సాక్షి, అమరావతి: కొత్తగా లా కాలేజీలకు అనుమతులను నిషేధిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, వర్సిటీలకు సూచించింది. ఈనెల 11న జరిగిన బార్ కౌన్సిల్ సమావేశంలో కొత్త కాలేజీలకు అనుమతులపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇప్పటికే దేశంలో పుట్టగొడుగుల్లా లా కాలేజీలు ఏర్పాటయ్యాయని, పరిమితికి మించి లా పట్టభద్రులున్నందున కొత్త కాలేజీల ఏర్పాటును మూడేళ్ల పాటు నిలిపివేయాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పెండింగ్‌లో ఉన్న వాటికి అనుమతులు ఇవ్వవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2015లో కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్ల పాటు కొత్త కాలేజీల ఏర్పాటుపై మారటోరియం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మారటోరియం 2017–18తో ముగిసింది. మళ్లీ కొత్త కాలేజీలకు అనుమతులకోసం రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు పలు దరఖాస్తులు వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు. కొత్తగా లా కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించబోరు.
రాష్ట్రంలో కాలేజీల వివరాలు..
మూడేళ్ల లా కోర్సు నిర్వహిస్తున్న కాలేజీలు రాష్ట్రంలో 31 ఉన్నాయి. వీటిలో వర్సిటీ కాలేజీలు 4 ఉండగా తక్కినవన్నీ ప్రైవేటు కాలేజీలే. వర్సిటీ కాలేజీల్లో 300 సీట్లుండగా ప్రైవేటు కాలేజీల్లో 5,360 సీట్లున్నాయి. ఇక అయిదేళ్ల లా కోర్సు నిర్వహించే కాలేజీలు 27 ఉన్నాయి. వీటిలో వర్సిటీ కాలేజీలు 3 కాగా తక్కినవి ప్రైవేటు కాలేజీలు. వర్సిటీ కాలేజీల్లో 200 సీట్లుండగా, ప్రైవేటు కాలేజీల్లో 2660 సీట్లు ఉన్నాయి.
కొత్తగా లా కాలేజీలకు అనుమతులు లేవు
Published Wed, Aug 14 2019 3:34 AM | Last Updated on Wed, Aug 14 2019 3:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment