ప్రైవేట్‌ ఆసుపత్రుల స్టెంట్‌ దోపిడీ | Sridhar writes on heart stents | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆసుపత్రుల స్టెంట్‌ దోపిడీ

Published Fri, Jun 9 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

ప్రైవేట్‌ ఆసుపత్రుల స్టెంట్‌ దోపిడీ

ప్రైవేట్‌ ఆసుపత్రుల స్టెంట్‌ దోపిడీ

విశ్లేషణ
అమెరికాలో 1,200 డాలర్లకు దొరికే కరొనరీ స్టెంట్‌లను భారత్‌లో 2,971 డాలర్లకు అమ్ముతున్నారు. ఇది అసలు ధరలకన్నా నాలుగు రెట్లెక్కువ. బీమా సంస్థే కదా చెల్లించేది.. నష్టమేంటనే వారూ ఉన్నారు. బీమా కుప్పగూలే ప్రమాదముంది.

కార్మిక రాజ్య భీమా సంస్థ (ఇఎస్‌ఐసీ) అధ్వర్యంలో 34 స్పెషల్‌ చికిత్సాలయాలు ఉన్నాయి. అయినా కొందరు రోగులను ప్రైవేటు ఆసుపత్రు లకు పంపక తప్పదు. అయితే  ఆ విధంగా సంస్థ పంపిన రోగులనుంచి ప్రైవేటు కార్పొరేట్‌ వైద్యశాలలు స్టెంట్‌ వంటి వస్తువులు అమర్చడానికి విపరీతంగా ఖర్చులు వసూలు చేస్తున్నారంటూ పవన్‌ శాశ్వత్‌ సమగ్ర సమాచారాన్ని కోరాడు. ఇఎస్‌ఐసి వారు కోరిన సమాచారం ఇవ్వడం లేదని సమాచార కమిషన్‌కు అప్పీలు చేసుకున్నారు. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వంటి ప్రభుత్వ వైద్యశాలలు విధించే చార్జీల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వసూలు చేస్తే కనీసం ఏడాదికి రూ.1,500 కోట్ల మేరకు రోగులను దోచుకుంటూ ఉంటే బీమా సంస్థకు తెలియదా? తెలిస్తే ఏంచేశారనేది సవాల్‌. ఆ రోగులకు అమర్చిన పరికరాలకు సంస్థ ఎంత డబ్బు చెల్లించిందో వివరాలు అడిగారు. ప్రైవేటు వైద్యశాలలకు ఎంతమంది రోగులను బీమాసంస్థ పంపిందో, వారి శరీరంలో అమర్చిన స్టెంట్‌ వంటి పరికరాల కోసం ఎంత మొత్తంలో బిల్లుల చెల్లింపు చేసిందో వివరించాలని కోరాడు. సరైన సమాచారం అందలేదు.

కేంద్రప్రభుత్వ ఆరోగ్యసేవల విభాగం (సీజీహెచ్‌ ఎస్‌) రేట్లను అనుసరిస్తుందని, ఆ రేట్లు లేనపుడు ఎఐఐ ఎంఎస్‌ నిర్ణయించిన రేట్లను అనుసరిస్తుందని కార్మిక రాజ్య భీమాసంస్థ అధికారులు వివరించారు. రెండు చోట్లా రేట్లు లేనపుడు ప్రైవేటు వైద్యశాల రేటును కొంత రిబేటుతో ఆమోదిస్తుందని వివరించారు. కొన్ని సందర్భాలలో రెండున్నర రెట్లు ఎక్కువ ధర వసూలుచేస్తున్నారని తెలిసి కూడా రోగులను ఆ వైద్యశాలలకే ఎందుకు పంపుతున్నారో  చెప్పాలని శాశ్వత్‌ కోరారు. వారు విపరీతంగా పెంచిన రేట్ల ప్రకారం వందల కోట్ల రూపాయలు ఎందుకు చెలిస్తున్నారన్నది ప్రశ్న. ఇది లోతుగా దర్యాప్తు చేయవలసిన కుంభకోణం కావచ్చు. రేట్ల నిర్ధారణ సరిగా లేకపోవడం వల్ల ఎక్కువ చెల్లించవలసి వస్తున్నదని ప్రభుత్వానికి బీమాసంస్థ ఫిర్యాదు కూడా చేయలేదు. సంస్థలో పనిచేసే ఉన్నతాధికారులందరికీ ఈ అన్యాయపు రేట్ల వసూలు తెలుసు. ప్రైవేటు వైద్యశాలల వారు కోట్లరూపాయల లాభాలు గడిస్తుంటే, సొంత ప్రయోజనం ఏదీ లేకుండా అధికారులు చూస్తూ ఊరుకుంటారా? అసలు ధరకన్నా మరీ ఎక్కువ ధర వసూలుచేసినట్టు రుజువైతే ఆ ప్రైవేటు వైద్యశాల రోగిని, ప్రభుత్వాన్ని కూడా మోసం చేసినట్టే అవుతుంది. అందుకు సహకరించిన వారిని కూడా ప్రాసిక్యూట్‌ చేయవలసి ఉంటుంది. ఇది ఒక్కరితోనో ఇద్దరితోనో ముగిసే సమస్య కాదు. దేశ వ్యాప్తంగా వేలాది మందినుంచి లక్షలాది రూపాయలు దారుణంగా వసూలుచేసిన కుంభకోణంగా తేలే అవకాశం ఉంది.

హృద్రోగులకు అమర్చే కార్డియోవర్టర్‌ డెఫిబ్రిలేటర్‌ (ఐసీడీ) ఒకే అర ఉన్నది, రెండు అరలున్న పరికరానికి ఎఐఐఎంఎస్‌ 1.75 లక్షలు వసూలుచేస్తే, కార్మిక రాజ్యబీమా సంస్థ పంపిన పేషంట్లకు 5.5 లక్షల నుంచి 8.5 లక్షల దాకా చెల్లిస్తున్నది. కార్డియాక్‌ రీసింక్రొనైజేషన్‌ థెరపీ (సీఆర్‌టీ) పరికరానికి ధర 4.25 లక్షలైతే వీరు 7.5 నుంచి 11 లక్షలదాకా చెల్లిస్తున్నారు. íసీఆర్‌టీకి డెఫిబ్రిలేటర్‌ను తగిలించినందుకు 4.9 లక్షలయితే భీమా సంస్థ వారు ఎంతో ఔదార్యంతో 12.5 నుంచి 14.5 లక్షలదాకా ఇచ్చేస్తున్నారు. మరో ఘోరం ఏమంటే ఈ పరికరాలకే ఇచ్చే ధరలో ఇఎస్‌ఐ దవాఖానాల మధ్య బోలెడంత తేడా కనిపిస్తున్నది. ఉదాహరణకు బాపునగర్‌ ఇఎస్‌ఐ వారు 2.7 లక్షలు ఇచ్చే ఒక పరికరానికి ఐజీ ఇఎస్‌ఐ వారు 8 లక్షలు చెల్లిస్తున్నారు. అసలు రోగికి అవసరం లేకపోయినా ఈ పరికరాలు అమర్చి దానికి లక్షలు బీమా సంస్థనుంచి వసూలు చేసే దుర్మార్గం కూడా జరుగుతున్నదని నారాయణ హృదయాలయ వైద్యనిపుణులు డాక్టర్‌ దేవిశెట్టి, అపోలో హైదరాబాద్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ మనోజ్‌ అగర్వాల్‌ విమర్శించి నట్టు జూన్‌ 25, 2015 నాటి వార్తా కథనం తెలియజేస్తున్నది.

కరొనరీ స్టెంట్‌లను జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చాలని ఒక న్యాయవాది బీరేందర్‌ సాంగ్వాన్‌ ఒక పిల్‌ కూడా వేశారు. విపరీతమైన రేట్ల వల్ల నిజంగా ఈ స్టెంట్లు అవసరమైన వారు కూడా ముందుకు రావడం లేదు. 2013 నుంచి 2016 వరకు ఏటా 1,500 కోట్ల రూపాయల మేరకు కార్మిక బీమాసంస్థను ప్రైవేటు వైద్యదుకాణాలు దోచుకున్నాయని శాశ్వత్‌ వివరించారు. శాశ్వత్‌ ఈ అంశాలను వివరిస్తూ ఎన్నోసార్లు వినతి పత్రాలను కార్మిక బీమా సంస్థ డైరెక్టర్‌ జనరల్‌కు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారికి పంపినా దిక్కు లేదు. 29 మే 2015న ప్రధానమంత్రి కార్యాలయానికి వివరంగా వినతి చేసినా పట్టించుకున్న నాథుడు లేడు.

అమెరికన్‌ హెల్త్‌ అసోసియేషన్‌ వారి పరిశోధన ప్రకారం అమెరికాలో 1,200 డాలర్లకు దొరికే ఈ పరికరాలను భారత్‌లో 2,971 డాలర్లకు అమ్ముతున్నారు. అసలు ధరలకన్నా నాలుగు రెట్లెక్కువ భారత్‌లో చెల్లిస్తున్నారు. సిజిహెచ్‌ఎస్‌ వారు ఎఐఐఎంఎస్‌ వారు నిర్ణయించిన రేట్లకన్నా 2.5 రెట్లు ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం ఏముంది? బీమా సంస్థే కదా చెల్లించేది.. నష్టమేమిటని వాదించే వారూ ఉన్నారు. బీమా కుప్పగూలిపోయే ప్రమాదం ఉందని గమనించాలి. దీనిపైన ఏచర్యలు తీసుకున్నారో చెప్పాలని, అడిగిన వివరాలన్నీ ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించింది. (పవన్‌ శాశ్వత్‌ వర్సెస్‌ ఇఎస్‌ఐసీ CIC/BS/C-/2015/000118 కేసులో 8.5. 2017న ఇచ్చిన ఆదేశం ఆధారంగా).

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement