madhabhushi sridhar
-
ప్రజాస్వామ్య పాలనతోనే ప్రగతి
ఎచ్చెర్ల క్యాంపస్ : పారదర్శకమైన, ప్రజాస్వామ్య పాలనతో నే దేశ ప్రగతి సాధ్యం అవుతుందని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచారి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రజాస్వామ్యంలో పాదర్శక పాలన ప్రాధాన్యత, ప్రస్తుతం సమాచా ర హక్కు చట్టం ప్రాధాన్యతపై విద్యార్థులు, బోధనా సిబ్బందినుద్దేశించి మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే పేద ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. పేద ప్రజలు ప్రగతి సాధించా లంటే నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరాలని చెప్పారు. రాజకీయ జోక్యం, లంచాల వ ల్ల సమాజంలో పేదలకు, అర్హులకు ప్రభుత్వ పథకాలు చేరకుండా పోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన, లబ్ధిదారుల ఎంపిక, ప్రజాస్వామ్యంలో కార్యనిర్వహక శాఖ పనితీరు ప్రజలు తెలుసుకునే అవకాశం సమాచార హక్కు చట్టం ద్వారా అందుబాటులోకి వచ్చిందన్నారు. తెల్ల రేషన్ కార్డు, రూ. 10 ఖర్చుతో ఎటువంటి అవినీతి అక్రమాలను అయినా ప్రజలు వెతికి తీయవచ్చునన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు ఈ హక్కును ఆయుధంగా ఉపయోగించుకొని అవినీతి పాలకులు, ఆధికారులపై పోరాడాలని సూచించారు. 1990 సంవత్సరం నుంచి సమాచార హక్కు చట్టం కోసం పోరాటం సాగిందని, చివరకు 2005లో అమల్లోకి వచ్చిందని వివరించారు. 20 ఏళ్ల సమాచారం ప్రజలు తీసుకోవచ్చునన్నారు. రేషన్ కార్డుకు లంచం అడిగిన అధికారిపై, మైనర్ బాలిక కిడ్నాప్‌పై స్పందించని అధికారిపై, లంచాలు. ప్రలోభాలకు సిద్థమై ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా చేసిన ఎందరో అధికారులపై సామాన్యులు విజయం సాధించినట్టు శ్రీధర్ చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హత ప్రామాణికంగా అందజేయకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా నిలదీయ వచ్చునన్నారు. ప్రస్తుతం సమాజంలో జాగృతి పెరగాలని, అవినీతిని కూకట వేళ్లతో సమాజం నుంచి బయటకు తీయవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్ కూన రామ్‌జీ మాట్లాడుతూ విద్యార్థులు సచార హక్కు చట్టం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ కురపాన రఘుబాబు, ప్రిన్సిపాల్ గుంట తులసీరావు, శ్రీకాకుళం ఆర్డీవో టి.వెంకటరమణ, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పి,జగన్నాథరావు, ఎచ్చెర్ల తహసీల్దార్ శ్రీనివాసరావు, జిల్లా సమచార హక్కు చట్టం ప్రతినిధి కె.వసంతరావు పాల్గొన్నారు. -
గోప్యత హక్కుకు పునాది
విశ్లేషణ ఆర్టికల్ 21 జీవన స్వేచ్ఛ పరిధిలోకి గోప్యత, రతి విషయంలో ఐచ్ఛికత వస్తాయని చౌదరి అన్నారు. సాంకేతిక సమాచార విప్లవం వల్ల ప్రైవసీపై ప్రతికూల దాడుల ప్రభావాన్ని కూడా జస్టిస్ చౌదరి 1983లోనే దర్శించగలిగారు. భార్యాభర్తలలో ఒకరు అకారణంగా దాంపత్య జీవనం నుంచి ఉపసంహరించుకుని విడిగా ఉంటే మరొకరు కోర్టుకు వెళ్లి ‘కలసి కాపురం చేసే’ హక్కుందంటూ డిక్రీ పొందవచ్చునని హిందూ వివాహ చట్టం సెక్షన్ 9 పేర్కొన్నది. కాపురం హక్కు దాంపత్య హక్కు అని కవితాత్మకంగా చెప్పే ఈ హక్కు అసలు రూపం ఏమంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రతిలో పాల్గొనాలని ‘బలవంతపు రతి హక్కు’. చట్టం ద్వారా దంపతులలో ఒకరు మరొకరిని ఒప్పించే హక్కు కాదు, ఒప్పుకోకపోయినా రతికి రప్పించే హక్కు. వైవాహిక అత్యాచారం చెల్లదంటూ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. గోప్యత, స్వత్వం, ఎంపిక హక్కులతో కూడిన ప్రైవసీ ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో జస్టిస్ చౌదరి 1983లో ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పు గుర్తుకొస్తుంది. 16 ఏళ్ల సరితతో వెంకటసుబ్బయ్య వివాహం జరిగింది. కాని అయిదేళ్లుగా వారు విడిగా ఉన్నారు. సరిత పెద్ద సినీనటిగా ఎదిగినారు. వెంకటసుబ్బయ్య తనకు సరితతో కాపురం చేసే హక్కు ఉందని డిక్రీ సాధించారు. అది ఇష్టం లేని వివాహమని, తనను బలవంతంగా కాపురానికి పంపకూడదని, అసలు సెక్షన్ 9 రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సరిత సవాలు చేశారు. శారీరకంగా మరొకరితో కలియడమా, లేదా అనే విషయంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ సహజంగా ఉందని, ఇష్టంలేని రతి డిక్రీలు ఇవ్వడం అన్యాయమనీ ఆమె వాదించారు. జస్టిస్ చౌదరి కాపురం హక్కులో రెండు భావాలు ఉన్నాయన్నారు. 1. దంపతులలో ఒకరికి మరొకరితో కలసి ఉండే హక్కు. 