బాధితురాలికి ఆ హక్కు ఉంది! | Madhabhushi Sridhar writes on RTI | Sakshi
Sakshi News home page

బాధితురాలికి ఆ హక్కు ఉంది!

Published Fri, Apr 28 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

బాధితురాలికి ఆ హక్కు ఉంది!

బాధితురాలికి ఆ హక్కు ఉంది!

విశ్లేషణ
సహజ న్యాయసూత్రాల ప్రకారం బాధితురాలికి న్యాయం చేయడం కోసం సమాచారం ఇవ్వాలి. ఆమె పత్రికలు, మీడియా ప్రచారం కోసం అడగడం లేదని తెలిసి కూడా సమాచారం ఇవ్వకపోవడం ఆమె హక్కును భంగపరచడమే.

పారిశ్రామిక విజ్ఞానవేత్తల సంస్థ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (CSIR)లో పనిచేస్తున్న ఒక పరిశోధకురాలు తనను సీనియర్‌ ప్రొఫెసర్‌ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఐసీసీ ఒక నిజ నిర్ధారణ సంఘాన్ని (ఎఫ్‌ఎఫ్‌సి) నియమించింది. ఆ సంఘం నివేదిక ప్రతిని బాధితురాలు ఆర్టీఐ కింద అడిగినా ఇవ్వలేదు. నిజనిర్ధారణ కమిటి ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చిందనీ, తుది నివేదిక ఇచ్చేదాకా ఏ సమాచారమూ ఇవ్వరాదని పై అధికారులు ఆదేశించారంటూ నిరాకరించారు.

బాధితురాలి నుంచి ఫిర్యాదు అందగానే సర్వీసు నియమాల ప్రకారం శాఖాపరమైన విచారణ ప్రారంభించాలి. ఐపీసీ సెక్షన్‌ 509 కింద నేరం జరిగిందని ప్రా«థమికంగా తేలితే ఏడురోజులలోగా పోలీసులకు ఫిర్యాదును పంపాలని సెక్షన్‌ 11 నిర్దేశిస్తున్నది. ఇవేవీ ఈ కేసులో జరిగినట్టు లేవు. ఈ నియమాల ప్రకారం క్రిమినల్‌ ఫిర్యాదు పోలీసులకు పంపారా అని తెలుసుకునే హక్కు, తన వాదం వినిపించే హక్కు, దర్యాప్తు నివేదిక ప్రతిని పొందే హక్కు ఉన్నాయి. సమాచార హక్కు అదనంగా ఆర్టీఐ చట్టం కింద లభిస్తుంది. దర్యాప్తు జరుగుతున్న దశలో బాధితురాలు తనను కానీ, నిందితుడైన వ్యక్తిని కానీ బదిలీ చేయాలనీ; తనకు మూడు నెలల సెలవు ఇవ్వాలనీ కోరవచ్చు.

సెక్షన్‌ 13 ప్రకారం నిజనిర్ధారణ దర్యాప్తు నివేదిక ఇచ్చిన పదిరోజులలోగా బాధితురాలు లేదా ఫిర్యాదీకి నివేదిక ప్రతిని ఇవ్వాలి. ఆరోపణ నిజమని తేలితే చర్య తీసుకోవాలి. నిందితుడి ఖాతానుంచి నిర్దేశిత సొమ్మును కోసి బాధితురాలికి చెల్లించాలని ఆదేశించవచ్చు.

ప్రాథమిక నివేదికే కాబట్టి ఇవ్వలేదని, తుది నివేదిక అందిన తరువాత ఇస్తామనే వాదన చట్టబద్ధంగా లేదు. నివేదిక అంటే ప్రాథమిక, తుది నివేదికలు రెండూ అని అర్థం. ఫిర్యాదు వివరాలు, బాధితురాలిని గుర్తించే వివరాలు, నిందితుడు, సాక్షుల వివరాలు, సంప్రదిం పులు, దర్యాప్తు ప్రక్రియ సమాచారం, ఐసీసీ లేదా లోకల్‌ కమిటీ సిఫార్సులు సంబంధం లేనివారికి, ప్రెస్‌ మీడియాలకు ఇవ్వడానికి వీల్లేదని సెక్షన్‌ 16 నిర్దేశించింది. సమాచార హక్కు చట్టంలో ఏమి ఉన్నప్పటికీ, ఈ సమాచారం ఇవ్వడానికి వీల్లేదని ఉంది. అయితే బాధితురాలి పేరు సాక్షుల పేర్లు తప్ప, బాధితురాలికి న్యాయం చేసే వివరాలను ఇవ్వవచ్చు.
 
ఈ సెక్షన్‌ వినియోగించి బాధితురాలికి కూడా వివరాలు ఇవ్వకూడదని ప్రభుత్వ కార్యాలయం నిర్ణయిం చడం చాలా అన్యాయం. సహజ న్యాయసూత్రాల ప్రకా రం బాధితురాలికి న్యాయం చేయడం కోసం సమాచారం ఇవ్వాలి. ఆమె పత్రికలు, మీడియా ప్రచారం కోసం అడగడం లేదని తెలిసి కూడా సమాచారం ఇవ్వకపోవడం ఆమె హక్కును కావాలని భంగపరచడమే. సెక్షన్‌ 19, 2013లో చేసిన నిబంధనల ప్రకారం వీలైనంత త్వరలో విచారణ ముగించి, సత్వరమే చర్యలు తీసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉంది. నిబంధన 7(3) ప్రకారం ప్రతివాది లేదా నిందితుడు ఇచ్చిన వాదం, సాక్షుల జాబితాను బాధితురాలికి ఇవ్వాలి.

సహజ న్యాయసూత్రాల ప్రకారం విచారణ జరిపించాలని కూడా నియమాలు వివరిస్తున్నాయి. ఈ కేసులో వీట న్నింటినీ ఉల్లంఘించారు. ప్రాథమిక నివేదిక ఇస్తే తరువాత దర్యాప్తునకు విఘాతం కలుగుతుంది కనుక ప్రతి ఇవ్వబోమని సెక్షన్‌ 8(1)హెచ్‌ మినహాయింపును కూడా దుర్వినియోగం చేశారు. కార్యాలయంలో లైంగిక వేధిం పులు మహిళల జీవన హక్కును, పనిచేసే హక్కును హరిస్తాయని సుప్రీంకోర్టు, మన పార్లమెంటు, అంతర్జాతీయ న్యాయసూత్రాలు ఘోషిస్తున్నాయి. ప్రపంచ మానవ హక్కుల వేదికలు చెప్పాయి. పనిచేసే చోట మహిళల లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిహార చట్టం ఆ హక్కులను 2013లో స్పష్టంగా వివరించింది.

ఆ కారణంగా ఈ సమాచారం కూడా జీవన, స్వేచ్ఛాహక్కుల సంబంధిత సమాచారం అవుతుంది. కనుక 48 గంటల్లో ఇవ్వాలి. ఆర్టీఐ కింద 2 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం, 2013 చట్టం కింద 10 రోజుల్లో ఇవ్వాల్సిన నివేదిక, ఆర్టీఐ చట్టం కింద కనీసం నెలరోజుల్లోనైనా ఇవ్వకుండా మూడేళ్లు ఆలస్యం చేసిన అధికారులకు జరిమానా నోటీసు జారీచేసింది కమిషన్‌. సమాచారం వెంటనే ఇవ్వాలని ఆదేశించింది.

ఒకవైపు లైంగిక వేధింపుల నివారణ చట్టం పదిరోజుల్లో నివేదిక ఇవ్వమని చెప్పే సెక్షన్‌ను వదిలేసి, మీడియాకు ఇవ్వకూడదనే సెక్షన్‌తో ఈ అధికారి దుర్వినియోగం చేశారు. లైంగిక వేధింపుల ఫిర్యాదు ఆరోపణలు, బాధితురాలి పేరు, నిందితుడి పేరు సమాచార హక్కు చట్టం కింద కూడా ఇవ్వకూడదనీ, మీడియాకు పత్రికలకు ఇతరులకు ఇవ్వకూడదనీ ఈ సెక్షన్‌ తెలియచేస్తున్నది. బాధితురాలికి ఫిర్యాదీకి ఇవ్వకూడదని ఈ సెక్షన్‌లో లేదు. కానీ అధికారులు ఇవ్వడం లేదు. ఆర్టీఐ దరఖాస్తును అధికారులు అక్రమంగా తిరస్కరిస్తున్నారు. అనవసరమైన ప్రచారాన్ని నివారించి మహిళ గౌరవాన్ని కాపాడడానికి ఉద్దేశించిన ఈ సెక్షన్‌ను ఆ బాధితురాలి హక్కులను కాలరాయడానికే వాడడం దుర్మార్గం. ఫిర్యాదీకి దర్యాప్తు నివేదిక ఇవ్వాలి. ఆమెకి తన ఫిర్యాదుపైన ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ఉంది. (CIC-/A-/ 2016/306867, PIO, Council of Scientific & In-dustrial research కేసులో ఏప్రిల్‌ 13న సీఐసీ ఇచ్చిన ఒక ఆదేశం ఆధారంగా)

మాడభూషి శ్రీధర్‌

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement