
ప్రతీకాత్మక చిత్రం
(మే నెల 18న ‘వైద్యులంటే నెత్తుటి వ్యాపారులా’ అన్న శీర్షిక కింద సాక్షి సంపాదకీయ పేజీలో వచ్చిన వ్యాసం చదివి నొచ్చుకున్నవారిని మన్నించాలని కోరుతున్నాను. నెత్తుటి వ్యాపారులెవరూ నన్ను తిట్టలేదు. కొందరు మంచి డాక్టర్లకు మాత్రం కోపం వచ్చింది. వైద్యవృత్తిలో ప్రమాణాల రక్షణకు విచి కిత్స అవసరం, అధిక సంఖ్యాకులౌతున్న అనైతిక వైద్యులకు శస్త్ర చికిత్స కూడా అవసరం –రచయిత)
మన వృత్తిలో ఉన్నారన్న ఏకైక కారణంతో వైద్యవృత్తికే కళంకం తెచ్చే వారిని సమర్థించినా మౌనంగా సహించినా, ఆ కళంకితుల సంఖ్య పెరుగుతుందని గమనించాలి. డాక్టర్ల మీద వైద్యశాలల మీద వినియోగదారుల ఫోరంలలో దాఖలవుతున్న వేలాది కేసులు చూడండి. ఆర్టీఐ కింద డాక్టర్ల ఘోరాలను ఎండగడుతున్న దరఖాస్తులు, కమిషన్ ముందు అప్పీళ్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో పేదరోగులను కూడా పట్టి పీడించే జలగలు ఎన్ని ఉన్నాయో గమనించి వైద్యులే వాటిని నివారించాలి.
పెద్ద పట్టణాల్లో, మహానగరాల్లో మందులమ్ముకునే దుకాణాలతో పర్సెంటేజులు లేని డాక్టర్లెంతమంది ఉన్నారో వృత్తి ప్రేమికులు అంచనా వేసుకోవాలి. ఆస్పత్రులలో రోగుల అంగాంగాలు అమ్ముకొం టున్న కుంభకోణాల గురించి చదువుకోవాలి. ఏడేళ్ల అమ్మాయికి 661 సిరంజిలు 1546 గ్లోవ్స్ వాడామని అబద్ధం చెప్పి బిల్లు వేసిన వైద్యశాల వారు, కేసులుపెడితే వసూలుచేసిన డబ్బు తిరిగి ఇచ్చారు. ఆ అమ్మాయికి ప్రతిగంటకు రెండు సిరంజిలు అయిదు జతల గ్లోవ్స్ వాడారని అవాస్తవాలు చెప్పి గరిష్ట ధరకు అయిదింతలు ధర వసూలుచేస్తే ఆ వైద్యశాల డాక్టర్లు కూడా మనకెందుకని మౌనంగా ఉన్నారు. జరుగుతున్న ఘోరాలను చూడబోమని కళ్లుమూసుకుంటే అది వివేకవంతమైన పని కాదు.
తాము మంచి వారమనుకునే డాక్టర్లంతా వెంటనే రోగులకు తమ చికిత్సా వివరాలు ఎప్పడికప్పుడు అందించే ఏర్పాట్లు చేయాలని నా మనవి. రోగులకు చికిత్సా వివరాలు ఇవ్వడం గొప్ప ముందడుగు అవుతుంది. ఇవ్వాళ నేనొక్కడినే అడుగుతుండవచ్చు. కాని 2005 దాకా సమాచార హక్కు అంటే నవ్వి హేళన చేసిన వారంతా ఈరోజు ఆ హక్కు తెస్తున్న మార్పులను చూసి ఆశ్చర్యపోతున్నారు. వైద్యశాలల ఆల్మరాల్లో దాక్కున్న రోగుల చికిత్సా వివరాలు బయటికి వచ్చే రోజు వస్తుంది. చీకట్లో సాగే అవైద్య ఔషధ అవినీతి వ్యాపార వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తాయి. బయట దొరికే మందులకన్నా తక్కువ ధరకు ఆస్పత్రులు మందులు అమ్మితేనే వారికి తమ ఆస్పత్రి భవనంలో మందుల దుకాణం పెట్టుకునే అర్హత రావాలి. బయటకన్నా ఎక్కువ ధరకు మందులు అమ్ముకునే వారు వైద్యవృత్తి చేస్తున్నట్టా? నల్లబజారు నడుపుతున్నట్టా?
అడిగే వాడు లేక, దాడులు చేసి పట్టుకునే అధికారుల్లో నీతి లేక, వైద్యుల, వైద్యశాలల అక్రమ మందుల వ్యాపారాలు నడుస్తున్నాయి. ప్రతిదానికీ కోర్టుకు పోలేక, కోర్టుల్లో ఏళ్లకొద్దీ పోరాడలేక అడిగేవాడు కరువైపోతున్నాడు. మేం నీతివంతంగా చికిత్స చేస్తాం, రికార్డులు స్వచ్ఛంగా రాస్తాం, మీకు ఇస్తాం, మందుల ధరల్లో మా కమిషన్ మినహాయించుకుని, లాభం తగ్గించుకుని లేదా లాభంలేకుండా నష్టం లేకుండా మందులు ఇస్తాం, బయటకన్నా మాధర తక్కువ అని ఢంకా బజాయించి చెప్పుకునే డాక్టర్లు, నర్సింగ్ హోంల యజ మానులు ముందుకు రావాలి. వస్తారా?
రోగుల చికిత్సా వివరాలు దాచుకున్నంతకాలం వీరి చిత్తశుద్ధిని, విత్తబుద్ధిని ఎందుకు అనుమానించకూడదో చెప్పండి దయచేసి. ఉచి తంగా చికిత్స చేయకండి. అప్పులు చేసయినా మీ బిల్లులు కడతారు. కాని ఏం చేస్తున్నారో చెప్పండి, చెప్పిందే చేయండి. వైద్యో నారాయణో హరిః అంటే భవరోగాలకు అసలు వైద్యుడు నారాయణుడు అని అర్థం, కాని ప్రతివైద్యుడూ నారాయణుడని కాదు. దేవుడికన్న పూజనీయులైన వైద్యులు లేరని కాదు. వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నది.
వైద్యం ఒక సేవావృత్తి. త్యాగనిరతి కలిగిన వృత్తి. నిరంతరం ఆరోగ్యాన్ని, దేహాన్ని రక్షించే వృత్తి. కాని అవన్నీ కట్టు కథలేనా? ఈ కాలంలో కనిపించే అవకాశం ఉందా? ఆయా వృత్తులలో అనైతిక ధోరణులను, ఆయా వృత్తులలో ఉన్న సంఘాల వారే నివారించాలి. డాక్టర్లు రోగులను అడిగి తమ లోపాలను తెలుసుకుని సరిదిద్దుకోవాలి. విమర్శించే వారిని కాదు. పొగిడే వారిని తిట్టాలి.
మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment