ప్రేమ జంటలు.. పరువు హత్యలు..! | Madhabhushi sridhar writes about honour killings | Sakshi
Sakshi News home page

ప్రేమ జంటలు.. పరువు హత్యలు..!

Published Fri, Aug 26 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

ప్రేమ జంటలు.. పరువు హత్యలు..!

ప్రేమ జంటలు.. పరువు హత్యలు..!

విశ్లేషణ
జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం గుర్తించిన హక్కు. ఈ హక్కును వాడుకున్నందుకు యువతీయువకులు పరువుహత్యలకు గురవుతూ రాజ్యాంగపరమైన జీవన హక్కును పూర్తిగా కోల్పోతున్నారు. దీన్ని నివారించే విధానాలు కనిపెట్టాలి.

యువతీ యువకులకు వివాహం చేసుకునే స్వేచ్ఛ, వారు అపరిపక్వ నిర్ణయాలతో జీవితాంతం బాధపడ కుండా కాపాడే తల్లిదండ్రుల బాధ్యత మధ్య ఘర్షణ తప్పదు. నైతిక విలువలు అంతటా దిగజారుతున్న ఈ రోజుల్లో ఏది నిజమైన ప్రేమో తెలుసుకొనే లోగానే మోసాలకు గురైన వార్తలు వింటూనే ఉన్నాం. నిజమైన ప్రేమ కారణంగా పిల్లలు వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలతో తమ సంతానాన్నే ద్వేషించే దుర్మార్గానికి కొత్త పేరు పరువు హత్య. ఇందులో పరువు ఏమీ లేదు, హత్య మాత్రం ఉంది. తమ కులాన్ని, వంశాన్ని, ఇష్టాన్ని కాదన్నారన్న ఒకే కారణంతో తమ కూతురిని ఆమెను ప్రేమించిన వ్యక్తిని హత్య చేయడానికి ఆమె కుటుంబం వెనుకాడటం లేదు. ఖాప్‌ పంచాయతీలు కుల సంఘాలు ఈ హత్యలను సమర్థించడం మరీ దారుణం.


ఏప్రిల్‌ 2011లో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు మార్కండేయ కట్జూ, జ్ఞాన్‌ సుధా మిశ్రాతో కూడిన ధర్మాసనం పరువు పేరుతో హత్యలను వ్యవస్థీకరించిన ఖాప్‌ పంచాయితీ లను తీవ్రంగా నిరసించింది. ఉత్తర భారతంలో ఖాప్‌ పంచా యితీలు, దక్షిణాన తమిళ నాడులో కట్ట పంచాయితీలు క్రూరమైన ఆదేశాలు ఇవ్వడం చెల్లవని వారిని కఠినంగా శిక్షించాలని ధర్మాసనం పేర్కొన్నది. విశ్వలోచన్‌ మదన్‌ ప్రజా ప్రయోజన వాజ్యంలో న్యాయమూర్తులు చంద్రమౌళి కె ప్రసాద్, పిసి ఘోష్‌తో కూడిన ధర్మాసనం 2014లో ఖాప్‌ పంచాయితీలవలె షరియత్‌ కోర్టులు మఫ్తి లేదా ఖాజీ తీర్పులకు కూడా చట్టబద్ధత లేదని, ఈ ఆదేశాల ఆధారంగా జరిగే పరువు హత్యలను నివారించే బాధ్యత రెవెన్యూ పోలీసు అధికారులకు ఉందని వివరించింది. తమకు తెలిసిన తరువాత అనుమానితులను అరెస్టు చేయక పోవడం, కేసులు పెట్టకపోవడం వల్ల పరువు హత్యా సంఘటనలు జరిగితే జిల్లా మెజిస్ట్రేట్‌ లేదా ఎస్‌పీ బాధ్యత వహించాలని, వారిపైన కూడా శాఖాపరమైన ఛార్జిషీటు దాఖలుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం భావించింది. ఇటువంటి సందర్భాలలో అసలు నేరస్తులతో పాటు ప్రత్యక్షంగానో పరోక్షం గానో ఈ అధికారులు కూడా బాధ్యులైనట్టు భావించాలని సూచించింది.


లా కమిషన్‌ 2012లో ఈ అంశాన్ని పరిశీలించింది. ఒక పత్రాన్ని ప్రజాభిప్రాయ సేకరణకు విడుదల చేసింది. తమకు ఇష్టం కాని వివాహాలను నిరోధించడానికి.. జీవన, స్వేచ్ఛా హక్కులను కూడా హరించడానికి కులసంఘాలు కుల సమా వేశాలు బహిరంగంగానే దాడి చేస్తుంటే ప్రస్తుత వ్యవస్థ చట్టాలు కోర్టులు ఆపలేక పోతున్నాయని లా కమిషన్‌ పేర్కొన్నది. వివాహ నిర్ణయ స్వేచ్ఛలో జోక్యం చేసుకునే చట్టవ్యతిరేక సమావేశాల నిషేధపు చట్టం తీసుకురావాలని సూచించింది. బిల్లును కూడా రూపొందించింది. చట్టం వ్యతిరేకం కాని వివాహాలను ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. చట్ట సమ్మతమైన వివాహాన్ని పరువుకు భంగకరంగా భావించి ఆపే కుట్రలుచేయడం నిషేధించాలని ఈ చట్టాన్ని ప్రతిపాదించింది. కలెక్టర్, ఎస్‌పీ తదితర అధికారులపైన ఈ కుట్రలను ఆపే బాధ్యతను ఉంచాలని, ఇటువంటి కుట్రల సమావేశాల్లో పాల్గొన్న వ్యక్తుల పైన 30వేల రూపాయల జరిమానా, మూడేళ్ల దాకా జైలుశిక్ష విధించాలని, వీటిని గుర్తించదగిన, బెయిల్‌ ఇవ్వతగని, రాజీకీ వీల్లేని నేరాలుగా నిర్ధారించాలనీ ప్రత్యేక కోర్టులో సుమోటోగా కేసులు చేపట్టే అధికారం ఉండాలనీ సూచించింది. కానీ అందరూ ఈ బిల్లును మరిచి పోయారు.
నోటీసు ప్రాణాంతకం
రిజిస్టర్‌ వివాహపు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఇది యువతీ యువకులకు ప్రాణాంతకంగా మారింది. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం గుర్తించిన హక్కు. ఈ హక్కును వాడుకున్నందుకు వారి మరో ప్రధానమైన రాజ్యాంగ జీవన హక్కును పూర్తిగా కోల్పోతున్నారు. దీన్ని నివారించే విధానాలు కనిపెట్టాలి. కావలసిన చర్యలు ప్రభుత్వమే తీసుకో వాలి. మత పరమైన వివాహ చట్టాలలో, మతా తీతమైన ప్రత్యేక వివాహ చట్టంలో కూడా యువతీ యువ కుల ప్రాణ రక్షణకు కావలసిన రక్షణలేమీ లేవు.  


తల్లిదండ్రులకు తమ పిల్లల వివాహ నిర్ణయ సమాచారం తెలుసుకునే హక్కు లేదా అనే ప్రశ్నతోపాటే స్వయంగా వివాహ నిర్ణయం తీసుకుంటే అది చట్ట వ్యతిరేకం కాకపోయినా, తమ ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు, నోటీసు ఇవ్వకూడదనే అంశాన్ని కూడా పరి శీలించాలి. ప్రస్తుత చట్టాల ప్రకారం నోటీసు తప్పని సరి, మొత్తం ప్రపంచానికే నోటీసు ఇవ్వాలి. ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్త వచ్చు అనేది ఇవ్వాళ అమలులో ఉన్న చట్టం. కాని ఎవ్వరూ వివాహ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చి అక్కడ గోడకు వేలాడే (ఉంటే) నోటీసును చదువుకోవడం జరగదు కనుక రిజిస్టర్‌ వివా హాలు రహస్య వివాహాలైపోతున్నాయి. చట్టప్రకారం రహస్యం కాక పోయినా ఆచరణలో రహస్యమే.


వివాహాన్ని రిజిస్టర్‌ చేయడం కోసం పెట్టుకునే దరఖాస్తులో తమ వివాహాన్ని పెద్దలు సమ్మతిస్తున్నారో లేదో తెలుసుకునే కాలమ్‌ లేదు. వారు వ్యతిరేకిస్తున్నారని, బెదిరిస్తున్నారని కూడా చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పటి విధానం ప్రకారం ఇవేవీ పరిశీలించకుండానే అధికారి నోటీసు జారీచేయవచ్చు. వివాహ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులో తమకున్న ముప్పును వివరించి, తల్లి దండ్రులో కులపెద్దలో బెదిరిస్తున్నారనే ఫిర్యాదును కూడా చేర్చేందుకు తగిన విధంగా దరఖాస్తు ఫారాలను రూపొం దించాలని, యువతీయువకులు ఈ విషయాన్ని తప్పనిసరిగా అధికారి దృష్టికి తీసుకువచ్చే వీలు కల్పించాలని ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 19 (8)(ఎ)(4) కింద కేంద్ర సమాచార కమిషన్‌ మార్పును సూచించింది. లా కమిషన్‌ సూచించిన చట్టం తేవాలని కూడా సిఫార్సు చేసింది. (CIC/SA/A/2016/0015 56, శశి వర్సెస్‌ ఎస్‌డిఎం కేసులో 1.8.2016లో ఇచ్చిన తీర్పు ఆధారంగా).

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
ఈమెయిల్‌: professorsridhar@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement