పీఎంవోలో పీఎం నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: ఎంత తీరికలేని ఉద్యోగమైనా.. పండుగలకో, ఫంక్షన్లకో సెలవంటూ తీసుకోని ఉద్యోగులు ఉంటారా? కార్మిక చట్టాల ప్రకారం ఒక ఉద్యోగి పనిగంటలు 8. మహాఅయితే 12 గంటలు. కానీ 24X7 కర్తవ్యనిర్వహణకే కంకణబద్ధుడైన వ్యక్తిని ఎప్పుడైనా చూశారా?.. అవును. ఆ వ్యక్తి మరెవరోకాదు.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే!
2014, మే 26న పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు మోదీ ఒక్కటంటే ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. అంతేకాదు, ప్రతి రోజు.. ప్రతి నిముషం.. ఆయన డ్యూటీలోనే ఉంటారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) పేర్కొంది. దేశ ప్రధానుల సెలవులకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించిన ఓ వ్యక్తికి మంగళవారం పీఎంవో రాతపూర్వక సమాధానం చెప్పింది.
గతంలో పనిచేసిన ప్రధానుల సెలవులకు సంబంధించిన సమాచారమేదీ తమ వద్ద లేదన్న పీఎంవో.. సంబంధిత రికార్డులను అక్కడ భద్రపర్చరని తెలిపింది. అయితే ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం ఒక్కటంటే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, నిత్యం డ్యూటీలో ఉండటం ప్రధాని బాధ్యతల్లో ఒకటని పీఎంవో పేర్కొంది. 66 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా దేశాన్ని నడిపిస్తోన్న మోదీ ఎంతైనా గ్రేటేకదా!