భార్య పేరును ఆమెకే చెప్పరా?
వ్యక్తిగతమంటూ సర్వీసు రికార్డుల్లోని భార్య పేరును దాచడం మేలా? లేక భార్యే అడుగుతున్నదని చెప్పడం సమంజసమా? ఆలోచించాలి. రెండో పెళ్లి చేసుకున్న వాడిని రక్షించాలనుకోవడం నేరాలను ప్రోత్సహించడమే.
ఆర్టీఐ ప్రశ్న: సర్వీసు రికార్డులో నీ భార్య పేరేమిటి?
కార్మిక దవాఖానలో పెద్ద ప్రొఫెసర్ సర్వీసు రికార్డు వివరాలు కావాలని భార్య సమాచార హక్కు దరఖాస్తు పెట్టుకున్నది. వైవాహిక తగాదాలతో ఆ ఇద్దరూ కోర్టుకెక్కారు. కను కనే తన సర్వీసు వివరాలు ఇవ్వకూడదని భర్త అభ్యంతరం చెప్పారు. సమాచారం ఇవ్వకుండా తప్పించుకోవడం ఎలా అని ఆలోచించే కొన్ని మెదళ్లు ఏమీ ఇవ్వవు. బోలెడు సాకులు చూపుతారు. ఈ దేశంలో పౌరుడివేనా? అయితే రుజువు తెమ్మం టారు. భార్య ఆర్టీఐ కింద భర్త సర్వీసు రికార్డు వివరాలు అడిగితే... నువ్వు భార్యవే అని నమ్మకం ఏమిటి? అని అడుగుతారు. ఆమె తన వివాహ రిజి స్ట్రేషన్ సర్టిఫికెట్ ప్రతిని పీఐఓకు ముందే ఇచ్చింది. నీకు మొత్తం సర్వీసు రికార్డులు ఎందుకు, అసలు నీ సమస్య ఏమిటి? అని అడిగే వాడు లేడు. ఆమె మొదటి అప్పీలును కూడా నిరాకరించాకనైనా కమి షన్ ఆ ప్రశ్న వేసినందుకు ఆమె సంతోషించింది. సర్వీసు రికార్డంతా అవసరం లేదు, అందులో భార్య, కూతురు పేర్లు ఎవరివి రాశారో తెలుసు కోవాలన్నదే తన ప్రయత్నం అని వివరించారామె.
సాధారణంగా, నీ భార్య పేరు, పిల్లల పేర్లు చెప్పాలని ఆర్టీఐ కింద అడగడానికి వీల్లేదు. అది పూర్తిగా వ్యక్తిగత సమాచారం. కానీ రెండో పెళ్లి నేరమని శిక్షాçస్మృతి నిర్ధారిస్తుండగా, ఏ భర్తయినా రహస్యంగా రెండో పెళ్లి చేసుకుని నేరం చేస్తే నిల దీసే అధికారం మొదటి భార్యకు లేదా? ఆమెకు సమాచారం తెలుసుకునే హక్కు లేదా? అన్నది ప్రశ్న. వ్యక్తిగత సమాచారమైనా ప్రజాప్రయోజనం ఉంటే ఇవ్వాలని ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(ఎ)లో నిర్దేశించింది. తన వ్యక్తిగత సమస్య ప్రజా ప్రయో జనం అవుతుందా? అని అడిగే పీఐఓలు, కమిష నర్లు ఉన్నారు. భర్త చేసిన నేరాన్ని రుజువు చేయడం ప్రజా ప్రయోజనమే అవుతుందని చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది.
అయినా భార్య అడిగితే భార్య పేరేమిటో చెప్పడానికి సమస్యేమిటి? మరో భార్య ఉంటే ఆ నేరం బయటపడుతుందని భయ పడే వారు ఈ సమస్యలు సృష్టిస్తారు. సాకులు కల్పి స్తారు. రెండు పెళ్లిళ్ల నేరస్తులను భార్యల నుంచి రక్షించడానికి పబ్లిక్ అథారిటీలు నిస్సిగ్గుగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంటారు. వారే కాదు, సంస్కారాలు వదిలేసిన తల్లిదండ్రులు కూడా భార్యను హింసించి ఇంకో పెళ్లి చేసుకున్న అధముణ్ణి సమర్థిస్తారు. ఒక భార్యను వదిలేశాడని తెలిసినా మరొక మహిళ వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండే కాలం ఇది. కనుక ప్రతిదీ చట్టాలను ఉప యోగించి, కోర్టులను కదిలించి, పోలీసు లాఠీలకు పనిచెప్పించి, లంచాలిచ్చి సైతం నేరం రుజువుచేయ డానికి ప్రయత్నించాల్సి వస్తున్నది.
భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చి జీవన భృతి వివాదం వస్తే ఇద్దరి మధ్య మొత్తం సమాచార మార్పిడి జరగాల్సిందేనని కుసుం శర్మ వర్సెస్ మహిందర్ కుమార్ శర్మ కేసులో ఢిల్లీ హైకోర్టు 2015లో వివరించింది. భర్త ఆదాయాన్ని భార్య, భార్య ఆదాయాన్ని భర్త అడగవచ్చు, ఆ సమా చారాన్ని ఇవ్వవచ్చు. కోర్టు కూడా స్వయంగా ఆదే శించవచ్చు. జీవనభృతి కేసుల్లో పిటిషన్ వేసిన ప్పుడే భార్యాభర్తలు తమ ఆదాయవ్యయాల వివ రాలు తమంత తామే వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పీఐఓలు ఇది గుర్తుంచుకోవాలి. చట్టాలు, ప్రభుత్వ విధానాలు నేరాలను ప్రోత్స హించరాదు. ఆర్టీఐలో సమాచారం దాచి నేరాలను ప్రోత్సహించే వైఖరి సరికాదు. తన భర్త తన సర్వీసు రికార్డులో తన పేరే ఉంటే దాన్ని దాచాల్సిన అవ సరమే లేదు. వేరే పేరు చెప్పి ఉంటే నేరాన్ని ఒప్పు కున్నట్టే. ఆ నేరాన్ని కప్పిపుచ్చడం కూడా నేరమే అవుతుంది. అలాగే పిల్లల పేర్లు కూడా. తన సంతానం పేర్లే తాను చెప్పి ఉంటే భయం దేనికి? చెప్పకపోతే భయ పడక తప్పదు. చెప్పక తప్పదు.
సెక్షన్ 8(2)ను పీఐఓలు, మొదటి అప్పీలు అధికారులు, కమిషనర్లు మరిచిపోతుంటారు. ఆ సెక్షన్ కింద ప్రజా ప్రయోజన ఆధారిత మినహా యింపులు నాలుగే ఉన్నాయి. కానీ మినహాయిం పును వర్తింపచేసే ముందు ఆ సమాచారం దాచితే మేలు జరుగుతుందా లేక వెల్లడిస్తే మేలు జరుగు తుందా? అని ఆలోచించాలి. జవాబును బట్టి సమా చారాన్ని ఇవ్వాలో వద్దో నిర్ణయించాలి. వ్యక్తిగత సమాచారమంటూ సర్వీసు రికార్డుల్లోని భార్య పేరును దాచడం వల్ల మేలు కలుగుతుందా? లేక భార్యే అడుగుతున్నది కనుక చెప్పడం సమంజ సమా? అని ఆలోచించాలి. రెండో పెళ్లి చేసుకున్న వాడు మన పై అధికారనో, మిత్రుడనో వాడిని మొదటి భార్య కేసు నుంచి రక్షించాలనుకుంటే నేరాలను ప్రోత్సహించిన వారవుతారే తప్ప, ప్రజా ప్రయోజనం సాధించిన వారు కారు. నేరాలు జరగ కుండా చూడడం, జరిగిన నేరాలను పట్టించేందుకు సహకరించడం ప్రజా ప్రయోజనం.
భార్యా పిల్లలను పోషించడం భర్త చట్టపరమైన విధి. తనకు జీవనోపాధి ఉండి భర్తకు లేకపోతే అతన్ని, పిల్లలను విధికి వదిలేయకుండా ఆదరించడం భార్య బాధ్యత అని చట్టాలు వివరిస్తున్నాయి. తన కూతురు పేరు గాక, వేరొక పేరును ఆమె భర్త సర్వీసు రికార్డులో నమోదు చేయించి ఉంటే కూతురి పోషణ బాధ్యత సమస్యే అవుతుంది. కనుక ఆ సమాచారం ఇవ్వక తప్పదు. (నేత్రావతి ఆదిబట్టి వర్సెస్ పీఐఓ, ఈఎస్‌ఐసి చెన్నై CIC/BS/ C/2016/900077 కేసులో 24.4.2017 న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
మాడభూషి శ్రీధర్
professorsridhar@gmail.com