law colleges
-
కొత్తగా లా కాలేజీలకు అనుమతులు లేవు
సాక్షి, అమరావతి: కొత్తగా లా కాలేజీలకు అనుమతులను నిషేధిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, వర్సిటీలకు సూచించింది. ఈనెల 11న జరిగిన బార్ కౌన్సిల్ సమావేశంలో కొత్త కాలేజీలకు అనుమతులపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే దేశంలో పుట్టగొడుగుల్లా లా కాలేజీలు ఏర్పాటయ్యాయని, పరిమితికి మించి లా పట్టభద్రులున్నందున కొత్త కాలేజీల ఏర్పాటును మూడేళ్ల పాటు నిలిపివేయాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పెండింగ్‌లో ఉన్న వాటికి అనుమతులు ఇవ్వవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2015లో కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్ల పాటు కొత్త కాలేజీల ఏర్పాటుపై మారటోరియం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మారటోరియం 2017–18తో ముగిసింది. మళ్లీ కొత్త కాలేజీలకు అనుమతులకోసం రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు పలు దరఖాస్తులు వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు. కొత్తగా లా కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించబోరు. రాష్ట్రంలో కాలేజీల వివరాలు.. మూడేళ్ల లా కోర్సు నిర్వహిస్తున్న కాలేజీలు రాష్ట్రంలో 31 ఉన్నాయి. వీటిలో వర్సిటీ కాలేజీలు 4 ఉండగా తక్కినవన్నీ ప్రైవేటు కాలేజీలే. వర్సిటీ కాలేజీల్లో 300 సీట్లుండగా ప్రైవేటు కాలేజీల్లో 5,360 సీట్లున్నాయి. ఇక అయిదేళ్ల లా కోర్సు నిర్వహించే కాలేజీలు 27 ఉన్నాయి. వీటిలో వర్సిటీ కాలేజీలు 3 కాగా తక్కినవి ప్రైవేటు కాలేజీలు. వర్సిటీ కాలేజీల్లో 200 సీట్లుండగా, ప్రైవేటు కాలేజీల్లో 2660 సీట్లు ఉన్నాయి. -
లా కాలేజీల్లో పెరిగిన సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లా కాలేజీల్లో సీట్లు పెరిగాయి. గతేడాది రాష్ట్రంలోని 21 కాలేజీల్లో 4,322 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి 4,712కు పెరిగాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్–2018 ఫలితాలను గురువారం ఆయన విడుదల చేశారు. అన్ని ప్రవేశ పరీక్షల్లో సీట్లు ఎక్కువగా, అభ్యర్థులు తక్కువగా ఉన్నారని, లాసెట్‌లో మాత్రం సీట్లు తక్కువగా ఉంటే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం లాసెట్‌లో 15,793 మంది అర్హత సాధించారని తెలిపారు. లాసెట్‌కు 23,109 మంది దరఖాస్తు చేశారని, వారిలో 18,547 మంది రాత పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. మూడేళ్ల లా కోర్సుకు 16,332 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 12,960 రాత పరీక్ష రాయగా, 11,563 మంది అర్హత సాధించారన్నారు. ఐదేళ్ల లా కోర్సుకు 4,580 మంది దరఖాస్తు చేసుకుంటే, 3,727 మంది రాత పరీక్షకు హాజరయ్యారని, 2,401 మంది అర్హత సాధించారన్నారు. పీజీ లా కోర్సుకు 2,197 మంది దరఖాస్తు చేసుకోగా, దాంట్లో 1,860 మంది హాజరైతే 1,829 మంది అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లింబాద్రి, కార్యదర్శి ఎన్ శ్రీనివాస్‌రావు, లాసెట్ కన్వీనర్ ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బార్ కౌన్సిల్‌కూ దాపరికమేనా?
న్యాయశాస్త్రాన్ని నేర్పే కళాశాలల వారు ఇచ్చిన అన్ని నివేదికలను, అవి విద్యార్థులకు సమకూర్చుతున్నామంటున్న సౌకర్యాల వివరాలను బహిర్గతం చేయాలి. అప్పుడే ఆ విషయాలను తెలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు లభిస్తుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సభ్యులలో ఒకరు ఎన్ని సార్లు విదేశీ యాత్రలు చేశారో, అందుకు కారణాలు ఏమిటో వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద ఒక న్యాయవాది కోరారు. ఉత్తరా ఖండ్ నుంచి ఎన్నికైన మరొక బీసీఐ సభ్యుడు భట్ సిఫార్సుల ద్వారా ఎన్ని న్యాయశాస్త్ర కళాశాల లకు భారత న్యాయవాదులమండలి అనుమతిని ప్రదానం చేసిందని కూడా అడిగారు. యూనివర్సిటీల పరిశీలన కమిటీ, నివేదిక సిఫార్సుల వివరాలన్నీ గోప్యంగా ఉంచా ల్సినవి అంటూ ఈ వివరాలు ఇవ్వడానికి బీసీఐ నిరాకరిం చింది. 2009–2015 మధ్య బీసీఐ సభ్యులెవరూ విదేశీ యాత్రలు చేయలేదని పీఐఓలు చెప్పారు. అడ్వకేట్ల చట్టం 1961 సెక్షన్ 7(1)(హెచ్) ప్రకారం న్యాయశాస్త్ర విద్యలో ప్రమాణాలను కాపాడే గురుతర బాధ్యత బీసీఐపైన ఉంది. తమ సభ్యుడిగా చేరి న్యాయ వాద వృత్తి నిర్వహించడానికి కావలసిన యోగ్యమైన న్యాయవిద్య అతనికి ఉందా, పట్టా ఇచ్చిన విశ్వవిద్యాల యానికి తగిన ప్రమాణాలున్నాయా? అని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవలసిన బాధ్యత కూడా దానిపై ఉంది. యూనివర్సిటీలకు వెళ్లి తనిఖీ చేయాలి. రికార్డులు తెప్పించుకుని చూడాలి. భవనాలు, గ్రం«థాలయం, హాస్టళ్లు, ఇతర వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో పరీక్షిం చాలి. బీసీఐ పరిశీలనకు వచ్చినపుడు ప్రమాణాలను పరీ క్షించడానికి వీలైన అన్ని సరైన సౌకర్యాలను కళాశాలలో ప్రతి బాధ్యతాయుతమైన వ్యక్తి కల్పించవలసి ఉంటుందని కూడా ఈ చట్టంలో ఉంది. బీసీఐ ఇన్స్పెక్షన్ మాన్యువల్ ఒకటో అధ్యాయం ప్రకారం బీసీఐ చాలా లోతైన సమగ్ర పరిశీలన జరపాలి. బీసీఐకి పనికివచ్చే లాయర్లను ఇవ్వగల సామర్థ్యం దానికి ఉందో లేదో తేల్చాలి. దేశంలో ప్రస్తుతం రెండు రకాల న్యాయ కళాశాలలు ఉన్నాయి. కొన్ని జాతీయ న్యాయవిశ్వవిద్యాలయాలేగాక, సాధారణ విశ్వవిద్యాలయాల అనుబంధ న్యాయశాస్త్ర కళా శాలలు అనేక వందలు ఉన్నాయి. జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాలకు కావలసినన్ని నిధులు సమకూర్చడానికి రాçష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహంగా ఉంటాయి. దానికి ఒక కారణం నేషనల్ లా స్కూల్స్‌కు ప్రధాన న్యాయమూర్తి చాన్స్‌లర్‌గా ఉండడం. వాటికి ఇచ్చే నిధులలో సగం ఇచ్చినా, అధ్యాపక పదవుల్లో ఉన్నఖాళీలను సమర్థులైన కొత్త వారితో ఎప్పటికప్పుడు భర్తీ చేసినా మామూలు విశ్వవిద్యాలయాల లా కళాశాలలు కూడా బాగుపడతాయి. న్యాయవ్యవస్థ, పాలక వ్యవస్థ సాయంతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు మంచి ప్రమాణాలు, కీర్తి సాధించిన మాట నిజమే. కాని తమ ఉన్నత ప్రమాణాలను ఇతర విశ్వవిద్యాలయ కళాశాలలకు విస్తరించడానికి ఈ సంస్థలు ఏమీ చేయడం లేదు. ఏక శాఖా విశ్వవిద్యా లయాలు వేటికవిగా జాతీయ స్థాయిలో న్యాయశాస్త్ర పట్ట భద్రులను తయారు చేస్తుంటాయి. ఇక అనేక శాఖలున్న విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్ర విభాగానికి కూడా దిక్కూ మొక్కూ ఉండదు. వాటి అనుబంధ న్యాయ కళాశాలలు వేలాది విద్యార్థులకు ఒకేసారి విద్యాబోధన చేస్తూ ఉంటే ప్రమాణాలు నీరుగారిపోకుండటానికి హామీ ఇచ్చేవారు, వాటికి ఆ జవాబుదారీ బాధ్యతను నిర్దేశించేవారూ లేరు. బీసీఐ సభ్యులతో ఏర్పడిన లీగల్ ఎడ్యుకేషన్ కమిటీ న్యాయ విద్యాప్రమాణాలకు బాధ్యత వహించాలి. ఈ కమిటీ పరిశీలనకు వచ్చినపుడు అందరూ నిర్భయంగా ఉన్న సమస్యలు వివరించాలి. ఆ కమిటీ వారు తమ నివేదికలను, తమకు కళాశాల వారు ఇచ్చిన మహజర్లను అందరితోనూ పంచుకోవాలి. కమిటీ ఇచ్చిన నివేదిక, కమిటీకి ఇచ్చిన రికార్డు సమాచారం అవుతుంది. కాపీలు, ఇతర వివరాలు అడిగినప్పుడు ఇవ్వడం వారి బాధ్యత. ఇది గోప్యమైన సమాచారం అయ్యే అవకాశం లేదు. సెక్షన్ 4(1)(బి) ప్రకారం ఈ సమాచారాన్ని ఎవరూ అడగకుండా బీసీఐ ఇవ్వాల్సిందే. అడిగినా ఇవ్వకపోతే సమాచార హక్కు ఏ విధంగా బతుకుతుంది? న్యాయశాస్త్రాన్ని నేర్పే కళాశాలలు నాక్ సంస్థకు, బార్ కౌన్సిల్ కమిటీకి ఇచ్చిన సమాచారాన్ని పంచుకునే జవాబుదారీతనం, పారదర్శకత బీసీఐకి కూడా ఉండాలి. ప్రతి కళాశాల, విశ్వవిద్యాలయం తమవద్ద ఉన్న అధ్యాపకులు ఎవరో వివరించాలి. వారికి ఏ మేరకు వేతనాలను ఇస్తున్నారో రుజువులతో సహా చూపాలి. జాబితాలో చూపిన అధ్యాపకులు నిజంగా ఆ కళాశాలలోనే పనిచేస్తున్నారో లేక మరే కళాశాలలోనో కూడా పనిచేస్తున్నట్టు చెప్పుకుంటున్నారో, లేదో పరిశీలిం చాలి. ఆ కళాశాల వారు ఇచ్చిన అన్ని నివేదికలను, విద్యా ర్థులకు సమకూర్చుతున్నామని చెప్పుకునే అన్ని సౌకర్యాల వివరాలను కూడా బహిర్గతం చేయాలి. అప్పుడే విద్యా ర్థులకు ఆ కళాశాల నిజంగానే సౌకర్యాలు కల్పించిందో, లేదో తెలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు ఉంటుంది. వేతనాల చెల్లింపు వివరాలను కూడా పది మందికి తెలి యజేయాలి. ఇది గోప్యమైన సమాచారమయ్యే అవకాశమే లేదు. బీసీఐ సభ్యుడి విదేశీ పర్యటనకు, విదేశీ విశ్వవిద్యా లయానికి ఇచ్చిన గుర్తింపునకు ఉన్న సంబంధాన్ని వివరిం చాలి. లీగల్ ఎడ్యుకేషన్ కమిటీలో ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందిన కళాశాల వివరాలు ఇవ్వడం కూడా బీసీఐ బాధ్యత. ఆ కమిటీ సభ్యుల పర్యటనలు, వారి నివేదికలు, సిఫార్సులు ఇవ్వాల్సిందేనని సమాచార కమి షన్ ఆదేశించింది. న్యాయశాస్త్ర చదువులను బాగుచేసే బాధ్యత లాయర్లదే. (పాథక్ వర్సెస్ బీసీఐ కేసు నంబర్ CIC/SA/C/2016/000164లో 2.1.2017న కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ఇన్ని అక్రమాలా?
అడ్డగోలుగా నడుస్తున్న కళాశాలలు పట్టించుకోని అధికారులు పేరుకే న్యాయ కళాశాలలు. చేసేవి అక్రమాలు. నామమాత్రపు భవనాలు.. ఫ్యాకల్టీ ఉండరు. హాజరులో ఉన్న విద్యార్థులు తరగతుల్లో కనిపించరు. నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలుండవు. రికార్డుల్లో మాత్రం అన్నీ సవ్యంగా ఉన్నట్టు చూపిస్తారు. దానికి సంబంధిత అధికారులు తలూపుతారు. ఫలితంగా కొన్నాళ్లకు ఈ కాలేజీల నుంచి కొత్త న్యాయవాదులు పుట్టుకొస్తారు..! ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు.. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి ఇలాకాలో జరుగుతున్న వ్యవహారం! విశాఖపట్నం :జిల్లాలో భీమిలి మండలంలో ఒకటి, అనకాపల్లిలో మరో న్యాయ కళాశాల కొన్నేళ్లుగా నడుస్తున్నాయి. వీటికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎఫిలియేషన్ కూడా ఉంది. ఈ కాలేజీల్లో మూడు, ఐదేళ్ల లా కోర్సులు నిర్వహణకు అనుమతి ఉంది. దీంతో ఏటా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 11 క్లాస్ రూమ్‌లు, ఒక మ్యూట్ కోర్టు, సెమినార్ హాలు, ప్రిన్సిపాల్ చాంబర్, గ్రంథాలయం, ఆట స్థలం, పూర్తి స్థాయి ఫ్యాకల్టీ, ఇతర మౌలిక వసతులు ఉండాలి. ఏటా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తనిఖీలు చేస్తుండాలి. ఆంధ్ర విశ్వ విద్యాలయం అధికారులు కూడా పర్యవేక్షించాలి. అన్నీ సక్రమంగా ఉంటేనే వాటి కొనసాగింపునకు అనుమతివ్వాలి. కానీ ఈ కాలేజీల్లో బోర్డులు, చిన్నపాటి నామమాత్రపు భవనాలు తప్ప నిబంధన ప్రకారం ఉండాల్సినవేమీ లేవని విద్యార్థులు చెబుతున్నారు. పైగా ఏయూ అధికారుల పర్యవేక్షణ కూడా ఉండడం లేద న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులిస్తే చాలు.. కళాశాలకు వెళ్లనక్కర్లేదు భీమిలి మండలంలో నడుస్తున్నట్టు చెబుతున్న కాలేజీ ఒక్కో స్టూడెంట్ నుంచి రూ.60 వేల నుంచి లక్ష వరకూ, అనకాపల్లి కళాశాలలో చేరే వారికి రూ.30-40 వేల వరకూ వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మొత్తం చెల్లించి కాలేజీల్లో చేరిన వారు తరగతులకు, వైవాకు హాజరు కానక్కర్లేదని, రికార్డులు రాయాల్సిన పని కూడా ఉండదని, అన్నీ యాజమాన్యాలే చూసుకుంటాయని అంటున్నారు. పరీక్షలకు హాజరైతే అప్పుడు కూడా వీరు సాధ్యమైనంత సాయం చేసి గట్టెక్కిస్తారన్న ప్రచారం ఉంది. తమిళులే అధికం..! భీమిలి మండలంలో ఉన్న కాలేజీలో తెలుగు వారికంటే తమిళులే ఎక్కువగా చేరుతుంటారు. ఎందుకంటే తమిళనాడులో న్యాయ విద్యాభ్యాసానికి 23 ఏళ్ల వయో పరిమితి ఉంది. మన రాష్ట్రంలో ఆ నిబంధన లేకపోవడం ఈ కాలేజీలకు వరమైంది. ఇది తమిళ విద్యార్థులకు అనుకూలంగా మారడంతో మూడొంతులు వారే ఉంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ న్యాయ కళాశాలల బాగోతంపై ఏబీవీపీ నాయకులు గతంలోనే ఏయూ వీసీ జీఎస్ఎన్ రాజుకు వినతిపత్రం ద్వారా ఫిర్యాదులు కూడా చేశారు. దీనిపై ఆయన సీడీసీ డీన్ కోటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని వేశారు. లోపాలు నిజమే.. ఈ న్యాయ కళాశాలలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు అధికారులను వేశార . వారు దర్యాప్తు చేసి నివేదికలను సిద్ధం చేశారు. ప్రాథమికంగా ఆ కాలేజీల్లో ఫ్యాకల్టీతో పాటు మరికొన్ని నిబంధనలు పాటించడం లేనట్టు తేలింది. నిజమని తేలితే ఎఫిలియేషన్ ఆగుతుంది. త్వరలోనే నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. - కోటేశ్వరరావు, డీన్, సీడీసీ, ఏయూ చర్య లేకుంటే గవర్నర్‌కు ఫిర్యాదు.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ రెండు న్యాయ కళాశాలలపైన, బాధ్యులైన ఏయూ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. వాటి గుర్తింపు రద్దు చేయాలి. అధికారులు న్యాయ విద్యా ప్రమాణాలు కాపాడాలి. లేనిపక్షంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. - కె.వాసు, జిల్లా కన్వీనర్, ఏబీవీపీ