి ఆర్‌టీఐ చట్టానికి అందరూ తూట్లు పొడుస్తుంటే ఇప్పుడు స్వయానా సమాచార కమిషనే ఆ పనికి పూనుకోవడం ఆందోళనకరం. సమాచార కమిషనర్‌లకు ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ, పౌరులకు చట్టాలు కల్పిస్తున్న హక్కులపై గౌరవం ఉండాలి. ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని పారదోలాలన్న దృఢ సంకల్పం ఉండాలి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం నేపథ్యం, దాని పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలియాలి. ఈ లక్షణాలు కొరవడినవారిని అందలం ఎక్కిస్తే అది కోతికి దొరికిన కొబ్బరికాయ చందం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement