బార్‌ కౌన్సిల్‌కూ దాపరికమేనా? | madhabhushi sridhar writes on law colleges | Sakshi
Sakshi News home page

బార్‌ కౌన్సిల్‌కూ దాపరికమేనా?

Published Fri, Feb 10 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

బార్‌ కౌన్సిల్‌కూ దాపరికమేనా?

బార్‌ కౌన్సిల్‌కూ దాపరికమేనా?

న్యాయశాస్త్రాన్ని నేర్పే కళాశాలల వారు ఇచ్చిన అన్ని నివేదికలను, అవి విద్యార్థులకు సమకూర్చుతున్నామంటున్న సౌకర్యాల వివరాలను బహిర్గతం చేయాలి. అప్పుడే ఆ విషయాలను తెలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు లభిస్తుంది.

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) సభ్యులలో ఒకరు ఎన్ని సార్లు విదేశీ యాత్రలు చేశారో, అందుకు కారణాలు ఏమిటో  వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద ఒక న్యాయవాది కోరారు. ఉత్తరా ఖండ్‌ నుంచి ఎన్నికైన మరొక బీసీఐ సభ్యుడు భట్‌  సిఫార్సుల ద్వారా ఎన్ని న్యాయశాస్త్ర కళాశాల లకు భారత న్యాయవాదులమండలి అనుమతిని ప్రదానం చేసిందని కూడా అడిగారు. యూనివర్సిటీల పరిశీలన కమిటీ, నివేదిక సిఫార్సుల వివరాలన్నీ గోప్యంగా ఉంచా ల్సినవి అంటూ ఈ వివరాలు ఇవ్వడానికి బీసీఐ నిరాకరిం చింది. 2009–2015 మధ్య బీసీఐ సభ్యులెవరూ విదేశీ యాత్రలు చేయలేదని పీఐఓలు చెప్పారు.

అడ్వకేట్ల చట్టం 1961 సెక్షన్‌ 7(1)(హెచ్‌) ప్రకారం న్యాయశాస్త్ర విద్యలో ప్రమాణాలను కాపాడే గురుతర బాధ్యత బీసీఐపైన ఉంది. తమ సభ్యుడిగా చేరి న్యాయ వాద వృత్తి నిర్వహించడానికి కావలసిన యోగ్యమైన న్యాయవిద్య అతనికి ఉందా, పట్టా ఇచ్చిన విశ్వవిద్యాల యానికి తగిన ప్రమాణాలున్నాయా? అని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవలసిన బాధ్యత కూడా దానిపై ఉంది. యూనివర్సిటీలకు వెళ్లి తనిఖీ చేయాలి. రికార్డులు తెప్పించుకుని చూడాలి. భవనాలు, గ్రం«థాలయం, హాస్టళ్లు, ఇతర వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో పరీక్షిం చాలి. బీసీఐ పరిశీలనకు వచ్చినపుడు ప్రమాణాలను పరీ క్షించడానికి వీలైన అన్ని సరైన సౌకర్యాలను కళాశాలలో ప్రతి బాధ్యతాయుతమైన వ్యక్తి కల్పించవలసి ఉంటుందని కూడా ఈ చట్టంలో ఉంది. బీసీఐ ఇన్‌స్పెక్షన్‌ మాన్యువల్‌ ఒకటో అధ్యాయం ప్రకారం బీసీఐ చాలా లోతైన సమగ్ర పరిశీలన జరపాలి. బీసీఐకి పనికివచ్చే లాయర్లను ఇవ్వగల సామర్థ్యం దానికి ఉందో లేదో తేల్చాలి.

దేశంలో ప్రస్తుతం రెండు రకాల న్యాయ కళాశాలలు ఉన్నాయి. కొన్ని జాతీయ న్యాయవిశ్వవిద్యాలయాలేగాక, సాధారణ విశ్వవిద్యాలయాల అనుబంధ న్యాయశాస్త్ర కళా శాలలు అనేక వందలు ఉన్నాయి. జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాలకు కావలసినన్ని నిధులు సమకూర్చడానికి రాçష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహంగా ఉంటాయి. దానికి ఒక కారణం నేషనల్‌ లా స్కూల్స్‌కు ప్రధాన న్యాయమూర్తి చాన్స్‌లర్‌గా ఉండడం. వాటికి ఇచ్చే నిధులలో సగం ఇచ్చినా, అధ్యాపక పదవుల్లో ఉన్నఖాళీలను సమర్థులైన కొత్త వారితో ఎప్పటికప్పుడు భర్తీ చేసినా మామూలు విశ్వవిద్యాలయాల లా కళాశాలలు కూడా బాగుపడతాయి.

న్యాయవ్యవస్థ, పాలక వ్యవస్థ సాయంతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు మంచి ప్రమాణాలు, కీర్తి సాధించిన మాట నిజమే. కాని తమ ఉన్నత ప్రమాణాలను ఇతర విశ్వవిద్యాలయ కళాశాలలకు విస్తరించడానికి ఈ సంస్థలు ఏమీ చేయడం లేదు. ఏక శాఖా విశ్వవిద్యా లయాలు వేటికవిగా జాతీయ స్థాయిలో న్యాయశాస్త్ర పట్ట భద్రులను తయారు చేస్తుంటాయి. ఇక అనేక శాఖలున్న విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్ర విభాగానికి కూడా దిక్కూ మొక్కూ ఉండదు. వాటి అనుబంధ న్యాయ కళాశాలలు వేలాది విద్యార్థులకు ఒకేసారి విద్యాబోధన చేస్తూ ఉంటే ప్రమాణాలు నీరుగారిపోకుండటానికి హామీ ఇచ్చేవారు, వాటికి ఆ జవాబుదారీ బాధ్యతను నిర్దేశించేవారూ లేరు.

బీసీఐ సభ్యులతో ఏర్పడిన లీగల్‌ ఎడ్యుకేషన్‌ కమిటీ న్యాయ విద్యాప్రమాణాలకు బాధ్యత వహించాలి. ఈ కమిటీ పరిశీలనకు వచ్చినపుడు అందరూ నిర్భయంగా ఉన్న సమస్యలు వివరించాలి. ఆ కమిటీ వారు తమ నివేదికలను, తమకు కళాశాల వారు ఇచ్చిన మహజర్లను అందరితోనూ పంచుకోవాలి. కమిటీ ఇచ్చిన నివేదిక, కమిటీకి ఇచ్చిన రికార్డు సమాచారం అవుతుంది. కాపీలు, ఇతర వివరాలు అడిగినప్పుడు ఇవ్వడం వారి బాధ్యత. ఇది గోప్యమైన సమాచారం అయ్యే అవకాశం లేదు. సెక్షన్‌ 4(1)(బి) ప్రకారం ఈ సమాచారాన్ని ఎవరూ అడగకుండా బీసీఐ ఇవ్వాల్సిందే. అడిగినా ఇవ్వకపోతే సమాచార హక్కు ఏ విధంగా బతుకుతుంది? న్యాయశాస్త్రాన్ని నేర్పే కళాశాలలు నాక్‌ సంస్థకు, బార్‌ కౌన్సిల్‌ కమిటీకి  ఇచ్చిన సమాచారాన్ని పంచుకునే జవాబుదారీతనం, పారదర్శకత బీసీఐకి కూడా ఉండాలి. ప్రతి కళాశాల, విశ్వవిద్యాలయం తమవద్ద ఉన్న అధ్యాపకులు ఎవరో వివరించాలి.

వారికి ఏ మేరకు వేతనాలను ఇస్తున్నారో రుజువులతో సహా చూపాలి. జాబితాలో చూపిన అధ్యాపకులు నిజంగా ఆ కళాశాలలోనే పనిచేస్తున్నారో లేక మరే కళాశాలలోనో కూడా పనిచేస్తున్నట్టు చెప్పుకుంటున్నారో, లేదో పరిశీలిం చాలి. ఆ కళాశాల వారు ఇచ్చిన అన్ని నివేదికలను, విద్యా ర్థులకు సమకూర్చుతున్నామని చెప్పుకునే అన్ని సౌకర్యాల వివరాలను కూడా బహిర్గతం చేయాలి. అప్పుడే  విద్యా ర్థులకు ఆ కళాశాల నిజంగానే సౌకర్యాలు కల్పించిందో, లేదో తెలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు ఉంటుంది. వేతనాల చెల్లింపు వివరాలను కూడా పది మందికి తెలి యజేయాలి. ఇది గోప్యమైన సమాచారమయ్యే అవకాశమే లేదు. బీసీఐ సభ్యుడి విదేశీ పర్యటనకు, విదేశీ విశ్వవిద్యా లయానికి ఇచ్చిన గుర్తింపునకు ఉన్న సంబంధాన్ని వివరిం చాలి. లీగల్‌ ఎడ్యుకేషన్‌ కమిటీలో ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందిన కళాశాల వివరాలు ఇవ్వడం కూడా బీసీఐ బాధ్యత. ఆ కమిటీ సభ్యుల పర్యటనలు, వారి నివేదికలు, సిఫార్సులు ఇవ్వాల్సిందేనని సమాచార కమి షన్‌ ఆదేశించింది. న్యాయశాస్త్ర చదువులను బాగుచేసే బాధ్యత లాయర్లదే. (పాథక్‌ వర్సెస్‌ బీసీఐ కేసు నంబర్‌ CIC/SA/C/2016/000164లో 2.1.2017న కేంద్ర సమాచార కమిషన్‌ ఇచ్చిన తీర్పు ఆధారంగా)

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement