
తిలక్ సినిమా నిధుల కథ
విశ్లేషణ
విచారణలో తేలిన మరో విశేషం–మొత్తం భారత రిపబ్లిక్ స్వర్ణోత్సవాల కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించారని. అందులో రెండున్నర కోట్లు తిలక్ సినిమాకు ఇచ్చారు. ఇంత జరిగితే ఏ చర్య అయినా తీసుకోవాలనే విషయం గుర్తురాలేదు.
చాలా సందర్భాలలో ప్రభుత్వ అధికారులు తమ ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తించడం లేదు. నష్టపోయినవారు ఫిర్యాదు చేసినా చెత్తబుట్ట దాఖలే. పైన మహోన్నత రాజ్యాంగాధికార హోదాల్లో ఉన్నవారు కూడా స్పందించడం చాలా అరుదు. జవాబు అడిగే అధికారమే జనా నికి లేదు. ఈ చీకటిలో చిన్న వెలుగు నా వినతిపత్రం గతేమిటి అని అడిగే ఆర్టీఐ హక్కు. ప్రజాధనాన్ని దోచు కోవడానికి తిలక్ పేరును, ఆయన జీవితంపై సినిమా పేరుతోనూ, మన రిపబ్లిక్ పేరును కూడా వాడుకుంటారు. భారత గణతంత్ర స్వర్ణోత్సవాలు నిర్వహించడానికి వందకోట్లతో ఒక సెల్ ఏర్పాటైంది. ఇప్పుడు కోట్లూ లేవు, సినిమా లేదు, సెల్ కూడా లేదు. కమలాపూర్కర్ అనే పౌరుడు ఆర్టీఐ సవాలు విసిరితే కళ్లు తెరుచుకోలేదు కాని, కళ్లు చెదిరిపోయే నిజాలు బయటకు వచ్చాయి.
సమాచారం ఇవ్వకుండా పౌరుడిని కోర్టుకు లాగే లిటిగేషన్ పెరుగుతున్నది. గణతంత్ర స్వర్ణోత్సవాలకు వేసిన సెల్ ఉత్సవ కాలం అయిపోగానే అంతరించిందనీ, కానీ బాధ్యతలు నిర్వహించేంత వరకు పనిచేయవలసి ఉంటుందనీ అన్నారు. 2005లో ఉత్సవాలలో భాగంగా బాలగంగాధర్ తిలక్ జీవితగాథను సినిమాగా నిర్మించేం దుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రూ. 2.5 కోట్లు వినయ్ ధుమాల్ అనే వ్యక్తికి రెండు విడతల్లో ఇచ్చేసింది. ఆయన ఆ సినిమా తీయనే లేదు. డబ్బు జాడ లేదు. ఏ విచారణ జరగలేదు. డబ్బు వినియోగంపై ఏదైనా నివేదిక ఎక్కడైనా ఉంటుందేమోనని వెతికారు. లేదు. 2011లో ఆర్టీఐ దర ఖాస్తు వచ్చేదాకా తిలక్ పేరు మీద రెండున్నర కోట్ల రూపా యలు ధారాదత్తం చేసిన విషయం బయటపడలేదు. ప్రస్తుతం సీబీఐ ఈ ప్రజాధనం దుర్వినియోగంపైన విచా రణ జరుపుతున్నదనీ, నివేదిక కోసం ఎదురు చూస్తున్నా మనీ పీఐఓ వివరించారు.
పోనీ అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు దస్తా వేజులేమయినా ఉన్నాయా అని కమిషన్ ప్రశ్నిస్తే ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన కాగితాలు గానీ దస్తావే జులు గానీ ఉత్సవ నిర్వహణ సెల్‌కు చెందిన రికార్డు గదిలో లేవని రెండున్నర కోట్ల రూపాయలతో సహా ఫైళ్లు కూడా మాయమైనాయని ప్రజాసంబంధ అధికారి వివరిం చారు. కనీసం ఫైళ్లు అంతర్థానమైన సమాచారమైనా ఈ ఆర్టీఐ ద్వారా తేలిందని తిలక్ అభిమానులంతా సంతో షించాలి. ఆశ్చర్యం ఏమిటంటే మాయమైపోయాయని అంటున్న ఫైళ్లను వెతకడానికి ఏమైనా చేశారా అంటే, వెతికే ప్రయత్నాల వివరాలు చెప్పే ఫైలు కూడా ఏదీ తమ దృష్టికి రాలేదని చాలా వినయంగా జవాబిచ్చారు. ఇంత డబ్బు మాయమైనా కనీసం విషయం చెప్పడానికి, పై అధికారు లకు చెప్పడానికో, కేసు పెట్టడానికో ఎవరూ ప్రయత్నం చేయలేదు.
పోలీస్ స్టేషన్‌లో ప్రథమ సమాచార నివేదికైనా ఇచ్చారా? అనే ప్రశ్నకు కూడా జవాబు లేదు. 2011లో ఆర్టీఐ దరఖాస్తు వచ్చిన తరువాత 2013 నుంచి ఇటీవలి దాకా ఫైళ్ల కోసం తీవ్రంగా రికార్డు రూములలో వెతికారట. కాని ఏ ఫలితమూ లేదట. సమాచార కమిషన్ విచారణలో తేలిన మరో విశేషం– మొత్తం భారత రిపబ్లిక్ స్వర్ణోత్స వాల కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించారని. అందులో రెండున్నర కోట్లు తిలక్ సినిమాకు ఇచ్చారు. ఇంత జరిగితే ఏ చర్యైనా తీసుకోవాలనే బాధ్యత ఎవరికీ గుర్తురాలేదు. మనకెందుకు అనే మనస్తత్వం పాతుకు పోయిందనడానికి ఇదొక ఉదాహరణ. వందకోట్లు మాయ మైనా మనం ఏమీ చేయం. దాని ఫైళ్లు లేకపోతే ‘పోతే పోయాయి మనమేం చేస్తాం’ లేదా ‘ఆర్టీఐ ప్రశ్న వస్తే రెండో అప్పీలు దాకా కాలం గడుపుదాం’ అనే మనస్తత్వం పాతుకుపోయింది.
చట్టం తన పని తాను చేసుకుపోతుందంటారు. కానీ మన గణతంత్రానికి 50 ఏళ్లు నిండిన సందర్భం గడిచి పోయి 17 ఏళ్లయినా, నాటి వందకోట్ల దుర్వినియోగ ఉదంతం గురించి వీసమెత్తు విషయం కూడా తెలియని ఘనతంత్రం మనది. పోనీ అంతకుముందు ఎవరి దగ్గర, ఏ రికార్డులు ఉండేవో చెబుతారా? లేదా చివరిగా ఎవరి అధీనంలో రికార్డులు ఉన్నాయో తెలిపే రిజిస్టర్ ఉందా అని అడిగితే అదీ తెలియదని అధికారి వివరించారు. ఇప్పటి కైనా ఈ ఉత్సవాల ఫైళ్ల అంతర్థానంపైన దర్యాప్తు జరిపించి అసలు ఏం జరిగిందో వివరించే నివేదికను రెండునెల ల్లోగా సమర్పించాలని కమిషన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
ఈలోగా రిపబ్లిక్ స్వర్ణోత్సవాల నిర్వహణకు బడ్జెట్ కేటాయింపు, ప్రతిపాదించిన ఉత్సవాల జాబితా, జరిగిన కార్యక్రమాల జాబితాలను 30 రోజులలోగా ఇవ్వాలని కూడా కమిషన్ ఆదేశించింది. సీబీఐ ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి ఎంతకాలం అవసరమో, చర్యలకు ఎంత కాలం పట్టే అవకాశం ఉందో నెలరోజుల్లో తెలియజేయా లని కూడా కమిషన్ ఆదేశించింది. వేలకోట్ల రూపాయల కుంభకోణాలు ఎన్నో దర్యాప్తు చేస్తున్న íసీబీఐకి ఈ తిలక్ సినిమా కుంభకోణం చాలా చిన్నది కావచ్చు. తీరిక దొర కడం చాలా కష్టం కూడా కావచ్చు. వందకోట్లు మాయం కావడం కూడా మన వ్యవస్థలో మామూలే అనుకున్నా, దానికి సంబంధించి ఏ కాగితమూ లేకపోవడం ఏమీ జరగకపోవడం వ్యవస్థలో తీవ్రలోపాన్ని సూచిస్తున్నది. (వీ.ఆర్. కమలాపూర్కర్ వర్సెస్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కేసు ఇఐఇ/Sఏ/అ/ 2016/000484లో 13 ఫిబ్రవరి 2017న కమిషన్ ఆదేశం ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్,
professorsridhar@gmail.com