2. వైవాహిక సంయోగం. అన్నాసాహెబ్ వర్సెస్ తారాబాయి కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిస్తూ, భర్త ప్రవర్తనలో లోపం లేనపుడు, భార్యకు ఇష్టం లేకపోయినా ఆమెతో కాపురం చేయాలని ఆదేశించే డిక్రీని సమర్థించింది. ఇక ఆ తారాబాయి గతేమిటో చదువరుల ఊహకే వదలాలి అని జస్టిస్ చౌదరి వ్యాఖ్యానించారు. మహాకవి శ్రీశ్రీ చెప్పిన రాక్షస రతి ఇదేననీ, ఇది క్రూరమైన చట్టమనీ చౌదరి అన్నారు. బతికే హక్కు అంటే జంతువు వలె ఏదో రకంగా ప్రాణం నిలబెట్టుకోవడం కాదు, ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించడాన్ని ఆర్టికల్ 21 ఆశిస్తున్నది. ఖరక్ సింగ్ కేసులో సుబ్బారావు అసమ్మతి తీర్పును ఉటంకిస్తూ, ఆర్టికల్ 21 జీవన స్వేచ్ఛ పరిధిలోకి గోప్యత, రతి విషయంలో ఐచ్ఛికత వస్తాయని చౌదరి అన్నారు. సాంకేతిక సమాచార విప్లవం వల్ల ప్రైవసీపై ప్రతికూల దాడుల ప్రభావాన్ని కూడా చౌదరి 1983లోనే దర్శించగలిగారు. సుబ్బారావు అసమ్మతి తీర్పు, గోవింద్ కేసు, అమెరికాలో గ్రిస్ వరల్డ్ జానే రో కేసులను చౌదరి ప్రస్తావించి విశ్లేషించారు. కుటుంబ సభ్యుల మధ్య సామీప్యత, ఆంతరంగికత, వైవాహిక సంబంధాలు, మాతృత్వం, పిల్లలను కనిపెంచడం వంటి అంశాలన్నీ గోప్యతా హక్కు పరిధిలో ఉన్నాయని, మానవ జీవన ఆనందానికి ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశాలు ఏలిన వారి జోక్యం వల్ల దెబ్బతింటే రిట్ పిటిషన్లో అడిగే హక్కు ఉందని, పాలకులు ప్రమాద ఘంటికలు వినబడితే తప్ప ఇటువంటి విషయాల్లో అనవసరంగా, అసమంజసంగా జోక్యం చేసుకునే వీల్లేదని గోవింద్ కేసులో సుప్రీంకోర్టు చేసిన విశ్లేషణను చౌదరి సమర్థించి మరింత విస్తరించారు. ఓంస్టెడ్ కేసులో జస్టిస్ బ్రాండీస్ అసమ్మతి తీర్పుతో చౌదరి తన వాదాన్ని మరింత పరిపుష్ఠం చేశారు. ప్రశాంతత, చొరబాటులేని ఏకాంతత, ఆంతరంగిక నిర్ణయ స్వేచ్ఛ అనేవి గోప్యతలో మూడు కీలకమైన అంశాలని గేరీ ఎల్. బోస్ట్ విక్ అనే రచయిత పేర్కొన్నారు. జస్టిస్ చౌదరి ఈ అంశాలన్నీ పరిశీలించి, సెక్షన్ 9 కింద బలవంతపు కాపురపు ఉత్తర్వులివ్వాలనే చట్ట నియమం రాజ్యాంగ ప్రా«థమిక హక్కుల సూత్రాలకు పూర్తి భిన్నంగా ఉందని, కనుక చెల్లదని వెల్లడించారు. జస్టిస్ చౌదరి తీర్పు ఆనాడు ఢిల్లీ హైకోర్టును మెప్పించలేకపోయింది. హిందూ వివాహ చట్టం సెక్షన్ 9 చెల్లుతుందని, వివాహం అనే వ్యవస్థను రక్షించడానికి అంగీ కారంతో ప్రమేయం లేకుండా కాపురం హక్కు డిక్రీ అధికారం ఉండాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది, ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. జస్టిస్ సుబ్బారావు, గోవింద్, అమెరికా తీర్పులు, బోస్ విక్, గ్రిస్వాల్డ్ కేసులు చర్చిస్తూ జస్టిస్ చౌదరి ఇచ్చిన తీర్పులో అంశాలను ఆ కేసులనే ప్రస్తావిస్తూ, తొమ్మిదిమంది న్యాయమూర్తుల ధర్మాసనం గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించడం ద్వారా1983 నాటి ఆయన ఆలోచనకు గౌరవం లభించినట్టయింది. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ప్రైవేట్ ఆసుపత్రుల స్టెంట్ దోపిడీ
విశ్లేషణ అమెరికాలో 1,200 డాలర్లకు దొరికే కరొనరీ స్టెంట్లను భారత్‌లో 2,971 డాలర్లకు అమ్ముతున్నారు. ఇది అసలు ధరలకన్నా నాలుగు రెట్లెక్కువ. బీమా సంస్థే కదా చెల్లించేది.. నష్టమేంటనే వారూ ఉన్నారు. బీమా కుప్పగూలే ప్రమాదముంది. కార్మిక రాజ్య భీమా సంస్థ (ఇఎస్ఐసీ) అధ్వర్యంలో 34 స్పెషల్ చికిత్సాలయాలు ఉన్నాయి. అయినా కొందరు రోగులను ప్రైవేటు ఆసుపత్రు లకు పంపక తప్పదు. అయితే ఆ విధంగా సంస్థ పంపిన రోగులనుంచి ప్రైవేటు కార్పొరేట్ వైద్యశాలలు స్టెంట్ వంటి వస్తువులు అమర్చడానికి విపరీతంగా ఖర్చులు వసూలు చేస్తున్నారంటూ పవన్ శాశ్వత్ సమగ్ర సమాచారాన్ని కోరాడు. ఇఎస్ఐసి వారు కోరిన సమాచారం ఇవ్వడం లేదని సమాచార కమిషన్‌కు అప్పీలు చేసుకున్నారు. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి ప్రభుత్వ వైద్యశాలలు విధించే చార్జీల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వసూలు చేస్తే కనీసం ఏడాదికి రూ.1,500 కోట్ల మేరకు రోగులను దోచుకుంటూ ఉంటే బీమా సంస్థకు తెలియదా? తెలిస్తే ఏంచేశారనేది సవాల్. ఆ రోగులకు అమర్చిన పరికరాలకు సంస్థ ఎంత డబ్బు చెల్లించిందో వివరాలు అడిగారు. ప్రైవేటు వైద్యశాలలకు ఎంతమంది రోగులను బీమాసంస్థ పంపిందో, వారి శరీరంలో అమర్చిన స్టెంట్ వంటి పరికరాల కోసం ఎంత మొత్తంలో బిల్లుల చెల్లింపు చేసిందో వివరించాలని కోరాడు. సరైన సమాచారం అందలేదు. కేంద్రప్రభుత్వ ఆరోగ్యసేవల విభాగం (సీజీహెచ్ ఎస్) రేట్లను అనుసరిస్తుందని, ఆ రేట్లు లేనపుడు ఎఐఐ ఎంఎస్ నిర్ణయించిన రేట్లను అనుసరిస్తుందని కార్మిక రాజ్య భీమాసంస్థ అధికారులు వివరించారు. రెండు చోట్లా రేట్లు లేనపుడు ప్రైవేటు వైద్యశాల రేటును కొంత రిబేటుతో ఆమోదిస్తుందని వివరించారు. కొన్ని సందర్భాలలో రెండున్నర రెట్లు ఎక్కువ ధర వసూలుచేస్తున్నారని తెలిసి కూడా రోగులను ఆ వైద్యశాలలకే ఎందుకు పంపుతున్నారో చెప్పాలని శాశ్వత్ కోరారు. వారు విపరీతంగా పెంచిన రేట్ల ప్రకారం వందల కోట్ల రూపాయలు ఎందుకు చెలిస్తున్నారన్నది ప్రశ్న. ఇది లోతుగా దర్యాప్తు చేయవలసిన కుంభకోణం కావచ్చు. రేట్ల నిర్ధారణ సరిగా లేకపోవడం వల్ల ఎక్కువ చెల్లించవలసి వస్తున్నదని ప్రభుత్వానికి బీమాసంస్థ ఫిర్యాదు కూడా చేయలేదు. సంస్థలో పనిచేసే ఉన్నతాధికారులందరికీ ఈ అన్యాయపు రేట్ల వసూలు తెలుసు. ప్రైవేటు వైద్యశాలల వారు కోట్లరూపాయల లాభాలు గడిస్తుంటే, సొంత ప్రయోజనం ఏదీ లేకుండా అధికారులు చూస్తూ ఊరుకుంటారా? అసలు ధరకన్నా మరీ ఎక్కువ ధర వసూలుచేసినట్టు రుజువైతే ఆ ప్రైవేటు వైద్యశాల రోగిని, ప్రభుత్వాన్ని కూడా మోసం చేసినట్టే అవుతుంది. అందుకు సహకరించిన వారిని కూడా ప్రాసిక్యూట్ చేయవలసి ఉంటుంది. ఇది ఒక్కరితోనో ఇద్దరితోనో ముగిసే సమస్య కాదు. దేశ వ్యాప్తంగా వేలాది మందినుంచి లక్షలాది రూపాయలు దారుణంగా వసూలుచేసిన కుంభకోణంగా తేలే అవకాశం ఉంది. హృద్రోగులకు అమర్చే కార్డియోవర్టర్ డెఫిబ్రిలేటర్ (ఐసీడీ) ఒకే అర ఉన్నది, రెండు అరలున్న పరికరానికి ఎఐఐఎంఎస్ 1.75 లక్షలు వసూలుచేస్తే, కార్మిక రాజ్యబీమా సంస్థ పంపిన పేషంట్లకు 5.5 లక్షల నుంచి 8.5 లక్షల దాకా చెల్లిస్తున్నది. కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ (సీఆర్టీ) పరికరానికి ధర 4.25 లక్షలైతే వీరు 7.5 నుంచి 11 లక్షలదాకా చెల్లిస్తున్నారు. íసీఆర్టీకి డెఫిబ్రిలేటర్‌ను తగిలించినందుకు 4.9 లక్షలయితే భీమా సంస్థ వారు ఎంతో ఔదార్యంతో 12.5 నుంచి 14.5 లక్షలదాకా ఇచ్చేస్తున్నారు. మరో ఘోరం ఏమంటే ఈ పరికరాలకే ఇచ్చే ధరలో ఇఎస్ఐ దవాఖానాల మధ్య బోలెడంత తేడా కనిపిస్తున్నది. ఉదాహరణకు బాపునగర్ ఇఎస్ఐ వారు 2.7 లక్షలు ఇచ్చే ఒక పరికరానికి ఐజీ ఇఎస్ఐ వారు 8 లక్షలు చెల్లిస్తున్నారు. అసలు రోగికి అవసరం లేకపోయినా ఈ పరికరాలు అమర్చి దానికి లక్షలు బీమా సంస్థనుంచి వసూలు చేసే దుర్మార్గం కూడా జరుగుతున్నదని నారాయణ హృదయాలయ వైద్యనిపుణులు డాక్టర్ దేవిశెట్టి, అపోలో హైదరాబాద్ వైద్య నిపుణులు డాక్టర్ మనోజ్ అగర్వాల్ విమర్శించి నట్టు జూన్ 25, 2015 నాటి వార్తా కథనం తెలియజేస్తున్నది. కరొనరీ స్టెంట్లను జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చాలని ఒక న్యాయవాది బీరేందర్ సాంగ్వాన్ ఒక పిల్ కూడా వేశారు. విపరీతమైన రేట్ల వల్ల నిజంగా ఈ స్టెంట్లు అవసరమైన వారు కూడా ముందుకు రావడం లేదు. 2013 నుంచి 2016 వరకు ఏటా 1,500 కోట్ల రూపాయల మేరకు కార్మిక బీమాసంస్థను ప్రైవేటు వైద్యదుకాణాలు దోచుకున్నాయని శాశ్వత్ వివరించారు. శాశ్వత్ ఈ అంశాలను వివరిస్తూ ఎన్నోసార్లు వినతి పత్రాలను కార్మిక బీమా సంస్థ డైరెక్టర్ జనరల్‌కు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారికి పంపినా దిక్కు లేదు. 29 మే 2015న ప్రధానమంత్రి కార్యాలయానికి వివరంగా వినతి చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ వారి పరిశోధన ప్రకారం అమెరికాలో 1,200 డాలర్లకు దొరికే ఈ పరికరాలను భారత్‌లో 2,971 డాలర్లకు అమ్ముతున్నారు. అసలు ధరలకన్నా నాలుగు రెట్లెక్కువ భారత్‌లో చెల్లిస్తున్నారు. సిజిహెచ్ఎస్ వారు ఎఐఐఎంఎస్ వారు నిర్ణయించిన రేట్లకన్నా 2.5 రెట్లు ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం ఏముంది? బీమా సంస్థే కదా చెల్లించేది.. నష్టమేమిటని వాదించే వారూ ఉన్నారు. బీమా కుప్పగూలిపోయే ప్రమాదం ఉందని గమనించాలి. దీనిపైన ఏచర్యలు తీసుకున్నారో చెప్పాలని, అడిగిన వివరాలన్నీ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. (పవన్ శాశ్వత్ వర్సెస్ ఇఎస్ఐసీ CIC/BS/C-/2015/000118 కేసులో 8.5. 2017న ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
భార్య పేరును ఆమెకే చెప్పరా?
వ్యక్తిగతమంటూ సర్వీసు రికార్డుల్లోని భార్య పేరును దాచడం మేలా? లేక భార్యే అడుగుతున్నదని చెప్పడం సమంజసమా? ఆలోచించాలి. రెండో పెళ్లి చేసుకున్న వాడిని రక్షించాలనుకోవడం నేరాలను ప్రోత్సహించడమే. ఆర్టీఐ ప్రశ్న: సర్వీసు రికార్డులో నీ భార్య పేరేమిటి? కార్మిక దవాఖానలో పెద్ద ప్రొఫెసర్ సర్వీసు రికార్డు వివరాలు కావాలని భార్య సమాచార హక్కు దరఖాస్తు పెట్టుకున్నది. వైవాహిక తగాదాలతో ఆ ఇద్దరూ కోర్టుకెక్కారు. కను కనే తన సర్వీసు వివరాలు ఇవ్వకూడదని భర్త అభ్యంతరం చెప్పారు. సమాచారం ఇవ్వకుండా తప్పించుకోవడం ఎలా అని ఆలోచించే కొన్ని మెదళ్లు ఏమీ ఇవ్వవు. బోలెడు సాకులు చూపుతారు. ఈ దేశంలో పౌరుడివేనా? అయితే రుజువు తెమ్మం టారు. భార్య ఆర్టీఐ కింద భర్త సర్వీసు రికార్డు వివరాలు అడిగితే... నువ్వు భార్యవే అని నమ్మకం ఏమిటి? అని అడుగుతారు. ఆమె తన వివాహ రిజి స్ట్రేషన్ సర్టిఫికెట్ ప్రతిని పీఐఓకు ముందే ఇచ్చింది. నీకు మొత్తం సర్వీసు రికార్డులు ఎందుకు, అసలు నీ సమస్య ఏమిటి? అని అడిగే వాడు లేడు. ఆమె మొదటి అప్పీలును కూడా నిరాకరించాకనైనా కమి షన్ ఆ ప్రశ్న వేసినందుకు ఆమె సంతోషించింది. సర్వీసు రికార్డంతా అవసరం లేదు, అందులో భార్య, కూతురు పేర్లు ఎవరివి రాశారో తెలుసు కోవాలన్నదే తన ప్రయత్నం అని వివరించారామె. సాధారణంగా, నీ భార్య పేరు, పిల్లల పేర్లు చెప్పాలని ఆర్టీఐ కింద అడగడానికి వీల్లేదు. అది పూర్తిగా వ్యక్తిగత సమాచారం. కానీ రెండో పెళ్లి నేరమని శిక్షాçస్మృతి నిర్ధారిస్తుండగా, ఏ భర్తయినా రహస్యంగా రెండో పెళ్లి చేసుకుని నేరం చేస్తే నిల దీసే అధికారం మొదటి భార్యకు లేదా? ఆమెకు సమాచారం తెలుసుకునే హక్కు లేదా? అన్నది ప్రశ్న. వ్యక్తిగత సమాచారమైనా ప్రజాప్రయోజనం ఉంటే ఇవ్వాలని ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(ఎ)లో నిర్దేశించింది. తన వ్యక్తిగత సమస్య ప్రజా ప్రయో జనం అవుతుందా? అని అడిగే పీఐఓలు, కమిష నర్లు ఉన్నారు. భర్త చేసిన నేరాన్ని రుజువు చేయడం ప్రజా ప్రయోజనమే అవుతుందని చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. అయినా భార్య అడిగితే భార్య పేరేమిటో చెప్పడానికి సమస్యేమిటి? మరో భార్య ఉంటే ఆ నేరం బయటపడుతుందని భయ పడే వారు ఈ సమస్యలు సృష్టిస్తారు. సాకులు కల్పి స్తారు. రెండు పెళ్లిళ్ల నేరస్తులను భార్యల నుంచి రక్షించడానికి పబ్లిక్ అథారిటీలు నిస్సిగ్గుగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంటారు. వారే కాదు, సంస్కారాలు వదిలేసిన తల్లిదండ్రులు కూడా భార్యను హింసించి ఇంకో పెళ్లి చేసుకున్న అధముణ్ణి సమర్థిస్తారు. ఒక భార్యను వదిలేశాడని తెలిసినా మరొక మహిళ వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండే కాలం ఇది. కనుక ప్రతిదీ చట్టాలను ఉప యోగించి, కోర్టులను కదిలించి, పోలీసు లాఠీలకు పనిచెప్పించి, లంచాలిచ్చి సైతం నేరం రుజువుచేయ డానికి ప్రయత్నించాల్సి వస్తున్నది. భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చి జీవన భృతి వివాదం వస్తే ఇద్దరి మధ్య మొత్తం సమాచార మార్పిడి జరగాల్సిందేనని కుసుం శర్మ వర్సెస్ మహిందర్ కుమార్ శర్మ కేసులో ఢిల్లీ హైకోర్టు 2015లో వివరించింది. భర్త ఆదాయాన్ని భార్య, భార్య ఆదాయాన్ని భర్త అడగవచ్చు, ఆ సమా చారాన్ని ఇవ్వవచ్చు. కోర్టు కూడా స్వయంగా ఆదే శించవచ్చు. జీవనభృతి కేసుల్లో పిటిషన్ వేసిన ప్పుడే భార్యాభర్తలు తమ ఆదాయవ్యయాల వివ రాలు తమంత తామే వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పీఐఓలు ఇది గుర్తుంచుకోవాలి. చట్టాలు, ప్రభుత్వ విధానాలు నేరాలను ప్రోత్స హించరాదు. ఆర్టీఐలో సమాచారం దాచి నేరాలను ప్రోత్సహించే వైఖరి సరికాదు. తన భర్త తన సర్వీసు రికార్డులో తన పేరే ఉంటే దాన్ని దాచాల్సిన అవ సరమే లేదు. వేరే పేరు చెప్పి ఉంటే నేరాన్ని ఒప్పు కున్నట్టే. ఆ నేరాన్ని కప్పిపుచ్చడం కూడా నేరమే అవుతుంది. అలాగే పిల్లల పేర్లు కూడా. తన సంతానం పేర్లే తాను చెప్పి ఉంటే భయం దేనికి? చెప్పకపోతే భయ పడక తప్పదు. చెప్పక తప్పదు. సెక్షన్ 8(2)ను పీఐఓలు, మొదటి అప్పీలు అధికారులు, కమిషనర్లు మరిచిపోతుంటారు. ఆ సెక్షన్ కింద ప్రజా ప్రయోజన ఆధారిత మినహా యింపులు నాలుగే ఉన్నాయి. కానీ మినహాయిం పును వర్తింపచేసే ముందు ఆ సమాచారం దాచితే మేలు జరుగుతుందా లేక వెల్లడిస్తే మేలు జరుగు తుందా? అని ఆలోచించాలి. జవాబును బట్టి సమా చారాన్ని ఇవ్వాలో వద్దో నిర్ణయించాలి. వ్యక్తిగత సమాచారమంటూ సర్వీసు రికార్డుల్లోని భార్య పేరును దాచడం వల్ల మేలు కలుగుతుందా? లేక భార్యే అడుగుతున్నది కనుక చెప్పడం సమంజ సమా? అని ఆలోచించాలి. రెండో పెళ్లి చేసుకున్న వాడు మన పై అధికారనో, మిత్రుడనో వాడిని మొదటి భార్య కేసు నుంచి రక్షించాలనుకుంటే నేరాలను ప్రోత్సహించిన వారవుతారే తప్ప, ప్రజా ప్రయోజనం సాధించిన వారు కారు. నేరాలు జరగ కుండా చూడడం, జరిగిన నేరాలను పట్టించేందుకు సహకరించడం ప్రజా ప్రయోజనం. భార్యా పిల్లలను పోషించడం భర్త చట్టపరమైన విధి. తనకు జీవనోపాధి ఉండి భర్తకు లేకపోతే అతన్ని, పిల్లలను విధికి వదిలేయకుండా ఆదరించడం భార్య బాధ్యత అని చట్టాలు వివరిస్తున్నాయి. తన కూతురు పేరు గాక, వేరొక పేరును ఆమె భర్త సర్వీసు రికార్డులో నమోదు చేయించి ఉంటే కూతురి పోషణ బాధ్యత సమస్యే అవుతుంది. కనుక ఆ సమాచారం ఇవ్వక తప్పదు. (నేత్రావతి ఆదిబట్టి వర్సెస్ పీఐఓ, ఈఎస్ఐసి చెన్నై CIC/BS/ C/2016/900077 కేసులో 24.4.2017 న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
బాధితురాలికి ఆ హక్కు ఉంది!
విశ్లేషణ సహజ న్యాయసూత్రాల ప్రకారం బాధితురాలికి న్యాయం చేయడం కోసం సమాచారం ఇవ్వాలి. ఆమె పత్రికలు, మీడియా ప్రచారం కోసం అడగడం లేదని తెలిసి కూడా సమాచారం ఇవ్వకపోవడం ఆమె హక్కును భంగపరచడమే. పారిశ్రామిక విజ్ఞానవేత్తల సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లో పనిచేస్తున్న ఒక పరిశోధకురాలు తనను సీనియర్ ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఐసీసీ ఒక నిజ నిర్ధారణ సంఘాన్ని (ఎఫ్‌ఎఫ్‌సి) నియమించింది. ఆ సంఘం నివేదిక ప్రతిని బాధితురాలు ఆర్టీఐ కింద అడిగినా ఇవ్వలేదు. నిజనిర్ధారణ కమిటి ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చిందనీ, తుది నివేదిక ఇచ్చేదాకా ఏ సమాచారమూ ఇవ్వరాదని పై అధికారులు ఆదేశించారంటూ నిరాకరించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందగానే సర్వీసు నియమాల ప్రకారం శాఖాపరమైన విచారణ ప్రారంభించాలి. ఐపీసీ సెక్షన్ 509 కింద నేరం జరిగిందని ప్రా«థమికంగా తేలితే ఏడురోజులలోగా పోలీసులకు ఫిర్యాదును పంపాలని సెక్షన్ 11 నిర్దేశిస్తున్నది. ఇవేవీ ఈ కేసులో జరిగినట్టు లేవు. ఈ నియమాల ప్రకారం క్రిమినల్ ఫిర్యాదు పోలీసులకు పంపారా అని తెలుసుకునే హక్కు, తన వాదం వినిపించే హక్కు, దర్యాప్తు నివేదిక ప్రతిని పొందే హక్కు ఉన్నాయి. సమాచార హక్కు అదనంగా ఆర్టీఐ చట్టం కింద లభిస్తుంది. దర్యాప్తు జరుగుతున్న దశలో బాధితురాలు తనను కానీ, నిందితుడైన వ్యక్తిని కానీ బదిలీ చేయాలనీ; తనకు మూడు నెలల సెలవు ఇవ్వాలనీ కోరవచ్చు. సెక్షన్ 13 ప్రకారం నిజనిర్ధారణ దర్యాప్తు నివేదిక ఇచ్చిన పదిరోజులలోగా బాధితురాలు లేదా ఫిర్యాదీకి నివేదిక ప్రతిని ఇవ్వాలి. ఆరోపణ నిజమని తేలితే చర్య తీసుకోవాలి. నిందితుడి ఖాతానుంచి నిర్దేశిత సొమ్మును కోసి బాధితురాలికి చెల్లించాలని ఆదేశించవచ్చు. ప్రాథమిక నివేదికే కాబట్టి ఇవ్వలేదని, తుది నివేదిక అందిన తరువాత ఇస్తామనే వాదన చట్టబద్ధంగా లేదు. నివేదిక అంటే ప్రాథమిక, తుది నివేదికలు రెండూ అని అర్థం. ఫిర్యాదు వివరాలు, బాధితురాలిని గుర్తించే వివరాలు, నిందితుడు, సాక్షుల వివరాలు, సంప్రదిం పులు, దర్యాప్తు ప్రక్రియ సమాచారం, ఐసీసీ లేదా లోకల్ కమిటీ సిఫార్సులు సంబంధం లేనివారికి, ప్రెస్ మీడియాలకు ఇవ్వడానికి వీల్లేదని సెక్షన్ 16 నిర్దేశించింది. సమాచార హక్కు చట్టంలో ఏమి ఉన్నప్పటికీ, ఈ సమాచారం ఇవ్వడానికి వీల్లేదని ఉంది. అయితే బాధితురాలి పేరు సాక్షుల పేర్లు తప్ప, బాధితురాలికి న్యాయం చేసే వివరాలను ఇవ్వవచ్చు. ఈ సెక్షన్ వినియోగించి బాధితురాలికి కూడా వివరాలు ఇవ్వకూడదని ప్రభుత్వ కార్యాలయం నిర్ణయిం చడం చాలా అన్యాయం. సహజ న్యాయసూత్రాల ప్రకా రం బాధితురాలికి న్యాయం చేయడం కోసం సమాచారం ఇవ్వాలి. ఆమె పత్రికలు, మీడియా ప్రచారం కోసం అడగడం లేదని తెలిసి కూడా సమాచారం ఇవ్వకపోవడం ఆమె హక్కును కావాలని భంగపరచడమే. సెక్షన్ 19, 2013లో చేసిన నిబంధనల ప్రకారం వీలైనంత త్వరలో విచారణ ముగించి, సత్వరమే చర్యలు తీసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉంది. నిబంధన 7(3) ప్రకారం ప్రతివాది లేదా నిందితుడు ఇచ్చిన వాదం, సాక్షుల జాబితాను బాధితురాలికి ఇవ్వాలి. సహజ న్యాయసూత్రాల ప్రకారం విచారణ జరిపించాలని కూడా నియమాలు వివరిస్తున్నాయి. ఈ కేసులో వీట న్నింటినీ ఉల్లంఘించారు. ప్రాథమిక నివేదిక ఇస్తే తరువాత దర్యాప్తునకు విఘాతం కలుగుతుంది కనుక ప్రతి ఇవ్వబోమని సెక్షన్ 8(1)హెచ్ మినహాయింపును కూడా దుర్వినియోగం చేశారు. కార్యాలయంలో లైంగిక వేధిం పులు మహిళల జీవన హక్కును, పనిచేసే హక్కును హరిస్తాయని సుప్రీంకోర్టు, మన పార్లమెంటు, అంతర్జాతీయ న్యాయసూత్రాలు ఘోషిస్తున్నాయి. ప్రపంచ మానవ హక్కుల వేదికలు చెప్పాయి. పనిచేసే చోట మహిళల లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిహార చట్టం ఆ హక్కులను 2013లో స్పష్టంగా వివరించింది. ఆ కారణంగా ఈ సమాచారం కూడా జీవన, స్వేచ్ఛాహక్కుల సంబంధిత సమాచారం అవుతుంది. కనుక 48 గంటల్లో ఇవ్వాలి. ఆర్టీఐ కింద 2 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం, 2013 చట్టం కింద 10 రోజుల్లో ఇవ్వాల్సిన నివేదిక, ఆర్టీఐ చట్టం కింద కనీసం నెలరోజుల్లోనైనా ఇవ్వకుండా మూడేళ్లు ఆలస్యం చేసిన అధికారులకు జరిమానా నోటీసు జారీచేసింది కమిషన్. సమాచారం వెంటనే ఇవ్వాలని ఆదేశించింది. ఒకవైపు లైంగిక వేధింపుల నివారణ చట్టం పదిరోజుల్లో నివేదిక ఇవ్వమని చెప్పే సెక్షన్‌ను వదిలేసి, మీడియాకు ఇవ్వకూడదనే సెక్షన్‌తో ఈ అధికారి దుర్వినియోగం చేశారు. లైంగిక వేధింపుల ఫిర్యాదు ఆరోపణలు, బాధితురాలి పేరు, నిందితుడి పేరు సమాచార హక్కు చట్టం కింద కూడా ఇవ్వకూడదనీ, మీడియాకు పత్రికలకు ఇతరులకు ఇవ్వకూడదనీ ఈ సెక్షన్ తెలియచేస్తున్నది. బాధితురాలికి ఫిర్యాదీకి ఇవ్వకూడదని ఈ సెక్షన్లో లేదు. కానీ అధికారులు ఇవ్వడం లేదు. ఆర్టీఐ దరఖాస్తును అధికారులు అక్రమంగా తిరస్కరిస్తున్నారు. అనవసరమైన ప్రచారాన్ని నివారించి మహిళ గౌరవాన్ని కాపాడడానికి ఉద్దేశించిన ఈ సెక్షన్‌ను ఆ బాధితురాలి హక్కులను కాలరాయడానికే వాడడం దుర్మార్గం. ఫిర్యాదీకి దర్యాప్తు నివేదిక ఇవ్వాలి. ఆమెకి తన ఫిర్యాదుపైన ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ఉంది. (CIC-/A-/ 2016/306867, PIO, Council of Scientific & In-dustrial research కేసులో ఏప్రిల్ 13న సీఐసీ ఇచ్చిన ఒక ఆదేశం ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
బార్ కౌన్సిల్‌కూ దాపరికమేనా?
న్యాయశాస్త్రాన్ని నేర్పే కళాశాలల వారు ఇచ్చిన అన్ని నివేదికలను, అవి విద్యార్థులకు సమకూర్చుతున్నామంటున్న సౌకర్యాల వివరాలను బహిర్గతం చేయాలి. అప్పుడే ఆ విషయాలను తెలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు లభిస్తుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సభ్యులలో ఒకరు ఎన్ని సార్లు విదేశీ యాత్రలు చేశారో, అందుకు కారణాలు ఏమిటో వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద ఒక న్యాయవాది కోరారు. ఉత్తరా ఖండ్ నుంచి ఎన్నికైన మరొక బీసీఐ సభ్యుడు భట్ సిఫార్సుల ద్వారా ఎన్ని న్యాయశాస్త్ర కళాశాల లకు భారత న్యాయవాదులమండలి అనుమతిని ప్రదానం చేసిందని కూడా అడిగారు. యూనివర్సిటీల పరిశీలన కమిటీ, నివేదిక సిఫార్సుల వివరాలన్నీ గోప్యంగా ఉంచా ల్సినవి అంటూ ఈ వివరాలు ఇవ్వడానికి బీసీఐ నిరాకరిం చింది. 2009–2015 మధ్య బీసీఐ సభ్యులెవరూ విదేశీ యాత్రలు చేయలేదని పీఐఓలు చెప్పారు. అడ్వకేట్ల చట్టం 1961 సెక్షన్ 7(1)(హెచ్) ప్రకారం న్యాయశాస్త్ర విద్యలో ప్రమాణాలను కాపాడే గురుతర బాధ్యత బీసీఐపైన ఉంది. తమ సభ్యుడిగా చేరి న్యాయ వాద వృత్తి నిర్వహించడానికి కావలసిన యోగ్యమైన న్యాయవిద్య అతనికి ఉందా, పట్టా ఇచ్చిన విశ్వవిద్యాల యానికి తగిన ప్రమాణాలున్నాయా? అని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవలసిన బాధ్యత కూడా దానిపై ఉంది. యూనివర్సిటీలకు వెళ్లి తనిఖీ చేయాలి. రికార్డులు తెప్పించుకుని చూడాలి. భవనాలు, గ్రం«థాలయం, హాస్టళ్లు, ఇతర వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో పరీక్షిం చాలి. బీసీఐ పరిశీలనకు వచ్చినపుడు ప్రమాణాలను పరీ క్షించడానికి వీలైన అన్ని సరైన సౌకర్యాలను కళాశాలలో ప్రతి బాధ్యతాయుతమైన వ్యక్తి కల్పించవలసి ఉంటుందని కూడా ఈ చట్టంలో ఉంది. బీసీఐ ఇన్స్పెక్షన్ మాన్యువల్ ఒకటో అధ్యాయం ప్రకారం బీసీఐ చాలా లోతైన సమగ్ర పరిశీలన జరపాలి. బీసీఐకి పనికివచ్చే లాయర్లను ఇవ్వగల సామర్థ్యం దానికి ఉందో లేదో తేల్చాలి. దేశంలో ప్రస్తుతం రెండు రకాల న్యాయ కళాశాలలు ఉన్నాయి. కొన్ని జాతీయ న్యాయవిశ్వవిద్యాలయాలేగాక, సాధారణ విశ్వవిద్యాలయాల అనుబంధ న్యాయశాస్త్ర కళా శాలలు అనేక వందలు ఉన్నాయి. జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాలకు కావలసినన్ని నిధులు సమకూర్చడానికి రాçష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహంగా ఉంటాయి. దానికి ఒక కారణం నేషనల్ లా స్కూల్స్‌కు ప్రధాన న్యాయమూర్తి చాన్స్‌లర్‌గా ఉండడం. వాటికి ఇచ్చే నిధులలో సగం ఇచ్చినా, అధ్యాపక పదవుల్లో ఉన్నఖాళీలను సమర్థులైన కొత్త వారితో ఎప్పటికప్పుడు భర్తీ చేసినా మామూలు విశ్వవిద్యాలయాల లా కళాశాలలు కూడా బాగుపడతాయి. న్యాయవ్యవస్థ, పాలక వ్యవస్థ సాయంతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు మంచి ప్రమాణాలు, కీర్తి సాధించిన మాట నిజమే. కాని తమ ఉన్నత ప్రమాణాలను ఇతర విశ్వవిద్యాలయ కళాశాలలకు విస్తరించడానికి ఈ సంస్థలు ఏమీ చేయడం లేదు. ఏక శాఖా విశ్వవిద్యా లయాలు వేటికవిగా జాతీయ స్థాయిలో న్యాయశాస్త్ర పట్ట భద్రులను తయారు చేస్తుంటాయి. ఇక అనేక శాఖలున్న విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్ర విభాగానికి కూడా దిక్కూ మొక్కూ ఉండదు. వాటి అనుబంధ న్యాయ కళాశాలలు వేలాది విద్యార్థులకు ఒకేసారి విద్యాబోధన చేస్తూ ఉంటే ప్రమాణాలు నీరుగారిపోకుండటానికి హామీ ఇచ్చేవారు, వాటికి ఆ జవాబుదారీ బాధ్యతను నిర్దేశించేవారూ లేరు. బీసీఐ సభ్యులతో ఏర్పడిన లీగల్ ఎడ్యుకేషన్ కమిటీ న్యాయ విద్యాప్రమాణాలకు బాధ్యత వహించాలి. ఈ కమిటీ పరిశీలనకు వచ్చినపుడు అందరూ నిర్భయంగా ఉన్న సమస్యలు వివరించాలి. ఆ కమిటీ వారు తమ నివేదికలను, తమకు కళాశాల వారు ఇచ్చిన మహజర్లను అందరితోనూ పంచుకోవాలి. కమిటీ ఇచ్చిన నివేదిక, కమిటీకి ఇచ్చిన రికార్డు సమాచారం అవుతుంది. కాపీలు, ఇతర వివరాలు అడిగినప్పుడు ఇవ్వడం వారి బాధ్యత. ఇది గోప్యమైన సమాచారం అయ్యే అవకాశం లేదు. సెక్షన్ 4(1)(బి) ప్రకారం ఈ సమాచారాన్ని ఎవరూ అడగకుండా బీసీఐ ఇవ్వాల్సిందే. అడిగినా ఇవ్వకపోతే సమాచార హక్కు ఏ విధంగా బతుకుతుంది? న్యాయశాస్త్రాన్ని నేర్పే కళాశాలలు నాక్ సంస్థకు, బార్ కౌన్సిల్ కమిటీకి ఇచ్చిన సమాచారాన్ని పంచుకునే జవాబుదారీతనం, పారదర్శకత బీసీఐకి కూడా ఉండాలి. ప్రతి కళాశాల, విశ్వవిద్యాలయం తమవద్ద ఉన్న అధ్యాపకులు ఎవరో వివరించాలి. వారికి ఏ మేరకు వేతనాలను ఇస్తున్నారో రుజువులతో సహా చూపాలి. జాబితాలో చూపిన అధ్యాపకులు నిజంగా ఆ కళాశాలలోనే పనిచేస్తున్నారో లేక మరే కళాశాలలోనో కూడా పనిచేస్తున్నట్టు చెప్పుకుంటున్నారో, లేదో పరిశీలిం చాలి. ఆ కళాశాల వారు ఇచ్చిన అన్ని నివేదికలను, విద్యా ర్థులకు సమకూర్చుతున్నామని చెప్పుకునే అన్ని సౌకర్యాల వివరాలను కూడా బహిర్గతం చేయాలి. అప్పుడే విద్యా ర్థులకు ఆ కళాశాల నిజంగానే సౌకర్యాలు కల్పించిందో, లేదో తెలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు ఉంటుంది. వేతనాల చెల్లింపు వివరాలను కూడా పది మందికి తెలి యజేయాలి. ఇది గోప్యమైన సమాచారమయ్యే అవకాశమే లేదు. బీసీఐ సభ్యుడి విదేశీ పర్యటనకు, విదేశీ విశ్వవిద్యా లయానికి ఇచ్చిన గుర్తింపునకు ఉన్న సంబంధాన్ని వివరిం చాలి. లీగల్ ఎడ్యుకేషన్ కమిటీలో ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందిన కళాశాల వివరాలు ఇవ్వడం కూడా బీసీఐ బాధ్యత. ఆ కమిటీ సభ్యుల పర్యటనలు, వారి నివేదికలు, సిఫార్సులు ఇవ్వాల్సిందేనని సమాచార కమి షన్ ఆదేశించింది. న్యాయశాస్త్ర చదువులను బాగుచేసే బాధ్యత లాయర్లదే. (పాథక్ వర్సెస్ బీసీఐ కేసు నంబర్ CIC/SA/C/2016/000164లో 2.1.2017న కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ఈ దాపరికం ప్రమాదం..!
విశ్లేషణ ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకాలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో నిర్ధారించడానికి న్యాక్ సంస్థకు ఇచ్చిన నివేదికలు ముఖ్యం. ఇవన్నీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయి. వాటిని అడిగిన వారికి ఇవ్వాల్సిందే. ప్రైవేట్ పబ్లిక్ విద్యాసంస్థ లలో బోధనా ప్రమాణాలను రక్షించేదెవరు? అసలు పాఠా లుచెప్పే వారే లేని కళాశాలలు ఎలా నడుస్తున్నాయి? విద్యా ర్థులు ఏం నేర్చుకుంటున్నారు? ఎవరు నేర్పుతున్నారు? జైపూర్ సుబోధ్ కళాశాల వారు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)కు ఇచ్చిన శాశ్వత అధ్యాపకుల జాబితా ప్రతి ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా గిరి ధారి శరణ్ శర్మ అడిగారు. ఇవ్వకుండా న్యాక్ అధికారి ఆ దరఖాస్తును సుబోధ్ కళాశాలకు బదిలీ చేసారు. చాలా ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకులు సరిగా ఉండరు. సరైన వారిని నియమించరు. నియమిస్తే జీతాలు సరిగా ఇవ్వరు. వేతనాలను ప్రభుత్వం నిర్దే శించిన ప్రకారం ఇస్తున్నామని అబద్ధాలు చెబుతారు. పరిశీలక బృందాలను నమ్మించడానికి దస్తావేజులు తయారు చేస్తారు. శాశ్వత సర్వీసులో లెక్చరర్లు ఉన్నట్టు నమ్మిస్తారు. ఉపాధ్యాయులకు తక్కువ జీతాలు, విద్యా ర్థులకు తక్కువ స్థాయి పాఠాలు, యాజమాన్యాలకు ఎక్కువ లాభాలు. పుట్టగొడుగుల్లా వెలిసిన కళాశాలల్లో కుప్పలు తెప్పలుగా బయటకు వచ్చే ఇంజినీర్లు, గ్రాడ్యు యేట్లు, డాక్టర్లు ఎంతమంది పనికొస్తారో తెలియదు. న్యాక్ వారికి ఇచ్చిన అబద్ధపత్రాలను ఎండగట్టడం ఏ విధంగా? కనీసం వారు ఇచ్చిన పత్రాల ప్రతులు అధికారికంగా బయటకు వస్తే వాటి నిజానిజాలు బయ టపెట్టడానికి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు లేదా మోసపోయిన అధ్యాపకులకు వీలవుతుంది. శాశ్వత సర్వీసు అధ్యాపకుల జాబితా ఇవ్వగానే అందులో నిజంగా నియమితులైన వారెందరో తెలిసిపోతుంది. సమాచార హక్కు అవసరం అదే. కళాశాల స్వార్థ పూరిత కార్యక్రమాలను ఆపే బదులు, వారితో పరిశీలకులు కూడా కలిసిపోతే విద్యా ప్రమాణాలకు దిక్కేమిటి? న్యాక్ పరిశీలక బృందానికి కళాశాల యజమానులు ఇచ్చిన అధ్యాపకుల జాబితా ఇవ్వడానికి ఎందుకు భయం? రెండో అప్పీలు కేంద్ర సమాచార కమిషన్ ముందుకు వచ్చింది. న్యాక్ పక్షాన లాయర్ హాజర య్యారు. అధ్యాపకుల జాబితాను కళాశాలవారు ఇవ్వ గానే కమిటీ సభ్యులు అక్కడికక్కడే చదివి, ఆయా అధ్యా పకులు నిజంగా ఉన్నారో లేదో పరిశీలిస్తారట. తరువాత ఆ జాబితా కాగితాలు కళాశాలకే ఇచ్చివేస్తారట. అయితే ఆ విధంగా చెక్ చేసినట్టు, ఇచ్చిన అధ్యా పకుల జాబితా సరిగ్గా ఉన్నట్టు లేదా లోపాలు ఉన్నట్టు ఎక్కడైనా రాసి ఉంటారు కదా, దాని ప్రతులు ఇవ్వ గలరా అనడిగితే జవాబు ‘నాకు తెలియదు. న్యాక్ వారు చెప్పలేదు’ అని. తమసంస్థ దగ్గర ఉండవలసిన పత్రాలు లేవనడం, ఉన్నా ఇవ్వకపోవడం, పైగా సమాచార దర ఖాస్తును కళాశాలకు బదిలీ చేసి, చేతులు దులుపుకో వడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది. దానికి షోకాజ్ నోటీసు ఇవ్వక తప్పదు. సమా ధానం సరిగా లేకపోతే జరిమానా కూడా తప్పదు. ఆ విషయం చెప్పగానే లాయర్ గారు కొంత సమయం అడి గారు. న్యాక్ ఉన్నతాధికారులను అడిగి డాక్యుమెంట్ ఇవ్వడం గురించి చెబుతానన్నారు. న్యాక్ 1994 లో విద్యా ప్రమాణాలను పరిశీలించి ధృవీకరించడానికి ఏర్పడిన సంస్థ. యూజీసీ దీన్ని ఏర్పాటు చేసింది. ఏడు ప్రమాణ పరిశీలనాంశాలను గుర్తించింది. పాఠ్యాంశాలు, బోధనా, అధ్యయన పరి శీలన, పరిశోధన, సలహాలు విస్తరణ అంశాలు, మౌలిక వనరులు, అధ్యయన వనరులు, విద్యార్థుల సమర్థనాం శాలు, పాలన, నాయకత్వం యాజమాన్యం, సృజనాత్మ కత, ఉత్తమ విధానాలు. ఇవి ఉన్నాయో లేదో తేల్చాలి. ప్రతి సంస్థ సొంతంగా తమ కళాశాల వనరుల గురించి సమగ్రంగా అధ్యయన నివేదిక రూపొందించి ఇవ్వాలి. ఈ నివేదిక ఆధారంగానే పరిశీలన ప్రమాణాల నిర్ధారణ జరుగుతుంది. ఈ నివేదికకు అనుబంధంగా అనేక పత్రాలు ఉంటాయి అందులో ఒకటి అధ్యాపకులు, సిబ్బంది జాబితా. ఎంతమంది తాత్కాలిక సిబ్బంది లేదా ఎందరు శాశ్వత ప్రతిపాదికమీద నియమితులై నారు. వారి జీతాల వివరాలు ఉండాలి. న్యాక్ సభ్యులు వీటిని పరిశీలించి తనిఖీ చేయాలి. ఈ విధానమంతా పారదర్శకంగా ఉండాలి. నివేదిక తయారైన తరువాత దాన్ని కళాశాల ఉన్నతాధికారికి ఇస్తారు. ఆయన పరి శీలించి అందులో ఏ వివరాలనైనా పరిశీలించలేదని అని పిస్తే, వ్యతిరేక నిర్ధారణలకు ఆధారం లేదని అనుకుంటే ఆ వివరాలను కమిటీ ముందుకు తేవచ్చు. ఆ తరువాత నివేదికకు తుది రూపు ఇవ్వడానికి అవకాశం ఉంది. టీచర్ల నియామకాలు సరిగా జరుగుతున్నాయో లేదో నిర్ధారించడానికి ఈ న్యాక్ సంస్థకు ఇచ్చిన నివే దికలు ముఖ్యం. ఆ నివేదికలు, అనుబంధాలు అన్నీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం అన్న నిర్వచనంలోకి వస్తాయి. కనుక వాటిని అడిగిన వారికి ఇవ్వక తప్పదు. ఏ విధంగానూ అవి రహస్యాలు కావు. పోటీలో నష్టపరిచే అంశాలు కూడా కావు. ఒక్క ప్రొఫె సర్‌ను అనేక కళాశాలలు తమ అధ్యాపకుడని చెప్పుకునే అవినీతిని నిరోధించడానికి కూడా ఈ సమాచార పార దర్శకత ఉపయోగపడుతుంది. 15 రోజుల్లో అధ్యాపకుల జాబితా ఇవ్వగలమని లాయర్ న్యాక్ తరఫున కమిషన్‌కు హామీ ఇచ్చారు. ఆ విధంగా ధృవీకృత ప్రతి ఇవ్వాలని కమిషన్ ఆదేశిం చింది. న్యాక్ మాత్రమే కాక సుబోధ్ కళాశాల కూడా తమ ఉద్యోగుల జాబితా ఇవ్వాలని కమిషన్ ఆదేశిం చింది. న్యాక్ తన విధి విధానాలను మరింత పార దర్శకంగా రూపొందించాలని, ఈ జాబితాలను కళాశా లల నుంచి సేకరించాలని, ఆర్టీఐ చట్టం కింద అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని కమిషన్ సూచించింది. (గిరిధారి శరణ్ శర్మ వర్సెస్ న్యాక్ CIC/SA/A/2015/001420 కేసులో జనవరి 18న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ప్రేమ జంటలు.. పరువు హత్యలు..!
విశ్లేషణ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం గుర్తించిన హక్కు. ఈ హక్కును వాడుకున్నందుకు యువతీయువకులు పరువుహత్యలకు గురవుతూ రాజ్యాంగపరమైన జీవన హక్కును పూర్తిగా కోల్పోతున్నారు. దీన్ని నివారించే విధానాలు కనిపెట్టాలి. యువతీ యువకులకు వివాహం చేసుకునే స్వేచ్ఛ, వారు అపరిపక్వ నిర్ణయాలతో జీవితాంతం బాధపడ కుండా కాపాడే తల్లిదండ్రుల బాధ్యత మధ్య ఘర్షణ తప్పదు. నైతిక విలువలు అంతటా దిగజారుతున్న ఈ రోజుల్లో ఏది నిజమైన ప్రేమో తెలుసుకొనే లోగానే మోసాలకు గురైన వార్తలు వింటూనే ఉన్నాం. నిజమైన ప్రేమ కారణంగా పిల్లలు వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలతో తమ సంతానాన్నే ద్వేషించే దుర్మార్గానికి కొత్త పేరు పరువు హత్య. ఇందులో పరువు ఏమీ లేదు, హత్య మాత్రం ఉంది. తమ కులాన్ని, వంశాన్ని, ఇష్టాన్ని కాదన్నారన్న ఒకే కారణంతో తమ కూతురిని ఆమెను ప్రేమించిన వ్యక్తిని హత్య చేయడానికి ఆమె కుటుంబం వెనుకాడటం లేదు. ఖాప్ పంచాయతీలు కుల సంఘాలు ఈ హత్యలను సమర్థించడం మరీ దారుణం. ఏప్రిల్ 2011లో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు మార్కండేయ కట్జూ, జ్ఞాన్ సుధా మిశ్రాతో కూడిన ధర్మాసనం పరువు పేరుతో హత్యలను వ్యవస్థీకరించిన ఖాప్ పంచాయితీ లను తీవ్రంగా నిరసించింది. ఉత్తర భారతంలో ఖాప్ పంచా యితీలు, దక్షిణాన తమిళ నాడులో కట్ట పంచాయితీలు క్రూరమైన ఆదేశాలు ఇవ్వడం చెల్లవని వారిని కఠినంగా శిక్షించాలని ధర్మాసనం పేర్కొన్నది. విశ్వలోచన్ మదన్ ప్రజా ప్రయోజన వాజ్యంలో న్యాయమూర్తులు చంద్రమౌళి కె ప్రసాద్, పిసి ఘోష్‌తో కూడిన ధర్మాసనం 2014లో ఖాప్ పంచాయితీలవలె షరియత్ కోర్టులు మఫ్తి లేదా ఖాజీ తీర్పులకు కూడా చట్టబద్ధత లేదని, ఈ ఆదేశాల ఆధారంగా జరిగే పరువు హత్యలను నివారించే బాధ్యత రెవెన్యూ పోలీసు అధికారులకు ఉందని వివరించింది. తమకు తెలిసిన తరువాత అనుమానితులను అరెస్టు చేయక పోవడం, కేసులు పెట్టకపోవడం వల్ల పరువు హత్యా సంఘటనలు జరిగితే జిల్లా మెజిస్ట్రేట్ లేదా ఎస్పీ బాధ్యత వహించాలని, వారిపైన కూడా శాఖాపరమైన ఛార్జిషీటు దాఖలుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం భావించింది. ఇటువంటి సందర్భాలలో అసలు నేరస్తులతో పాటు ప్రత్యక్షంగానో పరోక్షం గానో ఈ అధికారులు కూడా బాధ్యులైనట్టు భావించాలని సూచించింది. లా కమిషన్ 2012లో ఈ అంశాన్ని పరిశీలించింది. ఒక పత్రాన్ని ప్రజాభిప్రాయ సేకరణకు విడుదల చేసింది. తమకు ఇష్టం కాని వివాహాలను నిరోధించడానికి.. జీవన, స్వేచ్ఛా హక్కులను కూడా హరించడానికి కులసంఘాలు కుల సమా వేశాలు బహిరంగంగానే దాడి చేస్తుంటే ప్రస్తుత వ్యవస్థ చట్టాలు కోర్టులు ఆపలేక పోతున్నాయని లా కమిషన్ పేర్కొన్నది. వివాహ నిర్ణయ స్వేచ్ఛలో జోక్యం చేసుకునే చట్టవ్యతిరేక సమావేశాల నిషేధపు చట్టం తీసుకురావాలని సూచించింది. బిల్లును కూడా రూపొందించింది. చట్టం వ్యతిరేకం కాని వివాహాలను ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. చట్ట సమ్మతమైన వివాహాన్ని పరువుకు భంగకరంగా భావించి ఆపే కుట్రలుచేయడం నిషేధించాలని ఈ చట్టాన్ని ప్రతిపాదించింది. కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులపైన ఈ కుట్రలను ఆపే బాధ్యతను ఉంచాలని, ఇటువంటి కుట్రల సమావేశాల్లో పాల్గొన్న వ్యక్తుల పైన 30వేల రూపాయల జరిమానా, మూడేళ్ల దాకా జైలుశిక్ష విధించాలని, వీటిని గుర్తించదగిన, బెయిల్ ఇవ్వతగని, రాజీకీ వీల్లేని నేరాలుగా నిర్ధారించాలనీ ప్రత్యేక కోర్టులో సుమోటోగా కేసులు చేపట్టే అధికారం ఉండాలనీ సూచించింది. కానీ అందరూ ఈ బిల్లును మరిచి పోయారు. నోటీసు ప్రాణాంతకం రిజిస్టర్ వివాహపు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఇది యువతీ యువకులకు ప్రాణాంతకంగా మారింది. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం గుర్తించిన హక్కు. ఈ హక్కును వాడుకున్నందుకు వారి మరో ప్రధానమైన రాజ్యాంగ జీవన హక్కును పూర్తిగా కోల్పోతున్నారు. దీన్ని నివారించే విధానాలు కనిపెట్టాలి. కావలసిన చర్యలు ప్రభుత్వమే తీసుకో వాలి. మత పరమైన వివాహ చట్టాలలో, మతా తీతమైన ప్రత్యేక వివాహ చట్టంలో కూడా యువతీ యువ కుల ప్రాణ రక్షణకు కావలసిన రక్షణలేమీ లేవు. తల్లిదండ్రులకు తమ పిల్లల వివాహ నిర్ణయ సమాచారం తెలుసుకునే హక్కు లేదా అనే ప్రశ్నతోపాటే స్వయంగా వివాహ నిర్ణయం తీసుకుంటే అది చట్ట వ్యతిరేకం కాకపోయినా, తమ ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు, నోటీసు ఇవ్వకూడదనే అంశాన్ని కూడా పరి శీలించాలి. ప్రస్తుత చట్టాల ప్రకారం నోటీసు తప్పని సరి, మొత్తం ప్రపంచానికే నోటీసు ఇవ్వాలి. ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్త వచ్చు అనేది ఇవ్వాళ అమలులో ఉన్న చట్టం. కాని ఎవ్వరూ వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి అక్కడ గోడకు వేలాడే (ఉంటే) నోటీసును చదువుకోవడం జరగదు కనుక రిజిస్టర్ వివా హాలు రహస్య వివాహాలైపోతున్నాయి. చట్టప్రకారం రహస్యం కాక పోయినా ఆచరణలో రహస్యమే. వివాహాన్ని రిజిస్టర్ చేయడం కోసం పెట్టుకునే దరఖాస్తులో తమ వివాహాన్ని పెద్దలు సమ్మతిస్తున్నారో లేదో తెలుసుకునే కాలమ్ లేదు. వారు వ్యతిరేకిస్తున్నారని, బెదిరిస్తున్నారని కూడా చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పటి విధానం ప్రకారం ఇవేవీ పరిశీలించకుండానే అధికారి నోటీసు జారీచేయవచ్చు. వివాహ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో తమకున్న ముప్పును వివరించి, తల్లి దండ్రులో కులపెద్దలో బెదిరిస్తున్నారనే ఫిర్యాదును కూడా చేర్చేందుకు తగిన విధంగా దరఖాస్తు ఫారాలను రూపొం దించాలని, యువతీయువకులు ఈ విషయాన్ని తప్పనిసరిగా అధికారి దృష్టికి తీసుకువచ్చే వీలు కల్పించాలని ఆర్టీఐ చట్టం సెక్షన్ 19 (8)(ఎ)(4) కింద కేంద్ర సమాచార కమిషన్ మార్పును సూచించింది. లా కమిషన్ సూచించిన చట్టం తేవాలని కూడా సిఫార్సు చేసింది. (CIC/SA/A/2016/0015 56, శశి వర్సెస్ ఎస్‌డిఎం కేసులో 1.8.2016లో ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com